4, ఫిబ్రవరి 2019, సోమవారం

Sri Gupteshwar Temple,

            గుహలో గుప్తంగా కొలువైన  శ్రీ గుప్తేశ్వరుడు 

                                                                                       
                                                                                               


లయకారకుడు,శుభంకరుడు మరియు భక్తవత్సలుడు అయిన కైలాసనాధుడు ఈ పుడమి మీద లింగరూపంలో  అనేకానేక దివ్య క్షేత్రాలలో కొలువుతీరి కోరినవారికి కొంగు బంగారంగా పూజలందుకొంటున్నారు. వీటిల్లో కొన్ని దుర్గమారణ్యాలలో పర్వత శిఖరాల మీద, గుహలలో నెలకొన్ని ఉన్న ప్రదేశాలు కలవు. అలాంటి వాటిల్లో ఒకటి శ్రీ గుప్తేశ్వర మహాదేవ క్షేత్రం. మన రాష్ట్రానికి చేరువలో ఉన్న ఒడిశా రాష్ట్రం లోని కోరాపుట్ జిల్లాలో ఉన్న విశేష దర్శనీయ క్షేత్రం. 
జిల్లా కేద్రమైన కోరాపుట్ కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గుప్తేశ్వర్ లోని మహాదేవ లింగం గత మూడు యుగాలుగా మహనీయుల, అవతార పురుషుల మరియు మహర్షుల పూజలందుకొన్నదిగా భక్తులు విశ్వసిస్తారు. 
స్థానికంగా వినిపించే గాధల ప్రకారం అవతార పురుషుడైన శ్రీరాముడు తన వనవాస కాలంలో భార్య సోదర సమేతంగా శ్రీ గుప్తేశ్వర స్వామికి అభిషేకాలు చేసినట్లుగా తెలియవస్తోంది. రామాయణ కాలంలో దండకారణ్యంగా పేర్కొన్న ప్రాంతములోని భాగాలే  నేటి ఒడిశా లోని కోరాపుట్, మల్కనగిరి, ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ మరియు ఆంధ్రప్రదేశంలోని పశ్చిమ గోదావరి జిల్లాలు అని పేర్కొంటారు.  దాని ప్రకారం ఎప్పటి నుండి ఈ లింగం గుప్తంగా ఈ కొండ గుహలో ఉన్నదో ! అలా యుగాల నుండి గుప్తంగా గుహలో ఉన్నందున భక్తులు శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ అని పిలుస్తుంటారు. నాటి నుండి నేటి వరకూ స్థానిక అడవి బిడ్డలే స్వామివారికి  పూజాదికాలు చేస్తున్నారు. బాహ్యప్రపంచానికి ఈ క్షేత్రం గురించి తెలియదు. 
కానీ మహాకవి కాళిదాసు విరచించిన "మేఘసందేశం"లో ఇక్కడి దట్టమైన దండకారణ్య వనాలను, పక్కనే పారే సావేరి నది మరియు గుహలో కొలువైన శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ గురించి వర్ణించినట్లుగా తెలుస్తోంది.  































పంతొమ్మిదో శతాబ్దంలో జయపూర్ ని పాలించిన దేవ్ వంశ రాజుల యేలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఒకనాడు వేట నిమిత్తం అడవిలోకి వచ్చిన రాజు గుహలో కొలువై బోయలచే సేవించబడుతున్న గుప్తేశ్వర లింగాన్ని దర్శించుకొన్నారట. నాటి నుండి పట్టణ ప్రాంతాల నుండి భక్తులు లింగరాజును సందర్శించుకోడానికి ఈ రామగిరి ప్రాంతాలకు రాసాగారు. ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీక మాసాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినం నాడు లక్షల సంఖ్యలో తరలి వస్తారు. 
దండకారణ్యంలో భాగమైన రామగిరి అరణ్యాలలో నెలకొని ఉన్నది శ్రీ గుప్తేశ్వర. పావన సావేరి నదీతీరంలో ఉన్న ఈ  సున్నపు రాతి పర్వత శ్రేణిలో ఎన్నో గుహలున్నాయి. చాలా వాటిని భద్రతారీత్యా మూసివేయబడినాయి. కొన్ని వాటంతట అవే మూసుకొనిపోయాయి. ప్రస్తుతం సందర్శకులు దర్శించుకోడానికి అనువుగా ఉన్న గుహలు నాలుగు. మొదటిది గుప్తేశ్వర లోయలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఎడమపక్కన కనపడుతుంది. ఇందులో శ్రీ గణపతి, శివ మరియు శ్రీ దుర్గ దేవి కొలువై ఉంటారు. పక్కన నిర్మించిన చిన్న మందిరం లాంటి నిర్మాణంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడు మరియు శ్రీ రామభక్త హనుమాన్ దర్శనమిస్తారు. మధ్యలో ప్రధాన గుహాలయానికి దారితీసే సోపాన మార్గాన్ని వదిలి నది వైపుకు వెళుతుంటే ఎడమపక్కన "పరబేద మరియు స్వర్గద్వార గుహలు అని మార్గాన్ని సూచించే సూచిక కనపడుతుంది.  కొండలలో చక్కని శాశ్విత నడక మార్గాన్ని నిర్మించారు. సుమారు అర కిలోమీటరు దూరం వెళితే  పరబేద గుహ కనిపిస్తుంది. మట్టితో నిర్మించిన మెట్ల మార్గంలో చీకటితో నిండిన గుహలోనికి వెళితే నాగాభరణంతో అలంకరించబడిన శివలింగం కనపడుతుంది. ఇక్కడ దేవ ధేనువు కామధేనువు పరమేశ్వరునికి క్షీరాభిషేకం చేసినట్లుగా చెబుతారు. దానికి నిదర్శనంగా ఆ చిన్న గుహ పై భాగం  ఆవు పొదుగును పోలి ఉండి బొట్లుబొట్లుగా నీరు క్రింద ఉన్న లింగం మీద పడుతుంటుంది. అక్కడ ఉండే పూజారి వచ్చిన భక్తులను మనసులో కోరిక కోరుకొని  దాని క్రింద అరచేతిని చాపి ఉంచమంటాడు. నీటిచుక్క పడితే  మనోభీష్టం నెరవేరుతుంది అని నమ్ముతారు. దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వెళితే అరణ్యవాస కాలంలో సీతారాములు విడిది చేసిన స్వర్గద్వారం అనే గుహ వస్తుంది. ఇక్కడ కూడా మొదటి గుహలో మాదిరి నీటి చినుకులు లింగాన్ని అభిషేకిస్తుంటాయి. దీనికి అనేక మార్గాలున్నాయి. లోపలకు వెళితే నీటి ప్రవాహం పారుతున్న శబ్దం వినిపిస్తుంది. అంతర్భాగంలో యోగులు, మహర్షులూ తపస్సు చేసుకొంటుంటారని అంటుంటారు. ఈ గుహకి బయట ఒక ఓ పక్కన రామ తీర్ధం మరో పక్కన సీతా తీర్ధం కొంచెం దూరంలో లక్ష్మణ తీర్ధం ఉంటాయి. 





































పచ్చదనం పరుచుకున్న పర్వతాల నడుమ పక్షుల కిలకిలారావాలు, వానరాల సందడి, మంద్రంగా వీచే స్వచ్ఛమైన చల్లని గాలి మనస్సుకు యెనలేని శాంతిని కలిగిస్తాయి. అక్కడ నుండి నదీతీరానికి చేరుకొంటే మరింత ఆహ్లాదకర అనుభూతిని సొంతం చేసుకోవచ్చును. నదికి దారితీసే మార్గానికి ఏర్పాటు చేసిన ద్వారం మీద మకర వాహనం మీద ప్రయాణిస్తున్న గంగాదేవి శిల్పాన్నిఏర్పాటు చేశారు. పేరేదైనా ప్రవహిస్తూ ప్రాణాధారమైన నీరు గంగే కదా ! తూర్పు కనుమలలోని సింకారం పర్వతాల మీద జన్మించిన సావేరి నది (కోలాబ్ అని కూడా అంటారు) గోదావరి నదికి ఉపనది. అడవులలో నివసించే వారికే కాదు పట్టాన ప్రాంతవాసులకు కూడా  జీవనాధారం. ప్రవాహ ఒరవడికి అరిగిపోయిన శిలలు అనేక రూపాలను సంతరించుకొని ప్రకృతి గొప్పదనాన్ని స్పష్టంగా కనులకు చూపుతాయి. తీరంలో స్నానం చెయ్యడానికి క్షేమకరమైన ఏర్పాట్లు చేశారు. 
 వెళ్లిన దారినే తిరిగి ప్రధాన గుహాలయం వద్దకు వస్తూ దారికి రెండు పక్కలా ఏర్పాటు చేయబడిన పూజా సామాగ్రి, చిత్రపటాలు,పండ్లు, ఫలహారాలు అమ్మే దుకాణాలను  చూడవచ్చును. ఇక్కడ బస చేయడానికి దేవస్థానం మరియు ఒడిస్సా రాష్ట్ర పర్యాటక శాఖ వారి వసతి గృహాలు కలవు. 
సుమారు వంద మెట్లు ఎక్కి ప్రధాన గుహాలయం చేరుకొంటే స్వర్ణవర్ణం శోభితంగా ప్రవేశ ద్వారం ఎదురవుతుంది. అక్కడే అంజనాసుతుడు సంజీవరాయనునిగా  చిన్న గుహలో భక్తులకు దర్శనమిస్తారు. కొద్దిగా పైకి వెళితే గుహకి అనుసంధానంగా ముఖ మండపం నిర్మించారు. మధ్యలో పెద్ద విగ్రహ రూపంలో నందీశ్వరుడు ఉపస్థితులై కనపడతారు. గర్భాలయంగా పరిగణించే గుహ ద్వారానికి ఇరుపక్కలా నంది మరియు హనుమంతుడు స్దాన భంగిమలో ద్వారపాలకులుగా ఉంటారు. కొండరాళ్ళ మధ్య నిర్మించిన సన్నని మెట్ల మీదగా వంగి జాగ్రత్తగా క్రిందకి వెళితే పర్వతరాజు పడగ పెట్టినట్లుగా సహజసిద్ధంగా ఏర్పడిన గుహలో ఆరు అడుగుల ఎత్తు అంతే పరిమాణంలో చుట్టుకొలత తో తామ్ర వర్ణ ఛాయలో నాగాభరణాలు, రుద్రాక్షలు, పుష్పహారాలు, బిల్వపత్రాలను అలంకరించుకొని నయనమనోహరంగా దర్శనమిస్తారు. చూడగానే హిమాలయాలలో కనిపించే అమరనాథ హిమలింగం తలుపుకు వస్తుంది. 
 కాకపోతే దాని దర్శనం సంవత్సరంలో కొంతకాలమే ! కానీ శ్రీ గుప్తేశ్వరుని సంవత్సరమంతా సేవించుకొనవచ్చును. స్థానికులే పూజారులుగా వ్యవహరిస్తారు. స్వామిని దర్శించుకొని రెండో పక్కన ఏర్పాటుచేసిన మరో సన్నని మార్గం ద్వారా పైకి చేరుకోవచ్చును. నిత్య పూజలు జరుగుతాయి. 































కోరాపుట్ నుండి గుప్తేశ్వర దాకా చక్కని రహదారి కలదు. కానీ  ఉదయం ఆరున్నరకు కోరాపుట్ నుండి బయలుదేరే బస్సు ఒక్కటే అక్కడి చేరుకోడానికి ఆధారం. అదే బస్సు మధ్యాహాన్నం తిరిగి బయలుదేరుతుంది. లేకపోతే బోయపరిగూడ దాకా బస్సులో వెళ్లి అక్కడ నుండి ఆటో లేదా జీపు మాట్లాడుకొని వేళ్ళ వచ్చును. కాకపోతే కొంచెం ఎక్కువ తీసుకొంటారు. కోరాపుట్ లేదా జయపూర్ నుండి కానీ ప్రవేట్ లేదా స్వంత వాహనాలలో చేరుకోవడం ఉత్తమం. 
ఇబ్బందులున్నా శ్రీ గుప్తేశ్వర మహాదేవ దర్శనం భక్తులను ప్రకృతితో మమేకం చేసే ఒక అద్భుత ఆధ్యాత్మిక యాత్ర. 

నమః శివాయ !!!!
 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...