సద్గతులను ప్రసాదించే శ్రాద్ధ నారాయణుడు
ప్రజలు ఆలయాలకు వెళ్లి కొలువు తీరిన దేవీదేవతలకు తమ కోరికల చిట్టా తెలుపుతూ నెరవేర్చమని అర్ధిస్తుంటారు. వీటిల్లో అధికభాగం ఇహలోక సుఖాలే ఉంటాయి. ఇవి బొందిలో జీవం ఉన్నంత వరకూ ఒకదాని తరువాత మరొకటి చొప్పున కొనసాగుతూనే ఉండటం ఆ అందరికీ తెలిసిన విషయమే !
ఒకోసారి ఈ తాపత్రయం మరణానంతర లేదా మరో జన్మకు సంబంధించిన విషయాల పట్ల కూడా ఉండటం విశేషం. కానీ సమస్త జీవులను క్షమించి ఆదరించి వారి కోర్కెలను నెరవేరుస్తారు పరాత్పరుడు. ఆ విధమైన అదృష్టానికి నోచుకొన్న ధన్య జీవులైన దంపతుల కారణంగా అందరికీ లభించిన ఒక అరుదైన ఆలయం తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు పట్టణంలోని శ్రీ శ్రాద్ధ నారాయణ పెరుమాళ్ కోవెల.
చాలా చిన్నగా మన వాడకట్టులో కనపడే అతి సాధారణ నిర్మాణంలాగ కనిపించే శ్రీ మహా లక్ష్మి సమేత శ్రీ నారాయణ పెరుమాళ్ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం. గతంలో ఈ క్షేత్రాన్ని "పుండరీక నల్లూరు" లేదా "పిండం వైత్త నల్లూరు" అని పిలిచేవారు. చెంగల్పట్టు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో పక్షి తీర్ధం వెళ్లే దారిలో వచ్చే "నేన్మెలి" (Nenmeli) అనే చోట ఉన్న ఈ క్షేత్ర గాధ ఇలా ఉన్నది.
పూర్వం ఆర్కాట్ నవాబ్ వద్ద యజ్ఞ నారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు దీవానుగా పనిచేసేవారు. భార్యాభర్తలు శ్రీవైష్ణవులు. శ్రీ మన్నారాయణ స్వామిని అమిత భక్తి శ్రద్దలతో సేవించుకొనేవారు.
తమకున్న అధికారంతో శిధిలావస్థలో ఉన్న శ్రీహరి ఆలయాలను పునః నిర్మించడం, అర్చక స్వాములను నియమించడం, నిర్వహణకు నిధులు మరియు భూములు ఇవ్వడం చేసేవారు.
వీటికోసం తమ ఆస్తులు, జీతభత్యాలనే కాకుండా ప్రజల నుండి వసూలు చేసిన శిస్తుల, పన్నుల మరియు ఇతర ఆదాయ మార్గాల ద్వారా లభించిన ధనాన్ని కూడా ఖర్చు చేశారు శర్మ గారు. కానీ నవాబ్ ఖజానాకు జమ కట్టలేదు.
కొంత కాలం గడిచింది. శర్మ వసూలు చేసిన సొమ్ము కట్టలేదని, ఆ ధనాన్నిఆలయాల అభివృద్ధి నిమిత్తం ఉపయోగించారని తెలిసింది.నవాబు ఆగ్రహించి ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు బ్రాహ్మణ దంపతులను చెఱసాలలో బంధించమని ఆజ్ఞాపించారు.
అనుజ్ఞ తీసుకోకపోవడం నిజమే , కానీ తాము ఆ ధనాన్ని దైవకార్యాలకే వినియోగించాము తప్ప స్వంతానికి వాడుకోలేదు. చెప్పుడు మాటల ప్రభావంతో నవాబు తమ విన్నపాన్ని వినకుండా శిక్ష విధించారని వగచారు దివాను దంపతులు. ఆ ఆవేదనలో దేహత్యాగం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అప్పటికే వారు వృద్దులు. సంతానం లేదు. కానీ జన్మరీత్యా సంక్రమించిన కులం ప్రకారం మరణానంతరం తగిన శ్రాద్ధ కర్మలు జరిగితే గానీ ఉత్తమ లోకాలు లేదా ఉత్తమ జన్మలు లభించవు అన్న విశ్వాసం వారికి కలదు. సరే ! చెఱసాల పాలై దుర్భర జీవితం గడిపే కన్నా మరణించడమే మంచిది. తరువాత విషయం పెరుమాళ్ నిర్ణయిస్తారు అని తలంచి ఆలయ పుష్కరణిలో దూకి మరణించారు.
మరణానంతరం వారికి శ్రీవారి సాక్షాత్కారం లభించినదట. వారికి తన యెడల గల భక్తిశ్రద్ధలు, విశ్వాసానికి ప్రతిగా స్వయంగా తానే వారికి మరణానంతర క్రతువులు, పిండ ప్రధానం మరియు తర్పణాలు సమర్పిస్తానని తెలిపి శాశ్వత వైకుంఠ వాస యోగం అనుగ్రహించారట.
ఈ సంఘటన జరిగింది ఇక్కడే ! వృద్ధ దంపతుల కోరిక మేరకు, వారి నిస్వార్ధ భక్తికి ప్రతిగా లభించిన ప్రతిఫలం అందరికీ తెలియాలన్న వారి కోరిక మేరకు శ్రీ మహాలక్షి సమేత నారాయణ పెరుమాళ్ గా కొలువు తీరారు. నాటి నుండి నేటి వరకు శర్మ దంపతుల తిథిని శ్రీమన్నారాయణుడే జరుపుతున్నారు. నాడు శర్మ గారి వంశీయులు హాజరయ్యి తొలి తీర్ధం స్వీకరిస్తారు.
అందుకే ఈ ఆలయ ఉత్సవమూర్తిని "శార్ధ సంరక్షణ నారాయణుడు" అని అంటారు. స్వయం వైకుంఠ వాసుడు చేసే ఆబ్ధీకం కనుక ఈ క్షేత్రాన్ని గయ సమాన క్షేత్రంగా పరిగణిస్తారు. దాని వలన తదనంతర కాలంలో సంతానం లేని వారి, అవివాహితుల, అనాధల లేక బంధువులు ఎవరూ లేని వారి పిండ ప్రధాన భాద్యతను పరమాత్మకు అప్పగించడం ఆరంభమైనది.
తమకు తెలిసిన సంతానం లేని దంపతుల, అవివాహిత అనాధ స్నేహితుల లేదా ఆత్మహత్య లేదా ప్రమాదాలలో అర్ధాంతరంగా మరణించినవారి శ్రాద్ధం ఇక్కడ జరిపించుకోడానికి చాలా మంది వస్తుంటారు. ముందు రోజు ఆలయ అర్చక స్వామిని సంప్రదించిస్తే చెల్లించవలసిన పైకం మిగిలిన వివరాలు తెలుపుతారు.
తిథిని అమావాస్య లేదా ఏకాదశి రోజున మధ్యాహన్నం పన్నెండు గంటల తరువాత ఆరంభిస్తారు. చెయ్యించదలచినవారు మరణించినవారి పేరు, గోత్రము, జన్మ నక్షత్రంలాంటి వివరాలతో సంకల్పం చెప్పి మిగిలిన బాధ్యత శ్రీవారికి అప్పగిస్తారు సన్నిహితులు. కార్యక్రమం పూర్తి అయిన తరువాత స్వామివారికి ఆవు నెయ్యితో చేసిన బెల్లం పరమాన్నం మరియు పెరుగన్నం నివేదన చేస్తారు. క్రతువు నిర్వహించడానికి గర్భాలయం వెనుక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ గయలో దర్శనమిచ్చే గదాధరుని పాదాలను కూడా ఉంచారు.
చిన్న ఆలయం.తొలుత అర్ధ మండపం, గర్భాలయం మరియు ముఖ మండపము మాత్రమే ఉండేవని నిర్మాణాన్ని చూస్తే అర్ధం అవుతుంది. ఆలయ విశేషాలు వ్యాప్తి చెందిన తరువాత చుట్టూ ఇతర నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తుంది. తూర్పు దిశగా ఉండే ఆలయానికి ఎదురుగా ధ్వజస్థంభం, శ్రీ గరుడాళ్వార్ మరియు శ్రీ ఆంజనేయ సన్నిధి కనపడతాయి.మండపంలో శ్రీవారి చిత్రపటాలను అలంకరించబడి ఉంటాయి.
గర్భాలయానికి దారితీసే ద్వారం స్వర్ణవర్ణ రేకులతో తాపడం చేబడినది. అర్ధమండపంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శార్ధ సంరక్షణ నారాయణుడు దర్శనమిస్తారు. గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మీ సమేత నారాయణ స్వామి నేత్రపర్వంగా కొలువుతీరి కనపడతారు.
స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తారు. నిత్యం స్థానిక భక్తులు మాత్రమే కనపడే ఈ ఆలయంలో అమావాస్య మరియు ఏకాదశి రోజులలో వాటికి ముందు రోజులలో శ్రాద్ధం జరిపించుకోడానికి వచ్చేవారితో కోలాహాలం నెలకొంటుంది.
ఈ ఆలయంలో ఉన్న మరో విశేషం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మీ సాలగ్రామం. అతి అరుదుగా లభిస్తుంది. అమ్మవారికి ప్రతిరూపం అయిన ఈ సాలగ్రామానికి భక్తిశ్రద్దలతో అభిషేకాలు, పూజలు జరిపితే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది అని అంటారు. ముఖ్యంగా మంగళ మరియు శుక్రవారాలలో ఈ సాలగ్రామానికి ప్రత్యేక కుంకుమ పూజ జరిపించుకొంటే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అని స్థానిక మహిళలు విశ్వసిస్తారు.
దేశంలోని అన్ని ప్రాంతాల నుండి చెంగల్పట్టు చేరుకోడానికి రైలు సౌకర్యం కలదు. అందుబాటులో వసతి మరియు భోజన సౌకర్యాలు లభిస్తాయి. చుట్టుపక్కల ఎన్నో పురాతన దర్శనీయ ఆలయాలు ఉన్నాయి.
పంచభూత క్షేత్రాలలో ఒకటైన తిరువణ్ణామలై లో శ్రీ అరుణాచలేశ్వరుడు తన భక్తుడైన వళ్లాల రాజు కు సంతానం లేనందున మాసీ మాసంలో శ్రాద్ధం పెడతారు. కానీ ఇక్కడ పరమాత్మ అందరికీ సద్గతులు కలిగించడానికి స్వయంగా శ్రాద్ధము పెట్టడం మరెక్కడా కనపడని విశేష విశేషం.
జై శ్రీమన్నారాయణ !!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి