7, ఫిబ్రవరి 2019, గురువారం

          పశు పక్ష్యాదులకు కూడా ప్రత్యేక రోజులున్నాయిట




                                                                                                 



మనందరం ఉన్నంతలో ఆనందంగా, తాహతుకు తగినట్లుగా ఆర్భాటంగా జరుపుకొనేది పుట్టిన రోజు వేడుకలను. మనది లేదా మన కుటుంబ సభ్యుల జన్మదినోత్సవ సందర్బంగా ఒకరికొకరు శుభాకాంక్షలు అందుకోవడం లేదా తెలపడం, బంధుమిత్రులతో ఉల్లాసంగా గడపడం ఆ రోజున  సహజంగా చోటుచేసుకునే పరిణామాలు. అది ఒక ప్రత్యేకమైన రోజు మనందరికీ. 
మరి మనతో పాటు ఈ భువిలో నివసించే పశు పక్ష్యాదులు సంగతేమిటి ? వాటికి నోరు లేదాయ పాపం. ఏమి చేయాలి ? ఎక్కడో పుడతాయి. మరెక్కడో మరణిస్తాయి. జీవించడానికి ఎన్నో పాట్లు పడుతుంటాయి.  భావాలను వ్యక్తపరచడానికి మనకంటూ బాష ఉన్నది. మాట్లాడగలం. కానీ మన వలన పర్యావరణానికి హాని తప్ప జరుగుతున్నమేలు ఏమీ కనపడటం లేదు. కానీ వానపాములు, సీతాకోకచిలుక దగ్గర నుండి ఏనుగు వరకు అన్ని మూగ జీవులు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు భాద్యతను సక్రమంగా నెరపుతున్నాయి. నిర్వహించడానికి కృషి చేస్తున్నాయి. అవి చేయలేకపోతే అది మన పొరబాటే. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి మనం చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు కదా మరి!
సరే ఈ విషయాలను వదిలేసి అసలు విషయం దగ్గరకు వద్దాము. 
పశు పక్ష్యాదులు మానవాళికి ఆహరంగా , ప్రయాణ సాధనాలుగా ఉపయోగపడటమే కాకుండా భూమి మీద వాతావరణాన్ని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేనా మనకు మనోల్లాసం కలిగిస్తాయి. కుక్క, పిల్లి, పావురాలు,చిలకలు లాంటి పెంపుడు జంతువులు మరియు పక్షులు  మన భావోద్వేగాలను అదుపులో ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
పుడమి పరిరక్షణలో విశేష పాత్ర పోషిస్తున్న పశు పక్ష్యాదుల పట్ల ఆదరణతో కొందరు శాస్త్రవేత్తలు, జంతు పక్షి ప్రేమికులు, భూమి బాగోగుల పట్ల ఆలోచన ఉన్నవారు కలిసి కొన్ని సంస్థలను స్థాపించారు. ప్రతి ఒక్క పక్షి లేదా జంతువుకు సంవత్సరంలో ఒక రోజును కేటాయించారు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించి ఆ జీవి గురించి, ఆ జాతి వలన ఒనగూడే ప్రయోజనాల గురించి వాటిని కాపాడవలసిన అగత్యం ఏ  స్థాయిలో ఉన్నది అన్న విషయాలను తెలుపుతారు. ఈ రోజులను నిర్ణయించినవారు పశ్చిమ దేశాలకు చెందినవారే కావడం విశేషం. వారిని హృదయపూర్వకంగా అభినందించాలి. ఇక్కడొక విషయం తెలుసుకోవాలి. ఈ పశుపక్ష్యాదుల గొప్పదనాన్ని గుర్తించిన మన పూర్వీకులు వాటికి పురాణాలలో దేవీదేవతల వాహనాలుగా విశిష్ట స్థానాలలో నిలిపారు. శనీశ్వరునికి సీసా నూనెతో అభిషేకం చేస్తాం. ఆయన వాహనానికి గుప్పెడు మెతుకులు వెయ్యం. అది వేరే సంగతి. 
అలా నిర్ణయం కాబడ్డ రోజే ఆ పక్షి లేదా జంతువు యొక్క ప్రత్యేకమైన రోజు. ముందుగా పక్షుల  గురించిన వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల పక్షి జాతులున్నాయి. శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం పదివేల కొత్త జాతి పక్షులను కనిపెడుతున్నారు. అంతే సంఖ్యలో వివిధ కారణాలతో  కొన్ని జాతులు పూర్తిగా అంతరించి పోవడమో లేదా వాటి సంఖ్య దారుణంగా తగ్గిపోవడమో జరుగుతోంది. అందువలన అన్ని జాతులకు కలిపి ప్రపంచ పక్షుల దినోత్సవాన్ని ఏప్రిల్ నెల పదమూడవ తారీఖుగా నిర్ణయించారు. గమనించదగిన అంశం ఏమిటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆ రోజు శలవగా ప్రకటించడం. ఒక చోట స్థిరంగా ఉండక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తాత్కాలికంగా వలస వెళ్లే విహంగాల దినోత్సవాన్ని మే నెల రెండో శనివారం నాడు  జరుపుతారు. 
కాకపోతే మెక్సికో, దక్షిణ, మధ్య అమెరికాలలో జాతీయ పక్షి దినోత్సవాన్ని అక్టోబర్ నెల రెండో శనివారం జరుపుకోగా మనదేశంలో జనవరి నెల అయిదో తారీఖున జరుపుకొంటాము. మన జాతీయ పక్షి తెలుసు కదా నెమలి.    
ఇక విడివిడిగా చూస్తే ఒక్క రోజు తప్ప మిగిలిన సమయం అంతా మనం అసహ్యించుకునే కాకికి కేటాయించిన రోజు ఏప్రిల్ ఇరవై ఏడు. అంతరించిపోతున్న పిచ్చికలది మార్చి ఇరవై. చిలక పలుకులు అంటూ మన అభినందనలను అందుకొనే రామచిలుకల రోజు మే నెల ఆఖరి రోజున. పెంపుడు పక్షులైన పావురం మే నెల పదమూడు, కోడి మే నెల నాలుగు,బాతు జనవరి పద మూడున తమ యజమానులు దయ తలిస్తే తమ ప్రత్యేక రోజులు జరుపుకొంటాయి. లేకపోతే లేదు. ఇక అందరూ అశుభంగా భావించడం వలన రాత్రి పూటే సంచరించే  గుడ్లగూబ ఆగస్టు నాలుగున, గబ్బిలం ఏప్రిల్ పదిహేడున చీకట్లోనే జరుపుకొంటాయి. 
నాట్యమయూరి మార్చి ఇరవైనాలుగున, సంగీత నిధి హమ్మింగ్ బర్డ్ మే పదిహేనున, గాన కోకిల ఏప్రిల్ ఇరవైన తమ ప్రత్యేక దిన సంబరాలను నృత్యగానాల మధ్య జరుపుకొంటాయి. తమను అస్యహించుకొన్నా మానవాళికి సేవ చేసే రాబందులు సెప్టెంబర్ మొదటి శనివారం నాడు, గ్రద్దలు మార్చి ఇరవై అయిదున గుట్టు చప్పుడు కాకుండా కొండల మీద వేడుకలను చేసుకొంటాయి. 
పంటలు సంవృద్ధిగా పండటానికి తమ వంతు కృషి చేసే సీతాకోక చిలుకలు పంటలు ఇంటికి వచ్చిన తరువాత అంటే పద్నాలుగు మార్చి, వానపాములు కొత్తపంట వేసే ముందు అనగా  అక్టోబర్ ఇరవై ఒకటిన పండుగ చేసుకొంటాయి. కస్సు బుస్సు మంటూ బెదిరిస్తూనే 
పుట్టలో పడుకొనే పాలు పూజలు స్వీకరించే  పన్నగం జులై పదహారున గుట్టుగా పుట్టలో ప్రత్యేక రోజు జరుపుకొంటుంది. 
ఇక పశువులు మరియు జంతువుల అంతర్జాతీయ దినోత్సవాల గురించి తెలుసుకొనే ముందు వాటి ప్రస్తుత జీవన విధానానికి ఎదురవుతున్న ముప్పును గురించి మాట్లాడుకొందాము. అరణ్యాల విస్తీర్ణం త్వరితగతిన తగ్గిపోవడం, తగినంత ఆహరం, నీరు లభ్యం కాకపోవడం, వేటగాళ్ల బారినపడటం లాంటి కారణాలతో పెక్కు వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. ఇక పెంపుడు జంతువులలో శునకాలు తప్ప మిగిలిన వాటి స్థితి కూడా ఏమంత ఆరోగ్యవంతంగా లేదు.తగ్గుతున్న పంట పొలాల విస్తీర్ణం, జరుగుతున్నవ్యవసాయంలో కూడా యంత్ర వినియోగం, వర్షాభావ పరిస్థితులు, గడ్డి కొరత, పెరిగిన నిర్వహణ ఖర్చుల కారణంగా  పాడి పశువుల నిర్వహణ తగ్గిపోతున్నది. వేరే  లాభసాటి వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కఠిన పరిస్థితులలో తమ ఉనికిని మరియు అవసరాన్ని గట్టిగా లోకానికి తెలుపాలన్ననిర్ణయంతో అవన్నీవాటి ప్రత్యేక దినాలను వీలైనంత ఘనంగా జరుపుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
మానవుని తొలి నేస్తం విశ్వసానికి మారుపేరు కుక్క. తనకున్న ఆదరణతో ఆగస్ట్ ఇరవై ఆరున సంబరాలను జరుపుకొంటాయి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఎవరైనా మనిషికి అణిగి మణిగి ఉంటె ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా రాజభోగాలు అందుకోవచ్చును. అందుకే కామోసు కుక్క తినే బిస్కట్లకు కూడా ఒక రోజు కేటాయించారు. అది ఫిబ్రవరి ఇరవై మూడు. 
పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కొత్తగా ఈ జాబితాలో పుణ్యం దక్కుతుంది అన్న ఆశతో పాటు  అనేకం చేరాయి. వీటన్నింటినీ అందిస్తున్న గోమాత జులై పదిన, నల్లగా ఉన్నా తన మనస్సు లాంటి స్వచ్ఛమైన తెల్లని పాలు, పాల పదార్ధాలను అందించే గేదె నవంబర్ నెల తొలి శనివారం నాడు, మిగిలిని పెంపుడు జంతువులైన మేకలు సెప్టెంబర్ తొమ్మిదిన, గొఱ్ఱెలు అక్టోబర్ ఇరవై ఏడున ప్రత్యేక దినాలను జరుపుకొంటాయి.
తొలినాటి ప్రయాణ సాధనం.తదనంతర కాలంలో కనిపెట్టిన ఎన్నో ఇంధన రవాణా వాహనాల  యంత్ర సామర్ధ్యాన్ని దాని బలంతో పోలుస్తున్నారు. ఇంత గొప్ప గౌరవాన్ని పొందుతున్న   అశ్వం మార్చి ఒకటవ తారీఖున మాంచి ఉషారుగా జరుపుకొంటుంది. ఎందుకూ పనికిరానివాడికి ప్రధానం చేసే బిరుదు ఒకటుంది అడ్డమైన చాకిరీ చేస్తూ కూడా ఇలాంటి అవమానాలను ఎదుర్కొనే గార్దభాలు అభావంగానే తమ రోజుని మే నెల  ఎనిమిది న చేసుకొంటాయి.
అరణ్యాలలో జీవించే సాధు మరియు క్రూర జంతువులకు కూడా ఒక్కో రోజు చొప్పున ఉన్నాయి. వీటిల్లో చాలా మటుకు అంతరించి పోతున్నవాటి జాబితాలో ఉండటం విచారకరం. ప్రస్తుతం పెద్ద జంతువుగా గుర్తింపు పొందుతున్న గజాలు సందడిగా మందతో కలిసి ఆగస్టు పన్నెండున, మృగరాజు ఆగస్టు పదిన, పెద్ద పులి జులై ఇరవై తొమ్మిదిన, చిరుతపులి డిసెంబర్ నాలుగున తమ ప్రత్యేక రోజులను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటాయి. ఎలుగుబంట్లు ఫిబ్రవరి ఇరవై ఏడున, కంగారూలు మే పదిహేనున, గుఱ్ఱానికి దగ్గర చుట్టం అయిన జీబ్రా జనవరి ముప్పై ఒకటిన, ఎత్తైన జీవిగా పేరొందిన జిరాఫీ జూన్ ఇరవై ఒకటిన పండుగ  చేసుకొంటాయి. చూడగానే ఆమ్మో అనిపించే జంతువు ఖడ్గమృగం. అది సెప్టెంబర్ ఇరవై రెండున విశేష రోజు వేడుకలు చేసుకొంటే, కొంతవరకు దానిని పోలి ఉండి నీటి గుఱ్ఱం గా పిలవబడే హిప్పోపొటమస్ ఫిబ్రవరి పదిహేనున చేసుకొంటుంది.
చెట్ల మీద తిరుగుతూ చూడగానే ముచ్చట కలిగే పండా సెప్టెంబర్ పదిహేనున వృక్ష శాఖల మీద బిడియంగా ప్రత్యేక దినాన్ని జరుపుకొంటాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. వీటి ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే మనతో  భూమి మీద నివసించే జీవుల ప్రాధాన్యాన్ని గుర్తించడానికే. దానిని గ్రహించి వాటికి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలను తెలుపుదాం.  
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...