Naulakha Mandir, Begusarai

                               నవలాఖా మందిర్, బెగుసరాయ్ 



గణపతి ఆలయం, అమ్మవారి గుడి, శివాలయం లేదా శ్రీ కృష్ణాలయం ఇలా నే మనం మనకు తెలిసినా  లేదా సందర్శించిన ఆలయాలను ఉదహరిస్తాము.  కానీ ఆ నిర్మాణానికి అయిన ధనం విలువతో ఆలయాన్ని పిలవడము చేయం. అయితే అలా నిర్మాణానికి పెట్టిన రూపాయల విలువతో పేర్కొనే రెండు ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. ఒకటి ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవగఢ్ లో ఒకటి రెండవది బీహార్ రాష్ట్రం లోని బెగుసరాయ్ లో.









ఈ మధ్య ఉద్యోగరీత్యా బీహార్ రాష్ట్రంలో పర్యటించాల్సి వచ్చినప్పుడు బెగుసరాయ్ వెళ్లాను. అక్కడ శ్రీ సీతారామ లక్ష్మణ మందిరం ఒకటి ఉందని దానిని నవలాఖా మందిర్ అని పిలుస్తారు అని తెలిసింది.పనంతా పూర్తి అయిన తరువాత సాయంత్రం మందిరం చూడటానికి మా స్థానిక సహోద్యోగిని తో కలిసి వెళ్లాను.బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో విష్ణు పూర్ అన్న ప్రాంతంలో ఉన్న ఈ మందిరానికి చేరుకోడానికి ఆటోలు దొరుకుతాయి.








1853వ సంవత్సరంలో సంత్ శ్రీ మహావీర్ దాస్ జీ ఈ మందిరాన్ని నిర్మించారు అని తెలుస్తోంది. ప్రస్తుతం వారి మఠం ఆధ్వర్యం లోనే మందిర కార్యకలాపాలు జరుగుతున్నాయి.
శిథిలావస్థకు చేరుకొన్న ప్రధాన ద్వారం విశాల ప్రాంగణం లోనికి దారి తీస్తుంది. విచారకరమైన విషయం ఏమిటంటే నిర్మాణాలను పరిరక్షించడానికి ఎవరూ ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కనీసం మరమత్తులు కూడా జరపడం లేదు.
కనీసం అడ్డదిడ్డంగా పెరిగి మందిర సౌందర్యాన్ని కనపడకుండా చేస్తున్నచెట్లను, మొక్కలను సరి చేసే ప్రయత్నాలు కూడా లేవు.








విశాల ప్రాంగణం లోనికి వెళ్ళగానే ఎదురుగా గుబురుగా పెరిగిన వృక్షాలు, మొక్కల మధ్య ఆకాశాన్ని తాకుతోంది అనిపించే మందిర విమాన గోపురం దానికి  నాలుగు వైపులా సుందర గుమ్మటాలు కనిపిస్తాయి.








ఆ రోజులలో ఈ నిర్మాణానికి తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేశారట. అందుకని స్థానిక యాసలో "నవలాఖ మందిరం'గా పిలుస్తున్నారు. సుమారు నూట యాభై సంవత్సరాల క్రిందట తొమ్మిది లక్షలు అయ్యాయంటే మారిన పరిస్థితుల ప్రకారం నేడు ఎంత అవుతుంది ???
ముఖ మండప పైభాగాన నిర్మాణ వివరాలను తెలిపే ఫలకాన్ని ఉంచారు. దానికి అలంకరణ గా ఏర్పాటు చేసిన మయూరాలు, లతలు, పుష్పాలు సహజ వర్ణాలతో ఆకట్టుకొంటాయి.











ప్రధాన విమాన గోపురం బాగున్నా పక్కన ఉన్న గుమ్మటాలు మాత్రం కొంత మేర నెర్రెలు వచ్చి తగిన మర్మత్తుల కొరకు ఎదురు చూస్తున్నాయి. కళాత్మకంగా  చెక్కబడిన విమాన గోపురం పైన కలశం దానికి ఇరుపక్కలా శ్రీ ఆంజనేయ మరియు శ్రీ గరుత్మంత మూర్తులను చెక్కారు. ఉత్తరాదిన సహజంగా గోపుర పైభాగాన కనిపించే ధ్వజం ఇక్కడ కనపడదు.
అదే విధంగా దక్షిణాదిన కనిపించే ధ్వజస్థంభం, బలి పీఠం  ఇక్కడ కనపడవు.









గర్భాలయానికి పైన చుట్టూ రామాయణ ఘట్టాలను తెలిపే సుందర వర్ణ చిత్రాలను నిలిపారు. వీటిల్లోభూజాత  భూదేవి ఒడిని చేరడం, శబరి చేతి నుండి ఎంగిలి ఫలాలను శ్రీ రాముడు స్వీకరించడం లాంటి అరుదైన చిత్రాలు ఆకట్టుకొంటాయి.













అన్నిటికన్నా ఆకర్షణీయమైనది పైకప్పును తీర్చిదిద్దిన విధానం. విలువైన రాళ్ళతోనో, ఖరీదైన అద్దాలతోనో నిర్మించారు అనిపిస్తుంది. కానీ అవి ఒక విధమైన రాళ్లు( మకరాణా  మార్బల్స్) మాత్రమే. దీపపు కాంతులను స్వీకరించిన  పైకప్పు రాళ్లు తిరిగి వెదజల్లే కాంతి అద్భుతంగా ఉంటుంది.











మండపం లో ఒకపక్క శ్రీ హనుమంతుడు మరో పక్క శ్రీ వినతాసుతుని  పాలరాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
గర్భాలయం లో ఎత్తైన గద్దె మీద మూలవిరాట్టులైన సీతారామ లక్ష్మణులు పీతాంబర ధారులై సుందర అలంకరణలో దర్శన మిస్తారు. గమనించదగిన అంశం ఏమిటంటే దశరధ నందానులు ధనుర్భాణాలు ధరించి ఉండరు.
అదే విధిగా సతతం రామ పాదాల వద్ద ఉండే శ్రీ రామదూత కూడా కనిపించరు.











వాయునందనునికి ఈ మందిరం ఎదురుగా నిర్మించిన మరో మందిరం నిర్మించారు. ఇక్కడ స్వామి పంచముఖాలతో ప్రసన్న మూర్తిగా కనిపిస్తారు.నిత్యం నియమంగా పూజాదికాలు నిర్వహిస్తారు. సాయంకాలాల్లో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీరామ నవమి, హనుమద్జ్జయంతి పర్వదినాలలో వేలాదిగా భక్తులు తరలివస్తారు,














బెగుసరాయ్ లో  రైల్వే స్టేషన్ ఉన్న అన్ని రైళ్లు అక్కడ ఆగవు. దగ్గరలో ఉన్న రైల్వే కూడలి "బరోని". దేశం లోని అన్ని ప్రాంతాల నుండి బరోని కి రైళ్లు ఉన్నాయి. స్థానికంగా ఉండటానికి వసతి గృహాలు ( హోటల్స్) ఉన్నాయి. 
సరి అయిన ప్రచారం, నిర్వహణ ఉంటే సందర్శకులను అమితంగా ఆకర్షించ దగిన విశేషాలు గలది నవలాఖా మందిరం బెగుసరాయ్. 

జై శ్రీ రామ్ !!!!! 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Irukalala Parameswari Temple, Nellore