శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, యనమలకుదురు
నిత్యస్మరణీయ నామం నమః శివాయ !
పరిపూర్ణ భక్తిభావంతో నామాన్ని స్మరిస్తే చాలు భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే పరమ శివుడు భూలోకంలో అనేక ప్రాంతాలలో స్వయంభూ లింగరూపంలో కొలువుతీరి ఉన్నారు. మరికొన్ని చోట్ల అవతార పురుషులు, మహర్షులు, భక్తులు శతాబ్దాల క్రిందట ప్రతిష్టించారు. అవన్నీ నేడు ప్రసిద్ధ శివ క్షేత్రాలుగా పేరొందాయి.
విజయవాడ యనమలకుదురు గ్రామంలోని "మునిగిరి"మీద కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం రెండువకోవ లోనికి వస్తుంది.
పురాణ కాలంలో అనేక మంది మహర్షులు పవిత్ర కృష్ణా నదీ తీరం లోని ఈ పర్వతం మీద తపస్సు చేయడం వలన ఆ పేరు, సహస్రాధిక మునులు తపస్సు చేసుకొన్నకొండ ఉన్న ఊరుగా " వేయి మునుల కుదురు" గా పిలవబడేవి అని చెబుతారు.
అదే కాల క్రమంలో "యనమలకుదురు"గా రూపాంతం చెందినట్లుగా తెలుస్తోంది.
ఏ దివ్య కారణం వలన లేదా ఏ భక్తుని కాపాడటానికి భక్త సులభుడు ఉద్భవించారో తెలియదు కానీ మహా విష్ణు ఆరో అవతార స్వరూపమైన పరశురాముడు భూమి లోనికి కృంగి పోయిన తన గురువైన మహేశ్వర లింగాన్నిగుర్తించి పునః ప్రతిష్ట చేసినట్లుగా స్థల పురాణం చెబుతోంది.
తదనంతర కాలంలో అనేక మంది రాజులు, పాలకులు, జమీందారులు సామాన్య భక్తులు ఆలయాభివృద్దికి తమ చేసిన కృషి వలన నేటి రూపం సంతరించుకొన్నది.
పరశురాముడే కాదు ఆయన తరువాత అవతార పురుషుడైన శ్రీరాముడు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి లింగరాజును సేవించుకొన్నట్లుగా తెలుస్తోంది.
ఇద్దరు రాముల సేవలను అందుకొన్న లింగ రూపుడు శ్రీ రామ లింగేశ్వరునిగా ప్రసిద్ధి చెందారు.
ఆరువందల అడుగుల ఎత్తైన మునిగిరి పైకి చేరుకోడానికి సోపాన మార్గము మరియు వాహన మార్గము ఏర్పాటు చేశారు. క్షేత్రపాలకుడైన అంజనాసుతుని విరాట్ రూపం చాలా దూరానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా కనపడుతుంటుంది.
పైనుండి సువిశాల విజయవాడ నగరాన్ని, పక్కనే ప్రవహించే కృష్ణా నదిని, శ్రీ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్ర కీలాద్రి ని వీక్షించడం ఒక చక్కని అనుభూతి. స్వచ్ఛమైన గాలి ఆపైన భగవంతుని సన్నిధానం ఇంకేమి కావాలి !
పర్వత పైభాగాన తొలి ఆలయం శ్రీ గణపతిది. ప్రధమ పూజితున్ని సేవించుకొని ముందుకు సాగితే వచ్చే సన్నిధి హరి హర పుత్రుడైన శ్రీ ధర్మశాస్తది.
కైలాస నాధుడు ఇక్కడ కొలువై ఇద్దరు రాములు పూజలందుకోవడం వలన ఈ క్షేత్రాన్ని శివకేశవ క్షేత్రం గా అభివర్ణించడం వలన ఇక్కడ శ్రీ ధర్మశాస్త ఆలయం ఉండటం ఎంతైనా సమంజసం. ఆనందదాయకం. దర్శనీయం !!
శబరీ గిరీశుని దర్శించుకొని ముందుకు వెళితే క్షేత్ర పాలకుడైన శ్రీ దాసాంజనేయుని సన్నిధి వస్తుంది.
శంకర అవతారం అయిన వాయునందనుడు రామ భక్తుడు. ఈయన క్షేత్ర పాలకుడు కావడం మరింత సముచితం.
కొద్దిగా ఎత్తైన గట్టు మీద ముకుళిత హస్తాలతో స్థానక భంగిమలో కొలువైన హనుమంతుని దర్శించుకొని పక్కనే ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి పుట్టకు మొక్కి ప్రధాన ఆలయం వైపుకి వెళితే ఉత్తర ద్వారానికి ఒక పక్కన యాగశాల మరో పక్కన వేదిక కనిపిస్తాయి.
నూతనంగా పునః నిర్మించబడిన ప్రధాన ఆలయ ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే తూర్పుముఖంగా శ్రీ రామలింగేశ్వర స్వామి పక్కన దక్షిణ ముఖంగా అమ్మవారు శ్రీ పార్వతీ దేవి కొలువై ఉంటారు. ముఖ మండపంలో నందీశ్వరుడు గర్భాలయ ద్వారానికి ఇరుపక్కలా ద్వార పాలకులు కనపడతారు.
గర్భాలయంలో పెద్ద లింగరూపంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనమిస్తారు.
స్వామి అభిషేక ప్రియుడు. అందుకే ప్రతి నిత్యం అభిషేక సేవల పాల్గొనడానికి ఎందరో భక్తులు తరలివస్తుంటారు.
చతుర్భుజిగా వరద అభయ హస్తాలతో స్థానక భంగిమలో శ్రీ పార్వతీ దేవి నయనమనోహర అలంకరణలో దర్శనమిస్తారు.
ఆలయ అంతర ప్రాకారంలో శ్రీ సప్త మాతృకలు, శ్రీ ఆది శంకరుల సన్నిధులుంటాయి.
ప్రాకార పైభాగాన శ్రీ గణపతి, శ్రీ సుబ్రమణ్య రూపాలను, శివ కళ్యాణ దృశ్యాలను రమణీయంగా మలచి నిలిపారు.
ప్రధాన ఆలయానికి రెండు పక్కల శివ పార్వతుల పుత్రులైన శ్రీ వినాయక మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ ఉపాలయాలు నిర్మించారు.
తూర్పు వైపున పెద్ద నంది ని నెలకొల్పారు.
శాస్త్ర ప్రకారం నిత్య అభిషేకాలు, పూజలు నిర్వర్తించే ఈ ఆలయంలో అన్ని పర్వదినాలను వైభవంగా నిర్వహిస్తారు.
వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, మండల పూజ, నవరాత్రులుతో పాటు మూడు రోజుల పాటు శివరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి.
జిల్లా నుండే కాక రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలి వచ్చేశివరాత్రి ఉత్సవాలలో భక్తులు మేలైన జాతి వృషభాలు మీద విద్యుత్ దీప కాంతులతో ప్రత్యేకంగా అలంకరించిన ఎత్తైన ప్రభలు ప్రధాన ఆకర్షణ.
శివరాత్రి నాటి రాత్రి శివ నామస్మరణ, ఉపవాసం, తెల్లవారి శివ కళ్యాణం రమణీయంగా జరుగుతాయి.మూడో నాడు వసంతోత్సవాలను ఉల్లాసంగా నిర్వహిస్తారు.
గ్రామ ప్రజలంతా ఈ మూడు రోజులు తమ ఇంటి పండుగగా భావించి పాల్గొంటారు.
శ్రీ రామలింగేశ్వర స్వామిని ఒక్క సారి దర్శిస్తే వెయ్యి మార్లు దర్శించిన ఫలితం ఉంటుంది అన్న తరతరాల విశ్వాసంతో ప్రతి నిత్యం ఎందరో భక్తులు స్వామివారి దర్శనానికి సేవలకు వస్తుంటారు.
విజయవాడ పట్టణ రైల్వే స్టేషన్ నుండి, బస్సు స్టాండు నుండి ఆటోలలో సులభంగా శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వార్లు కొలువుతీరిన మునిగిరి ఉన్న యనమలకుదురు ఊరు సులభంగా చేరుకోవచ్చును.
విజయవాడ నగరంలో తప్పనిసరిగా సందర్శించవలసిన వాటిల్లో ఈ ఆలయం ఒకటి.
రానున్న పుష్కరాల సందర్బంగా నూతన శోభను సంతరించుకొంటున్నది ఈ దివ్య క్షేత్రం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి