2, ఆగస్టు 2016, మంగళవారం

pradosha Puja

                                               ప్రదోష పూజ 

ప్రతి రోజు ప్రాతః కాలంలో శ్రీ మహా విష్ణు ఆలయ సందర్శన, సాయం సంధ్యా సమయంలో శివ దర్శనం సర్వ శుభాలను కలిగిస్తాయని పురాణాలు, గ్రంధాలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకులు తెలుపుతున్నారు.
సకల జీవులను రక్షించేవాడు హృదయాన సిరులను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని నిలుపుకొన్నశ్రీహరి దర్శనం ఇహలోక సుఖాలను, ప్రదోష సమయంలో లయకారుడైన మహేశ్వర దర్శనం సర్వ పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేదిగా పేర్కొంటారు.
అందుకే శివాలయాలలో ప్రతి నిత్యం జరిపే ప్రదోష కాల (సాయంత్రం పూట ) పూజకు ప్రాధాన్యత అధికం. మాసానికి రెండుసార్లు వచ్చే త్రయోదశి నాడు చేసే ప్రదోష పూజ అన్నింటికన్నా విశేషమైనది. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు గంటన్నర తరువాత గంట అంటే మొత్తం రెండున్నర గంటల కాలాన్ని ప్రదోష సమయం అంటారు.
ఈ ప్రదోష పూజ, వ్రతం గురించి స్కాంద పురాణం, శివ పురాణాలలో పేర్కొనబడినది.
అమావాస్యకు, పౌర్ణమికి రెండు రోజుల ముందు వచ్చే త్రయోదశి నాడు జరిపే ఈ ప్రదోష పూజలో శిలాద మహర్షి కుమారుడు పరమేశ్వరుని వాహనము అయిన నందీశ్వరునికే  ప్రధమ పూజ. 






దీనికి సంబంధించి అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి. గరళ కంఠుడు లోక సంరక్షణ నిమిత్తంక్షీరసాగర మధన సమయాన ఉద్భవించిన  హాలాహలాన్ని స్వీకరించి దాని ప్రభావంతో కించిత్తు మైకానికి లోనై సొమ్మసిల్లి పోయారట. అది చూసిన లోకాలన్నీ తల్లడిల్లిపోయాయట.
జగన్మాత పార్వతీ దేవి జటాధరుని తన ఒడిలో ఉంచుకొని సపర్యలు చేశారట. తెప్పరిల్లిన సోమశేఖరుడు కనులు తెరిచిన సమస్త దేవతలకు, ఋషులకు, మహా మునులకు, ప్రజలకు ఆనందం కలిగించిన శుభసమయం త్రయోదశి నాటి సాయంత్రం.
నాటి నుండి ప్రతి త్రయోదశి నాడు ప్రదోష పూజ చేయడం ఒక సంప్రదాయంగా ఆరంభించారు.
యోగ మాయ నిద్ర నుండి మేల్కొని ప్రశాంత చిత్తంతో ఉండే భక్తసులభుడు పూజకు సంతృప్తుడై సర్వ మనోభీష్టాలను నెరవేరుస్తారన్నది భక్తుల విశ్వాసం.








మరో గాధ ప్రకారం రాక్షసుల చేతిలో ఓడిపోయిన దేవతలు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు నందీశ్వరుని నాయకత్వంలో కైలాస గిరి చుట్టూ ప్రదక్షిణం చేసి కైలాసనాధుని మెప్పించి ఆయన సహాయంతో రాక్షసుల మీద విజయం సాధించారట.
ఇలా ఈ పూజకు నేపథ్యమైన  ఏ గాధ తీసుకొన్నాసంపూర్ణ శరణాగతి మరియు భక్తి విశ్వాసభావంతో కూడిన దైవారాధన వలన సర్వాంతర్యామి యొక్క కరుణాకటాక్షాలు పరిపూర్ణంగా పొందుతారని చెబుతాయి.
అందువలన భక్తులు త్రయోదశి నాటి ప్రదోష వ్రతం, పూజ చేపట్టి తమ ఇహపర కోర్కెలను నెరవేర్చుకొని అంతిమంగా శివ సాన్నిధ్యం పొందుతున్నారు.
ఈ పూజ ప్రారంభం అయినది తిరుపతి - చెన్నై మార్గం లోని "సురట పల్లి"లో అని అంటారు. హాలాహలాన్ని తాగిన హరుడు సేదతీరినది ఇక్కడే అని చెబుతారు. అందుకే ఎక్కడా లేని విధంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారి ఒడిలో శిరస్సు ఉంచి సేదతీరుతున్న శయన శివుని దర్శించుకోవచ్చును. ఎన్నో ప్రత్యేకతలు ఈ ఆలయ సొంతం.










తెలుగు నాట చాలా కొద్దీ చోట్ల (శ్రీ కాళహస్తి, సురుటపల్లి లాంటి తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉన్న ఆలయాలలో జరుపుతుంటారు ) తమిళనాడు లోని అన్ని శివాలయాలలో శుక్లపక్ష మరియు కృష్ణ పక్ష త్రయోదశి నాడు ప్రదోష పూజ శాస్త్రప్రకారం రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.  
సాయంత్రం నాలుగు గంటలకు నందివాహనునికి ఎదురుగా ముఖ మండపంలో కొలువై ఉండే నందికి వివిధ ద్రవ్వాలతో అభిషేకం చేస్తారు.
ఒక్కో అభిషేకానికి ఒక్కో రకమైన ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు తెలుపుతున్నాయి.
పాలు - దీర్గాయువు, ఆవు నెయ్యి  - మోక్షం, పెరుగు - సత్సంతానం, తేనె - మధురమైన గొంతు, బియ్యపు పిండి/నూక - ఋణవిముక్తి, చెరుకు రసం - ఆరోగ్యం, పంచామృతం - సిరిసంపదలు, నిమ్మ రసం - అపమృత్యు భయాన్ని తొలగింపు, లేత కొబ్బరి బొండాం నీరు - సుఖశాంతులు, అన్నాభిషేకం - చక్రవర్తి యోగం, గంధం - లక్ష్మీ కటాక్షం, పంచదార - శత్రుత్వ నివారణ. విభూతి - సర్వ పాపహరణం.






నందికి, లింగరాజుకి (ఉత్సవ మూర్తి అయిన నటరాజుకి కూడా అభిషేకాలు జరుపుతారు)  అభిషేకాల అనంతరం సుందరంగా విభూతి, చందన, కుంకుమ లేపనాలతో వివిధ వర్ణ పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరిస్తారు.
తరువాత నంది వాహనం మీద ఆదిదంపతులు ఆలయ ప్రదక్షిణా పధంలో ఊరేగుతారు. ఆలయానికి మాడ వీధులు ఉంటే ఆలయ వెలుపలి ప్రాకారంలో మాడ వీధులలో ఊరేగుతారు. గ్రామస్థులు అత్యంత భక్తి శ్రద్దలతో దేవీ సమేత దేవరకి స్వాగతం పలుకుతారు. 
సహజంగా గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాము. కానీ ప్రదోష పూజ రోజున భక్తులు సోమస్కంద ప్రదక్షిణ చేస్తారు.
అంటే ధ్వజస్థంభం వద్ద ప్రదక్షిణ ఆరంభించి గోముఖి దాకా వెళ్లి తిరిగి ధ్వజస్థంభం దాటి అప్రదక్షిణంగా గోముఖి దాకా వెళ్ళాలి. ఒకసారి ఇలా చేస్తే అది ఒక సాధారణ ప్రదక్షణానికి సమానం. ఇలా వారి వారి మనోభీష్టాల ప్రకారం భక్తులు ఈ ప్రదక్షణలు చేస్తారు. ఆ రోజే సోమస్కంద ప్రదక్షణ చేయటానికి కారణం ఏమిటంటే పవిత్ర అభిషేక ద్రవ్యాలు గోముఖి గుండానే వెలుపలికి వస్తాయి కదా! వాటిని తొక్కడం లేదా దాటడం మహా పాపంగా భావించడమే!!









శైవ క్షేత్రాలలో నందీశ్వరుడు తప్పని సరిగా దర్శనమిస్తారు.  ఆయనకు ఉన్న ప్రాధ్యాన్యత అంతాయింతా కాదు.
తిరువణ్ణామలై లాంటి క్షేత్రాలలో వివిధ ఆకారాలలో అంటే భారీ నుండి చిన్న నంది రూపాలు ప్రాకారానికి ఒకటి చొప్పున ఉంటాయి. తిరునెల్వేలి, చిదంబరం, తంజావూరు, మధురై లాంటి ఛోట్ల కూడా భారీ నందీశ్వర రూపాలను చూడవచ్చును.
తిరువణ్ణామలై లో ప్రతి ఒక్క నందీశ్వరుడు అరుణగిరి వైపుకి తిరిగి ఉండటం ఆ గిరి కున్న ప్రాధ్యాన్యత తెలుపుతుంది.



త్రయోదశి  ప్రదోషమే కాకుండా మహా ప్రదోషం పేరిట సంవత్సరానికి ఒకసారి నిర్వహించడం కూడా జరుగుతుంది. దీనిని మహా శివరాత్రికి ముందు మాఘ మాసంలో అత్యంత వైభవంగా భక్తిశ్రద్దలతో తమిళనాడు లోని అన్ని శైవాలయాలలో నిర్వహిస్తారు.
శివ ప్రదోషమే కాక శని ప్రదోషం కూడా చేస్తారు. జాతకరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాలతో నిత్య  జీవితంలో సమస్యలతో సతమతమయ్యే వారు అధికంగా ఈ శని ప్రదోషము జరుపుకొంటుంటారు.
ఈ శని ప్రదోషాన్ని జరుపుకోడానికి కారణం సర్వేశ్వరుడు గరళాన్ని స్వీకరించింది శనివారం నాడు.  శనివారం శనికి ప్రీతిపాత్రమైన రోజు. అందుకని ఈ శని ప్రదోష పూజలు పెద్దలు ప్రవేశపెట్టారు. నవగ్రహాలకు అధిపతి నటరాజే గా!






భక్తులు ఆ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శివారాధన చేసుకొని, ఉపవాసం ఉండాలి. రోజంతా శివనామస్మరణ చేస్తూ ప్రశాంత చిత్తంతో గడపాలి. సాయంత్రం శివాలయంలో నిర్వహించే ప్రదోష అభిషేకాలు, అలంకరణలు, ఆది దంపతుల విహారం వీక్షించి, సోమస్కంద ప్రదక్షిణ చేసి చివరగా ప్రసాదం స్వీకరించి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ వ్రతం వలన ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. కార్యజయం, జీవితం సిరిసంపదలతో సుఖంగా సాగిపోతుంది. సమస్త పాపాలు తొలగిపోతాయి అన్నది తరతరాల నమ్మకం. 





అదృష్టం కొద్దీ నాకు మధురై, తిరునెల్వేలి, కుర్తాళం, తిరువణ్ణామలై, సేలం క్షేత్రాలలో, చెన్నై శ్రీ కపాలేశ్వర స్వామి ఆలయంలో ఈ త్రయోదశి ప్రదోష పూజ వీక్షించే అవకాశం దక్కింది.
తమిళనాడులో పర్యటించాలనే ఆలోచన ఉంటే ఆ రోజులలో ఏదో ఒక త్రయోదశి ఉండేలా ప్రణాళిక రచించుకోవడం అంటే  ప్రదోష పూజను చూసే భాగ్యం దక్కించుకోవడమే !

నమః శివాయ !!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...