పుత్రుడైన పరమేశ్వరుడు
పరమేశ్వరుడు తలచుకొంటే ప్రసాదించలేనిది అంటూ ఏదీ లేదు !
ఎనలేని అనుగ్రహాన్ని కురిపించగలరు.కన్నప్ప,మార్కండేయుడు,శిబి ఇలా ఎందరో మహానుభావులు అలాంటి కృపకు నోచుకొన్నవారే !!
వారి కోవకు చెంది, మహేశ్వరుని మమతానురాగాలకు అర్హత పొందిన మరో భాగ్యశాలి వళ్ళాల దేవ మహారాజు.
శ్రీ కృష్ణ దేవరాయలు
వెయ్యి కాళ్ళ మండపం మరియు వళ్ళాల గోపురం
వీర వళ్ళాల దేవ రాజు - 3 దక్షిణ భారత దేశాన్నిపాలించిన శక్తివంతమైన "హొయసల "రాజ వంశానికి చెందిన వాడు. వీరి తొలి రాజధాని నేటి మైసూరుకు సమీపంలోని "హళిబేడు". ఆ రోజుల్లో దాని పేరు "ద్వార సముద్ర".
1233 నుండి 1346 వరకు (వంద సంవత్సరాలకు పైగా) వీరు నేడు కర్ణాటక, ఆంద్ర, తమిళనాడు, తెలంగాణాగా పిలవబడుతున్న ప్రాంతాలలోని అధిక భూభాగాన్ని తమ పాలనలో ఉంచుకొన్నారు. హొయసల రాజులలో అత్యంత కీర్తిప్రతిష్టలు పేరొందిన పాలకుడు "వళ్ళాల దేవ రాజు - 3". ఈయన పోరాట పరాక్రమ విజయాలకు గుర్తింపుగా ప్రజలు "వీర వళ్ళాల"గా పిలిచేవారు.
1292 వ సంవత్సరం నుండి 1342 దాకా పాలించిన వళ్ళాల రాజు తన పాలనను తొలి రోజులలో ద్వార సముద్ర నుండే సాగించాడు. కానీ అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనానాయకుడైన "మాలిక్ ఖాఫర్ " 1311వ సంవత్సరంలో జరిపిన దక్షిణ దేశ దండయాత్రలో అతని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. తన సమస్త సంపదలను మాలిక్ ఖాఫర్ కు సమర్పించుకున్నాడు.సుల్తాన్ మూకలు ద్వార సముద్ర నగరాన్ని సమూలంగా నేలమట్టం చేశారు.
శివ భక్తుడైన వళ్ళాలుడు తదనంతర కాలంలో సుల్తాన్లకు సామంతునిగా ఉంటూ తిరువణ్ణామలై ని తన రెండవ రాజధానిగా చేసుకొని దక్షిణాన తాను కోల్పోయిన ప్రాంతాలను చాలా మటుకు తిరిగి గెల్చుకొన్నాడు.
ఈయన శివ భక్తి గురించి " అరుణాచల పురాణం "లోని ఏడవ అధ్యాయంలో విపులంగా తెలుపబడినది. ఆ వివరాలు తెలుసుకొందాము.
వళ్ళాల గోపురం శ్రీ బ్రహ్మ లింగేశ్వర ఆలయం వద్ద నుండి
వళ్ళాల రాజు అనేక విధములైన కైకర్యాలు అణ్ణామలై స్వామికి సమర్పించుకున్నాడు. ఎన్నో నిర్మాణాలను పునః నిర్మించాడు. కొత్తవి చేపట్టాడు. ఎంతటి వీరుడో అంతటి దైవ భక్తుడైన మరెంతో దాన శీలి కూడా !
పేదవారికి, అంధులకు ధన సహాయం, సాధువులకు సన్యాసులకు, మఠాలకు ఎన్నో భూరి విరాళాలు అందించాడు.
ఈ కాలంలోనే పెక్కు నిర్మాణాలు అరుణాచలేశ్వర ఆలయంలో నిర్మించబడ్డాయి.
అన్నింటి లోనికి గొప్ప నిర్మాణంగా ఆ రోజుల్లో కీర్తించబడినది " వళ్ళాల గోపురం". ( మొదటి ప్రాకారం నుండి రెండో ప్రాకారం లోనికి వెళ్లేటప్పుడు ఉంటుంది. వేయ్యి కాళ్ళ మండపం, పెరియ నంది దాటినా తరువాత).
అప్పట్లో అదే ప్రధాన ద్వారం. ఈయన తరువాత మూడు వందల సంవత్సరాలకు శ్రీ కృష్ణ దేవరాయలు ప్రధమ ప్రాంగణ ప్రహరీ గోడను, నేటి తూర్పు రాజ గోపురాన్ని నిర్మించారు. మిగిలిన గోపురాలు అయిన పేయి, తిరుమంజన మరియు అమ్మణి అమ్మన్ గోపురాలు అనంతర కాలంలో నిర్మించబడ్డాయి).
ప్రజలందరూ రాజు గారి శివ భక్తికి, ఆలయాభివృద్ది పట్ల చూపిస్తున్న శ్రద్ధకు ఎంతో ప్రశంసించారు. అప్పటికే ఆ గోపురాన్ని చూసి మురిసిపోతున్నవళ్ళాల రాజు ఈ ప్రస్తుతింపులకు మరింత పొంగిపోయాడు. ఆయనలో గర్వం పెరిగిపోయింది.
తాను కాబట్టి ఇంతటి అద్భుత నిర్మాణం నిర్మించగలిగాడు. మరొకరికి సాధ్యం కాదు. అని అనుకోసాగాడు. నిండు సభలో ప్రస్తాపించాడు.
భక్తి భావం స్థానంలో అహంకారం తలెత్తడం గమనించిన సర్వేశ్వరుడు దానిని తొలిగించాలని నిర్ణయించుకొన్నారు.
దానికి తగిన సమయం కూడా వచ్చినది.
అమ్మని అమ్మన్ గోపురం (ఉత్తర)
ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సాయంత్రం దేవేరీ సమేతులై శ్రీ అన్నామలైయార్ పుర వీధులలో విహరించడం ఆనవాయితీ. తొలి రోజు సాయంత్రం ఆది దంపతులు ఉపస్థితులైన పల్లకీ వళ్ళాల గోపుర ద్వారం గుండా వెళ్లలేక పోవడంతో నిర్వాహకులు మరో మార్గం ద్వారా నగర సంచారానికి తీసుకొని వెళ్లారు.
తొమ్మిది రోజుల పాటు అలానే జరిగింది. సుందర నిర్మాణంగా రాజు గర్వపడుతున్న గోపురం గుండా స్వామి వెళ్ళలేదు. రాజుకు గర్వం తొలగిపోయి స్వామి వారి సన్నిధి చేరుకొని తెలిసీ తెలియక చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించి గోపుర ద్వారం గుండా పుర విహారానికి వెడల వలసినదిగా ప్రార్ధించాడు. ఆ విన్నపాలకు భక్త సులభుడు కరిగిపోవడం వలన నాటి సాయంత్రం ఇంతకు వచ్చిన అవాంతరాలు రాకుండా ఆపడం వలన పల్లకీ
వళ్ళాల గోపుర ద్వారం గుండానే వెలుపలికి వెళ్ళినది.
నేడు అలాంటి ఆటంకాలు ఏమీ లేకున్నా తొలి తొమ్మిది రోజులూ మరో ద్వారం గుండానే స్వామి ఆలయం వెలుపలికి వెళతారు.
నాటి నుండి అహంకారం పూర్తిగా తొలగిపోయిన మహారాజు మరింతగా శివ సేవలో నిమగ్నమైనాడు. ప్రజలకు పన్నుల భారం తగ్గించాడు. వారికి అనేక వసతులు, ఆసరాలు అందించాడు. ఇంతటి దైవభక్తి, ధర్మ ప్రవృతి కలిగి, ప్రజా శ్రేయస్సు కోరుకొనే రాజుకు ఉన్నకొరత సంతానం లేకపోవడం. అది ఆయనను ఎంతో బాధించేది. ఇద్దరు భార్యలతో కలిసి ఎన్నో వ్రతాలు, యాగాలు పూజలు చేసినా సంతాన భాగ్యం కలుగలేదు. ఈ విషయంలో రాజు నిత్య చింతితునిగా ఉండేవాడు.
పండితులతో, సాధువులతో తగిన పరిష్కారం గురించి తరచు సంప్రదింపులు జరిపేవాడు. వారు చెప్పినదల్లా తూచా తప్పకుండా ఆచరించేవాడు. అయినా ఎలాంటి ఫలితము కలుగ లేదు.
ప్రతి నిత్యం ఉదయాస్తమాన పూజలలో శ్రీ అరుణగిరి నాదర్ ను దీనంగా తన కోరికను విన్నవించుకొనేవాడు.
భక్తవత్సలుడు వళ్ళాలుని ప్రార్ధనకు కరిగిపోయారు.అయినా అంతిమంగా ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకొన్నారు.
తానూ తాపసి రూపం లోనికి మారి, కుబేరుని శిష్యునిగాను, ప్రమథ గణాలను అనుచరులుగా చేసుకొని తిరువణ్ణామలై చేరుకొన్నారు కైలాసనాధుడు. నగరంలో ఉన్న వేశ్యావాటికలకు, దేవదాసీ నివాసాలకు వెళ్లి అందరికీ కోరినంత ధనాన్ని ఇచ్చి ఒక్కో అనుచరుని వారితో ఉంచి తానూ ప్రధమ శిష్యుని వెంటబెట్టుకొని రాజాస్థానానికి వెళ్లారు.
సాధుసంతుల పట్ల అపార గౌరవాన్ని చూపే మహారాజు వారిని సాదరంగా ఆహ్వానించి అతిధి సత్కార్యాలను చేసి వారు వచ్చిన పని ఏమిటో ? దానికి తానూ ఎలా సహాయ పడగలనో? తెలుపమని ప్రార్ధించాడు.
తానూ తాపసి రూపం లోనికి మారి, కుబేరుని శిష్యునిగాను, ప్రమథ గణాలను అనుచరులుగా చేసుకొని తిరువణ్ణామలై చేరుకొన్నారు కైలాసనాధుడు. నగరంలో ఉన్న వేశ్యావాటికలకు, దేవదాసీ నివాసాలకు వెళ్లి అందరికీ కోరినంత ధనాన్ని ఇచ్చి ఒక్కో అనుచరుని వారితో ఉంచి తానూ ప్రధమ శిష్యుని వెంటబెట్టుకొని రాజాస్థానానికి వెళ్లారు.
సాధుసంతుల పట్ల అపార గౌరవాన్ని చూపే మహారాజు వారిని సాదరంగా ఆహ్వానించి అతిధి సత్కార్యాలను చేసి వారు వచ్చిన పని ఏమిటో ? దానికి తానూ ఎలా సహాయ పడగలనో? తెలుపమని ప్రార్ధించాడు.
శ్రీ కృష్ణ దేవ రాయ నిర్మిత కళ్యాణ మండపం
వీర వళ్ళాల దేవ రాజు - 3
దానికి ఆ ముని సంవత్సరాల తపస్సు చేయడం వలన తాను స్త్రీ సంగమానికి దూరం అయ్యాను, గనుక నాకో చక్కని సుందరి పొందును ఏర్పాటు చెయ్యమని కోరారు. అతిధుల కోర్కెలు ఎంతటి అసమంజసమైనవి అయినా వాగ్దానం ఇచ్చిన తరువాత నెరవేర్చడం గృహస్థు దర్మం.
అంగీకరించిన రాజు అతిధులను విడిదికి, సైనికులను వారకాంతల వీధికి పంపారు. కానీ ఒక్కరు కూడా వారితో రావడానికి అంగీకరించలేదు. వారి మాటలను విశ్వసించని రాజు మంత్రి పంపాడు. మంత్రి వెళ్ళీ సరికి అక్కడ ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైనది.
ధ్యానముద్రలో ఉన్న విటులకు (?) ఉపచర్యలు చేస్తూ కనిపించారు వేశ్యామణులందరూ.
అబ్బురపడిన మంత్రి ఆ మహిళతో రాజాజ్ఞ గురించి తెలిపాడు.
దానికి వారు రాజాజ్ఞను ధిక్కరిస్తే మరణం ఉంటుందో ఉండదో తెలీదు కానీ మాట తప్పితే నరక ప్రాప్తి తప్పదు. అందునా అడిగినంత ధనం ఇచ్చిన ఈ శివ భక్తులను తాము మోసం చెయ్యలేము. మరునాటికి రాజుగారి ఆజ్ఞ మేరకు దేనికైనా సిద్దము అని తెలిపారు.
చిన్న నంది మండప స్థంభం మీద వళ్ళాల రాజు
నిస్సహాయంగా వెనుతిరిగిన మంత్రి రాజుకు విషయం విన్నవించాడు. రాజునై కూడా అతిధి కోరిన కోర్కె తీర్చిలేక పోతున్నాను అన్న వ్యాకులతో అంతః పురానికి వెళ్ళాడు వళ్ళాలుడు. ఆయన వదనం చూడగానే భార్యలకు భర్త ఏదో తీవ్ర సమస్యతో సతమతమవుతున్నాడు అన్న విషయం బోధపడింది. అడగగా రాజు అతిధి సత్కార్యంలో ఎదురైనా అడ్డంకిని తెలిపాడు.
మరో మాట లేకుండా ఆయన చిన్న భార్య "సళ్ళమ దేవి" అతిధి కోర్కె నెరవేర్చడానికి తాను సిద్ధం అని తెలిపింది.
ఆనందంతో భార్యను అభినందించిన రాజు ఆమెను విడిది గృహానికి పంపాడు.
సళ్ళమ దేవి
ఆమె అక్కడికి వెళ్లే సరికి అతిధి పూర్తిగా ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఈమె రాకను గుర్తింపలేదు. సమయానికి రాక పోవడం వలన ఆగ్రహం ప్రదర్శిస్తున్నాడని అనుకొన్నది రాణి. అతని మీద సుగంధ జలాలను, పూలు, అత్తరు చల్లింది. మధురంగా గానం చేసింది. అయినా ఆయన ధ్యానం చెదరలేదు. చివరి ప్రయత్నంగా ఆమె ఆ తాపసిని తన కౌగిలి లోనికి తీసుకోబోయినది.
అంతే ముని కాస్తా ముద్దులు ఒలికే బాలునిగా మారి పోయాడు.
ఆనందంతో తబ్బిబ్బు అయిన రాణి రాజు వద్దకు వెళ్లి పసి బాలకుని చూపించింది.
వాత్సల్యం పెల్లుబుకగా బాలుని చేతుల లోనికి తీసుకు ప్రేమగా ఆప్యాయతతో ముద్దాడాడు రాజు.
ఆయన తృప్తి చెందక పూర్వమే బాలకుడు అదృశ్యమయ్యాడు.
దొరికినట్లే దొరికి దూరమైన పెన్నిధి పోయినవారి మాదిరిగా రాజు రాణి దుఖః సముద్రంలో మునిగి పోయారు.
పూజా మందిరానికి వెళ్లి అరుణ గిరి స్వామీ ని పరిపరివిధాల వేడుకొన్నారు.
గోపుర ద్వారం పైన వళ్ళాల రాజు
సంతృప్తి చెందిన పరమేశ్వరుడు వారికి దర్శన భాగ్యం ప్రసాదించి నేను మీకు బాలునిగా లభించి పుత్ర స్పర్శానుభవాన్ని ప్రసాదించాను. అందువలన వీకు పుత్రుడనే !
మరణానంతరం తల్లి తండ్రులకు పుత్రుడు ఏ రకమైన శ్రద్దా భక్తులతో శ్రాద్ధ కర్మలు జరుపుతాడో అలా నేను మీకు జరపగలను అని వరం ప్రాసాదించారు.
నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం మాసి ( ఫిబ్రవరి - మార్చి) నెలలో తిరువణ్ణామలై కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న "పళ్ళికొండ పట్టు"లో ఉన్న యేటి ఒడ్డున ఆబ్దికం పెడతారు.
ముందు రోజు సాయంత్రం పూజారులు వళ్ళాలరాజు తిధి గురించి స్వామికి తెలియచెబుతారు.
మరునాటి ఉదయం పల్లకీలో స్వామిని తీసుకొని పళ్ళికొండ పట్టు చేరుతారు. కార్యక్రమం పూర్తి అయిన తరువాత నీటిలో స్నానం చేసిన స్వామి ఆలయానికి చేరుకొంటారు.
ఎందరో భక్తుల్లో ఆ రోజు ఆ యేటిలో స్నానం చేస్తారు.
ఎంతటి భక్త వత్సలుడో శ్రీ అరుణాచలేశ్వరుడు !!!!
ఇంతటి అదృష్టానికి నోచుకొన్న వళ్ళాల రాజు విగ్రహాలు వళ్ళాల గోపురంలో మరియు చిన్న నంది మండప స్థంభం పైన చూడవచ్చును.
ఈ నంది క్రింద రాజు గారి కుటుంబ సభ్యుల రూపాలు కూడా ఉన్నాయి కానీ నిరంతర దీపాల కారణంగా రూపం కోల్పోయాయి.
తిరువణ్ణామలై ఆలయంలో జరిగే ఉత్సవాలలో ఇదొకటి. మరే ఇతర ఆలయంలో కూడా ఇలాంటి ప్రత్యేకత కానరాదు.
అందుకే ఇలలో కైలాసం అరుణాచలం !! ప్రత్యక్ష దైవం అరుణగిరి నాధుడే !!!