4, జులై 2016, సోమవారం

Temples for remedies

                                       అన్యధా శరణం నాస్థి 

ఎప్పుడు ఏ కష్టం వచ్చినా "దేవుడా ! కాపాడు !" అని మొర పెట్టుకోవడం మానవులుగా పుట్టిన మనమందరం చేస్తుంటాము.
నిత్య జీవితంలో లేదా గత జన్మలలో చేసిన అధర్మ కార్యాల వలన సంక్రమించిన కర్మల ఫలితంగా మానవులకు అనేకానేక ఇక్కట్లు జీవన క్రమంలో కలుగుతాయని పెద్దల చెప్పారు.
ఆ కర్మ ఫలం నుండి బయటపడటానికి సత్ప్రవర్తన, ధార్మిక ప్రవృతి తో పాటు భగవదారాధన తప్పనిసరి.






కాకపోతే ఏ ప్రారబ్ధం నుండి విముక్తి పొందాలంటే ఏ  ఆలయాన్ని సందర్శించాలి అన్నది ఒక సమస్య. దీనికి పరిష్కారంగా  తమిళనాడులో పరిహార ఆలయాల సంప్రదాయం నెలకొల్పబడినది.
మానవ జీవితాలలో ఎదుర్కొనే వివిధ సమస్యల నుండి బయటపడటానికి ఏ ఆలయాన్ని దర్శించాలి అన్నది మహాత్ములు ఏ నాడో నిర్ణయించారు.
ఆ వివరాలను వీలైనంత వివరంగా అందరికీ అందించే ప్రయత్నమే ఈ వ్యాసం.
ఈ ఆలయాలన్నింటికీ చెన్నై నుండి బస్సు లేదా రైలు మార్గంలో సులభంగా చేరుకోవచ్చును.



మనిషి జీవితంలో అభివృద్ధి సాధించడానికి, సమున్నత స్థానం చేరుకోడానికి, తగినంత విషయం పరి జ్ఞానం లభించాలన్నా జ్ఞానం ముఖ్యం. సంపూర్ణ విద్య ద్వారానే అది సాధ్య పడుతుంది అన్న సత్యం అందరికీ తెలిసిన సంగతే !
విద్యార్జన అవిఘ్నంగా జరగాలన్నా, చదువు మీద సరైన ఏకాగ్రత కుదర పోయినా, ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయికి చేరుకోలేక పోయినా విద్యార్థులు సందర్శించవలసిన ఆలయాలు రెండు వున్నాయి. 
మొదటిది మైలాడుదుతురై (మాయవరం)కి పదిహేను కిలోమీటర్ల దూరంలో "అరసలారు" నదీ తీరాన ఎన్నో పరిహారాలకు   నిలయమైన "కూతనూరు శ్రీ సరస్వతీ దేవి ఆలయం". 
సర్వ విద్యలకు అధిదేవత ఆ తల్లే కదా !
ఒక్క విద్య విషయం లోనే కాకుండా ఉద్యోగోన్నతి, వ్యాపారాభివృద్ధి, వేరు పడిన దంపతులు తిరిగి ఒక్కటి అవ్వడానికి అవసరపడిన ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. 
మాఘ మాసంలో (జనవరి-ఫిబ్రవరి)లో అరసలారు నదిలో వదిలే తర్పణాలు గతించిన పితృ దేవతలకు స్వర్గ ప్రాప్తిని కలిగిస్తాయి. ప్రతి నిత్యం వందలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. 
పిల్లలకు నవ రాత్రులలో అక్షరాభ్యాసం జరిపిస్తుంటారు. 
మైలాడుదుతురై (మాయవరం)కి చెన్నై, తంజావూరు, కుంభకోణం నుండి సులభంగా చేరుకోవచ్చును. 




రెండవ ఆలయం పాండిచ్చేరి (పుదుచ్చేరి) సమీపం లోని కడలూరుకు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న "తిరు వహీంద్ర పురం".
వైష్ణవులకు అత్యంత దర్శనీయ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి అయిన ఈ క్షేత్రంలో "శ్రీ దేవాధినాథ పెరుమాళ్" కొలువై ఉంటారు.
విరజా నదీ తీరంలో ఉన్న ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న చిన్న పర్వతం మీద "శ్రీ హయగ్రీవ స్వామి" వేంచేసి ఉంటారు. (ఈ బ్లాగ్ లో ఈ ఆలయం గురించిన వివరాలు కలవు)
శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం హయగ్రీవుడు జ్ఞాన ప్రదాత. విద్యలకు అధిపతి.
ఎందరో భక్తులు దర్శించుకొని ఈ ఆలయంలో దాదాపు సంవత్సరమంతా అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి.





చదువు తరువాత లక్ష్యం సంపాదన. చక్కటి జీతంతో కూడిన ఉద్యోగం లేదా అధిక లాభాలను అందించే వ్యాపారం. రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. తగిన సంపాదనతో జీవిత సుఖమయంగా సాగిపోవడానికి మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం కావాలి.
విల్లుపురానికి చేరువలోని "తిరు వెక్కరాయి"లో శంకర పారాణీ నదీతీరంలో త్రిమూర్తి స్వరూపంగా వెలసిన స్వయంభూ శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి త్రిముఖ లింగానికి అభిషేకాలు జరిపించాలి.
ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అరుదైన క్షేత్రం తిరువక్కరాయి. (వివరాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి).
కేరళ రాజధాని తిరువనంత పురంలో ఉన్న పురాతన శ్రీ లక్ష్మీవరాహ స్వామి ఆలయ" సందర్శనం కూడా ఉద్యోగాభివృద్దికి తోడ్పడుతుంది. (ఆ వివరాలు కూడా ఈ బ్లాగ్ లో ఉన్నాయి)



జీవితంలో స్థిరపడిన తరువాత వంశాభివృద్ధికి వివాహం.
తగిన సంబంధాలు రాక పోయినా, వచ్చినవి వివిధ కారణాల వలన కుదరక పోయినా కుదిరినవి అనుకోని కారణాల వలన విచ్ఛిన్నమైనా, లేక కోరుకొన్న వారితో కళ్యాణానికి ఏవేవో ఆటంకాలు ఎదురవుతున్నా ఇలా వివాహానికి సంబంధించిన ఎలాంటి అడ్డంకులైన ఈ క్రింది ఆలయాలను సందర్శిస్తే కళ్యాణ ఘడియలు ముంచుకొచ్చి మంగళ వాయిద్యాలు మ్రోగుతాయి.
1. మైలాడుదుతురై (మాయవరం)కి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీ కళ్యాణ సుందర మూర్తి కొలువైన "తిరు మన్నన్ చేరి".
2.  ఈరోడ్ కి నలభై కిలోమీటర్ల కావేరీ నదీతీరాన ఉన్న త్రిమూర్తి క్షేత్రం "కొడుముది" లోని "శ్రీ మగుధేశ్వర స్వామి ఆలయం"
3. ఆలయాల నగరం సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పరిగణించిన కాంచీపురం లోని శ్రీ ఏకాంబరేశ్వర స్వామి మరియు శ్రీ కచ్ఛపేశ్వర స్వామి ఆలయాలు.
4. నాగపట్టినం దగ్గరలోని వేదారణ్యంలో శ్రీ వేదారణ్యేశ్వర స్వామి ఆలయం.
5. తిరువారూర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలోని తిరు వెళి మలై లోని శ్రీ వెళి నాదర్ ఆలయం.
6. చిదంబరం లోని తిరు వేత్కాలం (శివపురి) లో కొలువైన శ్రీ పాలవన్ననాదర్ ఆలయం.
7. ప్రముఖ వస్త్ర వ్యాపార కేంద్రమైన తిరుప్పత్తూరు కి ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలోని "పిరాన్ మలై"(తిరు క్కోడున్ కున్రమ్ ) లో వెలసిన శ్రీ నల్ల మంగై పాగ స్వామి ఆలయం.
8. పుదుక్కోట్టై సమీపంలోని తిరు కోలగుడి లోని శ్రీ తాన్ తొండేశ్వర స్వామి ఆలయం.
9. మధురై శ్రీ మీనాక్షీ అమ్మన్ ఆలయం తో పాటు పడమర మాడ వీధిలో ఉన్న "శ్రీ ఇమాయిల్ వ్రాన్ మన్నతారు కోవెల.
10. మాయావరానికి అత్యంత చేరువలో ఉన్న తిరు వెళ్వి కుడి లోని శ్రీ పార్వతీ నాధా స్వామి ఆలయం. అదే విధంగా ఇక్కడికి దగ్గరలోని కుట్టాలం లోని శ్రీ పరమేశ్వర కోవెల.
11.  కుంభకోణానికి సమీపంలోని రెండు శ్రీ వైష్ణవ దివ్య దేశాలైన శ్రీ ఉప్పిలి అప్పన్ కోవెల మరియు శ్రీ నాంచారీ అమ్మన్ కోవెల.
12. తిరుచ్చి పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని తిరుపాంజలి లో నెలకొన్న శ్రీ గ్నీలివనేశ్వర స్వామి ఆలయం.  13. ఇక్కడికి దగ్గరలోని భూలోక వైకుంఠం శ్రీరంగం లోని శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం.
14. చెన్నై నగరం మైలాపూర్ లోని  శ్రీ కపాలేశ్వర స్వామి కోవెల.
15. చెన్నై కి ఇరవై కిలోమీటర్ల దూరంలోని తిరువేర్కాడు లోని శ్రీ వేదపురీశ్వర స్వామి ఆలయం మరియు చెన్నై కి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలోని తిరుమలై సాయి లోని శ్రీ ఒతాండేశ్వర స్వామి ఆలయం.
16. చెన్నై పాత మహాబలిపురం రోడ్డులో సాగర తీరాన ఉన్న తిరు విదాందాయి లోని శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ కోవెల.

 



వివాహం తరువాత సంసార రధం ఎలాంటి పొరపొచ్చాలు కలతలు కొట్లాటలు లేకుండా సాగాలి అంటే ఆలుమగల మధ్య సరి అయిన అవగాహన ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఉండాలి. దానితో పాటు భగవదనుగ్రహం కూడా తోడవ్వాలి.
కలతలతో సతమతమయ్యే జంటల మధ్య విభేదాలు తొలిగి తిరిగి సత్సంబంధాలు నెలకొనాలంటే తప్పక దర్శించాల్సిన క్షేత్రాలు రెండు ఉన్నాయి.
ఈరోడ్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరం లోని తిరుచెంగోడు శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయం మరియు కుంభకోణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరు చట్టి ముట్రం లోని శ్రీ శివ కొలంద స్వామి కోవెల.
ఈ రెండు విశేష పురాణ మరియు చారిత్రక విశేషాలకు నిలయాలు.



వివాహం తరువాత కుటుంబం పెరిగి ధనార్జన తప్పనిసరి అవుతుంది. ఆర్ధికంగా స్థిరపడటానికి ఉద్యోగంలో అయితే ఉన్నత పదవులు చేరుకోవాలి. వ్యాపారం అయితే అధిక లాభాలు, వ్యాపారాభివృద్ధి మరియు విస్తరణ ఆవశ్యకం.
మానవ ప్రయత్నంతో పాటు మహేశ్వరుని సహాయం కూడా తోడవ్వాలి.
దీనికి తగిన ఆలయాలు  మాయావరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న "తిరు నింద్రియూర్" లోని శ్రీ శివ స్వామిని లేకపోతే కుంభకోణానికి చేరువ లోని "అలగ పుత్తూరు" లో కొలువైన శ్రీ స్వప్నపురేశ్వర స్వామిని సేవించాలి.
పెరిగిన ఖర్చులు, జీవితంలో ఎదగడానికి చేసే చేబదుళ్ళు, వ్యాపారరీత్యా ఎదురయ్యే ఒడిదుడుకులు, నష్టాలు మనిషిని అత్యంత దయనీయ అవమానకరమైన పరిస్థితుల లోనికి దించుతాయి.
కాకపోతే చేసిన అప్పులు తీర్చడం కనీస ధర్మం. త్వరిత గతిన ఋణ బాధల నుండి విముక్తి పొందడానికి తిరువారూర్ లోని శ్రీ ఋణ లింగేశ్వర స్వామికి లేక కుంభకోణానికి సమీపం లోని తిరు చేరాయి లో కొలువైన శ్రీ సార పరమేశ్వర స్వామికి అభిషేకాలు జరిపించాలి.
సహజంగా జీవితంలో ఒక స్థాయికి చేరుకొని తెలిసీ తెలియని పొరబాట్ల వలన స్థాయి దిగజారిపోతే మిత్రులు, బంధువులు తగినంత దూరం పాటించడం అందరికీ తెలిసిన విషయమే !
అలాంటి నిస్సహాయ పరిస్థితులలో సహాయం కొరకు మాయావరానికి దగ్గర లోని తిరుఅన్నియూరు లో కొలువైన శ్రీ అగ్ని పురేశ్వర స్వామిని సేవిస్తే ఆదరించి చేజారిన సంపదలను తిరిగి దక్కేలా చేస్తాడని ఎందరికో అనుభవ విషయం.


 

గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం ఆడ మగ పిల్లలు ఉద్యోగరీత్యా, చదువుల కొరకు ఇతర పనుల నిమిత్తం నగరాలలోని ఎంతో దూరాలు ప్రయాణం చెయ్యాల్సి వస్తోంది.
పెరిగిన వాహనాల వలన ప్రమాదాలు ఏ రూపంలో ముంచుకొని వస్తాయో తెలియని రోజులు ఇవి.
ప్రయాణాలు ప్రమాదాలతో అర్ధాంతరంగా ముగియకుండా కాపాడే వాడు వెల్లూరు (రాయ వెల్లూరు) సమీపంలో గల
విరంచి పురంలో కొలువైన శ్రీ మార్గబంధేశ్వర స్వామిని ప్రార్ధించాలి. స్మరణ మాత్రాన ప్రయాణాలు క్షేమంగా సాగేలా చేసే పరమేశ్వరుడు ఆయన.
జీవితంలో స్థిరపడిన తరువాత వంశాభివృద్ధికి సత్సంతానం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకొంటారు.
ఆరోగ్యరీత్యా, శారీరక లోపం మూలానో సంతానం కలగని దంపతులు తగిన వైద్య సలహాల మేరకు ఔషదాలు వాడుతూ ఈ క్రింది ఆలయాలను సందర్శించితే శుభ ఫలితాలు లభిస్తాయి.
రామేశ్వరం లోని శ్రీ పర్వత వర్ధనీ సమేత శ్రీ రామనాధ స్వామిని, కుంభకోణం చుట్టుపక్కల ఉన్న నవగ్రహ క్షేత్రాలలో బుధ క్షేత్రం అయిన తిరువెక్కాడు ఆలయం లోని వటవృక్షానికి ప్రదక్షిణాలు చేసి, పెసలు దానం ఇవ్వాలి. తిరుచ్చి నగరం లోని రాక్ ఫోర్ట్ కొండా మీద కొలువైన శ్రీ తాయి మాన స్వామి ని ఉచ్చ పిళ్ళయార్ ని సేవిస్తే సానుకూల ఫలితాలు దక్కుతాయి.
అలానే కాంచీ పురం దగ్గర లోని తిరుప్పుకులి లోని శ్రీ విజయ రాఘవ స్వామి ఆలయం సందర్శించిన సత్ఫలితాలు లభిస్తాయి.
గర్భవతులైన ప్రతి ఒక్క పడతీ ఆరోగ్యవంతమైన చక్కని బిడ్డను పొందాలి అనుకోవడం సహజం. అందుకు సందర్శించాల్సిన ఆలయాలు   రామనాధ పురానికి చేరువులోని ఉత్తరకోశ మంగై లోని శ్రీ మంగళ నాదర్, కుంభకోణానికి చేరువ లోని శ్రీ గర్భాంబికా అమ్మన్, లేదా కలువలుచ్చేరి లోని శ్రీ అఖిలాండేశ్వరీ సమేత శ్రీ అగస్థేశ్వర స్వామి ఆలయం, అలానే పుదుక్కోట్టై దగ్గరలోని" ఏటై మతాళీ" లోని శ్రీ అఖిలాడేశ్వరీ సమేత శ్రీ అగస్తీశ్వరా స్వామి ఆలయం.





బ్రతుకు సమరంలో నిర్లక్షమో, అలవాట్ల వలనో,మారే ఇతర కారణం మూలానో వయస్సు పెరుగుతున్నప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టముట్టడం సహజం. 
వైద్య పరిరక్షణలో సరిపోయే ఔషధాలను వాడుతూ ఈ క్రింది ఆలయాలను సందర్శించితే ఆరోగ్యం కుదుట పడుతుంది మనఃశాంతి లభిస్తుంది. 
ఆరోగ్య ప్రదాతగా వైదీశ్వరన్ ప్రసిద్ధి. కుంభకోణం, చెన్నై పూనమలై, శ్రీ విల్లి పుత్తూరు లలో వైదీశ్వరన్ ఆలయాలు ఉన్నాయి. అలానే తిరువళ్లూరు లోని శ్రీ వీర రాఘవ స్వామి ఆలయం, చెన్నై తిరువాన్మయూరు లోని శ్రో ఔషధీశ్వర స్వామి కోవెల, తాంబరానికి చేరువ లోని సింగ పెరుమాళ్ రైల్వే స్టేషన్ దగ్గర లోని శ్రీ మరుదీశ్వర స్వామి కొలువుతీరిన గిరి ప్రదక్షణ, తిరునెల్వేలి సమీపం లోని శంకరన్ కోయిల్ ముఖ్యమైనవి. 
ఇవే కాకుండా నేత్ర సంబంధిత వ్యాధుల నివారణకు కాంచీపురం శ్రీ ఏకాంబేశ్వర స్వామి, తిరువారూర్ శ్రీ త్యాగ రాజ స్వామి, విల్లుపురానికి చేరువ లోని శ్రీ నేత్రోద్వారకేసరి స్వామి, బొల్లి ల్సన్న్తి చర్మ వ్యాధులకు కుంభకోణానికి దగ్గర లోని తలై నాగం మరియు కడలూరు దగ్గర లోని తీతనగరి ఆలయాలను దర్శించాలి. 
మన పూర్వ జన్మ పాపం నశించాలంటే తిరు విడై మరుదూర్ శ్రీ మహా లింగేశ్వర స్వామిని సేవించాలి. 
అదే విధంగా పితృ దేవతలకు సద్గతి కలగడానికి  తిరువారూర్కి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరం లోని తిల తర్పణ పురి శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో అర్చనలు జరిపించాలి. 
వయస్సు ముంచుకొస్తుంటే మృత్యు భయం తెలియకుండానే వెంటాడుతుంది. అది తొలగి పోవాలంటే మాయావరానికి సమీపంలోని  తిరుక్కడయూరు లో కొలువైన శ్రీ అమృత ఘటికేశ్వర స్వామిని లేదా కుంభకోణానికి ముప్పై అయిదు కిలోమీటర్ల దూరం లోని శ్రీ వంజియం శ్రీ వంజి నాధ స్వామిని సేవించాలి. 
గత జన్మలో లేదా ఈ జన్మలో మనం చేసిన సర్వ పాపాలు సంపూర్ణంగా తొలగి పోవాలంటే పేరొందిన పుణ్య క్షేత్రాలు అయినా రామేశ్వరం, ధనుష్కోడి, కన్యాకుమారి లలో సముద్ర స్నానం అక్కడి పరమేశ్వర సేవ లేదా సద్గురు సేవ, 
మార్గం ఎంచుకొనే అవకాశం మనదే !

సర్వేశ్వర కృపా కటాక్ష ప్రాప్తి రస్తు !!!   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...