26, జులై 2016, మంగళవారం

Sri Durgai Amman Temple, Tiruvannamalai

                శ్రీ దుర్గా దేవి ఆలయం, తిరువణ్ణామలై 


 


కొండ రూపంలో కపర్ది కొలువు తీరిన అపూర్వ కైలాస సమాన క్షేత్రం తిరువణ్ణామలై. 
అడుగడుగున ఆలయమున్నమహనీయ క్షేత్రం తిరువణ్ణామలై. ప్రతి చిన్న పెద్ద ఆలయం సందర్శనీయం. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది పురాతనమైన శ్రీ దుర్గా దేవి ఆలయం. ఈ ఆలయ పురాణ గాధ మహిషాసుర సంహారంతో ముడిపడి ఉండటం విశేషం.  
సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించబడినదిగా  పేర్కొనే ఈ ఆలయ పౌరాణిక గాధ  ఇలా ఉన్నది. 











ఆలయ గాధ 

ఒకసారి ఆది దంపతులు కైలాసంలో చతురోక్తులతో సమయం గడుపుతున్నారు. వినోదంగా పార్వతీ దేవి త్రినేత్రుని నేత్రాలను తన హస్తాలతో మూసివేశారు. లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యచంద్రులా నేత్రాలు. లోకమాత క్షణకాలం కనులను మూయడం వలన లోకాలన్నీ వేల సంవత్సరాలు అంధకారంలో మునిగిపోయాయి. లోకాలలో  పరిస్థితులన్నీఅల్లకల్లోలంగా మారిపోయాయి. అమ్మవారికి తాను చేసిన తప్పు అవగతమైనది. లోకాలను కాపాడే ఆదిశక్తి వాటిని అస్తవ్యస్తంగా మార్చినందుకు ఆమె దోష నివారణకు సిద్దపడింది. మహేశ్వరుడు ఆమెను సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటైన కాంచీపురంలో చూత వృక్షం క్రింద తన దర్శనం కొరకు తపస్సు చేయమని మార్గోపదేశం చేశారు

ప్రకారం పర్వత రాజ పుత్రి చెలులతో కలిసి భూలోకం చేరుకొన్నది. మామిడి చెట్టు క్రింద సైకత లింగం ప్రతిష్టించి తదేక దీక్షతో తపస్సు చేయసాగింది.
ఆకాశవాణి " దేవి! నీ భక్తి శ్రద్ధలు అపూర్వం. నీవు అరుణగిరి చేరుకొని అక్కడ గౌతమ ముని ఆశ్రమంలో ఉండుము. నీ మనస్సులో స్థిరనివాసమేర్పర్చుకొన్న మహేశ్వరుడు అక్కడ నీకు దర్శనం ఇస్తారు. ఆయన ఆదరణ పొందగలవు" అని పలికింది
 అశరీరవాణి వాక్కుతో ఆనందించింది అమ్మవారు. సైకత లింగ భాద్యతను మహర్షులకు అప్పగించి తాను చెలులతో కలిసి తిరువణ్ణామలై దిశగా బయలుదేరింది. పార్వతీ దేవిని ఆదరంగా  ఆహ్వానించారు గౌతమ మహర్షి. దేవి కోరిక మేరకు అరుణాచల ఆవిర్భావ వృత్తాంతాన్ని, మాహాత్యాన్ని, గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యాన్నిఫలితాలను సవిరంగా తెలియజెప్పారు. గిరి ప్రదక్షిణ మహిమ తెలుసుకొన్న పార్వతి నిత్యం నియమంగా చెలికత్తెలతో కలిసి అరుణాచల ప్రదక్షిణ మరియు శ్రీ అరుణాచలేశ్వరుని సేవించుకోసాగింది.

గౌతమాశ్రమంలో విడిది చేసిన దేవేరి వద్దకు దేవతలు, మహర్షులు, మునులు తరలి వచ్చారు. ఆమెను సేవించుకొని మహిషాసురుని వలన తామెదుర్కొంటున్న ఇబ్బందులు ఏకరవు పెట్టి, కాపాడమని అర్ధించారు. దేవి వారికి    వరగర్వంతో లోకకంటకునిగా మారిన అసురుని భాధ తగిన సమయంలో తొలగిపోతుందని అభయమిచ్చారు. అధర్మ మార్గంలో నడిచే వాని పాపం ఏదో ఒకనాటికి పండుతుంది కదా ! వాని అహంకారమే మృత్యువుగా మారుతుంది. అదే జరిగింది మహిషాసురుని విషయంలో కూడా !

ఒకనాడు వేట నిమిత్తం ఇక్కడికి వచ్చిన రాక్షస రాజు గౌతమాశ్రమములో ధ్యానంలో ఉన్న లోకేశ్వరిని చూసాడు. కర్మ పరిపక్వానికి రావడం వలన ఆమెలో అతనికి అమ్మ కనిపించలేదు. అతిలోక సౌందర్యరాశి దర్శనమిచ్చింది. అసురునిలో మోహావేశం తలెత్తినది. ఆమె ఎవరో తెలుసుకోడానికి మారువేషంలో ఆశ్రమానికి వెళ్ళాడు. చెలికత్తె " ఆమె తన పతి గురించి తపమాచరిస్తోంది. ఆయన దయ ఇంకా కలుగలేదు. ఆయన అనుగ్రహం కలిగే వరకు ఈమె తపము ఆగదు " అని తెలిపింది.

నిజరూపం దాల్చిన మహిషుడు " పతిని నేనే! సుందరాంగి నిరీక్షణ ఫలించింది" అని అంటూ మితిమీరిన అహంతో తన గొప్పలు చెప్పుకోసాగాడు. ఉన్మాద ప్రేలాపనకు కనులు తెరచిన కాత్యాయని ఉగ్ర రూపమైన దుర్గ గా అవతరించినది. క్షణకాలంలో అసుర సైన్యాన్ని బూడిద చేసింది. లోకాలకు ఆనందం కలిగే విధంగా మహిషుని శిరస్సును త్రిశూలంతో ఖండించి మహోగ్రంగా దాని మీద నాట్యం చేయసాగింది. దనుజుని తురిమిన దుర్గను  దేవతలు, మహర్షులు స్తోత్రం చేసి కీర్తించారు. శాంతించిన శాంభవి రాక్షసుని కంఠాన్ని అలంకరించిన శివ లింగాన్ని చేతి లోనికి తీసుకున్నది. రాక్షసుని రుధిరంతో తడిసిన లింగం ఆమె హస్తాన్ని అంటుకొని ఉండిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఊడి రాలేదు.

గౌతమ ముని "దేవదేవి ! అసురుడైనా మహిషుడు అమిత శివ భక్తుడు. లింగ దారుడు. పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా లోకనాయకివైన నీ చేతిలో మరణం పొందాడు. శివభక్తుని సంహరించడం వలన సంక్రమించిన దోషం కారణంగా లింగం నీ చేతికి అంటుకొనిపోయింది. సర్వతీర్ధాల జలంలో స్నానమాచరించి అరుణాచలేశ్వరుని సేవించుకొంటే దోషం తొలగిపోతుంది" అని పక్కన ఉన్న శిలను పగులగొట్టమని సలహా ఇచ్చారు. అమ్మవారు ఖడ్గంతో రాతిని ఖండించగా నీరు ఉబికివచ్చింది. దానిలో శుచిగా మారి మహాముని చెప్పిన ప్రకారం తిరిగి తపస్సు మీద దృష్టిని కేంద్రీకరించింది.

అలా అమ్మవారి ఖడ్గ ఘాతానికి రాతి నుంచి ఉద్భవించిన నీటితో ఏర్పడిన పుష్కరిణిని "ఖడ్గ తీర్ధం" అని పిలుస్తారు. ఆలయంలో చూడవచ్చును. 

ఆనతి కాలం లోనే  దేవి తపస్సుకు, దీక్షకు సంతసించిన మహేశ్వరుడు దర్శనమిచ్చి అమ్మవారికి తనలో అర్ధభాగం ఇచ్చి శ్రీ అర్ధనారీశ్వరునిగా పేరొందినది ఇక్కడికి అతి సమీపంలోనే గల పావళకున్రు మీద అని చెబుతారు.

సమస్త దేవతల, మహర్షుల కోరిక మేరకు అమ్మవారు ఇక్కడే కొలువు తీరారు. అరుణగిరి పాదాల వద్ద ఉన్న ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంటుంది.

ప్రతి నిత్యం స్థానిక మరియు దూర ప్రాంత భక్తులు వందలాదిగా తరలి వచ్చే ఈ ఆలయంలో పర్వదినాలలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా మహిళా భక్తులు వివాహం మరియు  సంతానం కొరకు వస్తుంటారు.













శ్రీ చక్ర, శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ సూక్త ఆలయం 



ఆలయ విశేషాలు 



బస్సు స్టాండ్ నుండి శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే దారిలో కుడి పక్కన అరుణగిరి పాదాల వద్ద కొద్దిగా ఎత్తులో ఉంటుందీ ఆలయం. ఎవరు నిర్మించారు అన్న వివరాలు పూర్తిగా వెలుగు లోనికి రాలేదు. పల్లవ, చోళ, పాండ్య,విజయనగర,నాయక మరియు హొయసల రాజులు ఎన్నో కైంకర్యాలు సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది. 
సువిశాల ప్రాంగణానికి తూర్పున నిర్మించిన సుందర వర్ణమయ శిల్పాలతో కూడిన రాజ గోపురం దాటి లోనికి ప్రవేశిస్తే ఎదురుగా  అమ్మవారి వాహనమైన సింహము ఉపస్థితురాలైన మండపం, బలి పీఠం కనపడతాయి. ప్రాంగణంలో మూడు ప్రధాన ఆలయాలు ఉన్నా ఒక్క ధ్వజస్థంభం కూడా ఉండక పోవడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చును.  



  









శ్రీ చక్ర సన్నిధి 


ప్రదక్షణ మొదలు పెట్టగానే దక్షిణం వైపున విశాల ముఖ మండపం కలిగి ఉన్న శ్రీ చక్రము, శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ సూక్తం ప్రతిష్టించబడిన విశేష ఆలయం వస్తుంది. ప్రాంగణంలో ఉన్న మూడు ఆలయాలలో ఇది రెండవది. అరుదుగా కనపడే రాతి మీద చెక్కబడిన శ్రీ చక్రాన్ని భగవాన్ శ్రీ రమణ మహర్షి  స్వయంగా ప్రతిష్టించారు. ముఖ్యమైన పర్వదినాలలో ఇక్కడ శాస్త్రోక్తంగా శ్రీ చక్రార్చన నిర్వహిస్తారు. మహిళా భక్తురాళ్లు  వేలాదిగా పాల్గొంటారు. 
ఇలా శ్రీ చక్రం మరియు శ్రీ సూక్తము ఆది దంపతులతో కలిసి ఒకే గర్భాలయంలో ఉన్నమరో ఆలయం ఎక్కడా  కనిపించదు. 





శ్రీ దక్షిణా మూర్తి 

శ్రీ వినాయక ఉపాలయం 



ఉపాలయాలు 


ముందుకు సాగితే వట వృక్షం క్రింద ఉన్న ఉపాలయంలో విఘ్ననాయకుడు శ్రీ వినాయకుడు రెండు రూపాలలో కొలువు తీరి దర్శనమిస్తారు.తమిళనాడులో మరీ ముఖ్యంగా తిరువన్నామలై లో ఇలా ఒకే పీఠం మీద గణపతి రెండు భిన్న రూపాలలో పూజలు అందుకోవడం చాలా చోట్ల కనిపిస్తుంది.శ్రీ అరుణాచలేశ్వర ఆలయానికి దగ్గరలోని శ్రీ ఇరట్టై పిళ్ళయార్ ఆలయం కూడా ఇలాంటిదే !!
ఆలయానికి శోభను ఇనుమడించేలా ఏపుగా పెరిగిన మూడు వట వృక్షాలు ఇక్కడ దర్శనమిస్తాయి.
ప్రధాన గర్భాలయానికి వెలుపల  శ్రీ కాల భైరవ మరియు శ్రీ దక్షిణా మూర్తులను చెక్కారు.  దర్శించుకోవచ్చును.

















ప్రధాన ఆలయం వెనుక పక్క ఉంచిన నంది అరుణ గిరి వైపుకి తిరిగి ఉంటుంది. ఇక్కడ అది చాలా సహజం. తిరువన్నామలైలో పెద్ద సంఖ్యలో నంది  విగ్రహాలు కనపడతాయి. అన్నీ కూడా అరుణాచలం వైపుకే తిరిగి ఉండటం చెప్పుకోదగిన అంశం. మరి తిరువణ్ణామలైలో పర్వతమేగా పరమేష్ఠి !  నంది దగ్గర నిలబడితే అరుణ గిరి సుస్స్పష్టంగా పూర్తిగా దర్శనమిస్తుంది.అపూర్వ అనుభూతిని పొందవచ్చును
శ్రీ వీరభద్రుడు మరో ఉపాలయంలో దర్శనమిస్తారు. పక్కనే ఉన్న మండపంలో నాగ ప్రతిష్టలు ఉంటాయి. సంతానం లేని దంపతులు నియమంగా ఇక్కడ  రాహు కేతు పూజలుచేస్తారు.
ఆలయ వెలుపలి గోడలపైన గోవు క్షీరంతో లింగానికి అభిషేకం చేయడం, కన్నప్ప లింగరాజుకి తన నేత్రాలను సమర్పించుకోవడం లాంటివి చక్కగా సుందరంగా సూక్ష్మ రూపంలో నేర్పుగా మలచారు.







అరుణాచలం వైపుకి తిరిగి ఉండే నందీశ్వరుడు 

ఆలయ ప్రాంగణం నుండి కనిపించే అరుణ గిరి 




శ్రీ పాపవినాశేశ్వరుడు 


అరుణగిరికి నమస్కరించుకుని ప్రదక్షిణా పధంలో నడుచుకొంటూ వెళితే అక్కడ శ్రీ పాపవినాశేశ్వర స్వామి లింగరూపంలో కొలువుతీరి ఉంటారు. ప్రాంగణంలో ఇది మూడవ ప్రధాన ఆలయం. ఈ పాపవినాశేశ్వర స్వామి లింగం మహిషాసురుని కంఠసీమ నుండి అమ్మవారి చేతికి అతుకున్న లింగమే! ఖడ్గ తీర్థ జలంతోనే స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. స్వామి వారి దర్శనం సర్వ పాపహరణం అని విశ్వసిస్తారు. ప్రతి నిత్యం అభిషేకాలు, అలంకరణలు,  అర్చనలు మరియు ఆరగింపులు జరుగుతాయి. త్రయోదశి,అమావాస్య,పౌర్ణమి, మాస శివరాత్రి మరియు ఇతర పర్వదినాలలో విశేష పూజలు చేస్తారు శ్రీ పాపవినాశేశ్వర స్వామి వారికి. 


















శ్రీ దుర్గా దేవి సన్నిధి 

ప్రాంగణంలోని ముఖ్య ప్రధాన ఆలయం. 
శ్రీ పాపవినాశేశ్వర స్వామికి మొక్కి వర్ణభరిత శిల్పాలతో నిండిన ముఖమండపం గుండా ప్రధాన ఆలయం లోనికి ప్రవేశిస్తే ఆరు అడుగుల ఎత్తైన రూపంలో అమ్మవారు శ్రీ దుర్గా దేవి అష్ట భుజిగా స్థానిక భంగిమలో దర్శనమిస్తారు.
మహిషాసుర శిరస్సు మీద నిలబడి శూలం,శంఖు చక్రం లాటి ఆయుధాలు ధరించి కటి అభయ హస్తాలతో, భిన్న వర్ణ పుష్ప స్వర్ణాభరణ భూషితగా కనపడే లోకపావని శ్రీ దుర్గా దేవి రూపం భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నేత్ర పర్వంగా కనపడే శ్రీ దుర్గ దేవి శాంత రూపిణి. వరదాయిని.













పూజలు - ఉత్సవాలు 


తమిళనాడులోని అన్నిశివాలయాలలో త్రయోదశి నాడు సాయం సంధ్యా సమయంలో ప్రదోష పూజ చేస్తుంటారు. ఈ ఆలయంలో  రాహుకాల శ్రీ దుర్గా పూజ ప్రత్యేకం. విశేషంగా నిర్వహిస్తారు.  
జాతక రీత్యా రాహు గ్రహ ప్రభావంతో జీవితంలో కష్టకాలం ఎదుర్కొనే వారు ఈ పూజలో పాల్గొని నిమ్మకాయ దొప్పలలో  నేతి దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతుంది అన్నది తరతరాలుగా వస్తున్న నమ్మకం. ఎందరో స్త్రీలు ఈ పూజలో పాల్గొంటుంటారు. సుమంగళీ పూజ కూడా ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రులలో ఆలయం భక్తులతో కళకళ లాడిపోతుంటుంది. ఆ తొమ్మిది రోజులూ దుర్గాదేవికి ప్రత్యేక అలంకారాలు, పూజలు చేస్తారు. 









నాగ ప్రతిష్టలు 






ప్రతి నిత్యం ఎన్నో అభిషేకాలు, పూజలు, అర్చనలు, అలంకరణలు అమ్మవారికి నియమంగా నిర్వహించే ఈ ఆలయం ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ భక్తుల కొరకు తెరిచి ఉండే ఈ ఆలయం తిరువన్నామలై లో గల పెక్కు దర్శనీయ ఆలయాలలో ఒకటి. 














బస్టాండ్ నుండి శ్రీ  అణ్ణామలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో బస్టాండ్ కి చాలా దగ్గర లో ఉంటుందీ ఆలయం. తిరువణ్ణామలై చేరుకోడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి కాట్పాడి జంక్షన్ కు రైలు సౌకర్యం కలదు. 
చక్కని వసతి ఆహార సౌకర్యాలు లభిస్తాయి. 
ఎన్నో ఆలయాలతో పాటు గిరి ప్రదక్షిణ చేయడం విధాయకం. శ్రీ శేషాద్రి స్వామి, భగవాన్ శ్రీ రమణ మహర్హి  ఆశ్రమాలతో పాటు మరెన్నో మహనీయుల ఆశ్రమాలు ఉన్నాయి తిరువణ్ణామలైలో. అన్నీ దర్శనీయాలే !


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...