శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్థేశ్వర స్వామి ఆలయం, మాదిరాజు గూడూరు
మనం పేరొందిన క్షేత్రాల లోని ఆలయాలకు ఎక్కువగా వెళుతుంటాము. కానీ మారు మూల చిన్న చిన్న ఊర్లలో కూడా ఎన్నోవిశేష ఆలయాలు మన దేశంలో కనపడుతుంటాయి.
వెళ్లే దారిలో ఎన్ని ఆలయాలను చూస్తుంటాము కానీ పట్టించుకోము.
వెళ్లే దారిలో ఎన్ని ఆలయాలను చూస్తుంటాము కానీ పట్టించుకోము.
అలాంటి ఆలయాలలో ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగినవి, స్థానిక పాలకులు వివిధ సందర్భాలలో నిర్మించినవి, లేక గ్రామం లోని నిర్మలమైన భక్తి భావాలు కలిగిన భగవద్ససేవకులు నిర్మించినవి కావచ్చు.
చక్కని నిర్మాణ విశేషాలు, పురాతన శాసనాలు లేదా ప్రత్యేక పూజలకు నిలయాలు ఆ ఆలయాలు కేంద్రం కావచ్చును.
భగవంతుని కృప వలన అలాంటి కొన్ని ఆలయాలను దర్శించే అవకాశం నాకు లభించింది.
ఈ మధ్యన నెల్లూరు పట్టణానికి వెళ్లిన సందర్భంలో కృష్ణ పట్టణం వైపుకు వెళ్లే పని పడినది.
మధ్యలో వచ్చే "మాదిరాజు గూడూరు" అనే గ్రామంలో పురాతన శివాలయం ఒకటి ఉన్నట్లుగా తెలిసింది.
దర్శించుకొందామని ఆగాము.
ఏనాటిదో ఎవరు ప్రతిష్టించి నిర్మించారో తెలియరాలేదు. పేరు వలన అగస్త్య మహర్షి జరిపిన దక్షిణ దేశ యాత్ర సందర్బంగా ప్రతిష్టించిన అనేకానేక లింగాలలో ఒకటిగా భావించవచ్చును. కానీ కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకొన్న ఆలయాన్ని స్థానికులు ఒక సంఘంగా ఏర్పడి పునః నిర్మించారు.
చాలా సుందరంగా చక్కని అభిరుచితో ఆధ్యాత్మిక ఆలోచనలతో నిర్మించారని చూడగానే తెలిసిపోతుంది.
దక్షిణ దిశలో ఉన్న ప్రధాన ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ప్రహరీ గోడలో వివిధ దేవతా మూర్తుల రూపాలు పంచ భూత లింగాలు కనపడతాయి.
ప్రదక్షణ పూర్తి చేసుకొని ముఖమండపం లోనికి చేరితే అక్కడ నందీశ్వరుడు ఉపస్థితులై ఉంటారు.
గర్భాలయ ద్వారానికి ఇరుపక్కలా శివ కుమారులైన గణపతి మరియు కుమార స్వామి ద్వారపాలకులగా దర్శనమిస్తారు.
అర్ధమండపం చేరుకొంటే గర్భాలయంలో లింగ రూపంలో సర్వేశ్వరుడు అగస్తీశ్వర లింగం పేరున అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు అందుకొంటుంటారు.
అక్కడే దక్షిణ ముఖంగా అమ్మవారు శ్రీ పార్వతీ దేవి స్థానిక భంగిమలో కొలువుతీరి ఉంటారు.
ఆలయం పక్కనే పూజారి గారి నివాసం.
పచ్చని పల్లె వాతావరణం ప్రశాంతత పరమేశ్వర దర్శనం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించినది.
ప్రాంగణంలో ఒక్క నవగ్రహ మండపం తప్ప మరో ఉపాలయం లేదు.
పూజాదికాలు నిర్వర్తించుకొని కాసేపు శివ ధ్యానం చేసుకొని ఇక ముందు మార్గంలో ఎదురయ్యే ఇలాంటి ఆలయాలను వీలైనంత ఎక్కువగా దర్శించి మానసిక ప్రశాంతత పొందాలని నిర్ణయించుకున్నాను.
నెల్లూరు పట్టణం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాదిరాజు గూడూరు.
నమః శివాయ !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి