ప్రదక్షిణ అన్న పదం లోని ప్రతి అక్షరానికీ ఒకో అర్ధం ఉన్నది అని పండితులు చెబుతారు.
మరో విధంగా చెప్పాలంటే మన పుట్టుక దగ్గర నుండి మరణం వరకు అన్నిటికీ కేంద్ర బిందువైన ఆ లీలా మానుష
రూపుడైన భగవంతునికి ఒక రూపం కల్పించుకొని, ఆయనను మన జీవీతాలు సుఖప్రదంగా సాగి పోవాలని
కోరుకొంటూ చుట్టూ తిరుగుతూ చేసేదే ప్రదక్షిణ.
నిత్యం వేద మంత్రాలతో పవిత్ర వాతావరణం నింపుకొన్న ఆలయము లో చేసే ఈ ప్రదక్షిణ మనలో అనుకూల
స్పందనలను ( positive vibrations) కలిగించి సరి అయిన ఆలోచనలను రేకెత్తించి జీవితానికో సవ్య మార్గం చూపిస్తుంది.
ఇంతటి ఘనమైనది కనుకనే పెద్దలు ఆలయాలలో తప్పని సరిగా ప్రదక్షిణ చేయాలని నిర్ణయించారు.
ఈ కారణంగా అశ్వద్ద వృక్షానికి, ఉదంబర వృక్షానికి, నాగ ప్రతిష్టలకు లేక పుట్టలకు, అగ్నికి, తులసి మొక్కకు కూడా
ఇదే క్రమంలో మన జీవితాలు సుఖప్రదంగా గడపడానికి కావలసిన నీటిని అందించే నదులను కన్న తల్లి ప్రతి
రూపాలుగా తలచి పూజించడం, హారతులు ఇవ్వడం కూడా జరుగుతోంది.
సప్త పుణ్య నదులలో ఒకటైన నర్మదా నది "అమరకంటక్" (మధ్యప్రదేశ్)లోపుట్టి ఒక వెయ్యి నూట పదిహేను కిలోమీటర్లు ప్రవహించి "గల్ఫ్ అఫ్ ఖంభట్" (గుజరాత్ ) వద్ద అరేబియా సముద్రంలో సంగమిస్తుంది.
నర్మదానది పరివాహక ప్రాంతంలో ఇరుపక్కలా ఎన్నో పుణ్య క్షేత్రాలు నెలకొన్ని ఉన్నాయి.
అందుకే ఈ నది విషయంలో మరింత ముందుకు వెళ్లి మూడు వేల మూడువందల కిలోమీటర్ల పై చిలూకు ఈ దూరాన్నిభక్తులు ఒక సంవత్సర కాలంలో అత్యంత భక్తిశ్రద్దలతో పరిక్రమ చేస్తారు. ఈ క్రమంలో ఎన్నో కఠోర నియమాలను యాత్రీకులు పాటించాల్సి ఉంటుంది.
అదే విధంగా పర్వతాల విషయానికి వస్తే గోవర్ధన గిరి, కైలాస గిరి ఏనాటి నుండో చేస్తున్నారు. ఈ మద్య కాలంలో ఇంద్రకీలాద్రి( విజయవాడ), సింహగిరి ( విశాఖపట్నం)లో కూడా గిరి ప్రదక్షణ ప్రారంభించారు. కానీ అన్నింటి లోనికి అత్యంత పుణ్య ప్రదమైన, ఇహపర సుఖాలను ప్రసాదించేదిగా ప్రసిద్ది చెందినది "అరుణా చల ప్రదక్షిణ".
కారణం ఇక్కడ పర్వతమే పరమేష్టి. మిగిలిన గిరులన్నీ ఆయన నివాసాలు. అదే ముఖ్యమైన వత్యాసం.
పరమేశ్వరుడు ఇక్కడ పర్వత రూపంలో వెలిసి ఉండడానికి సంబంధించిన గాధ అందరికీ తెలిసినదే ! క్లుప్తంగా ఉదహరిస్తాను.
ఒక సారి తామిద్దరిలో ఎవరు అధికులు అన్న తర్కం శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మ దేవుల మధ్య తలెత్తి చివరికి
అది పెద్ద వివాదంగా మారింది. అప్పుడు వారి మధ్య పెద్ద అగ్ని రూపంలో కైలాస నాధుడు ఉద్భవించి.
"మీ ఇరువురిలో ఎవరైతే నా ఆది అంతాలలో ఒక దానిని కనుకొంటారో వారే గొప్ప:" అన్న మాటలు వినిపించాయి.
అంతే విధాత తన హంస వాహనం మీద ఊర్ధ్వ దిశగా, శ్రీ హరి భూ వరాహ రూపం ధరించి పాతాళం వైపు వెళ్ళారు.
యెంత తవ్వినా మొదలు కనుగొన లేక శ్రీ మన్నారాయణుడు తిరిగి వచ్చి తన ఓటమిని అంగీకరించారు.
అదే పరిస్థితి వాణీ పతికి ఎదురైనది. కానీ ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేక తాను అగ్ర భాగం చూసాను అని
పలుకుతూ సాక్ష్యం గా మొగలి పువ్వును, గోవును తెచ్చారు.
ఆగ్రహించిన రుద్రుడు ఆయనకు భూలోకంలో పూజార్హత లేకుండా,మొగలి పువ్వుకు పూజకు పనికిరాని పువ్వుగా, తలతో అవును అని తోకతో కాదు అని మధ్యస్తంగా వ్యవహరించిన ఆవు పృష్ట భాగం పూజ్యనీయమని శపించారు.
తమ క్షమాపణలతో, స్తోత్ర పాఠాలతో శాంతింప చేసారు.
అంతట దేవతల, దిక్పాలకుల, మహా మునుల కోరిక మేరకు అక్కడే శిఖర రూపంలో కొలువయ్యారు. కొండంత
దేవరను కొండ రూపంలో సేవించుకోలేమని అసహాయత వ్యక్తం చేయగా లింగ రూపంలో పర్వత పాదాల వద్ద స్థిర
నివాస మేర్పరచుకొన్నారు. ( అరుణాచల ఆలయ విశేషాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి. చూడగలరు ).
తెల్లవారు ఝామున నాలుగున్నరకు తూర్పు గోపురం
స్వయం శంకరుడు శిఖరముగా నిలిచినందున కృతయుగంలో అగ్నిశిఖరంగా , త్రేతా యుగంలో మాణిక్య గిరిగా, ద్వాపరయుగంలో సువర్ణ శిఖరంగాను ఉండి కలియుగములో ఎరుపు రంగు గల రాతి కొండగా మారిన గిరిని దేవతల నుండి మానవుల వరకు అందరూ అరుణాచలేశ్వరు(ఎరుపు రంగు పర్వతం)నిగా, అన్నామలైయార్ ( కొండలకు రాజు ) నిగా కీర్తిస్తూ ఈ గిరికి ప్రదక్షిణ చేస్తున్నారు.
దీనికి నిదర్శనంగా ఈ క్షేత్రంలో బ్రహ్మ ప్రతిష్టిత "ఆది అన్నామలై స్వామి", శ్రీ మహావిష్ణు ప్రతిష్టించిన "అరుణ గిరినాధర్" ఆలయాలు,( ఈ ఆలయాల వివరాలు బ్లాగ్ లో కలవు). అదే విధంగా అష్టదిక్పాలక లింగాలు, మహర్షుల దేవాలయాలు, ఇవే కాకుండా కనిపించే ప్రతి ఆలయానికి తగినంత పౌరాణిక గాధ కలిగివుండటం చూడవచ్చును.
గిరివలయము యొక్క ప్రాముఖ్యాన్ని స్వయం సర్వేశ్వరుడు గౌతమ మహర్షికి అరుణ గిరి ప్రదక్షిణ ప్రాధ్యానతను
వివరించినట్లుగా స్కాంద పురాణం తెలుపుతోంది.
గిరివలయానికి అత్యంత ప్రాధాన్యత కలిగించినవారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆయన ఈ ప్రదక్షణ ఎలా చేయాలి ?
ఎక్కడ ప్రారంభించాలి ? ఏమేమి సందర్శించాలి ? ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ? అన్న వివరాలను విశదీకరించారు.
సహజంగా పౌర్ణమి నాడు అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షణ చేస్తుంటారు.
కానీ సంవత్సరంలో ఏ రోజు అయినా చేయవచ్చును. ఒక్క రోజున ఒక్కో ఫలితం దక్కుతుందని పరమేశ్వరుడు తెలిపారు.
- సోమవారం ---- పరిపూర్ణ ఆరోగ్యం, దీర్గాయువు
- మంగళవారం ---- ఋణ భాదల నుండి విముక్తి. చక్రవర్తి యోగం కలుగుతుంది
- బుధవారం ----- పాండిత్యం, జ్ఞాన సిద్ది
- గురువారం ----- స్థిరమైన ఆధ్యాత్మిక అవగాహన మరియు దృష్టి
- శుక్రవారం ----- అపార సంపత్తి. అనంతర కాలంలో వైకుంఠ ప్రాప్తి.
- శనివారం ----- సర్వ గ్రహ దోషాలు తొలగి అన్నింటా విజయం.
- ఆదివారం ----- శివ సాయుజ్యం
మహర్షుల అభిప్రాయం ప్రకారం మంగళ వారం మరియు కనుమ నాడు చేసే ప్రదక్షిణ ఇహ పర సుఖాలను ప్రసాదించేది.
అరుణాచల పరిక్రమకు కొన్ని అలిఖిత నియామాలు ఉన్నాయి.
- శుచిగా అభ్యంగన స్నానం చేసి పరిశుబ్రమైన వస్త్రాలు, నుదిటిన కుంకుమ విభూది ధరించాలి.
- పాద రక్షలు ధరించకుండా ( ఆలయం లోనికి చెప్పులు వేసుకొని వెళుతామా ? ) కాలినడకన చేయాలి.
- మనస్సును శివయ్య మీదే లగ్నం చేసి శివ నామం జపిస్తూ ఉండాలి.
- ఈ పద్నాలుగు కిలోమీటర్ల మార్గంలో ఎదురయ్యే ప్రతి ఆలయాన్ని సందర్శించాలి.
- తరుచు అరుణ గిరిని వీక్షిస్తుండాలి. అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుంది.
శ్రీ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం
ఆలయ గజరాజు "రుక్కు"
శ్రీ రమణ మహర్షిని ఒక భక్తుడు "గిరివాలం ఎలా చేయాలి ?" ప్రశించారట. దానికి వారిచ్చిన సమాధానం ఏమిటంటే
"నిండు గర్భిణి యెంత జాగ్రత్తగా ప్రతి అడుగు చూసుకొంటూ గర్భస్థ శిశువు క్షేమం ఆలోచిస్తూ నడుస్తుందో అలా
నడవాలి " అని. ఈ ఉపదేశం మనస్సులో పెట్టుకొంటే చాలు !!
ప్రదక్షిణా క్రమంలో ఎన్నో పురాతన, నూతన చిన్న పెద్ద ఆలయాలు, మందిరాలు, ఆశ్రమాలు, యోగ శిక్షణ
కేంద్రాలు ఎదురవుతాయి. చిన్ననూతన నిర్మాణాలను చూడక పోయినా పురాతన ఆలయాలు అన్నీ దర్శనీయాలే!
ముఖ్యమైనవి పదకొండు శివాలయాలు.పైన తెలిపిన అష్ట దిక్పాలక, బ్రహ్మ ప్రతిష్టిత ఆదిఅన్నామలై, రెండు మనకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్ర ప్రతిష్టితాలు.
ఈ ఆలయాలలో పూజలు జరిపిస్తే విశేష ఫలితాలను పొందవచ్చునని తెలుస్తోంది.
ఆలయం దిశ ప్రతిష్ట అధిష్టాన దేవత ఫలితం
- ఇంద్ర లింగం -- తూర్పు ---- ఇంద్ర ----- సూర్య, శుక్ర ----- కీర్తి, దీర్గాయువు
- అగ్నిలింగం -- ఆగ్నేయం ---- అగ్ని ----- చంద్ర ----- భయనివారణ, ఆరోగ్యం
- యమ లింగం -- దక్షిణం ---- యమ ---- అంగారక ----- ప్రమాదాల నుండి రక్షణ
- నైరుతిలింగం -- నైరుతి ---- నైరుతి --- రాహు ----- ధనం, కీర్తి, సత్సంతానం
- వరుణలింగం -- పడమర ---- వరుణ ---- శని ----- ఉబ్బసం లాంటి వాయు సంబంధిత రుగ్మతల నుండి రక్షణ
- వాయులింగం -- వాయువ్యం -- వాయువు --- కేతు ----- హుద్రోగ, ఉదరకోశ రోగాల ఉపశమనం
- కుబేర లింగం -- ఉత్తరం ---- కుబేరుడు --- గురువు ----- అర్దికాభివృద్ది.
- ఈశాన్య లింగం -- ఈశాన్యం --- ఈశానుడు --- భుధుడు ----- శాంతి
శ్రీ ఆది అన్నామలై స్వామి అత్యంత భక్త వత్సలుడు. కోరినా కోరక పోయినా ఎవరికి కావలసినది వారికి అనుగ్రహించే దయాళువు. శ్రీ సూర్య లింగం ఆరోగ్యాన్ని , శ్రీ చంద్ర లింగం దర్శనం శాంతి సుఖాలను అనుగ్రహిస్తారు.
శ్రీ కర్పగ వినాయక ఆలయం
అగ్ని లింగం
అగ్ని తీర్ధం
అగ్ని మండపం
శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం
శ్రీ దక్షిణా మూర్తి మందిరం
శ్రీ రమణ మహర్షి ఆశ్రమం
అరుణ గిరి ఎన్నో ఔషదాలతో నిండి వుండటం వలన ఈ పర్వతం నుండి వీచే గాలి ఆరోగ్య ప్రదాయని. ఆరోగ్యవంతులు భగవంతుని ఆశీస్సులతో సాధించలేనిది లేదు కదా !!
గిరి ప్రదక్షణ శ్రీ అన్నామలై స్వామి ఆలయ తూర్పు గోపురం వద్ద నుండి ఆరంభించాలి. కర్పూరం వెలిగించి మనసులోని కోరిక వెల్లడించుకొని (గిరివాలం చేసే సమయంలో ఎక్కడ ఎలాంటి కోరిక కోరుకోరాదు ) రెండో ప్రాకారం లోని దక్షిణ గోపురం వద్ద ఉన్న శ్రీ బ్రహ్మ లింగేశ్వర స్వామికి మొక్కాలి. ఇక్కడ నుండి అరుణాచల "ఏక మునిక్కాల్ కూంబు ముఖ దర్శనం " ( ఈ ముఖ దర్శనాల గురించి పూర్తి వివరాలకు ఈ బ్లాగ్ లోని అరుణాచల ముఖ దర్శనం వ్యాసం చదవగలరు) చేసుకొని వెలుపలికి వెళ్లి ప్రధాన రహదారి గుండా నడక ఆరంభించాలి. అత్యంత
దుకాణాల సముదాయం మధ్యలో కనీ కనిపించ కుండా ఉంటుంది అష్ట దిక్పాలక లింగాలలో మొదటిదైన "ఇంద్ర లింగం". పురాతన ఈ ప్రాంగణంలో ఇంద్ర ప్రతిష్టిత లింగరాజు, శ్రీ గణపతి, నందీశ్వరుడు కొలువై ఉంటారు.
ప్రార్ధించుకొని ముందుకు సాగితే తిరుమంజన గోపురం ( దక్షిణ గోపురం) వెళ్ళే దారికి ఉన్న నాలుగు దారుల కూడలిలో "శ్రీ కర్పగ వినాయకుడు" చిన్న మందిరంలో తూర్పు దిశగా ఉపస్థితులై దర్శనమిస్తారు. ఈయన దర్శనం సర్వ శుభదాయకం.
మేల్మరువత్తూర్ శ్రీ ఆదిపరా శక్తి ఆలయం
ప్రముఖ రచయిత కీర్తిశేషులు గుడిపాటి వెంకటా చలం సమాధి
శ్రీ ద్రౌపది అమ్మన్ కోవెల
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం
నంది మండపం
నెమ్మదిగా కదిలి నడుస్తూ వెళితే అగ్ని తీర్ధం, మండపం మరియు అగ్నిలింగం వస్తాయి. సందర్శించుకొని కొంచెం ముందుకు వెళితే శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం, వెంటనే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వస్తాయి. శేషాద్రి స్వామి ఆశ్రమం వద్ద నుండి "తేజో ముఖ దర్శనం" రమణ ఆశ్రమం వెలుపల నుండి "ఎరు పంచ ముఖ దర్శనం" లోపలికి వెళితే "ఏక ముఖ దర్శనం" లభిస్తాయి.
ఈ రెండు ఆశ్రమాల మధ్యన చిన్న మండపంలో జ్ఞాన ప్రదాత శ్రీ దక్షిణామూర్తి" కొలువుతీరి కనపడతారు. స్వామి వారికి చేసే పుష్పాలంకరణ కనుల పండుగగా ఉంటుంది.
శ్రీ రమణ ఆశ్రమం పక్కనే పెద్ద వట వృక్షం, పుష్కరణి ఉంటాయి. దీనికి ఎదురుగా ఉన్న వీధి లోపలికి వెళితే "యోగి
రామ సూరత్ కుమార్ ఆశ్రమం" చేరుకోవచ్చును. గిరివలయంలో సందర్శించాల్సిన వాటిల్లో ఈ ఆశ్రమం లేదు.
వెళ్లి దర్శించుకొని తిరిగి ప్రధాన రహదారిలో నడక కొనసాగిస్తే కుడి పక్కన దారి పక్కన కనిపిస్తుంది కీర్తి శేషులు గుడిపాటి చలం సమాధి. అక్కడే కుడి పక్కన మేల్మరువత్తూరు శ్రీ ఆది పరా శక్తి ఆలయం. ఇక్కడ నుండి లభించేది "దిడ ముఖ దర్శనం". ఇదే దర్శనం కుదిపక్కనే కొద్దిగా ముందుకు వెళ్ళిన తరువాత లోపలి ఉండే "శ్రీ ద్రౌపదీ అమ్మన్ కోవెల" దగ్గర కూడా పొందవచ్చును.
చాల పురాతన ఆలయం.
ప్రధమ నంది
గిరివలయంలోని మరో ముఖ్య నియమం ఎప్పుడూ ఎడమ పక్కనే నడవాలి. చాలా భాగం ఆలయాలు అటువైపే వుంటాయి. మార్గం కూడా అటు పక్కనే నిర్మించారు.
ఎడమ పక్కన శ్రీ సుబ్రహ్మణ్య ఆలయం, ఎదురుగా సింహ తీర్ధం. ఒకప్పుడు తిరువన్నామలై లో మూడువందల అరవై పై చిలుకు కోనేరులు ఉండేవట. నేడు నలుగు అయిదో నీరు ఉన్న పుష్కరిణిలు ఉన్నాయి. చాలా వరకు ఎండిపోయాయి. ప్రస్తుతం వాటిని పూర్వపు స్థాయికి తెచ్చే ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి.
గుండ్రంగా సుమారు నలభై అడుగుల ఎట్టు గల కొండ రాయి మీద ఉన్న పాత నంది మండపం దూరానికే కనపడుతుంది. ఇక్కడ నుండి "ముని మాయన దర్శనం" దొరుకుతుంది. గతం లో పైకి ఎక్కి నది వద్ద దీపం వెలిగించి గిరి దర్శనం చేసుకోనేవారట.
రహదారికి రెండు పక్కల ఎత్తుగా గుబురుగా పెరిగిన తురాయి చెట్ల నుండి వీచే చల్లని గాలిని పీలిస్తూ, ప్రశాంత ప్రాతః
కాల వాతావరణంలో దారిలో కనిపించే చిన్న చిన్న మందిరాలను దర్శించుకొంటూ మార్గాయాసం తెలియ కుండా యమ లింగం చేరుతాము.
కామకాడు
నీరు లేని కోనేరు
శ్రీ ఐశ్వరేశ్వరార్ మందిరం
శ్రీ దూర్వాస మహాముని
రాతి ఇల్లు
సంతానాన్ని కోరుకొంటూ కట్టిన దారాలు
రెండవ నంది
అర్చనాదులు పూర్తిచేసుకొని నడవడం మొదలు పెడితే కొద్ది దూరం లోనే పృధ్వీ నంది మండపం వస్తుంది.
అష్ట దిక్పాలక లింగాల మాదిరే గిరివాలయంలో మొత్తం ఏడు నంది మండపాలు ఎదురవుతాయి. అన్నీ గిరినే చూస్తుంటాయి. మొదటి అయిదు పంచభూత నందులు, ఆరోది సింహ నంది, చివరది అధికార నంది. ప్రతి నందికి మొక్కుకోవాలి. కుదిరితే దీపం వెలిగించాలి.
ప్రధమ నంది దగ్గర నుండి కలిగేది "పృధ్వీ బంగారు ముఖ దర్శనం".
పృధ్వీ నంది దాటిన తరువాత ప్రధాన రహదారి చీలుతుంది. ఎడమ పక్క దారి బెంగళూరుకు. గిరివాలం రహదారి కుడిపక్కన వుంటుంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లుగా చక్కగా తీర్ఛి దిద్దారు.
దారులు చీలిన కూడలిలో మరో శ్రీ కర్పగ వినాయక మందిరం ఉంటుంది.
గిరివలయ మార్గంలో మొదటగా కనిపించేది శ్రీ ఐశ్వరేశ్వరార్ మందిరం. ఈ పురాతన మందిరంలో సర్వేశ్వరుడు విగ్రహ రూపంలో ఆరాదించబడతారు. అరుదైన విషయమిది.
గిరివలయంలో మరెక్కడా లేని విధంగా ముగ్గురు మహర్షుల ఆలయాలు దర్శనమిస్తాయి.
వాటిల్లో మొదటిది అయిన "శ్రీ దూర్వాస మహా ముని ఆలయం " శ్రీ ఐశ్వరేశ్వరార్ మందిరం దాటినా వెంటనే వస్తుంది.
పాండవుల మాతృ మూర్తి కుంతీ దేవి ప్రతిష్టగా చెబుతారు. ద్వాపర యుగంలో లక్క ఇంటి దహనం నుండి బయట పడిన పాడవులు ఈ ప్రాంతం వచ్చి శ్రీ అన్నామలైయార్ ని సేవించుకొని గిరి ప్రదక్షణ చేసారని అంటారు.
పురాణాలలో ముక్కోపిగా పేరొందిన మహర్షిని ఇక్కడ సంతాన ప్రదాతగా, స్వగృహ భాగ్యాన్ని కలిగించే వరదాయకునిగా పూజిస్తారు. ఆయన ఉపదేశించిన మంత్రం ప్రభావం వలననే కుంతీ ధర్మజ, భీమ మరియు అర్జనులను, మాద్రి నకుల సహదేవులను కుమారులుగా పొందినది.
పద్మాసనంలో ధ్యాన ముద్రలో శిలా రూపంలో దర్శనమిస్తారు మహాముని.
సంతానాన్ని కోరుకొనేవారు ఇక్కడి వేపచెట్టుకు పసుపు పచ్చని దారాలను కడతారు. ఇంటిని కావాలనుకొనేవారు రాళ్ళను ఒక దాని మీద మరొకటి ఉంచుతారు. ఎన్నో దారాలు మరెన్నో రాతి మందిరాలు ఇక్కడ.
కూడలి నుండి దుర్వాస మహర్షి మందిరానికి మధ్యలో పర్వత పాదాల వద్ద గుబురుగా చెట్లు పెరిగిన ప్రదేశం వస్తుంది. ఇక్కడ నుండి అరుణ గిరి కనిపించదు. దీనినే "కామకాడు" (కోరికల అడవి) అంటారు. ఇహలోక సుఖాలలో తలమునకలుగా ఉన్న వాడికి దైవం మీదకు ధ్యాస పోదు. భగవంతుని తలచడు. దీనికి నిదర్శనమే కామ కాడు.
నడక దారిలో వచ్చేరెండవది అయిన అప్పు నంది దగ్గర నుండి చూస్తే లభించేది "మిత్ర చారు దర్శనం" మరియు నంది ముఖ దర్శనం. కొండ వాలులో కొన్ని రాళ్ళు కలిసి నంది ముఖంగా కనపడతాయి. ప్రకృతి ఎంత గొప్ప శిల్పి.
నంది ముఖ దర్శనం
షోన తీర్ధం
శ్రీ మారియమ్మన్ కోవెల
శ్రీ కాళియ మర్దన కృష్ణ మందిరం
అయిదు కిలోమీటర్లు నడిచిన తరువాత వచ్చే "షోన తీర్ధం" వద్ద దారి మీద రెండు నందులు, శ్రీ గణపతి, శ్రీ మారియమ్మన్, శ్రీ తాండవ కృష్ణ కోవెలలు నెలకొల్పబడినాయి.
చిన్న మండపంలో ఉన్న చిన్న "తేయునంది"మూడవది."చతుర్ముఖదర్శనం"చేసుకొనవచ్చును.
రహదారి నుండి కొద్దిగా లోపలి ఉంటుంది "నైరుతి లింగం" పక్కనే కోనేరు. మయూరాల అడ్డా. ఎన్నో నెమళ్ళు కనపడతాయి.
మరో మానవీయ దృశ్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది.
వలయ మార్గంలో నడిచి ఇక్కడకు ఉదయం ఆరున్నర లోగా చేరుకొంటే ఒక వ్యక్తి కాకులకు, నెమళ్ళకు బూంది, కోతులకు, కుక్కలకు బిస్కెట్లు పెడుతూ కనిపిస్తాడు.
ఆయన పేరు "ప్రకాష్". రాజస్తాన్ కు చెందినవాడు. వంద సంవత్సరాల క్రిందట వారి కుటుంబం ఇక్కడ స్థిరపడి బంగారు ఆభరణాల దుకాణం నడుపుతోంది. భగవంతుని ఆదేశం మేరకు ఇలా మూగ జీవాలకు ఆహరం అందిస్తున్నానని ఆయన వినయంగా చెబుతారు.
తృతీయ నంది
నైరుతి లింగం
మయూరాలు
శ్రీ ప్రకాష్
భగవాన్ రమణులు చెబుతారు గిరి వలయంలో భైరవునికి ఆహారం పెట్టాలి అని.
ఇక్కడొక స్వానుభవం గురించి ప్రస్తావించాలి. గిరివలయం చేసిన ప్రతిసారీ నా వెనక ఒక కుక్క వస్తూవుంటుంది. మొదట్లో పట్టించుకోలేదు. కానీ గమనించిన తరువాత అడిగాను "ఏం కావాలి ? నా వెనక పడుతున్నావు ?"అని. గబగబా దగ్గర లోని దుకాణం వద్దకు వెళ్లి కూర్చున్నది. రెండు బిస్కెట్లు కొని పెట్టాను. అంతే అక్కడే ఆగి పోయింది. ఈ నెల పంతొమ్మిదో తారీకున కూడా ఇదే విధంగా జరిగింది. ఆ చిత్రమే ఇది.
తిరువన్నామలై ఆలయానికి సరిగ్గా గిరి వెనక ఉండే మందిరం "తిరునేర్ శ్రీ అన్నామలై మరియు శ్రీ ఉన్నమలై అమ్మవారి"ది. పక్కనే శ్రీ గాయత్రి మాత మరియు నవగ్రహ మండపం ఉంటాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తారీకున భానుని తోలి కిరణాలు నేరుగా మండపంలోనిలింగం పైన పడతాయి.ఇక్కడ లభించేది "శక్తి శివ దర్శనం".
ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మరియు శ్రీ రాఘవేంద్ర బృందావనం ఉంటాయి.
చాలా మంది ఇక్కడ ఆగి అల్పాహారాలు చేస్తారు. కట్టెల పొయ్యి మీద వేసే "తట్టు దోశ" బాగుంటుంది.
శ్రీ తిరునేరు అన్నామలై మందిరం
శ్రీ గాయత్రి మాత మందిరం
గిరివలయ మార్గంలో ఎందరో కాషయంబరధారులు కనపడతారు. వీరంతా ఇక్కడే ఉంటారు. పుష్కరణి నీటిలో స్నానం, యాత్రికుల కోసం నిర్మించిన మండపాలలో నివాసం. ఆశ్రమాలలో భోజనం. కొందరు మన వెనుక పడి డబ్బుల అడుగుతుంటారు.
కొందరు ఇస్తే తీసుకొంటారు. మరికొందరు అలా కూర్చొని ఉంటారు.
అనేక సార్లు చేసిన గిరి ప్రదక్షణలలో వీరిలో కొందరితో మాట్లాడే అవకాశం దక్కింది. వీరంతా చక్కని హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలరు. తెలుగు అర్ధం చేసుకోగలరు.
విశేషమేమిటంటే వీరిలో కొందరు దుబాయి, సింగపూర్ లాంటి దేశాలలో ఉద్యోగం చేసి చాలా ధనం సంపాదించిన వారే!
అన్నీ తమ వారికి ఇచ్చి అన్నామలైయార్ సేవ చేసుకోవడానికి ఇక్కడి కి వచ్చారు. నియమంగా ప్రతినిత్యం ధ్యానం, గిరి వలయం చేస్తారు.
శ్రీ ఆంజనేయ ఆలయం
శ్రీ రాఘవేంద్ర బృందావనం
నాలుగో నంది
నాలుగో నందిని దాటిన తరువాత వస్తుంది "పళని ఆండవర్(దండాయుధ పాణి/ సుబ్రహ్మణ్య స్వామి) ఆలయం". స్వామి స్వయంభూ ! భ్రుంగి మహర్షి పళని వాసుని దర్శనాన్ని అపేక్షిస్తూ ఇక్కడ తపమాచరించి, సాక్షాత్కారం పొందారట. ఈ ఆలయానికి ఎదురుగా అడవిలోని అరుదైన "శ్రీ కన్నప్ప నయనార్ ఆలయం" చూడవచ్చును. (ఈ బ్లాగ్ లో ఆలయ వివరాలు ఉన్నాయి).
పళనిలో ఎలా బాలకుని రూపంలో ఉంటారో అదే మాదిరి దర్శనమిస్తారు కుమార స్వామి.
తరువాత వచ్చే "శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం" కూడా విశిష్టమైనదే !
ఈ ఆలయానికి ఎదురుగా వివాదాస్పద శ్రీ నిత్యానంద ఆశ్రమం ఉంటుంది.
దారి నుండి కొద్దిగా లోపలి ఉండే సింహ తీర్ధం దగ్గర చెట్టు క్రింద కనపడుతుంది సింహ నంది.
కాశీ క్షేత్రం సందర్శన సమయంలో ప్రీతికరమైన తినుబండారాన్ని లేదా ఆహార పదార్ధాన్ని వదలడం ఆచారం. ఇక్కడ సింహ నంది వద్ద మనకు శారీరకంగా , ఆర్ధికంగా అపకారం చేసే చెడ్డ అలవాట్లలో (అంటే పొగ త్రాగడం, మందు సేవించడం, జూదం ఆడటం,పర స్త్రీ వ్యామోహం, మోసం చేయడం లాంటివి) ఏదైనా ఒక దానిని శాశ్వితంగా వదలాలని అంటారు.
నాతొ సహా ఎవరూ అలా చేసిన దాఖలాలు నాకు తెలిసి లేవు.
శ్రీ పళని ఆండవర్ కోవెల
నిత్యానంద ఆశ్రమం
శ్రీ రాజ రాజేశ్వరీ ఆలయం
శ్రీ పార్వతి కొండ
కొద్దిగా లింగాకారంలో కనిపించే అరుణగిరి
శ్రీ కన్నప్ప నయనార్ ఆలయం
సింహ పుష్కరణి , సింహ నంది
వరుణ లింగం
మానవులకు మంత్ర శాస్త్రాన్నిఅందించిన మహర్షి శ్రీ గౌతముల వారి ఆశ్రమం మరియు ఆలయం పక్కపక్కనే వస్తాయి.
వెంటనే సూర్య లింగం, షిరిడీ సాయి మందిరం, శ్రీ హరి పాదాలు దాటిన తరువాత వరుణ లింగం ఆలయం.
వరుణునిచే ప్రతిష్టించబడిన లింగాన్ని సందర్సించు కొన్న తరువాత ఒక కిలోమీటరు వరకు ఎలాంటి ఆలయం కనిపించదు. రాతి బొమ్మలు చేసే శిల్ప శాలలు, యోగ శిబిరాలు దర్శనమిస్తాయి.
సూర్య లింగం
షిరిడి సాయి మందిరం
ఆది అన్నామలై ఊరు చేరి కుడి పక్కకు కొంచెం లోపలి వెళితే కనపడుతుంది బ్రహ్మ ప్రతిష్టిత శ్రీ ఆది అన్నామలై స్వామి ఆలయం. చక్కని శిల్పకళ కనిపిస్తుందీ ఆలయంలో. (వివరాలు ఈ బ్లాగ్ లో కలవు)
శివ యోగ ముఖ దర్శనాన్ని ఇక్కడ నుండి తిలకించవచ్చును.
ఈ ఆలయానికి వెళ్ళే వీధి మొదట్లో ప్రముఖ కవి, అరవై మూడు మంది నయమ్మారులలొ ఒకరైన "మాణిక్యవాసగర్" ఆలయం ఉంటుంది.
ధనుర్మాసంలో ఆండాళ్ గానం చేసిన 'తిరుప్పావై"ఎలా విష్ణు ఆలయాలలో గానం చేస్తారో అలా ఈయన రచించి గానం చేసిన "తిరువెంబావై" కీర్తనలను తమిళనాడు లోని అన్ని శివాలయాలలో మార్గశిర మాసమంతా నియమంగా గానం చేస్తారు. మాణిక్యవాసగర్ తిరువన్నామలై లోనే తిరువెంబావై ని రచించారు.
అది అన్నామలై గ్రామం మధ్యలో ఎన్నో చిన్న చిన్న పురాతన ఆలయాలు, శిధిల మండపాలు కనపడతాయి.
అష్ట దిక్పాలక లింగాలలో ఆరవది అయిన వాయులింగం దగ్గర "కండ నీరు ముఖ దర్శనం" వలన అనారోగ్యభాధలు దూరం అవుతాయి. ఈ ఆలయం పక్కనే అయిదవ నంది దర్శనమిస్తుంది.
హరి పాదాలు
శ్రీ ఆది అన్నామలై ఆలయం
శ్రీ మాణిక్యవాసగర్
వాయు లింగం
అయిదవ నంది
చంద్ర లింగం
శ్రీ అగస్థ్య మహర్షి ఆశ్రమం
అధికార నంది
శ్రీ కుబేర పెరుమాళ్ ఆలయం
ఇక్కడే శ్రీ రమణ మహర్షి తన గిరి వలయ సమయంలో గడిపిన "రమణాస్ బ్రిడ్జి" వస్తుంది. ఇక్కడితో గిరివలయం మార్గం పూర్తి అయ్యి తిరిగి మరో ప్రధాన రహదారి అయిన కంజి రోడ్డు లో నడవాలి.
ఈ దారిలో మొదట వచ్చేది చంద్ర లింగం. తరువాత లోపాముద్ర సమేత శ్రీ అగస్థ్య మహర్షి ఆశ్రమం దాటిన వెంటనే అధికార నంది వస్తుంది. ఇక్కడ మన గోత్ర నామాలను నందీశ్వరునికి చెప్పుకోవాలి. ఆయన పరమేశ్వరునికి తెలుపుతారని దానివలన గిరివలయం ఫలితం దక్కుతుందని పెద్దలు అంటారు.
అగస్త్య మహర్షి ఆశ్రమం వద్ద నుండి అరుదైన"శివ శక్తి ఐక్య స్వరూప దర్శనం" లభిస్తుంది.
అధికార నంది దాటిన తరువాత వచ్చే మట్టి దారిలో ఒక కిలోమీటరు దూరం ఎడమపక్క లోపలి నడిస్తే నూతనంగా నిర్మిస్తున్న "శ్రీ కుబేర పెరుమాళ్ కోవెల: ఉంటుంది. స్వర్ణమయ శ్రీ వేంకటేశ పెరుమాళ్ నిలువెత్తు విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా నారసింహ, దేవి ఉపాలయాల నిర్మాణం జరుగుతోంది.
పంచ ముఖ దర్శనం
ఇడుక్కు పిళ్ళయార్
అష్ట దిక్పాలక లింగాలలో ఏడవదైన "కుబేర లింగం" దర్శనం ముఖ్యమైనది. శ్రీ మహాలక్ష్మి స్వయంగా తనగిరివలయం చేసిన సందర్భంలో పూజించారని చెబుతారు.
కుబేర లింగం తరువాత యాత్రీకులు కొద్దిగా విశ్రాంతి తీసుకొనే అవకాశం "ఇడుక్కు పిళ్ళియార్" వద్ద లభిస్తుంది.
( వివరాలు ఈ బ్లాగ్ లో ఇవ్వబడినాయి)
పక్కనే చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో ఉన్నతిని ప్రసాదించే పంచ ముఖ దర్శనం. ఇక్కడ చిన్న మండపంలో ఉండే స్వామి అందరినీ ఆశీర్వదించి విభూతి ఇస్తుంటారు. కొందరికి పిలిచి మరీ మంత్రోపదేశం చేస్తారు. లేదా కొందరి గోత్ర నామాలు అడిగి పెద్దగ శంఖం పూరిస్తారు. దీనివలన చెడు ప్రభావాలు ఏమన్నా ఉంటె తొలగి పోతాయి. ఆయన ఉపదేశించిన మంత్రాన్ని చెప్పినన్ని సార్లు చెప్పినన్ని రోజులు మనం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
ఈశాన్య లింగం
నడకను కొనసాగిస్తే బస్సు స్టాండ్ కు దారి తీసే మార్గం వస్తుంది. దారికి అటుపక్క రుద్ర భూమి వైపుకు వెళ్లి "కోన లింగ ముఖ దర్శనం"చేసుకొని మధ్యలో ఉన్న దారిలోనడిస్తే ఈశాన్య లింగం ఆలయం వస్తుంది.
అద్భుతమైన పుష్పాలంకరణలో దర్శనమిస్తారు ఈశానేశ్వరుడు. ఆయనకు ఎదురుగా నిరంతరం వెలిగే నేతి దీపం ఉంటుంది.
ఈ ఆలయానికి ఎదురుగా ప్రధాన ఆలయ ఉత్తర గోపురాన్ని నిర్మించిన "శ్రీ అమ్మని అమ్మన్" జీవ సమాధిని దర్శించుకోవడం విధాయకం.
బస్సు స్టాండ్ మీదగా పావల కుండ్రు మురుగ, శ్రీ ఆది మీనాక్షి అమ్మన్ని దర్శించుకొని నేరుగా శ్రీ భూత నారాయణ ఆలయాన్ని చేరుకొంటే గిరి వలయం పూర్తి అయినట్లే ! భూత నారాయణ ఆలయం పక్కనే ఉన్న వీధిలో ఉన్న ఇరట్టై పిళ్ళియార్ ఆఖరి మజలీ ! రెండు వినాయక విగ్రహాలు ఒక సుబ్రమణ్య స్వామి విగ్రహం ఈ గర్భాలయంలో పూజలందు కొంటుంటారు.
శ్రీ భూత నారాయణ ఆలయం
పక్కకు తిరిగితే తూర్పు గోపురం.
ప్రధాన ఆలయంలో ఉన్న ఉపాలయాలను, గోపురాలను, మండపాలను దర్శించుకొని చివరగా సప్తవర్ణ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించబడిన శ్రీ అన్నామలైయార్ మరియు శ్రీ ఉన్నామలై అమ్మన్ ని దర్శించుకోవడంతో ఒక గిరివలయం పూర్తి అయినట్లే !!!
ఓం అరుణాచలేశ్వరాయ నమః !!!!