16, మార్చి 2014, ఆదివారం

Sri Matsya Giri Sri Lakshmi Narasimha Temple, Venkatapuram


       శ్రీ మత్స్య గిరి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం, వెంకటాపురం 

శ్రీ హరి లోక సంరక్షణార్ధం ధరించిన అనేకానేక అవతారాలలో నారసింహము ఒకటి. 
అత్యంత ఉగ్రత్వంతో పాటు నమ్మి కొలిచిన వారిని కాపాడే దేవునిగా శ్రీ నృసింహడు ప్రసిద్ది. 
అందుకే భారత దేశంలో అందునా దక్షిణాదిన నృసింహ ఆరాధన చాలా ఎక్కువ. 
ఎన్నో ఆలయాలలో స్వామి శ్రీ లక్ష్మీ నారసింహునిగా, యోగ నార సింహునిగా, ప్రసన్న నార సింహునిగా కొలువు తీరి భక్తుల పూజలందుకొంటున్నారు. 
పరిశోధకుల అంచనా ప్రకారం సింహ రూపుడు అరవై నాలుగు విదానాలైన రూపాలలో దర్శనమిస్తున్నారు. 
నవ విధ నార సింహ క్షేత్రం అయిన అహోబిలం మన రాష్ట్రంలో ఉన్నందుకు మన అదృష్టానికి పొంగిపోవాలి. 
అదే కాకుండా మరెన్నో ప్రసిద్ద నృసింహ క్షేత్రాలు అయిన యాదగిరి గుట్ట, సింహాచలం, కదిరి, మంగళగిరి, మట్టపల్లి, లాంటివి కూడా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాయి. 
కొన్ని విశేషమైన రూపాలలో కూడా అంటే వృక్ష, బిడారు, లింగ రూపంలో శ్రీ నార సింహుడు మన రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో కొలువు తీరి ఉన్నారు. 
అలాంటి వాటిల్లో ఒకటి నల్గొండ జిల్లాలోని మత్స్యగిరి లో ఉన్న శ్రీ లక్ష్మీ నార సింహ ఆలయం ఒకటి. 
మిగిలిన క్షేత్రాలకు మత్స్య గిరి కి ఉన్న ప్రధాన తేడా అన్ని చోట్లా విగ్రహ రూపంలో దర్శన మిచ్చే స్వామి ఇక్కడ జీవం పోసుకొని తన ప్రధమ అవతారమైన మత్స్య రూపంలో కనపడటమే కాకుండా పూజలందు కోవడం!!
ఈ ప్రత్యేకత వెనుక ఉన్నపౌరాణిక విశేషాల గురించి సంపూర్ణమైన వివరాలు అందుబాటులో లేవు. 
లభించిన గాధ ఇలా ఉన్నది.    






చాల కాలం క్రిందట ఒక సచ్చీలుడైన నారసింహ భక్తుడు ఇక్కడ నివసిస్తూఉండే వాడట.
నియమనిష్టలతో స్వామిని కొలుస్తూ జీవన యాత్ర ను కొనసాగించే అతని భక్తి శ్రద్దలకు సంతసించి, ఒకనాటి రాత్రి స్వప్న దర్శన మిచ్చి " తాను దాపులలో ఉన్న గిరి మీద మత్స్య రూపంలో అతనికి దర్శన మిస్తా"నని తెలిపారట.
తన అదృష్టానికి సంతోషించిన అతడు మరుసటి ఉదయాన కొండ మీదికి వెళ్ళగా అక్కడ మత్స్య రూపంలో ఉన్న విగ్రహం నీటి గుండం వడ్డున, గుండంలో అరుదైన చేప రూపంలో స్వామి వారి సాక్షాత్కారం లభించినదట.





 మహదానందంతో క్రిందికి వచ్చిన భక్తుడు మిగిలిన వారికి విషయాన్ని చెప్పి చిన్న గుడి నిర్మించి నియమంగా పూజించుకొసాగారట.
కాలక్రమంలో భక్తుల సహకారంతో ప్రస్తుత రూపు దిద్దుకొని, నిరంతరాయంగా కొనసాగుతున్న అభివృద్ధి తో త్వరలో ఒక మహా క్షేత్రంగా రూపుదిద్దుకోనున్నది.


మత్స్య గిరిలో ప్రధాన ఆకర్షణ పుష్కరణి లోని చేపలే !
సుమారు రెండు అడుగుల పొడుగు తగ్గ లావుతో నల్లగా ఉండే ఈ చేపల తల భాగంలో విషయమంతా ఉన్నది.
వెడల్పుగా ఉన్ననోటికి క్రింద నాలుగు, పెదాలకు కిరుపక్కాల రెండు, పైన రెండు  చొప్పున పొడుగైన మీసాలతో అచ్చం సింహపు మొహాన్నిపోలి ఉంటుంది.
తల పై భాగం కొద్దిగా ఉబ్బి మధ్యలో తెల్లటి నిలువైన నొక్కుతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుని తిరునామాన్ని తలపిస్తుంది.
పూజా సామాగ్రి అమ్మేదుకాణాలలో మరమరాలు మరియు చిన్న చిన్న బిస్కెట్ పాకెట్స్ అమ్ముతారు.
వాటిని నీటిలో వేస్తే చేపలు గుంపుగా పైకి వస్తాయి.
నిశబ్దం గా ఉండి, కొద్దిగా ఓపిక పడితే చక్కని దర్శనం లభిస్తుంది.
కోనేటి నీరు చాలా పాచి పట్టి ఉంటుంది.
శుభ్రం చేయకపోవడానికి ఏదన్నా కారణం ఉన్నదేమో తెలియలేదు.  
బండ రాతి  కొండ మీద పుష్కరణి అందులో ఎల్లప్పుడూ నీరు ఆ నీటిలో ప్రత్యేకమైన చేపలు  వాటికి తిరునామాలు ఉండటం అంతా సృష్టి కర్త మాయ అనిపించటంలో ఎలాంటి సందేహం లేదు.
పుష్కరణి ఒడ్డున స్వర్ణ వర్ణశోభిత విమానంతో ఉన్న ఆలయంలో మత్స్య రూపం లో ఉన్న ప్రధాన అర్చనా మూర్తి మీద శిరస్సున చక్రం, పాదాల వద్ద శంఖం మధ్యలో తిరునామం ఉంటాయి.
నిత్య పూజలన్ని ఇక్కడే జరుగుతాయి.


కొత్తగా దక్షిణా ముఖ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్నినిర్మించారు.
నూతన మండపము ఇతర నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నాయి.
కేశ ఖండన శాల కూడా ఉన్నది.

పుష్కరణి ఒడ్డున స్వర్ణ


ప్రతి నిత్యం చుట్టు పక్కల గ్రామాల నుండి ఎందరో భక్తులు వస్తుంటారు. 
శని ఆది వారాలలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 
ఏప్రిల్ మాసంలో ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 
నృసింహ జయంతి, హనుమత్ జయంతి, శ్రీ రామ నవమి ఘనంగా జరుపుతారు. 
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు కూడా వైభవంగా చేస్తారు. 
ఇంతటి ప్రత్యేకమైన క్షేత్రం హైదరాబాద్ కు సుమారు డెభై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
భువన గిరి నుండి చిట్యాల మార్గంలో వచ్చే వలిగొండ గ్రామం నుండి ఎనిమిది కిలోమీటర్లు లోపలి వెళ్ళాలి. 
దేవస్థానం అధ్వర్యంలో, ప్రెవేటు వ్యక్తుల నిర్వహణలో గదులు అద్దెకు లభిస్తాయి. 
సమస్త ఏర్పాట్లతో మొక్కు బడులు తీర్చుకోడానికి బంధు మిత్ర సమేతంగా వచ్చే వారికి ఏ ఇబ్బంది ఉండదు. 
స్వామిని సందర్శించుకోవాలనే వారు తిరిగి హైదరాబాద్ చేరుకోవడం ఉత్తమం. 
పర్వత పై భాగానికి చేరుకోడానికి రహదారి మరియు పురాతన సోపాన మార్గం ఉన్నాయి. 
చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించే క్షేత్రం మత్స్య గిరి. 










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...