Nagercoil Nagaraja Temple

                            శ్రీ నాగరాజ ఆలయం - నాగర్ కోయిల్ 

కొట్టార్ అంటే తెలియక పోవచ్చును కానీ నాగర్ కోయిల్ అంటే మాత్రం తెలియని వారుండరు.
భారత దేశ దక్షిణ భాగాన కన్యాకుమారి చేరుకోడానికి ముఖ్యమైన కూడలి నాగర్ కోయిల్.



ఇక్కడ స్వయంభూగా శ్రీ నాగరాజ మూర్తి వెలవడం వలన ఊరికి ఈ పేరు వచ్చినది.
భారత దేశంలో నాగ పూజకు అత్యంత ప్రాధాన్యత కలదు.
కేరళ లోని ప్రతి ఆలయంలోనూ నాగ దేవతలకు స్థానం కల్పించబడినది.
గతంలో కేరళలో భాగమైన ఈ ఊరు ట్రావెంకూర్ రాజుల కాలంలో నాగ పూజకు ప్రసిద్ది చెందినది.
ప్రస్తుతం తమిళ నాడులో ఉండటం వలన ఈ రాష్ట్రంలోని అతి పెద్ద నాగ దేవతల ఆలయంగా పేర్కొనవచ్చును.
చాలా సంవత్సరాల క్రిందట ఒక మహిళ పొలంలో కలుపుతీస్తుండగా కొడవలికి రక్తం అంటుకొన్నదట.
ఆమె భయపడిపోయి పరుగున వెళ్లి అందరికి విషయం తెల్పినదట.
వచ్చి గడ్డిని తొలగించి చూడగా అయిదు పడగల నాగేంద్ర స్వామి విగ్రహ రూపంలో దర్శనమిచ్చారట.
తమ అదృష్టానికి పొంగిపోయిన గ్రామస్తులు చిన్న పాక వేసి స్వామిని కొలవడం ఆరంభించారట.
 కొంతకాలంలోనే వారికి ఎన్నో అద్భుత అనుభావాలు కలిగాయట.
ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత మరియు జన్మతః జాతకంలో ఉన్న దోషాల విషయాలలో ఊహించలేని అనుభవాలు అంటే దీర్ఘ కాల ఆనారోగ్యం తో భాదపడుతున్న వారికి స్వామిని సేవించిన తరువాత ఆరోగ్యం కుదుటపడటం, జాతక రీత్యా సర్ప దోష, రాహు కేతు గ్రహ దోషాల భాధ తొలగిపోవడం లాంటివి కలగడంతో మరింత భక్తి శ్రద్దలతో పూజించే వారట.
విషయం తెలుసుకొన్న మహారాజు మార్తాండ వర్మ శ్రీ నాగ రాజును సేవించుకొంటే తనకు వచ్చిన చర్మ వ్యాధి తగ్గుతుందేమోనన్న ఆశతో వచ్చి నియమంగా స్వామికి అభిషేకాలు, పూజలు జరిపారట.
కొంత కాలంలోనే ఆయన వ్యాధి తగ్గిపోవడంతో ఆనందించి ఈ ఆలయాన్ని నిర్మించారట.
పూర్తిగా కేరళ సాంప్రదాయ నిర్మాణ శైలిలో ఉంటుందీ ఆలయం.
సుమారు అయిదు ఎకరాల స్థలంలో నాలుగు ప్రధాన ఆలయలుంటాయి.
శ్రీ నాగరాజ, శ్రీ కాశి విశ్వనాధ, శ్రీ అనంత కృష్ణ, శ్రీ గణపతి ముఖ్య దేవతలు.
ఉప ఆలయాలలో భోథనాద, శ్రీ ధర్మ శాస్త, శ్రీ బాల మురుగ, శ్రీ తీర్థ దుర్గ ( పుష్కరిణి పూడిక తీస్తున్నప్పుడు దొరకడం వలన ఈ పేరుతో పిలుస్తారు) కొలువై ఉంటారు.
ఒకే భవనం లాంటి కట్టడంలో ఉన్న నాలుగు ప్రధాన ఆలయాలకు విడివిడిగా ద్వారాలుంటాయి.
కేరళ సాంప్రదాయ పూజలు జరుగుతాయి.
కొన్ని ప్రత్యేకతలు ఇక్కడ కనపడతాయి.


శ్రీ నాగరాజ స్వామి గర్భాలయం గడ్డితో నిర్మించబడి ఉంటుంది. 
ప్రతి ఆషాడ మాసంలో కొత్త గడ్డిని కప్పుతారు. 
శ్రీ నాగరాజ స్వామి ఆలయానికి ధర్మెంద్రన్ మరియు పద్మావతి అని పిలవబడే  స్త్రీ పురుష నాగులు ద్వారపాలకులుగా ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
శివాలయాలలో సహజంగా విభూతి ప్రసాదంగా ఇస్తారు. 
కాని ఇక్కడ భక్తులకు పుట్ట మన్నుఇస్తారు. 
ఈ మట్టి దక్షిణాయనంలో నల్లగా, ఉత్తరాయణంలో తెల్లగా ఉంటుందని చెబుతారు. 

పూజలన్ని నాగరాజుకు చేసిన తరువాత కాశి విశ్వనాదునికి, శ్రీ అనంత కృష్ణ కు చేస్తారు. 
కానీ రాత్రి పూజ మాత్రం శ్రీ కృష్ణ భగవానునికే !
అదే విధంగా బ్రహ్మోత్సవాలు, రధ యాత్ర నందనందనునికే జరుగుతాయి. 
మరో విశేషం ఏమిటంటే ధ్వజస్తంభం శ్రీ కృష్ణ ఆలయానికి ఎదురుగా ఉంటుంది. 
సహజంగా ధ్వజస్తంభ పైభాగాన గరుడుడు ఉంటాడు. 
ఇది నాగ క్షేత్రం కావడం వలన, సర్ప గరుడులకు జాతి వైరం ఉన్నందున తాబేలు రూపం అమర్చారు. 
శ్రీ హరి దశావతారాలలో కూర్మావతారం ఒకటి కదా !
 ట్రావెంకూర్ రాజుల ఆరాధ్య దైవం శ్రీ అనంత పద్మనాభుడు. 

ఆలయ ప్రాంగణంలో ఎన్నో నాగ ప్రతిష్టలు కనపడతాయి. 
భక్తులు వాటికి పాలాభిషేకం జరిపి, పసుపుతో పూజిస్తారు. 
ముఖ్యంగా ఆశ్లేషా నక్షత్రం రోజున విశేషంగా భక్తులు తరలివచ్చి అభిషేకాలు జరిపించుకొంటారు. 
ఆదిశేషుని అవతారం అయిన లక్ష్మణుని జన్మ నక్షత్రం ఆశ్లేషా. 
ప్రదోష పూజాకాలంలో కూడా ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. ముఖ్యంగా జాతక రీత్యా  రాహు కేతు గ్రహ దోషాలు, నాగ దోషాలు ఉన్నవారు అధిక సంఖ్యలో వస్తుంటారు. 
శివలింగం పూలతో శ్రీ నాగారాజుని అర్చిస్తే విశేష ఫలితం ఉంటుంది అంటారు. 
ఎన్నో శివలింగం పూల వృక్షాలు ఉంటాయిక్కడ. 
నాగుల చవితి, కృష్ణాష్టమి, శివరాత్రి, నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. 
ఉదయం నాలుగు గంటల నుండి పదకొండున్నర  వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉండే శ్రీ నాగరాజ స్వామి ఆలయం నాగర్ కొయిల్ రైల్ వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
దేశ నలుమూల నుండి రైలు సౌకర్యం లభిస్తుంది. 
యాత్రికులకు సమస్త సదుపాయాలు ఉంటాయి. 
చుట్టు పక్కల ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore