6, అక్టోబర్ 2013, ఆదివారం

penna ahobilam




స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు ధరించిన అనేకానేక అవతారాలలో అత్యంత శక్తివంతమైనదిగా, ఆర్తులను రక్షించి, అపమృత్యు భయాన్ని తొలగించి సకల శుభాలను అనుగ్రహించేదిగా పేరుపొందినది శ్రీ నృసింహ అవతారం. 
 శ్రీ నరసింహ ఆరాధన దక్షిణ భారత దేశంలో ఎక్కువగా కనపడుతుంది. 
మన ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో ప్రసిద్ద నరసింహ క్షేత్రాలున్నాయి. 
అలాంటి వాటిల్లో ఒకటి అనంతపురం జిల్లాలోని పెన్నఅహోబిలం.  
పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రానికి సంభందించిన పురాణ గాధ కృత యుగ సంఘటనలతో ముడిపడి ఉన్నది. 
భక్త వరదుడైన శ్రీ మన్నారాయణుడు తండ్రి హిరణ్యకశపుని చేతిలో చిత్ర హింసలకు గురి అవుతున్న ప్రహ్లాదుని రక్షించ నారసింహ అవతారంలో బయలుదేరారు. 
అలా బయలుదేరిన స్వామి తన తొలి అడుగు భూమి పైన పెట్టిన స్థలమే ఈ అహోబిలం. పెన్నా నదీ తీరంలో ఉన్నందున దీనిని "పెన్నఅహోబిలం" అని పిలుస్తారు. 
(స్వామి తన రెండో అడుగును కర్నూలు జిల్లా లోని "అహోబిలం" లో పెట్టి హిరణ్యకశపుని సంహారించారని తెలుస్తోంది.)
హిరణ్యకశప సంహారం తరువాత కలియుగంలో స్వామి వారి పాదం పడిన స్థలం లోనే ప్రస్తుత ఆలయం నిర్మించబడినది.  
సమీపంలోని గ్రామం అయిన గొల్లపల్లి లో నివసించే ఒక గొల్ల వానికి విశేష పశు సంపద ఉండేది. 
అందులో ఒక గోవు ఉన్నట్లుంది పాలు ఇవ్వడం మానేసింది. 
అనారోగ్యమా లేక ఇంకేదైనా కారణమా అని యజమాని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేక పోయినది. పశువులు మేతకు అడవికి వెళ్లినప్పుడు ఏదన్నా జరుగుతోందా అన్న అనుమానంతో ఒకనాడు దానిని అనుసరించి వెళ్ళాడు. 
ధేనువు అరణ్యంలో ఒక పుట్ట వద్దకు వెళ్లి అందులోనికి పాలను వదల సాగింది. 
అది చూసిన యజమానికి అక్కడ ఏదో విశేషం ఉన్నదని అనిపించినది. 
తవ్వి చూసిన అతనికి అందులో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్య మంగళ రూపం, అక్కడే పెద్ద పాద ముద్ర  కనపడినది. 
శ్రీ వారి భక్తుడైన అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. 
ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి నియమంగా కొలువసాగాడు. 
ఒక నాటి రాత్రి నారసింహుడు అతనికి స్వప్నంలో క్షేత్ర విశేషాన్ని తెలిపారు. 
లోక కంటకుడైనా హిరణ్యకశపుని సంహరించి లోక కల్యాణం కొరకు భువిపైన మోపిన దివ్య స్థలంగా పెన్నఅహోబిలం, మానవ జీవితాలలో సకల శుభాలను ప్రసాదించే వానిగా శ్రీ నారసింహ స్వామీ పేరొందారు.  


ఆలయ విశేషాలు :

ఆనాడు గొల్ల పల్లి పెద్ద నిర్మించిన చిన్న ఆలయాన్ని విజయనగర రాజైన సదాశివ రాయలు పదహారవ శతాబ్దంలో తన జైత్ర యాత్రలో స్వామి వారి కృపతో లభించిన విజయానికి కృతజ్ఞతతో ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు. 
చిన్న గుట్ట మీద సువిశాల ప్రాంగణంలో ఉన్న ఆలయాన్ని చేరుకోడానికి తూర్పున, దక్షిణాన రాజ గోపురాలు, సోపాన మార్గం ఉన్నాయి. 

 

ప్రాంగణంలోనికి  అడుగు పెట్టగానే భక్తులను ఆకర్షించేవి ధ్వజస్తంభాలు. రెండు రాతివి. ఒకటి పంచ లోహ కవచంతో కప్పబడిన కలపది.  

పక్కనే సుందర కళ్యాణ మండపం ఉంటుంది. 
దక్షిణ దిశలో ఉన్న రాజగోపురం పక్కన శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం ఉంటుంది. 

ద్వజస్తంబాలకు, కళ్యాణ మండప స్థంబాలకు దశావతారాలను, నరసింహ, ఆంజనేయ రూపాలను అందంగా మలచారు.  


గర్భాలయంలో అమ్మవారిని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని రమణీయ పుష్పాలంకరణలో నయన మనోహరంగా దర్శనమిస్తారు శ్రీ నరసింహ స్వామి. 
మూల విరాట్టుకు పాదాల వద్ద స్వామి అడుగుతో పడిన గుంత ఉంటుంది. అభిషేక జలాలన్ని గుంత గుండా పెన్నా నదిలో కలుస్తాయని అంటారు.   







కొండ క్రింద అంజనా సుతుని ఉప ఆలయం ఉంటుంది. 

గుట్ట చుట్టూ ఎన్నో రాతి మండపాలు యాత్రీకుల సౌకర్యార్ధం నిర్మించబడినాయి. 


ఆలయ పుష్కరానికి సమీపంలో కొద్దిగా క్రిందకు ఉన్న  శ్రీ ఉద్భవ మహా లక్ష్మి ఆలయాన్ని మెట్ల మార్గం ద్వారా చేరవచ్చును. 


ప్రధాన రహదారి నుంచి ఆలయానికి వచ్చే బాటలో స్వాగత తోరణాన్ని దాటిన తరువాత  కొంత ఎత్తైన ప్రదేశంలో స్తంభాన్ని చీల్చుకొని అవతరించిన నారసింహుని ఎదురుగా నిర్ఘాంతపోతున్న హిరణ్యకశపుని, భక్తితో ప్రణమిల్లుతున్న ప్రహ్ల్లాదుని సుందరంగా మలచారు.






ప్రతి నిత్యం అనేక పూజలు, అర్చనలు, సేవలు నియమంగా జరుగుతాయి. ఏప్రిల్ నెలలో అతి వైభవంగా రథ యాత్ర నిర్వహిస్తారు. 
కళ్యాణ క్షేత్రమైన పెన్నఅహోబిలంలో చుట్టు పక్కల గ్రామాలు, జిల్లాల వాసులే కాకుండా కర్నాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు తరలి వచ్చి తమ బిడ్డల వివాహాలను జరుపుకొంటారు.   




ప్రధాన రహదారికి అటు పక్కన లోయ లాంటి ప్రదేశంలో కొండ గుహలో స్వామివారి రూపం, దగ్గరలోనే పెద్ద పాద ముద్ర ఉంటాయి. 
నరసింహ స్వామీ ఇక్కడ వరాహ రూపంలో ఉన్న ఒక రాక్షసుని సంహరించారని చెబుతారు. 
యిరువురికి జరిగిన పోరులో స్వామి  రాక్షసుని అదిమి పెట్టినపుడు రాళ్ళలో పడిన కోరల, గిట్టల ముద్రలను చూడవచ్చును. 








లోకాలను కాపాడే లోకరక్షకుడైన శ్రీ హరి మరో నిలయమైన పవిత్రమైన పెన్న అహోబిలం మన రాష్ట్రంలోని అనంతపురం పట్టణానికి ముఫై కిలో మీటర్ల దూరంలో, ఉరవ కొండకు సమీపంలో ఉంటుంది.
అనంతపురం నుండి సులభంగా చేరుకోనవచ్చును.
అనతపురానికి రాష్ట్రం లోని అన్ని పట్టణాలనుండి నేరుగా చేరుకోనడానికి రైలు, బస్సులు ఉన్నాయి.
యాత్రికులకు కావలసిన సదుపాయాలూ లభిస్తాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...