26, అక్టోబర్ 2013, శనివారం

SUKHANA LAKE

                                     సుఖన లేక్ , చండీఘర్ 


ఆధునిక భారత దేశంలో ఒక ప్రణాళికతో నిర్మించబడిన రెండు ముఖ్య పట్టణాలు భువనేశ్వర్ మరియు చండీఘర్. 
పురాణ కాల చరిత్ర కలిగిన భువనేశ్వర్ క్రొత్త హంగులతో స్వాతంత్రానంతరం ఒడిష రాష్ట్ర రాజధానిగా రూపు దిద్దుకోన్నది. 
కాని కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్ మాత్రం పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది. 
వరసకు సోదరులైన ఇద్దరు స్విస్ దేశస్తులు "లి-కొర్బూసియర్" మరియు "పియరీ - జియన్నరెత్" ల తో పాటు పి. యల్.  వర్మ నేటి చండీఘర్ రూపకర్తలు. 
  

లి-కొర్బూసియర్ ( Le-corbusier ) 1887 - 1965

యూరప్, అమెరికా, భారత దేశాలలో ఎన్నో నిర్మాణాలకు రూపకల్పన చేసిన వాడు లి-కొర్బూసియర్. 
ముఖ్యంగా ప్రజల సౌకర్యార్ధం, భావి తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాలికాబద్దంగా ఆధునిక నగరాల నిర్మాణంలో ప్రపంచ ప్రసిద్ది పొందిన వాస్తు శిల్పి. 
సముద్రంలో ఈతకెళ్ళి మృతి చెందాడు. 

  పియరీ - జియన్నరెత్ ( Pierre Jeanneret ) 1896 - 1967 

లి-కొర్బూసియర్ కి  వరసకు సోదరుడైన "పియరీ - జియన్నరెత్" అతనితో కలిసి ఎన్నో పేరొందిన నిర్మాణాలలో పాలు పంచుకొన్నాడు. 
ముఖ్యంగా చండీఘర్ రూపకల్పనలో వీరి పాత్ర చెప్పుకోదగినది. 
పియరీ చండీఘర్ తో విడదీయలేని భందాన్ని ఏర్పరచుకొన్నాడు. 
మరీ ఎక్కువగా సుఖానా సరోవరంతో !
ఎంతగా అంటే జీవిత చరమాంకంలో తాను నిర్మించిన పట్టణంలోనే ఉండిపోయాడు. 
 చివరి కోరిక మేరకు ఆయన చితాభశ్మాన్నిసుఖానా సరోవరంలో నిమజ్జనం చేసారు. 

సుఖానా సరోవరం :

ఎంతో ముందు చూపుకలిగిన రూపకర్తలిద్దరూ నగర ప్రజల ఉదయ, సాయంత్రాలు మనోహరంగా ఉండటానికి ఈ సరోవరాన్ని నిర్మించారు. 
1958వ సంవత్సరంలో శివాలిక్ పర్వతాల నుండి వర్షాకాలంలో పారే నీటి ప్రవాహంతో ఈ మానవ నిర్మిత సరోవరాన్ని నిర్మించారు. 
మానవ నిర్మిత జలాశయాల్లో పేరెన్నిక పొందిన వాటిల్లో సుఖానా ఒకటి. 
1974వ సంవత్సరంలో కొండలనుండి ఉద్భవించే జల ప్రవాహాన్ని వ్యవసాయ మరియు ఇతర అవసరాల నిమిత్తం పక్కకు మల్లించడంతో ఈ జలాశయము పూర్తిగా వర్షాల మీద ఆధార పడింది. 

    వివిధ కాలుష్యాల బారినుండి సరోవరాన్ని కాపాడటానికి స్థానిక ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకొంటోంది. 
కాళ్ళతో తొక్కుతూ నడిపే పడవలకు తప్ప చమురుతో నడిచే వాటికి ఇక్కడ స్థానం లేదు. అదే విధంగా చేపల వేట నిషేధం. 
చండీఘర్ వాసులకు సుఖానా సరోవారంతో చెప్పలేని అనుబంధం ఉన్నది. 
ఉదయాన్నే ఎందరో ఇక్కడ నడకతో తమ రోజును ప్రారంభిస్తారు. 
సాయంత్రాలు భార్యా పిల్లలతో వచ్చి కులాసాగా గడిపి వెళతారు మరెందరో. 
శీతాకాలంలో దేశ విదేశ పక్షులు ఇక్కడ తమ తాత్కాలిక బస ఏర్పాటు చేసుకొంటాయి. 
సాయం సంధ్యా సమయంలో పడవను నెమ్మదిగా నడుపుతూ అస్తమించే సూర్యుని చూస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ గడపటంతో  అనిర్వచనీయమైన మధురానుభూతులను మది నిండా నిండి పోతాయి. 
సరోవర తీరాన అన్ని రకాల వస్తువుల, తినుబండారాల దుకాణాలు ఉంటాయి. 
మనిషిని కూర్చోపెట్టి క్షణాలలో రేఖాచిత్రాన్ని గీసి చేతిలో పెట్టె చిత్రకారులెందరో ఉంటారిక్కడ. 






 పిల్లలకు ఆడుకోటానికి ఎన్నో ఏర్పాట్లు చేసారు. 
నిత్యం ఎదుర్కొనే శబ్ద, వాయు కాలుష్యాలనుండి కాపాడుకోడానికి, ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు గడపటానికి సుఖానా సరోవరానికి మించినది లేదు. 
ఇక్కడికి సమీపంలోనే చండీఘర్ లో ప్రసిద్ది చెందినా మరో ఆకర్షణ అయిన రాక్ గార్డెన్ ఉంటుంది. 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...