26, అక్టోబర్ 2013, శనివారం

KALKA

                          శ్రీ కాళీమాత కొలువుతీరిన కల్కా 

అసురులను అంతం చేసి ముల్లోకాలను కాపాడిన లోకపావని, ముగురమ్మల రూపం అయిన శ్రీ కాళికా దేవి కోరి కొలువుతీరిన ప్రదేశం "కల్కా". 



పురాణ గాధ :

కృత యుగంలో క్రూరులైన రాక్షసులు దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుండేవారు. 
వారి భాదను తట్టుకోలేక అంతా కలసి కైలాసానికి వెళ్లి సర్వేశ్వరుని శరణుకోరారు. 
ఆయన వారికి అభయం ఇవ్వగలిగినది శక్తిస్వరూపిణి అయిన కాత్యాయని అని తెలిపారు. 
అంతట వారంతా తమ స్తోత్రపాఠాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకొని, తమను లోకకంటకులైన  కిరాతకుల బారి నుండి కాపాడమని కోరారు. 
ప్రసన్నురాలైన పరాశక్తి పసిపాపగా మారి , క్షణాలలో లోక భీకర రూపం ధరించారు. 
అప్పుడు మహా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, శంకరుడు త్రిశూలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు తన పాశాన్ని, యిలా అందరూ తమ ఆయుధాలను, శక్తులను ఆమెకు యిచ్చారు. 
పరిపూర్ణ శక్తిమంతురాలైన కాళికగా మారిన జగజ్జనని దుష్టులను తుదముట్టించి లోకాలకు ఆనందాన్ని ప్రసాదించారు. 
అంతట సమస్త ప్రజల కోరిక మేరకు అక్కడే కొలువుతీరారు. 
కాలగమనంలో ఈ క్షేత్రం మరుగున పడిపోయినది.
ద్వాపర యుగంలో ఈ ప్రాంతం మత్స్య రాజ్య రాజధాని అయిన విరాట నగరంగా పిలవబడినది. 
మాయ జూదంలో ఓడిపోయిన  పాండవులు జూద నిబంధనల ప్రకారం పన్నెండు ఏళ్ళు వనవాసము చేసిన తరువాత సంవత్సరం పాటు అజ్ఞాత వాసం గడపటానికి విరాట్ నగరాన్ని ఎంచుకొన్నారు.
మారు వేషాలలో విరాట రాజు కొలువులో చేరారు.
విరాట రాజుకు ఉన్న గోసంపద ఎంతో ప్రసిద్ది చెందినది.
ఆ గోవులలో శ్యామ అనే ధేనువు రాజ కుటుంబానికి ప్రీతిపాత్ర మైనది.
అకస్మాత్తుగా అది పాలు ఇవ్వడం మానేసినది.
ఎన్నో వైద్యాలు, చక్కని ఆహరం పెట్టినా పలితం లేకపోవడంతో రాజు గారు మేతకు వెళ్ళిన సమయంలో ఏదన్నా జరుగుతోందా అన్న అనుమానంతో " తంత్రీపాలకుడు" అన్న పేరుతొ గోపాలకునిగా ఉన్న సహదేవుని ఆవును అనుసరించి విషయాన్నీ తెలుసుకోమని ఆదేశించారు.
అతను "దామ గ్రంధి " అన్న పేరుతొ అశ్వ పాలకునిగా ఉన్న సోదరుడు నకులుని సహాయం తీసుకొన్నా పలితం లేకపోయింది.
అప్పుడు సోదరుల బాధ తెలుసుకొన్న బృహన్నల రూపంలో ఉన్న అర్జనుడు ఒక నాడు ఆవుని అనుసరించాడు.
ఆ గోవు అడవిలోకి వెళ్లి ఒక పుట్ట వద్ద నిలబడగానే పొదుగులో నుండి పాలు ధారగా కారి పుట్టలో పడసాగాయి.
అది చూసిన పాండవ మధ్యముడు అక్కడ ఏదో మహత్యం ఉన్నది అని అర్ధం చేసుకొని పుట్టను తొలగించి చూశాడు.  
అక్కడ లింగ రూపంలో కొలువు తీరిన శ్రీ కాళికా మాతను చూసి తన అదృష్టానికి ఆనందించి రాజ సహకారంతో మందిరాన్ని నిర్మించారు.
నాటి నుండి నేటి వరకు ఎన్నో రాజ వంశాలు, యోగులు, ప్రజలు అమ్మవారిని సేవించుకొని, ఆమె కృపాకటాక్షాలకు పాత్రులవుతున్నారు.
శ్రీ కాళికాదేవి కొలువుతీరిన క్షేత్రం "కాళికా పురి" గా పిలవబడి తదనంతరం "కల్క"గా మారింది.






ఆలయ విశేషాలు :

కల్కా పట్టణ ప్రధాన రహదారిలో ఉంటుందీ మందిరం. 
కాలక్రమంలో ఆధునీకరణను సంతరించుకొన్న ఈ మందిర ప్రవేశ ద్వారం ఉత్తరం వైపు ఉంటుంది. 
మందిరానికి సమీపంలో ఎన్నో పూజా సామాగ్రి దుకాణాలుంటాయి. 
ప్రవేశ ద్వారం మీద ప్రధమ పూజితుడైన వినాయకుడు ఉంటాడు. 
మందిర ప్రాంగణంలో ఐదడుగుల ఎత్తైన శివలింగం, పాతిక అడుగుల కాళికా దేవి మూర్తి ఉంటాయి. 

చిన్నదైన గర్భాలయంలో లింగ రూప శ్రీ కాళికా దేవి కొలువుతీరి భక్త జనుల పూజలను స్వీకరిస్తుంటారు.  
పడమర దిశగా ఉన్న ఈ ప్రధాన మందిరంలో తదనంతర కాలంలో ప్రతిష్టించబడిన దేవీ మూర్తులు కూడా ఉన్నాయి. 
మందిరంలోనికి కెమెరా తీసుకొని వెళ్ళరాదు. 
రహదారిన వెళ్ళే భక్తుల కొరకు బయటి దాకా డిజిటల్ స్క్రీన్ మీద మూల విరాట్టుకు జరుగుతుండే పూజలను ప్రసారం చేస్తుంటారు. 



ప్రతి నిత్యం ఎన్నో పూజలు అమ్మ వారికి జరుగుతాయి. 
గణపతి, దేవి నవరాత్రులలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 
శ్రావణ,కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు.   
దుష్ట గ్రహ భాదలు తొలగి పోవాలని జీవితం సుఖంగా సాగాలని కోరుకొంటూ ఎందరో శ్రీ కాళి మాతను సందర్శించుకొంటూవుంటారు. 
ఇంతటి పురాణ ప్రసిద్దమైన కల్కా, చండీఘర్ కు నలభై కిలో మీటర్ల దూరంలో సిమ్లా వెళ్ళే దారిలో ఉంటుంది. 
పక్కనే ఉన్న "పరవానూ" లో ఒక పురాతన శివ మందిరం ఉన్నది.








  1964 లో పునరుద్దరించబడిన ఈ మందిరంలో పురాతన శివ లింగంతో బాటు శివ పార్వతుల, రాధా కృష్ణుల, సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామ, శ్రీ కాళికా దేవి, శ్రీ షిరిడి సాయి బాబా ఆదిగా గల దేవి దేవతల పాలరాతి విగ్రహాలను ప్రతిష్టించారు. 



1 కామెంట్‌:

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...