25, ఆగస్టు 2013, ఆదివారం

perunad ( RANNY )


కార్తీక మాసం నుండి మన రాష్ట్ర నలుమూలల, గ్రామ గ్రామాన మాల ధరించిన అయ్యప్ప భక్తులు కనిపిస్తారు.
నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడి ధరించి పుణ్య క్షేత్ర దర్శనం చేసుకొంటూ శబరిమల చేరుకొంటారు.
పరశు రామ భూమి అయిన కేరళలో ఆయనే ప్రతిష్టించిన నూట ఎనిమిది శ్రీ ధర్మ శాస్త ఆలయాలున్నాయి.
అవన్నీ యుగయుగాల పౌరాణిక గాధలకు, శతాబ్దాల చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యాలు.
కానీ వాటికి దక్కని ఒక గొప్ప గౌరవం పదో శతాబ్దంలో నిర్మించిన ఒక ఆలయానికి దక్కటం విశేషం.
అదే కక్కట్టు కోయిక్కాల్ శ్రీ ధర్మశాస్తా ఆలయం.




ఈ ఆలయము శబరిమల ఆలయం తో పాటు ఒకేసారి నిర్మించబడినది. 
దీనికి సంభందించిన గాద పదో శతాబ్దానికి చెందినదిగా తెలుస్తోంది. 
మహిషి సంహారం తరువాత శ్రీ అయ్యప్ప శబరిమల మూలవిరాట్టులో  ఐక్యం అయిన తరువాత ఆయన ఆనతి మేరకు పందల రాజు శబరిమల ఆలయ నిర్మాణం ఆరంభించారు. 
నిర్మాణ సమయంలో రాజు ఇక్కడే బస చేసారట. గ్రామ ప్రజలందరూ నిర్మాణపు పనులలో పాలుపంచుకొన్నారు. వారందరికీ నాయకులుగా శివ వెళ్లల కులానికి చెందిన పిళ్ళై సోదరులు వ్యవహరించారు. 
వారి దైవ భక్తికి, సహాయ సహకారాలకు సంతోషించిన రాజు వారి కోరిక మేరకు శబరిమల ఆలయ నిర్మాణంలో మిగిలిన సామానులతో ఇక్కడ శ్రీ ధర్మశాస్త కు, కొద్ది దూరంలో శ్రీ మాలికా పురతమ్మ అమ్మవారికి విడివిడిగా ఆలయాలు నిర్మించి వారికి అప్పగించారు. 
సోదరులలో పెద్ద వాడు ఇక్కడే స్థిర పడగా రెండో వాడు ఎరుమేలి తరలిపోయాడు. అక్కడి పూతన్ వీడు లో ఉన్న శ్రీ అయ్యప్ప కరవాలాన్ని సంరక్షించే పనిలో ఉండిపోయాడు. నేటికి అది వీరి వంశం ఆధీనంలోనే ఉన్నది. 
గ్రామంలో స్థిరపడిన పెద్ద వాడి వారసులు ఇక్కడి ఆలయ నిర్వహణ చేస్తున్నారు. 
పెరునాద్ ( PERUNAD ) గ్రామ కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో పంబా, కక్కాద్ నదుల సంగమ తీరంలో, ప్రశాంత ప్రకృతికి ప్రతి రూపాలుగా ఈ రెండు ఆలయాలు ఉంటాయి. 
రహదారికి కొద్దిగా పల్లపు స్థలంలో ఉంటుంది స్వామి ఆలయం. 
పైన నిర్మించిన స్వాగత ద్వారం దాటిన తరువాత దిగువన విశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం కనపడుతుంది. 
తూర్పు ముఖంగా ఉన్న ప్రాంగంలోనికి ఉత్తరంలో ఉన్న మార్గంగుండా వెళితే కేరళ సాంప్రదాయ నిర్మాణాలు చాలా ఉంటాయి. ఒక దానిలో ఆలయ కార్యక్రమ నిర్వాహణా కేంద్రం ఉన్నది. 
పక్కనే ఎతైన మండపం, ప్రక్కనే ధ్వజస్తంభం, బలి పీఠం తరువాత ప్రధాన ఆలయంలోనికి వెళ్ళడానికి ద్వారం ఉంటాయి. 
రాతితో నిర్మించిన చతురస్రాకార గర్భాలయంలో శ్రీ ధర్మ శాస్తా రమణీయ చందన, పుష్పఅలంకరణతో నేత్ర పర్వంగా భక్తులకు దర్శనమిస్తారు. 
ప్రతి నిత్యం ఉదయం ఐదున్నరకు తెరచి మధ్యాహాన్నం పన్నెండు గంటల దాక తిరిగి సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి తొమిదిన్నర వరకూ తెరిచివుండే ఈ ఆలయంలో నియమంగా పూజలు, ఆర్జిత సేవలు జరుగుతాయి. 
కాక్కట్టు కోయిక్కాల్ ఆలయంలోని ప్రత్యేక విశేషమేమిటంటే పందల రాజ మందిరం నుండి సన్నిధానం తీసుకువెళ్ళి మకర సంక్రాంతికి హరిహర సుతునికి అలంకరించే తిరువాభరణాలను అక్కడ ఉత్సవాలు పూర్తయిన తరువాత పందలానికి తిరిగి తీసుకొనివెళ్ళే సమయంలో వాటిని ఇక్కడి స్వామికి అలంకరిస్తారు. 
ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఒకటో తారీఖున జరుగుతుంది. చుట్టు ప్రక్కల గ్రామాలనుండి వేలాదిగాభక్తులు ముఖ్యంగా మహిళలు తరలి వస్తారు. 
శబరిమల తరువాత తిరువా భరణాలను ధరించేది ఇక్కడి శ్రీ ధర్మ శాస్తానే!
ప్రాంగణంలో ఎన్నో ఉప ఆలయాలు ఉన్నాయి. 
ధ్వజస్తంభం 

శ్రీ వినాయక 

బ్రమ్హ రాక్షస 



నాగ దేవత 

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర 

ఆది దంపతులు 

నంది 

అమ్మవారి వాహనం సింహం 
ఆలయ ఉత్సవాలు నిర్వహించడానికి ఒక మండపం కూడా ఉన్నది. 
స్వామి ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ మాలికా పురతమ్మ ఆలయం ఉన్నది. 
రహదారి నుండి దిగువకు ఉన్న మెట్ల మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చును. 
పురాతన నిర్మాణం శిధిలం కావడంతో ఈ నూతన ఆలయాన్ని కమిటి భక్తుల విరాళాలతో నిర్మించినట్లు తెలుస్తోంది. 




ఆలయం వెనుక పారుతున్న పవిత్ర పంబా నది 

శ్రీ మాలికా పురతమ్మ 
చిన్నదైన ఈ ఆలయంలో శ్రీ మాలికా పురతమ్మ సర్వాలంకృత భూషితగా కరుణ కటాక్ష వీక్షణాలను భక్తులపైన కురిపిస్తుంది. 
ఇక్కడ కూడా శ్రీ గణేశ. నాగ, రాక్షస, శివ, ఉపాలయలున్నాయి. 
శబరిమల యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా దర్శించవలసిన చారిత్రక ప్రాధాన్యం గల క్షేత్రమిది. 
పత్తనమ్తిట్ట నుండి పంబకు వెళ్ళే మార్గంలో పెరునాద్ వస్తుంది. పంబకు వెళ్ళేప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని  సులభంగా దర్శించుకొనే అవకాశం ఉన్నది. 
స్వామి శరణం ! అయ్యప్ప శరణం !



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...