14, ఆగస్టు 2013, బుధవారం

Mannar poluru

ఎన్నో అరుదైన ఆలయాలకు నిలయమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుత ఆలయమే మన్నార్ పోలూరు లోని శ్రీ సత్యభామ జాంబవతి సమేత అలఘు మల్లరు కృష్ణ స్వామి ఆలయం.
శ్రీ కృష్ణుడు రాధాదేవితో, రుక్మిణితో, సత్యభామతో కలిసి కొలువు తీరిన దివ్య ధామాలెన్నొ ఉన్నాయి.
కాని జాంబవతి దేవితో కలిసి వెలసిన క్షేత్రం ప్రపంచంలో ఇదొక్కటే!
మరో విశేషమేమిటంటే తొలిసారిగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించినది మాధవుని మామగారైన జాంబవంతుడే అని అంటారు.
దీనికి కారణం కృష్ణుని కళ్యాణం జాంబవతితో జరగడానికి తరువాత సత్యభామతో జరగడానికి మూలం ఈ క్షేత్రం.
సత్రాజిత్ మహారాజుకు సూర్య భగవానుడు అనుగ్రహించిన శమంతక మణిని ధరించి అతని సోదరుడు ప్రసేనుడు వేటకు వెళ్ళాడు.
అక్కడ ఒక సింహం అతనిని సంహరించి మణిని తీసుకు పోతుండగా జాంబవంతుడు దానిని చంపి మణిని తన కుమార్తెకు ఇచ్చాడట.
సోదరుడు కనిపించక పోవడంతో మణిని ఇవ్వ నిరాకరిచడంతో గోపాలుడే తన తమ్ముని వధించి మణిని తీసుకొని పోయాడని ప్రచారం చెయ్య సాగాడు సత్రజితు.
వినాయక చవితినాడు పాల గిన్నెలో చంద్రుని చూడటం వలన ఈ నీలాపనింద వచ్చిందని అర్ధం చేసుకొన్న నీల మేఘ శ్యాముడు అడవికి వెళ్ళాడు.
అక్కడ అడుగు జాడల ఆధారంగా జాంబవంతుని గుహ చేరారు.
మణిని ఇవ్వదానికి అంగీకరించని భల్లుక రాజుతో ఇరవై ఒక్క రోజులు మల్ల యుద్ధం చేసి అతనిని ఓడించారు.
శక్తి హరించుకు పోయిన జాంబవంతునికి త్రేతాయుగం లోని శ్రీ రాముడే నేటి శ్రీ కృష్ణుడు అని తెలుసుకొని స్తోత్ర పాఠాలు చేసి మణితో పాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు.
నిజం తెలుసుకొన్న సత్రాజిత్ క్షమాపణలు కోరుకొని తన పుత్రిక సత్యభామను ఇచ్చి కళ్యాణం జరిపించాడు.




















ఈ సంఘటనలకన్నింటికి ఈ క్షేత్రమే కారణం కావటాన అలఘు మల్లహరి పోరు ఊరు అని పిలిచేవారు. అంటే అందమైన శ్రీ హరి మల్ల యుద్ధం చేసిన స్థలం అని అర్ధం. క్రమంగా మన్నారు పోలూరు గా మారినది. 
స్వామి వారు తన  పై మోపబడిన నిందను తొలగించుకొని విజయులై తిరిగి రావడమే కాక మణిని మాణిక్యాల లాంటి భార్యలను సంపాదించుకొన్న స్థలం. అందుకే దీనిని నీలాప నిందా పరిహార క్షేత్రం గా అభివర్ణిస్తారు. 
మన్నారు పోలూరు ఎన్నో పురాణ గాధలకు సంభందించిన ప్రత్యక్ష రూపం. 
మన్నారు పోలూరు గర్వ భంగ క్షేత్రం గా కూడా ప్రసిద్ది. 
వాస్తవాలు తెలీక బల గర్వంతో అవతార పురుషునితోనే యుద్దానికి తలపడి భంగపడ్డాడు జాంబవంతుడు. 
అదే గర్వంతో నిత్యం స్వామి వారి సేవలో ఉండే గరుత్మంతుడు కూడా భంగ పడ్డాడు. ఆ సంఘటన ఇక్కడే చోటుచేసుకోన్నది. 

గరుత్మంతుని గర్వభంగం 









వైకుంఠ వాసుని తన మూపున ఉంచుకొని ముల్లోకాలు తిరిగే తనకన్నా బలవంతుడు, భక్తుడు లేడన్న గర్వాన్ని అంతర్గతంగా కలిగి ఉన్న విషయాన్ని గ్రహించిన అంతర్యామి అతనికి తగిన గుణపాఠాన్ని నేర్పాలనుకొన్నారు. 
ఇరువురు దేవేరిలతో జరగనున్న తన వివాహానికి రమ్మని తన మాటగా కదలీ వనంలో తపస్సు చేసుకొంటున్న హనుమంతునికి తెలుపమని వైనతేయుని ఆజ్ఞాపించారట. 
రివ్వున యెగిరి రామనామ ధ్యానంలో ఉన్న ఆంజనేయుని వద్ద వాలాడు . 
ఎన్ని మార్లు పిలిచినా పలకక పోవడంతో ఆగ్రహంతో పెద్దగా అరుస్తూ కుదిపాడట. 
అతని చర్యకు కనులు తెరిచిన రామదూత తన చేత్తో అతని దవడ మీద ఒక దెబ్బ కొట్టారట. 
దానితో ప్రాణం దిమ్మెర పోగా అక్కడినుండి ఇక్కడకు వచ్చి పడ్డారట పక్షి రాజు. 
పైన ఉన్న గరుత్మంతుని విగ్రహం యొక్క ఎడమ దవడ వాచి ఉండటం స్పష్టంగా కనపడుతుంది. 
వాచిన దవడతో కన్నీరు కారుస్తూ ఎదుట నిలుచున్నా గరుడుని ఓదార్చి స్వామి అతనితో మరోసారి  వెళ్లి వాయు నందనునితో శ్రీ రాముడు సుగ్రీవునితో, జటాయువుతో ఇష్టాఘోస్టి సలుపుతున్నారు అని తెలుపమన్నారు. 
శ్రీవారి ఆజ్ఞను కాదనలేక గరుత్మంతుడు తిరిగి బయలుదేరి విషయం తెలుపగానే మనోజుడు వాయు వేగంతో ఇక్కడికి చేరుకోన్నారట. 
ఈ సంఘటనకు నిదర్శనముగా ముఘమందపంలో జయ విజయుల ప్రక్కన సుగ్రీవుని మరియు రావణాసురుని ఖడ్గ ఘాతానికి ఒక రెక్క కోల్పోయిన జటాయువుని విగ్రహాలను ఉంచారు. 








సుగ్రీవుడు 

జటాయువు 




ఈ క్షేత్రానికి చేరుకొన్న కేసరీ నందనుడు దశరధ నందనునికి ప్రమాణం చేసి పాదాల చెంత కూర్చొని ప్రక్కనే ఉన్న సత్యాదేవిని సీతా మాతగా దర్శనం ప్రసాదించమని కోరాడు. 
సౌందర్య ధన అహంకారాలు గల ఆమె ఎంతో ప్రయత్నించి చివరికి గోదాదేవిగా మారింది. 
గర్భాలయంలో సత్య భామను గోదాదేవి ( ఆండాళ్ ) అలంకరణలో చూడవచ్చును. 
అలా స్వామి గరుడునికి, సత్యా దేవికి తగిన విధంగా గర్వభంగం కావించారు. 
అంతట అక్కడే ఉన్న రుక్మిణి దేవి శ్రీ వారి అనుమతితో జానకి దేవి రూపంలో దర్శనమిచ్చారు. 
గర్భాలయానికి కుడి ప్రక్కన ఉన్న ఉపాలయంలో ఆమె సుందరవల్లీ తాయారుగా కొలువై ఉంటారు. 
తన అదృష్టానికి పొంగిపోయిన ఆంజనేయుడు ఈ పవిత్ర స్థలంలో స్థిర నివాసం ఏర్పరుచుకొన్నారు. ఈ సంఘటనకు గుర్తుగా ఆలయ ఉతర భాగంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ చంద్రుని ఎదురుగా ధ్వజస్థంభం వద్ద దాసాంజనేయుని సందర్సిన్చుకోవచ్చును. 












గర్భాలయంలో సత్యా, జాంబవతి సమేత శ్రీ కృష్ణ స్వామి చతుర్భుజాలతో శంఖం, చక్రం వేణువుతో సుందర పుష్పాలంకరణతో నేత్ర పర్వంగా స్తానక భంగిమలో కొలువై ఉంటారు. 








ఉపాలయాలలో శ్రీ వేంకటేశ్వరుడు, గోదా దేవి, శ్రీ రామానుజాచార్యులు, ఉంటారు. 
ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు జమ్బవంతుడే!
ఎదుకంటే ఇది ఒకప్పుడు ఆయన నివాసమైన కొండ గుహ. అల్లునికి కుమార్తెకు తొలి ఆలయాన్ని ఆయనే నిర్మించారట. గర్భాలయం వెనుక వినమ్రంగా చేతులుజోడించి దేవ దేవుని తన అల్లునిగా చేసుకొన్నందుకు ఆనందంతో ఉన్న జాంబవంతుని చూడవచ్చును. 






జాంబవంతుడు 




కాలక్రమంలో ఆయన నిర్మించిన ఆలయం శిధిలంకాగా చాల మార్లు పునర్నిర్మించ్చారు. 
ప్రస్తుత ఆలయాన్ని ఎమిదో శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారని లభించిన ఆధారాల మూలంగా తెలుస్తోంది. 





రాజ వంశాల చిహ్నాలు 




ఆలయ ప్రాంగణము 

విమానము 

శ్రీ ఆంజనేయుని ఉపాలయం 



శ్రీ రామాలయం 

నారాయణ 

అరుదైన రాధా కృష్ణుల మూర్తి 

విష్వక్సేన 


ఆళ్వారులు మరియు వైష్ణవ గురువులు 


నర 


ఆలయ బావి 



చోళులు, పాండ్యులు, పల్లవులు, విజయనగర రాజులు, కాకతీయులు, ఇలా ఎన్నో రాజ వంశాలు అలఘు మల్లారి శ్రీ కృష్ణ స్వామి వారిని సేవిన్చుకోన్నాయని తెలుస్తోంది. 
ముఖ్యంగా నెల్లూరును పాలించిన తెలుగు చోడ వంశ పాలకులలో ప్రసిద్ధుడైన మనుమసిద్ది కాలంలో ఈ క్షేత్ర ప్రాశత్యం నలుచెరగులా వ్యాపించినది. 
ప్రస్తుతం పర్యాటక శాఖ నిర్వహణలో ఉన్నప్పటికి అభివృద్ధి నామ మాత్రమే అని చెప్పాలి. 
ఈ అరుదైన ఆలయాన్ని గురించి చేయాల్సిన స్థాయిలో ప్రచారం జరగడంలేడనే చెప్పాలి. 
ధనుర్మాసం, కార్తీక మాసంలో పూజలు, వైకుంఠ ఏకాదశి, శ్రీ రామనవమి, జన్మాష్టమి, గ్రామ ప్రజలు సమిష్టిగా జరుపుకొంటారు. ఆలయ క్షేత్ర గాధతో సంభంధం ఉన్న వినాయక చవితి మరియు దీపావళికి  ప్రత్యేకంగా సంబరాలు నిర్వహిస్తారు. 
శ్రీ కృష్ణుడు సత్యా జాంబవతి లతో కొలువుతీరిన ఒకే ఒక్క క్షేత్రంగా, ఎన్నో పురాణ గాధలకు సాక్షిగా ఉన్న శ్రీ అలఘు   మల్లారి కృష్ణ స్వామి ఆలయం మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా లోని సూళ్ళురు  పేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సూళ్ళూరు  పేటకు దేశంలోని అన్ని ముఖ్య నగరాల నుండి రైలు సౌకర్యం కలదు. యాత్రికులకు కావలసిన సదుపాయాలు సూళ్ళూరుపేటలో లభిస్తాయి. 









ఆలయ పూజారి శ్రీ మురళీ కృష్ణన్ సమీపంలోనే నివసిస్థారు. ఆలయ విశేషాలను చక్కగా వివరిస్తారు. 

కృష్ణం వందే జగద్గురుం !!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...