27, ఏప్రిల్ 2013, శనివారం

Budagavi

బూదగవి అనంతపురం జిల్లాలో ఉరవకొండ మండలంలో ఉన్నది.
చుట్టూ పర్వతాలతో, పంటపొలాలతో అచ్చమైన రాయలసీమ గ్రామీణ వాతావరణానికి నిదర్సనమైన బుదగవి గ్రామంలో చారిత్రక ప్రసిద్దిచెందిన రెండు పురాతన ఆలయాలున్నాయి.
ఒకటి అరుదైన సూర్య భగవానుని ఆలయం కాగా రెండవది శ్రీ రామ భక్త శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిది.
ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న వీటిని కర్నాటకాన్ని పాలించిన చాళుక్య రాజులు పదమూడవ శతాబ్దంలో  నిర్మించినట్ట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది.
సూర్య నారాయణునికి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అయిదు శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయాలలో ఇది మూడవది.
మొదటిది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, రెండవది కర్నూల్ జిల్లా నందికోట్కూర్ లో ఉన్నాయి. నాలుగవది తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడలో, ఐదవది హైదరాబాదులో ఉన్నాయి. 
నిరాదరణకు గురై శిధిలావస్థకు చేరుకొన్న ఆలయాన్ని విదేశాలలో స్థిరపడిన ఈ గ్రామస్తులు కొందరు పునర్నిర్మించారు.








 చాళుక్య రాజులు ఇక్కడ శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం నిర్మించడానికి కారణమైన పురాణ గాధ ఏది తెలియరావడం లేదు.
కాని ఆలయం ఎన్నో ప్రత్యేకతల నిలయంగా చెప్పుకోవాలి.
దేశంలోని అత్యంత పురాతన సూర్య దేవాలయాలో ఒకటి అయిన బుదగవి ఆలయంలో ప్రధాన అర్చనా మూర్తి లింగ రూపంలో ఉన్న సదాశివుడు.
ఈశ్వరుని అష్ట మూర్తులలో ఒకరైన ప్రత్యక్ష నారాయణుడు ఇక్కడ దక్షిణా ముఖునిగా కొలువై ఉంటారు.
దక్షిణ దిశకు అధిపతి యమధర్మరాజు. యముడు సూర్యుని కుమారుడు.
ఈ కారణంగా బుదగవి స్వామిని కొలిస్తే ఆరోగ్యము, ఐశ్వరం, అన్నింటా జయం కలగటమే కాక దీర్గాయువు లభిస్తుంది అన్నది తరతరాల నమ్మకం.
ప్రతి సప్తమి నాడు సూర్య నమస్క్రార సహిత సౌర హోమం భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తున్నారు.
ఆదిత్యుడు నమస్కార ప్రియుడు.
అందువలన ఓం నమో భగవతే సూర్యాయ నమః అన్న మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే మనోభీష్ట్టాలు నెరవేరుతాయి అన్నది కూడా స్థానిక నమ్మకం.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా కొంతకాలం ఉరవకొండ గ్రామంలో నివసించారు. ఆరోజులలో ఆయన ప్రతి నిత్యం బుదగవి ఆలయంలో పూజాదులు చేసేవారని శ్రీ సత్య బాబా జీవిత చరిత్రలో ఉదహరించబడినది.



సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఆలయంలో తూర్పు ముఖంగా ఉన్న ద్వారానికి ముందు రాతి స్థంభం, ఆలయ వృక్షమైన జమ్మి చెట్టు, గ్రామ దేవత ఉప ఆలయం ఉంటాయి. 
చిన్నదిగా ఉండే గర్భాలయంలో లింగరాజు చందన, వీభూతి, కుంకుమ అలంకరణతో దర్శన మిస్తారు. 
పక్కనే ఉన్న చిన్న ఆలయంలో ఉషా చాయా సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి ఏకశిలా రూపంలో నయన మనోహరంగా కొలువు తీరి వుంటారు. పీఠం వద్ద రధ సారధి అరుణుని, సప్తాశ్వాలను సుందరంగా మలచారు. 
ఎదురుగా దినకరుని అనుంగు శిష్యుడు అంజనా సుతుడు ఆంజనేయుడు సాష్టాంగప్రమాణం చేస్తున్న భంగిమలో ఉంటారు. 


సూర్య దేవాలయానికి చేరువలోనే వాయు నందనునికి ఒక ఆలయం ఉన్నది. దీనిని కూడా చాళుక్యులే నిర్మించినట్లు తెలుస్తోంది. 
శ్రీ అభయాంజనేయ స్వామి దక్షిణా ముఖునిగా అరుదైన భంగిమలో దర్శనమిస్తారు. 
ప్రాంగణంలో విఘ్ననాయకుడు, నాగ ప్రతిష్టలు ఉంటాయి. 







ప్రతి మాసం సప్తమి తిధి నాడు శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. 
రధ సప్తమి, శివ రాత్రి, దసరా నవ రాత్రులు, హనుమత్ జయంతి, శ్రీ రామ నవమి వైభవంగా జరుపుతారు. 
ఈ ఆలయాలు రెండు ప్రస్తుతం పురా వస్తు శాఖ వారి అధీనంలో ఉన్నాయి. 
చరిత్ర ప్రసిద్ది చెందినా ఈ రెండు ఆలయాలున్న బుదగవి అనంత పురం పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉర్వ కొండకు దగ్గరలో బళ్ళారి రోడ్లో ఉంటుంది.
ప్రతి పావు గంటకు ఒక బస్సు ఉన్నది.
అనంత పురంలో యాత్రికులకు కావలసిన అన్నిసదుపాయాలూ లభిస్తాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...