7, ఏప్రిల్ 2013, ఆదివారం

Vishu - Kerala ugadi

                               కేరళీయుల ఉగాది - విషు 

                                                                                                              = ఇలపావులూరి వెంకటేశ్వర్లు 

భారతదేశం లోని అన్ని రాష్ట్రాలు తమవైన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, ఆచార వ్యహారాలు కలిగివున్నాయి. 
ఉత్తరాదిన పక్కపక్కన ఉన్న రాష్ట్రాల సాంప్రదాయాలు దగ్గరగా ఉంటాయి
కానీ దక్షిణాదిన  ఉన్న నాలుగు రాష్ట్రాలు  విడివిడిగా తమవైన సాంప్రదాయాలు కలిగి ఉన్నాయి.
వీటిల్లో దేవతల స్వస్తలంగా పేరొందిన కేరళ మరింత భిన్నమైన ఆచార వ్యవహారాలకు నెలవు .
సుందర సాగర తీరాలు, పర్వత ప్రాంత విశ్రాంతి కేంద్రాలు, అరుదైన జంతుజాలాలతో నిండిన అభయాఅరణ్యాలు, ఉప్పుటేరులలో నౌకా విహారాలు, మనసును దోచే ప్రకృతి, ఆధ్యాత్మిక  భావాలు పెంచే  ప్రత్యెక ఆలయాలు,ఇలా  ఎన్నోఆకర్షణలతో దశాబ్దాలుగా  పర్యాటకులను ఈ పరశురామ భూమి ఆకర్షిస్తోంది.
ఇవే కాకుండా తనవైన సాంప్రదాయాలు,పండుగలతో కూడా అంతర్జాతీయంగా ఉత్తమ పర్యాటక కేంద్రం అనే ఖ్యాతిని సొంతం చేసుకొంది కేరళ.
భారతీయులనే కాక దేశవిదేశాల వారిని కూడా ఆకట్టుకునే విధంగా కొన్ని వందల సంవత్సరాల క్రిందట తమ పూర్వీకులు ఆరంభించిన పండుగులను నేటికీ అదే విధివిధానాలతో, అంతే స్ఫూర్తితో, ఒకరకంగా చెప్పాలంటే ఇనుమడించిన ఉత్సాహంతో జరుపుకొనడము అభినందనీయ విషయం.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కేరళ పండుగలు రెండు.
ఓనం మరియు విషు.

ఓనం

 పంటలు బాగా పండిన తరుణంలో ఎన్నో శతాబ్దాల క్రిందట తమనేలిన ఏలిక బలి చక్రవర్తి వస్తాడని,
తమ జీవితాలు సుఖ సంతోషాలతో సాగుతున్నాయని ఆయన స్వయంగా చూసి ఆనందంతో తిరిగి వెలతారన్న విశ్వాసంతో పది రోజుల పాటు రకరకాల ఆట పాటలతో రాష్ట్రమంతా ఒక్క కుటుంబంగా  మారి జరుపుకోనేదే ఓనం.

విషు 

కేరళీయుల ఉగాది విషు. 
ప్రతి సంవత్సరం మేష సంక్రాంతి రోజున కులమతాలకతీతంగా మలయాళీలందరూ కలిసి మెలిసి జరుపుకొనే విషు వెనుక ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్నది.
 ప్రజలు భగవద్భక్తితో ఈ పండగ భగవంతుడు తమకు సుఖ సంతోషాలను ప్రసాదించిన సందర్భంలో జరుపుకొనేదిగా ఎన్నో పురాణ గాధలను జోడించి వాటిని మననం చేసుకొంటూ ఉంటారు. 

 జ్యోతిష్య , ఖగోళ, శాస్త్రాల కలయిక 

విషు పండుగ తో జ్యోతిష్య , ఖగోళ, శాస్త్రాలు ముడిపడిఉన్నాయి.
ఉత్తరాయణ, దక్షిణాయన కాలాలలో సూర్య గమనంలో చోటు చేసుకొనే మార్పులను మన పూర్వీకులు సంపూర్ణంగా అధ్యనం చేసారు. వాటి ఆధారంగా గ్రహ గతులను నిర్దీకరించి  కాల నిర్ణయం, జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర అభివృద్ధి జరిగాయని తెలుస్తోంది. 
కేరళలో ఈ పండుగ వారి అధికారిక క్యాలెండర్ కొల్లవర్షం కన్నా ముందునుంచే చేసుకొంటున్న దాఖలాలు లభించాయి. 
ఈ రోజున సూర్యుడు తన ప్రయాణంలో తొలి మజిలీ అయిన మేష రాశి లోనికి ప్రవేశిస్తాడు. 
ప్రతి సంవత్సరంలో రెండు రోజులు భిన్నమైనవిగా నిర్ణయించబడ్డాయి. అది కూడా సూర్య గమనాన్ని బట్టి జరుగుతున్నది అన్న విషయాన్ని ఏనాడో ఖగోళ శాస్త్రవేతలు కనిపెట్టారు. 
వాటిలో జూన్ ఇరవై ఒకటి అత్యంత దీర్ఘమైన పగలు కలది గాను అలానే డిసెంబర్ ఇరవై ఒకటి అతి దీర్ఘమైన రాత్రి కలది గాను గుర్తించారు. మొదటిది ఉత్తరాయనంలోను, రెండవది దక్షిణాయనంలో  వస్థాయి. 
అదేవిధంగా ఏడాదిలో రెండు రోజులు సూర్యుడు భూమధ్య రేఖకు సమాంతరంగా తూర్పున ఉదయిస్తాడు. 
అవే తుల విషు మరియు మేడ విషు. 
ఏప్రిల్ వచ్చే మేడ విషు నాడే విషు పండుగ. ఇది ఉత్తరాయణ కాలం. 
ఆశ్విజ మాసం ( అక్టోబర్ - నవంబర్ ) లో అంటే దక్షిణాయనంలో వస్తుంది తుల విషు. 
నాడు జీవ నదిలో స్నానమాచరించడం, పిత్రు దేవతలకు తర్పణలు వదలడం కుటుంబానికి, వంశాభివృదికి మేలు చేస్తుంది అన్నది కేరళీయుల నమ్మకం.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేష రాశి ఉచ్చ రాశి. కార్తికేయుడు, చదువుల తల్లి  సరస్వతి దేవి, కుజుడు అధిదేవతలు.
ఈ రాశిలో వచ్చే అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రాలలో జన్మించినవారు అన్ని రంగాలలో ఉన్నత స్థానం చేరుకొంటారని అంటారు. 
విషు ఒక రోజు  పండుగ అయినా ప్రజలు  పది రోజులల పాటు  జరిగే ఓనం నాటి  ఉత్సాహాన్ని నింపుకొని జరుపుకొంటారు. 
.  

ఎన్నో ప్రత్యేకతల పండుగ  



విషు అంటే సమానం అని అర్ధం. 
దానికి తగినట్లే కులమతాల సంభందం లేకుండా ప్రజలందరూ సాంప్రదాయబద్దంగా, సమిష్టిగా పాలుపంచుకొంటారు
విషు కేరళ అంతటా జరుపుకొన్నా మలబారు ప్రాంతంలో మరింత ఘనంగా చేసుకొంటారు,
కేరళకు సమీపంలో ఉన్న కర్ణాటక ప్రాంతాలైన మంగళూరు, ఉడిపి మరియు తమిళనాడు లోని కొన్ని చోట్ల కూడా విషుని ప్రజలు సొంత పండుగ మాదిరి జరుపుకొంటారు. 
కొత్త సంవత్సరం ఎంతో మంచిని తెస్తుందని నమ్మే అందరి కలలకు ప్రతి రూపం విషు . మానవ సంభందాల అభివృధికి బాటలు పరుస్తుంది విషు. భూమిని నమ్ముకొన్నవారికి లోటులేదన్న సత్యాన్ని నిరూపిస్తుంది విషు. శాస్త్రాలపై మానవులకు ఉన్న నమ్మకాన్ని దృడం చేస్తుంది విషు. మానవ ప్రయత్నానికి దైవ కృప కావాలన్న పురాణ వాక్యానికి ప్రత్యక్ష నిదర్శనం విషు. 


పౌరాణిక ప్రాముఖ్యం 

స్థానికంగా విషు గురించి రెండు వేరు వేరు యుగాలకు సంభందించిన గాధలు వ్యాప్తిలో ఉన్నాయి. 
దిక్పాలకులను, గ్రహాలను తన అధీనంలో ఉంచుకొన్న రావణా బ్రహ్మ సూర్య గమనాన్ని ఎంతో ప్రభావితం చేసాడట. రామ బాణానికి అతడు నేలకు ఒరిగిన మరునాడు ఎలాంటి అడ్డంకులు, ఆజ్ఞలు లేకపోవడంతో సూర్య భగవానుడు తన పూర్తి శక్తి తో తూర్పు నుండి నిటారుగా ఉదయించాడట.  ఆ రోజే విషు అంటారు. 
రెండవ గాధ ద్వాపర యుగానికి సంభందించినది. 
శ్రీ కృష్ణ భగవానుడు నరకాసురుని సంహరించిన రోజు  ప్రజలు రాక్షస భాధ విరగడ అయి తమ జీవితాలలో కొత్త వెలుగులు తెచ్చినదిగా భావించి సంతోషంతో  విషుని జరుపుకొంటున్నారు. 
అందుకే విషు పూజలో రామాయణ గ్రంధానికి, శ్రీ కృష్ణుని పటానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది.  

చరిత్త్రాత్మిక పర్వదినం 

విషుని మలయాళీయులు పదిహేను వందల సంవత్సరాలుగా జరుకొంటున్నారని అంటారు. 
కేరళను 844-855 సంవత్సరాల కాలంలో పరిపాలించిన స్తాను రవివర్మ పాలనలో విషు సంబరాలు విశేష ప్రాధాన్యతను సంతరించుకో న్నాయని తెలుస్తోంది. 
విషు గురించి కొంత  సమాచారాన్ని కొట్టాయం జిల్లా, చెంగనస్సెర్రి  సమీపంలో  ఉన్న తిరుక్కోడిట్టానం శ్రీ మహా విష్ణు ఆలయంలో 962-1021 కాలంలో పాలించిన భాస్కర రవివర్మ వేయించిన శాసనం తెలుపుతుంది. 
ఈ ఆలయాన్ని తొలిసారిగా సహదేవుడు నిర్మించాడని అంటారు.  ఇది ఇక్కడి పంచపాండవ ఆలయాలలో ఒకటి. 

ఆశల పల్లకి విషు 

శుభ పరిణామాలు సంభావిస్తాయన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
 ఆ శుభాలను నిజం కావాలని కోరుకొంటూ ఎన్నో మార్గాలను అనుసరిస్తారు.
శుభ్రంగా ఉండే స్తలం లక్ష్మే నివాసం అని పెద్దలు అంటారు.
విషు ముందు రోజు రాత్రే రంగవల్లులు వేసి వాటిని పూలతోను, రంగులతోను సుందరంగా తీర్చిదిద్దుతారు.  గృహమంతా శుభ్రం చేసి పసుపు పచ్చని పూలతో, అరిటి, మామిడి ఆకులతో అలంకరిస్తారు.
గుమ్మంలో దీపాలు పెడతారు. పూజా గదిని మరోమారు సర్దుతారు.
సహజంగా మనందరకీ ఒక అలవాటు ఉన్నది. ఒక రోజున మంచి జరిగితే నిద్రలేస్తూనే దేవుని ఫోటో చూసా అంతా శుభంగా జరిగిందని, ఏదన్నా చెడు ఎదురైతే ఉదయాన్నే ఫలానావాడి మొహం చూసా అందుకే ఇలా జరిగింది అంటూ ఉంటాము. 
అలాంటిదే  విషు కన్ని ఒకటి. 

విషు కన్ని 

విషు కన్ని అంటే పండుగనాడు తొలిసారిగా శుభం కలిగించే వస్తువులను చూడటం అని అర్ధం చెప్పుకోవచ్చు. 
కేరళలోని ప్రతి ఇంటిలో ఒక రోజు ముందుగానే విషు కన్ని ఏర్పాట్లు మొదలవుతాయి. 
ముందు రోజు రాత్రి ఇంటిలోని పెద్ద ముతైదువ ఉరలి అనే పంచలోహ పళ్ళెంలో అక్షింతలు, పచ్చటి నిమ్మకాయలు, తమలపాకులు, వక్కలు, బంగారు రంగులో ఉండే గుండ్రని దోసకాయలు, బంగారు నాణేలు, రెండు ఇత్తడి కుందులు 
రామాయణ గ్రంధం పెట్టి పూజా మందిరంలో శ్రీ కృష్ణుని పటం ముందు ఉంచుతారు. అలానే  ఒక అష్థ లక్ష్మి చెంబులో నూతన వస్త్రాన్ని విసినకర్ర మాదిరి మడిచి ఉంచి దానిమీద శుభ పరిణామాలను తెస్తుందనే ఆరన్మూల కన్నాడి
 ( అద్దం ) పెడతారు. పూజామందిరం అంతా కని కొన్న అని పిలిచే పసుపు పచ్చని పూలతో అలంకరిస్తారు. కాస్సియా ఫిస్తుల అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ చెట్లను ఇండియన్ లాబర్నమ్ లేదా గోల్డ్ రష్ ట్రీ అని పిలుస్తారు. ఇవి కేరళ రాష్ట్ర అధికారిక పుష్పాలు. ఈ పూలు ఎండా కాలంలోనే పూస్తాయి. 
పెద్ద ముతైదువ ఆ రాత్రి పూజా మందిరంలోనే పడుకొని వేకువనే లేచి తన కళ్ళను మూసుకొని నీలవిలక్కు అని పిలిచే దీపాలను భగవద్గీత శ్లోకాలను చదువుతూ వెలిగిస్తుంది. 
దీపాలు వెలిగిన తరువాత కళ్ళు తెరిచి అన్ని వస్తువులను కలియచూసి , శ్రీ కృష్ణునికి నమస్సుమాంజలి ఘటించి,
ఇంటిలోని వారందరిని ఒకోక్కరిగా లేపి కళ్ళు మూసి పూజా మందిరానికి నడిపిస్తుంది. 
అలా కుటుంబ సభ్యులంతా విషు కన్ని దర్శనం చేసుకొంటారు. 
స్నానాదులు పూర్తిచేసుకొని పుత్తు కోడి ( నూతన వస్త్రాలు ) ధరిస్తారు. 

విషు క్కైనీట్టం 

ఇది ముఖ్యంగా పిల్లలు ఎదురుచూసే సందర్భం. ఎందుకంటే వారికి లాభించే సమయమదే!
క్కైనీట్టంలో  ఇంటి పెద్ద  పిల్లలకు , సేవకులకు, పేదలకు నగదు బహుమతిగా ఇస్తారు. 
ఆలానే ఊరివారంతా గ్రామ పెద్ద వద్దకు వచ్చి ఆశిస్సులు పొంది ఆయన ఇచ్చే  బహుమతులను స్వీకరిస్తారు .

విషు కన్ని విల్లి 

ఉత్తర మలబారు జిల్లాలైన కాసరగోడ్, కన్నూర్, కొలికోడ్,  వైనాడ్  లలో విషు కన్ని విల్లిని సాంప్రదాయబద్దంగా జరుపుకొంటారు. ఇది చిన్న పిల్లల కొరకు ఉద్దేసించబడినది. 
విషు రోజు ఉదయాన్నే కొత్త బట్టలు ధరించిన చిన్నారులు చిన్న చిన్న బృందాలుగా వాడకట్టులోని ప్రతి ఇంటికి వెళ్లి 
విషు కన్నియే ! విషు కన్నియే ! అంటూ ముద్దుముద్దుగా పలుకుతూ పండుగ రాకను తెలుపుతారు. 
మురిసిపోయిన ఇంటి ఇల్లాలు వారికీ మిఠాయిలు, బియ్యంతో చేసిన కన్ని అప్పం అనే తీపి వంటకాన్ని కానుకగా ఇస్తారు. అలానే కొందరు డబ్బులు కూడా ఇస్తారు. 
అలాంటి ఆనంద వాతావరణంలో గ్రామ జ్యోతిష్కుడు వచ్చి పంచాంగ శ్రవణం చేస్తాడు. ఆ సంవత్సర సంభవించబోయే శుభ పరిణామాలను ప్రజలకు తెలియజేస్తారు. 
విషు అసలు అందం ఉత్తర మలబార్ జిల్లాలలో చూడాలని పెద్దలు అంటారు. 

విషు చాల్ 

ఇది భూమి పుత్రులకు సంభందించిన కార్యక్రమం. 
విషు కన్ని , విషు క్కైకొట్టం, ఆలయ దర్శనం పూర్తయిన  తరువాత వ్యవసాయ కుటుంబాలలో ఇంటి పెద్ద అలంకరించిన నాగలిని పూజించి పొలంలోనికి దిగి పూజ చేసి నాగలితో చాలులు చేసి వాటిల్లో ఎండుగడ్డి, ఆవు పేడ వేసి మట్టితో కప్పెస్తారు. దీనివలన రాబోయే పంట బాగా పండుతుంది అన్నది వారి తరతరాల నమ్మకం. 

ఆలయ దర్శనం 

విషు నాడు  రాష్ట్రంలోని అన్ని ఆలయాలు పండగ శోభను సంతరించుకొంటాయి. 
ప్రముఖ దేవాలయాలన్నీ భక్తుల రాకతో కళకళలాడతాయి. ప్రత్యెక పూజలు, అభిషేకాలు, అలంకరణలు చోటు చేసుకొంటాయి.
విషు కోసం శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయాన్ని తొమ్మిది రోజులు తెరుస్తారు.
ఈ సమయంలో పడిపూజ విశేషంగా నిర్వహిస్తారు. అతలపూజ సందర్భంలో స్వామిని విభూది, రుద్రాక్షలతో అలంకరిస్తారు.
విషుకి రెండురోజుల ముందు సహస్ర కలశాభిషేకం భక్తి శ్రద్దలతో జరుపుతారు.
మిగిలిన పూజలైన గణపతి హోమం, నెయ్యాభిషేకం, ఉష, ఉచ్ఛ, దీపారాధన, పుష్పాభిషేకం, అన్ని మామూలుగానే కొనసాగుతాయి.
ప్రతేక ఉదయాస్థమాన పూజ లాంటివి విషు సందర్భంగా చేస్తారు.
విషు రోజున ఉదయం నాలుగు గంటలనుండి సాయంత్రం అయిదు గంటల వరకు విషు కన్ని దర్శనం శ్రీ ధర్మశాస్త సమక్షంలో లభిస్తుంది.
గురువాయురులో కూడా ఉదయం మూడు గంటల నుండి ముఖ మడపంలో విషు కన్నిని దర్శించుకోవచ్చు.
వచ్చిన భక్తులందరకు దేవస్వం వారు విషు సద్ది ( భోజనం ) ఏర్పాటు చేస్తారు.
తిరువనంతపురం శ్రీ  అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా విషు కన్ని ఉంచుతారు. కాకపొతే ఇక్కడ ఒక గంట మాత్రమే విషు కన్ని దర్శనం లభిస్తుంది.

విషు కన్హి  

విషు కన్నిని దర్శించుకోన్నాక అన్నం, కొబ్బరి పాలు, బెల్లం తో చేసిన పాయసం  విషు కన్హి ( అల్పాహారం ) ని కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తారు. 
చాలా ఆలయాలలో కూడా ప్రసాదంగా ఇదే ఇస్తారు. 

విషు సద్ది 

విషు రోజున చేసే సద్ది ( భోజనం ) మన ఉగాది పచ్చడికి నకలులాగా ఉంటుంది. 
సద్దిలో తీపి, పులుపు, చేదు, వగరు, కారం పదార్ధాలను సమ సంఖ్యలో అంటే అన్ని మూడేసి లేదా ఐదేసి చొప్పున ఉంటాయి. 
సద్దిలో తప్పని సరిగా ఉండేవి వేప పువ్వు రసం, మామిడికాయ పప్పు , పనసకాయ కూర, అప్పడం, పాయసం 
సద్ది తర్వాత పెద్దలు గత కాలపు జ్ఞాపకాలతో కాలక్షేపం చేస్తుంటే, యువకులు రకరకాల ఆటలలో పాల్గొంటారు. 
ఆడవారు ఇంటిని అలంకరిచడం చేస్తారు. 

విషు పాదక్కమ్ 

విషు ముందు నాటి రాత్రి, విషు రోజు ఉదయం యువతి యువకులు, పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా తయారు చేసిన 
పటాసులను కాలుస్తారు. దానినే విషు పాదక్కమ్ అంటారు. ఆ సమయంలో కేరళా అంతా మరో మారు దీపావళి వాతావరణం వెల్లివిరుస్తుంది. 
 భవిష్యత్తు మీద ఆశతో, కేరళీయులు తమ విషును ఇంత సాంప్రదాయబద్దంగా, ఎంతో అట్టహాసంగా జరుపుకొంటారు.  
మరో విశేషమేమిటంటే విషు సంబరాలు జరిగే ఏప్రిల్ నెల లోనే మనం ఉగాది , పంజాబులో బైశాఖి, అస్సాంలో బిషు, తమిళనాడులో వారి ఉగాది పూత్తండు జరుపుకొనడం. 
నేటి యాంత్రిక జీవనంలో కూడా శతాబ్దాల క్రిందట పూర్వీకులు ఆరంభించిన సంప్రదాయాలను మరువకుండా, ఏదో పండుగ జరుపుకొన్నం అని కాకుండా, మారుతున్న కాలంతో మారకుండా, ఎయేటి కా యేడు ఇనుమడించిన ఉత్సాహంతో విషు జరుపుకొనే కేరళీయులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.  

           
                                                           *************************







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...