30, డిసెంబర్ 2024, సోమవారం

Sri Pattabhi Rama Temple, Lakkaraju Garlapadu

 

                      పావనం పట్టాభిరాముని దర్శనం 

మన దేశం దైవ భూమ. పురాణాల ఆధారంగా స్వయం సర్వాంతర్యామి నడయాడిన దివ్య భూమి. 
 మహర్షులు,గురువులు మరియు కవులు దేవదేవుని లీలలను కీర్తిస్తూ ఎన్నో  కావ్యాలు ,కీర్తనలు రచించారు. 
అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పటికీ  విని వల్లే వేయడం వలన  ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా కొనసాగుతూ ప్రజలలో ఆదిదేవుని పట్ల భక్తి విశ్వాసాలు స్థిరంగా ఉండిపోయినాయి. 
పాలకులు కూడా ప్రజలలో నిరాకారుని పట్ల నెలకొని ఉన్న ఆరాధనను గమనించి ఉరూరా ఆలయాలను నిర్మించారు. వారి ఆదరణలో ఉన్న కవి పండితులు కూడా పరమేశ్వరుని కీర్తిస్తూ కావ్యాలను రచించారు. 
పాలకుల వద్ద మంత్రులుగా, సేనాధిపతులుగా, దండనాయకులుగా, ఒక ప్రాంతానికి అధిపతులుగా ఉన్నవారు కూడా అనేక ఆలయాలను నిర్మించడం లేదా శిధిలావస్థలో ఉన్న ఆలయాలను పునః నిర్మించడం జరిగినట్లుగా శాసనాలు, స్థానిక కధనాలు తెలుపుతున్నాయి. 
ఇలా నిర్మించబడిన ఆలయాలు దేశం నలుమూలలా కనిపిస్తాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అనేకం కనిపిస్తాయి. అవన్నీ కూడా సుమారుక్రీస్తుశకం పదవ శతాబ్ద కాలానికి ముందే  నిర్మించినట్లుగా శాసనాలు తెలియచేస్తున్నాయి. ఆ పురాతన దేవాలయాల విశేషాలు ప్రజలకు తెలియచేయవలసిన అవసరం తెలుసుకొన్న భక్తులు సందర్శించవలసిన అవసరం కూడా ఎంతో ఉన్నది. 

అష్టదిగ్గజాలు 

విజయనగర పాలకులు కవిపండిత పక్షపాతులు. వారిని ఆదరించేవారు. సత్కరించేవారు. నిత్యం కవితాగోష్టులు నిర్వహించేవారు అని చెబుతారు.  
మన పురాణాల ప్రకారం పృథ్వి కి ఉన్న అష్టదిక్కులను ఎనిమిది ఏనుగులు కాపలా కాస్తుంటాయని తెలుస్తోంది. ఆ అష్ట గజాల పేర్లు  ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం మరియు సుప్రతీకం. 
విజయనగర రాజులలోఅగ్రగణ్యుడు అయిన శ్రీ కృష్ణదేవరాయలు స్వయంగా కవి. అముక్త మాల్యద లాంటి కావ్యాన్ని రచించారు. ఎందరో కవి పండితులను ఆదరించారు. ఎన్నో కావ్యాలను స్వీకరించారు. శ్రీ కృష్ణ దేవరాయల  కొలువులో ఉన్న భువనవిజయంలో ఎనిమిది మంది గొప్ప కవిపండితులు ఉండేవారు. అనేక కవిసమ్మేళనాలలో, పాండిత్య సభలలో పాల్గొని విజయం సాధించిన వారిని "అష్టదిగ్గజాలు" గా పిలిచేవారు. భువనవిజయ గౌరవాన్ని కాపాడేవారిగా వారిని అలా పిలిచేవారు.  
 వీరి పేర్ల గురించి కొంత సందేహం ఉన్నప్పటికీ అందరూ అంగీకరించిన ఆ ఎనిమిది మంది కవిదిగ్గజాల పేర్లు వరుసగా అల్లసాని పెద్దన, ధూర్జటి, నంది తిమ్మన, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, రామరాజభూషణుడు,పింగళి సూరన మరియు తెనాలి రామకృష్ణ.  
వారందరూ ఎన్నో ప్రబంధ కావ్యాలను రచించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 




తెనాలి రామకృష్ణ కవి కట్టించిన ఆలయం 


తెనాలి రామకృష్ణ కవి ఇళ్లు ఉండిన స్తలం (ఆటో వెనక)


తెనాలి రామకృష్ణ 

వికటకవిగా ప్రసిద్ధి గాంచిన  తెనాలి రామకృష్ణ స్వస్థలం కృష్ణాతీరం. వీరి అసలు ఇంటిపేరు "గార్లపాటి". కానీ చిన్నతనం నుండి తెనాలి లో మేనమామ గారి ఇంట పెరగడం వలన "తెనాలి రామకృష్ణ" గా పిలవబడ్డారు. అమ్మలగన్నయమ్మ శ్రీ దుర్గాదేవి అనుగ్రహంతో గొప్ప కవి, హాస్యప్రియుడు, తన చతురోక్తులతో ఇతరులను మైమరపించి అలరించేవానిగా పేరొందారు. తన సునిశిత వ్యంగ్య హాస్య కవిత్వంతో ఎంతటి వారి గర్వాన్ని, అహంకారాన్ని అణచి విజయం సాధించేవారు. శ్రీకృష్ణ దేవరాయల వారికి కూడా రామకృష్ణ్ణుని పట్ల ఎనలేని గౌరవం ఉండేది.  తెనాలి రామకృష్ణుడు గొప్ప దేశభక్తునిగా, రాజుగారి విశ్వాసపాత్రునిగా గుర్తింపు పొందారు అని ప్రచారంలో ఉన్న అనేక గాధల ద్వారా అర్ధం అవుతుంది. తెనాలి రామకృషుని గాధలు మన తెలుగురాష్ట్రాలలోనే కాదు దేశమంతా గుర్తింపు పొందాయి. 
కవి, దేశభక్తుడు, రాజుగారికి విశ్వాస పాత్రునిగానే కాకుండా గొప్ప హిందూవాదిగా , సర్వేశ్వరుని పట్ల అంతులేని భక్తివిశ్వాసాలు కలిగినవారుగా పేరొందారు.  
వీరి స్వగ్రామం అయిన గార్లపాడు నేటి సత్తెనపల్లి (పల్నాడు జిల్లా)కి సమీపంలోని "లక్కరాజు గార్లపాడు" గా గుర్తించబడినది. శ్రీ రామకృష్ణుని తాత తండ్రులు గ్రామంలోని బొడ్డు రాయి వద్ద ఉండే  ఇంట్లో నివసించేవారని చెప్పబడుతోంది. తండ్రి శ్రీ రామయ్య గారి మరణానంతరం రామకృష్ణుడు మేనమామ గారి గ్రామమైన తెనాలి లో నివసించారు. ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందారు. 
దక్షిణ భారత దేశంలో అనేక విశిష్ట దేవాలయాలను నిర్మించిన శ్రీ కృష్ణ దేవరాయల వారి అడుగు జాడలలో నడిచారని తెలుస్తుంది ఆయన స్వగ్రామం వెళితే !

శ్రీ పట్టాభిరామ ఆలయం 

 సుమారు రెండు వేల సంవత్సరాల క్రిందటి ప్రతిష్ఠిత శ్రీ పట్టాభిరాముని ఆలయం లక్కరాజు గార్లపాడులో ఉన్నది. 
ఈ ఆలయాన్ని శ్రీ తెనాలి రామకృష్ణ కవి పునః నిర్మాణం చేయించినట్లుగా ప్రాంగణంలోని శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ శాసనంలో రామకృష్ణుని తాత తండ్రుల పేర్లు ఉన్నాయి.  
అనంతర కాలంలో పరాయి పాలకుల దాడుల నుండి ఆలయాల లోని మూలవిరాట్టులను కాపాడే సమయంలో భూమిలో ఎక్కడో దాచేసారట. సుమారు రెండువందల సంవత్సరాల పాటు ఆలయం మూలవిరాట్టు లేకుండా ఉండినదట. అదే సమయంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడినదట. ప్రజలు అనేక ప్రాంతాలలో తాగు నీటి కోసం బావులను త్రవ్వసాగారట. ఆ త్రవ్వకాలలో శ్రీ పట్టాభిరాముని  మరియు శ్రీ ఆంజనేయస్వామి వారి విగ్రహాలు బయల్పడినాయట. త్రాగు నీరు కూడా లభ్యమైనది అని  చెప్పవలసిన అవసరం లేదు.  
అలా తిరిగి దర్శనమిచ్చిన శ్రీ పట్టాభిరామునికి మరియు శ్రీ వాయునందనుని తిరిగి ప్రతిష్టించారు. అప్పటి ఈ ప్రాంత పాలకుడు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా వారి వేసిన శాసన ప్రతి ద్వారా తెలుస్తోంది.
చాలా చిన్న ఆలయం. పడమర ముఖంగా ఉండే ఈ ఆలయానికి ఎలాంటి రాజగోపురం కానీ విశేష నిర్మాణాలు కానీ కనిపించవు. ఆలయ ఆగ్నేయ దిశలో కళ్యాణ మండపం ఉంటుంది. కొన్ని భిన్న శిల్పాలు, రూపాలు ప్రాంగణంలో కనిపిస్తాయి. ఎత్తైన ధ్వజస్థంభం ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడే శ్రీ రామకృష్ణ కవి వేయించినదిగా చెప్పబడే శాసనం కూడా ఉంటుంది. 
చాలా చిన్న ముఖ మరియు అర్ధ మండపం ఉంటాయి. కానీ అవి జీర్ణావస్థలో ఉండటం శోచనీయం. 
శ్రీ అంజనాతనయుడు ముఖ మండపంలో ఉత్తరాభిముఖుడై దర్శనమిస్తారు. 



తెనాలి రామకృష్ణ కవి వేయించిన శాసనం 







శ్రీ పట్టాభి రామ స్వామి 

ఆలయం ఎంత చిన్నగా, శిథిలావస్థకు దగ్గరగా ఉన్నదో లోపల మూలవిరాట్టు వాటికి భిన్నంగా అరుదైన విగ్రహ రూపంలో రమణీయ అలంకరణలో దర్శనమిస్తారు. 
స్వామివారిని చూడగానే ఆలయ విషయాలు గుర్తుకురావు. స్వామివారే కనిపిస్తారు. ఎందుకంటే అలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి లేదు. 
సహజంగా ఏ రామాలయంలో చూసినా శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి దర్శనమిస్తారు. ధ్వజస్థంభం దగ్గర వినతాసుతుడు గరుత్మంతుడు కొలువై ఉంటారు.  శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో ఏ అవతార ఆలయంలో కూడా శ్రీవారు దేవేరితో బాటు  ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కొలువైన ఆలయం ఒక్కటే ఉన్నది. 
చెన్నై నగరంలో ఉన్న శ్రీ పార్ధసారధి స్వామి ఆలయంలో శ్రీ వెంకట కృష్ణ స్వామి  భార్య, సోదరులు, కుమారుడు, మనుమడు శ్రీ రుక్మిణి , శ్రీ బలదేవ, శ్రీ సాత్యకి, శ్రీ ప్రద్యుమ్న మరియు శ్రీ అనిరుద్ధునితో కలిసి దర్శనమిస్తారు.ట్రిప్లికేన్ లో ఉన్న ఈ ఆలయంలో గర్భాలయంలో మొత్తంఅయిదు విగ్రహాలు కనిపిస్తాయి. 
కానీ లక్కరాజు గార్లపాడు లోని మూలవిరాట్టు ఒక ప్రత్యేకత. అరుదైన విశేషం. భక్తిపారవశ్యం  కలిగించే రూపం, ఆనందపరవశం తెలియకుండానే ఉప్పొంగే విగ్రహం. 
ఇన్ని విశ్లేషణలు ఉపయోగించడానికి కారణం మూలవిరాట్టులో మరెక్కడా కనిపించని ప్రత్యేకతే కారణం! భక్తులు అలా చూస్తూ ఉండిపోతారు. 






ఒకే విగ్రహంలోదశరధ నందనులు నలుగురు, జనకరాజ పుత్రి , శ్రీ మారుతీనందనుడు మరియు శ్రీ వినతాసుతుడు  ఛత్రం చామరంతో సహా చక్రవర్తి వైభవాన్ని చాటి చెప్పే కిరీటాలు, నగలు ధరించి కనిపించడం అద్భుతంగా ఉంటుంది. 
శ్రీ రామచంద్రుడు, సీతాదేవి, శ్రీ భరత , లక్ష్మణ, శత్రుఘ్నులుమకరతోరణ క్రింద ఇరుపక్కలా శ్రీ హనుమంతుడు మరియు శ్రీ గరుత్మంతుడు దర్శనమివ్వడం ఒక పావనమైన దర్శన  అనుభూతిని భక్తులకు ప్రసాదిస్తుంది.  చిత్రం చూడండి. 
మూలవిరాట్టు పక్కనే ఉత్సవమూర్తులు కూడా దర్శనమిస్తారు. 
నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో  హిందూపర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీ హనుమజ్జయంతి మరియు శ్రీ రామనవమి ఘనంగా చేస్తారు. 
కొసమెరుపు చాలా దీనావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్దరించాలన్న సంకల్పంతో దేశవిదేశాలలో స్థిరపడిన గ్రామస్థులు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ప్రణాళిక రచించారని తెలిసింది. గ్రామంలో శివాలయం కూడా పూర్తిగా శిధిలమైనది. హరిహరులు ఆలయాలను ఒకే ప్రాంగణంలో రమ్యమైన ధామాలు నిర్మించి ప్రతిష్టించాలని నిర్ణయం జరిగింది. 
శ్రీ పట్టాభిరాముని కృపాకటాక్షాలతో అనుకున్న విధంగా ఈ ఆలయం మన రాష్ట్రంలో ఒక గొప్ప క్షేత్రంగా రూపుదిద్దుకోవాలని కోరుకొందాము. 
లక్కరాజు గార్లపాడు గ్రామం సత్తెనపల్లికి  కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వసతి భోజన సదుపాయాలు సత్తెనపల్లి మరియు గుంటూరు లలో లభిస్తాయి. సత్తెనపల్లి చుట్టుపక్కల మరికొన్ని విశేష పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆ వివరాలు కూడా త్వరలో పాఠకులకు తెలియచేయడం జరుగుతుంది. 

జై శ్రీరామ్ !!!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Shobhanachala Vyaghra Narasimha Swami Temple, Agiripalli

           శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి ఆలయం  లోకసంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించారు. విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి ...