30, డిసెంబర్ 2024, సోమవారం

Anicent Temples In Tumuluru & Chilumuru

                       శ్రీ సీతారామలక్ష్మణ ప్రతిష్ఠిత లింగాలు 

మన దేశంలో అనేక పుణ్య తీర్థ క్షేత్రాలు నెలకొని ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసినదే ! కానీ తెలియనిది ఏమిటంటే మన పుణ్య భూమిలో చిన్న చిన్న గ్రామాలలో కూడా విశేష ప్రాధాన్యత కలిగిన ఆలయాలు ఉండటం !
ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనేక పురాతన ధామాలు కనిపించడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి. మన రాష్ట్రం గుండా ప్రవహించే పావన జీవ నదులైన గోదావరి, కృష్ణ  మరియి పెన్నా నదీతీరాలలో ఏనాడో  రాజమహరాజులు నిర్మించిన ఆలయాలు కొన్ని శిధిలావస్థలో, మరికొన్ని స్థానిక భక్తుల సహకారంతో నూతనరూపు సంతరించుకోవడమో మనం చూడవచ్చును. 
దీనికి కారణం ఈ ప్రాంతాలు కొన్ని యుగాల నుండి మునుల నివాసంగా, వారు తపస్సు చేసుకొన్న ప్రదేశాలుగా ఉండటం. మహర్షులు ఎందుకని నదీతీరాలలో నివసించేవారంటే జలం జీవం. వారి నిత్య అనుష్టానానికి నీటి అవసరం ఎంతైనా ఉన్నది. 
కాలక్రమంలో ఈ ప్రాంతాలను పవిత్ర ప్రదేశాలుగా గుర్తించి పాలకులు ఆలయాలు నిర్మించడం జరిగింది. 
తరిచి చూస్తే ప్రతి గ్రామంలోనూ ఒక శివాలయం, ఒక విష్ణు ఆలయం అలాగే గ్రామదేవత సన్నిధి ఉండటం కనిపిస్తుంది. దీనికి కారణం గతంలో మన దేశంలో శైవం మరియు వైష్ణవం తప్ప మరో మతం లేకపోవడం.నాటి  సమాజంలో ఎలాంటి మతపరమైన గొడవలు తలెత్తకుండా ఉండటానికి వీరి ఇరువురినీ సమదృష్టితో చూడవలసిన అవసరం పాలకులకు ఉండటం కారణాలుగా చెప్పుకోవచ్చును.
ఈ ఆలయాలలో కొన్ని పురాణాలతో ముడిపడి ఉన్నవి కావడం చెప్పుకోవలసిన అంశం. 
రామాయణ మహా కావ్యంతో ముడిపడి ఉన్న మూడు ఆలయాలు విజయవాడ నగరానికి దగ్గరలో కృష్ణానదీ తీరంలో నెలకొని ఉన్నాయి. 














పురాణ గాథ 

శ్రీ సీతారాములు లక్ష్మణునితో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో వారి వద్దకు వచ్చి అవమానించబడిన శూర్పణఖ చెప్పిన చెప్పుడు మాటలతో ప్రేరేపితుడైన రావణుడు జానకీ మాతను లంకకు తీసుకొని పోతాడు. వానరుల సహాయంతో జాడ కనుక్కొని, వారధి నిర్మించి రావణ సంహారం కావించారు శ్రీ కోదండ రాముడు. 
కానీ రాక్షస గుణాలు కలిగినా రావణాబ్రహ్మ బ్రాహ్మణుడు కావడం వలన శ్రీరామునికి బ్రహ్మ హత్యా దోషం కలిగిందట. దానిని తొలగించుకోడానికి ఆయన అనేక తీర్థ పుణ్యక్షేత్రాలలో శివ లింగ ప్రతిష్టలు చేసారు అని తెలుస్తోంది. 
ఆ క్రమంలో కృష్ణాతీరానికి శ్రీరాముడు సతీ మరియు సోదరులు ఇతర పరివారంతో తరలి వచ్చారట. శ్రీ రామునితో పాటు సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా శివ లింగ ప్రతిష్ట చేశారని క్క్షెత్రగాధలు చెబుతున్నాయి. 
అలా లింగ ప్రతిష్ట చేసిన పావన ప్రదేశాలు నేటి బాపట్ల జిల్లాలోని తూములూరు మరియు చిలుమూరు. 

శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయం 

సుందర ప్రకృతి, ప్రశాంత పరిసరాలు, పక్కనే ప్రవహించే జీవనది కృష్ణవేణి. పులకించిపోయిన సౌమిత్రి తనకు కూడా ఒక లింగాన్ని ఈ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్టించాలని కోరికగా ఉందని  అగ్రజుని కోరారట. 
అన్న అనుమతితో శ్రీరామానుజుడు నేటి తూములూరు ఉన్న ప్రాంతంలో శివ లింగాన్ని ప్రతిష్టించారాని ఆలయ గాథ.
శ్రీ లక్ష్మణుడు ప్రతిష్టించడం వలన కైలాసనాధుడు ఇక్కడ శ్రీ లక్ష్మణేశ్వర స్వామిగా పిలవబడుతున్నారు. 
తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం గ్రామస్థుల, భక్తుల సహకారంతో  నూతనంగా పునః నిర్మించబడినది. తొలి ఆలయం ఎవరు నిర్మించారో తెలియదు. కానీ చాళుక్య, చోళ రాజుల కాలంలో ఒక ఆలయం శ్రీ లక్ష్మణేశ్వర స్వామికి నిర్మించబడినది అని తెలుస్తోంది. అనంతరం ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు శ్రీ బాలాత్రిపుర సుందరీ అమ్మవారిని మరియు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని ప్రతిష్టించారని చెబుతున్నారు. 
 కాకతీయులు శివారాధకులు. వారి కాలంలో వీరశైవం ప్రజల పాలకుల ఆదరణ పొందినది. ఆ కాలంలో కొందరు వీర శైవ ప్రచారకులు ఈ ప్రాంతాలకు వచ్చి శివాగమనాల గురించి ప్రచారం చేసారని చెబుతారు. వీర శైవులు ఎక్కువగా శ్రీ వీరభద్ర మరియు శ్రీ కాలభైరవ ఆరాధన చేసేవారు. అందుకనే కృష్ణాతీరంలో అనేక ఆలయాలలో శ్రీ వీరభద్ర మరియు శ్రీ కాలభైరవ స్వామి ప్రత్యేక సన్నిధులలో నేటికీ దర్శనమిస్తున్నారు. 













చక్కని వర్ణాలతో సుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలో అనేక దేవీదేవతా మూర్తుల చిత్రాలను ప్రదక్షిణాపధంలో గోడల పైన చిత్రించారు. శ్రీ సిద్ది బుద్ది సమేత శ్రీ వినాయకుడు, శ్రీ నటరాజు, ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం, అర్ధనారీశ్వర మూర్తి, ఏకపాద మూర్తి, శ్రీ మహాలక్ష్మి, శివపార్వతులు, శ్రీ కుమారస్వామి, శ్రీ దక్షిణామూర్తి  ఇలా ఎన్నో దేవీదేవతలు రూపాలు  రమణీయంగా కనపడతాయి. ఆలయ పైభాగాన కూడా అనేక వర్ణమయ రూపాలను ఉంచారు. 
ప్రాంగణంలో శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయం పక్కన హిమగిరులలో అనగా కైలాసంలో కొలువైన శివపరివార శిల్పాలు ఆకట్టుకొంటాయి. 
ఎత్తైన ధ్వజస్థంభం వద్ద శ్రీ  కాల భైరవుడు దర్శనమిస్తారు. పక్కనే చిన్న మండపంలో శ్రీ నందీశ్వర సమేత శ్రీ నందివాహనుడు బ్రహ్మ సూత్ర లింగ రూపంలో కొలువై ఉంటారు. భక్తులు నేరుగా అభిషేకం చేసుకొనే అవకాశం ఉన్నది. 
తూర్పుముఖంగా ఉన్న ప్రత్యేక సన్నిధిలో అంజనాసుతుడు శ్రీ భక్త ఆంజనేయునిగా ముకుళిత హస్తాలతో సింధూరవర్ణ శోభితునిగా దర్శనమిస్తారు. సన్నిధి ముఖమండపం పైన శ్రీ సీతా లక్ష్మణ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి పాదాల వద్ద దాసాంజనేయునిగా ఉండే  చక్కని రూపాలు చిన్న మండపంలో సుందరంగా ఉంటాయి. 
ఈ ప్రాంతంలో రుద్రాంశ సంభూతుడైన వాయునందనునికి అన్ని ఆలయాలలో ప్రత్యేక సముచిత   స్థానం ఉండటం చెప్పుకోవలసిన విషయం. 
ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కనిపిస్తుంది. అది శ్రీ చెండికేశ్వరుని సన్నిధి. 
తమిళనాడులోని శైవ క్షేత్రాలన్నింటిలో గోముఖి సమీపంలో శ్రీ చెండికేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. ఉత్సవాలలో శ్రీ చెండికేశ్వరునికి ప్రాధాన్యత కూడా అధికంగా కనపడుతుంది. అక్కడ భక్తులు చిన్నగా చప్పట్లు లేదా చిటికెలు వేసి శబ్దం చేసి  గోత్రనామాలు చెప్పుకోవడం కనపడుతుంది. శబ్దం చేయడం ఎందుకంటే ఆయన నిరంతరం ధ్యానంలో ఉంటారు. కానీ ఈయన వద్ద ఎవరు శివ దర్శనానికి వచ్చారు అన్న వివరాలు నమోదు అవుతాయని అంటారు. 
నందీశ్వరుని తరువాత అంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీ చండికేశ్వరుని వద్ద తమ నామగోత్రలు నమోదు కావాలని అలా చేస్తుంటారు భక్తులు. 
మన దగ్గర చాలా తక్కువ ఆలయాలలో శ్రీ చెండికేశ్వర స్వామి సన్నిధి కనపడుతుంది.  శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో గోముఖి వద్ద శ్రీ చెండికేశ్వరుడు దర్శనమిస్తారు. 
ప్రదక్షిణ పూర్తి చేసుకొని ముఖ మండపం లోనికి వెళితే అక్కడ ఎదురుగా మూడు సన్నిధులు కనపడతాయి. ఒకదానిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి, మరో సన్నిధిలో శ్రీ బాలాత్రిపుర సుందరీ అమ్మవారు మధ్యలో ఉన్న ప్రధాన సన్నిధిలో శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దర్శనమిస్తారు. 
దక్షిణం పక్కన ఉన్న సన్నిధిలో సుందర అలంకరణలో శాంతమూర్తిగా శ్రీ వీరభద్రస్వామి భద్రకాళీ సమేతులై దర్శనం ప్రసాదిస్తారు. ఉత్తరం వైపున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి చతుర్భుజాలతో ఉపస్థిత భంగిమలో ప్రసన్నవదనంతో భక్తులను అనుగ్రహిస్తారు. 
ప్రధాన గర్భాలయం వెలుపల ద్వారపాలకులకు బదులుగా ఆదిదంపతుల కుమారులైన శ్రీ గణపతి, శ్రీ కుమారస్వామి ఉంటారు. గర్భాలయంలో ఎత్తు తక్కువ  పానవట్టం పైన చందన , కుంకుమ విభూతి లేపనలతో, మల్లె , మందార, బంతి చామంతి కబంద పుష్ప అలంకరణలో శ్రీ లక్ష్మణేశ్వర స్వామి నేత్రపర్వంగా కనిపిస్తారు. 
ఈ ఆలయంలో గణపతి నవరాత్రులు, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, శ్రీరామనవమి, శ్రీ హనుమజ్జయంతి, కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 
నిత్యం పూజలు జరిగే ఈ ఆలయం ఉదయం మరియు సాయంత్రం భక్తుల కొరకు తెరిచి ఉంటుంది. 

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం 










శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయానికి కొంచెం దూరంలో పచ్చని  పంటపొలాలు,పూల మరియు అరటి తోటల మధ్య నెలకొని ఉన్న చిన్న ఆలయంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. 
ధ్వజస్థంభం, నాగప్రతిష్ఠలు, నవగ్రహ మండపం ప్రాంగణంలో కనిపిస్తాయి. 
ముఖ మండపంలో నందీశ్వరుడు, శ్రీ గణపతి కొలువై ఉంటారు. 
గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారు ఎత్తైన పానవట్టం మీద బ్రహ్మ సూత్రం ధరించి చిన్న లింగ రూపంలో కొలువై ఉంటారు. అమ్మవారు శ్రీ పార్వతీ దేవి ప్రత్యేక సన్నిధిలో ఉపస్థితురాలై దర్శనం ఇస్తారు . 
శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఈ ఆలయ ఉత్త్సవాలుజరుపుతారు . 

శ్రీ భూనీళా సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం 








తూములూరు గ్రామంలో కనిపించే మరో విశేష ఆలయం శ్ర భూనీళా సమేత శ్రీ చెన్నాకేశవ స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు పదవ శతాబ్ద కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. తిరిగి పద్దెనిమిదో శతాబ్దంలో అమరావతి పాలకుడైన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పునః నిర్మించి ఆలయ నిర్వహణ కోసం భూములను ఇచ్చారని శాసనాధారాలు ఉన్నాయి. 2014 వ సంవత్సరంలో గ్రామస్థులు ఆలయాన్ని చక్కగా తీర్చిద్దిద్దారు. 
తొలుత చాళుక్య  రాజుల కాలంలో శ్రీ చెన్నకేశవస్వామి వారు మాత్రమే కొలువై ఉండేవారట. అనంతర కాలంలో అమ్మవార్ల ప్రతిష్టాపన జరిగిందట. 
స్థానక భంగిమలో రమణీయమైన అలంకరణలో ఉభయ దేవేరులతో శ్రీవారు దర్శనమిచ్చే ఈ ఆలయంలో ధ్వజస్థంభం వద్ద శ్రీ ఆంజనేయస్వామి వారి సన్నిధి ఉంటుంది. 
స్వామి వారి రూపం బేలూరు లోని ప్రపంచప్రసిద్ధి చెందిన శ్రీ చెన్నకేశవస్వామి రూపం మాదిరి  రమణీయంగా మలచబడి ఉంటుంది.  
శ్రీ వైష్ణవ ఆగమాల ప్రకారం నిత్యపూజలు జరిగే ఈ ఆలయంలో అన్ని హిందూపర్వదినాలను, శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామనవమి, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. 
పురాతన ఆలయాలను రమ్యంగా తీర్చిద్ది చక్కగా నిర్వహిస్తున్న గ్రామ పెద్దలకు, అధికారులకు, అర్చకస్వాములకు అభినందనలు తెలపాలి ఎవరైనా!

శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలు, చిలుమూరు 

తూములూరుకు ఉత్తరంగా పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిలుమూరు. విజయవాడ నుండి గుంటూరు జిల్లా వైపున ఉన్న కృష్ణానది కరకట్ట మార్గంలో వస్తుంది. 
చిలుమూరు లో ఉన్న రెండు ఆలయాలు కూడా చాలా పురాతనమైనవి. 
త్రేతా యుగ విశేషాలతో మరియు కలియుగ వివరాలతో ఉన్న ఈ రెండు ఆలయాలలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజాదులు నిర్వహిస్తున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని చెబుతారు. ఈ సంవత్సరం వెయ్యి సంవత్సరాల ఉత్సవం కూడా ఏప్రిల్ నెలలో నిర్వహించారు. 

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం 
















సుమారు పదవ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. అప్పటి నుండి స్థానికులైన "హరి" వంశంవారు ఆలయ ధర్మకర్తలుగా వ్యహరిస్తున్నారు అని తెలుస్తోంది. 
ఎన్నో రాజవంశాలవారు, సామంతరాజులు, జమీందార్లు మరియు హరి వంశంవారు ఆలయాభివృద్దికి విశేష కృషిచేశారు. 
తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం సాదాసీదాగా ఎలాంటి రాజగోపురం, విశేష స్వాగత ద్వారాలు లేకుండా కనిపిస్తుంది. ఉపాలయాలు కూడా ఉండవు.
ముఖమండపం పైన సుందరమైన శ్రీ రుక్మిణీ శ్రీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి మూర్తులను, ఒకపక్క గరుత్మంతుడు మరో పక్క శ్రీ ఆంజనేయుడు ఉంటారు. ఆలయ నిర్మణానికి వెలుపల దక్షిణాముఖంగా కొలువైన శ్రీ హనుమంతుడు చిన్న మండపంలో స్థానక భంగిమలో సింధూరవర్ణ శోభితులై అభయహస్త ముద్రలో కనపడతారు. 
ఎత్తైన ధ్వజస్థంభం వద్ద వినతాతనయుడు గరుత్మంతుడు ముకుళిత హస్తాలతో స్వామివారి సేవకు సిద్ధంగా నిత్యసూరిలా వినమ్ర భంగిమలో ఉంటారు. 
అక్కడే ఆలయ చరిత్ర తెలిపే పురాతన శాసనం కనపడుతుంది. 
ముఖమండపానికి అనుసంధానంగా చిన్న అర్ధమండపం మరియు గర్భాలయం ఉంటాయి. అర్ధమండపంలో ఒక గూటిలో శ్రీ భక్త ఆంజనేయస్వామి, గర్భాలయంలో శ్రీ రుక్మిణీ శ్రీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్లు నయనమోహనమైన అలంకరణలో దర్శనం ప్రసాదిస్తారు. 
గర్భాలయంలోనే ఉత్సవ మూర్తులు కూడా రమ్యమైన అలంకరణలో దర్శనమిస్తారు. 
చిలుమూరులో ఉన్న రెండు ఆలయాల ఉత్సవాలు ఒకేసారి నిర్వహిస్తారు. 
కానీ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీ హనుమజ్జయంతి విశేషంగా జరుపుతారు. 







శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం 

చిలుమూరులోని రెండవ ప్రధాన ఆలయం ఉభయ రామేశ్వర క్షేత్రంగా పిలవబడే  శ్రీ రామలింగేశ్వర స్వామి వారు కొలువైనది . 
సువిశాల ప్రాంగణంలో పడమర ముఖంగా ఉండే ఏఈ ఆలయంలో ఎన్నో దేవతా వృక్షాలు కనిపిస్తాయి. ఈ క్షేత్రానికి ఉభయ రామేశ్వరం అని స్వామి వారికి శ్రీ రామలింగేశ్వరుడు అని పేరు రావడానికి సంబంధించిన గాథ త్రేతాయుగం నాటిదిగా చెబుతారు. 

పౌరాణిక నేపథ్యం 













రావణాబ్రహ్మ ను సంహరించడం  సంక్రమించిన బ్రహ్మ హత్యా దోషాన్ని తొలగించుకోడానికి గురువుల ఆదేశం మేరకు శ్రీ రామచంద్రుడు పావన తీర్ధ క్షేత్రాలలో  ప్రతిష్టించ నిశ్చయించారు. 
ఆ క్రమంలో పుణ్య నది కృషావేణీ తీరానికి విచ్చేసినప్పుడు పచ్చని పరిసరాలతో, నదీ ప్రవాహ గలగలలతో సుందరంగా ఉన్న ఈ ప్రదేశంలో తానొక శివలింగాన్ని ప్రతిష్టించాలన్న కోరిక వెళ్లబుచ్చారట. 
సంతసించిన జానకీరాముడు హనుమంతుని కాశీ నుండి ఒక శ్రేష్టమైన లింగాన్ని తెమ్మన్నారట. 
కానీ ఏ కారణం చేతనో వాయునందనుడు ముహూర్త సమయానికి తిరిగి రాలేదట. శుభఘడియలు దాటి పోరాదని అమ్మవారు స్వయంగా కృష్ణానదీ ఇసుకతో ఒక సైకత లింగాన్ని తయారు చేసి ప్రతిష్టించారట. 
కొంతసేపటికి లింగంతో తిరిగి వచ్చిన ఆంజనేయుడు అసహాయతతో ఆవేశపడి జానకీ మాత ప్రతిష్టించిన సైకత లింగాన్ని పెకలించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారట. అప్పుడు సీతారామచంద్రమూర్తి మారుతీనందనుని ఊరడించి ఆయన తెచ్చిన లింగాన్ని దూరంగా తోకతో చుట్టి విసరమని, ఆ లింగం ఎక్కడ పడుతుందో ఆ  క్షేత్రంలో తానూ స్వయంగా ప్రతిష్ఠిస్తాను అని చెప్పారట. అమిత బలశాలి అయిన రామదూత విసిరిన ఆ లింగం కృష్ణానది ఉత్తర తీరంలో పడినది. 
నేడు ఐలూరు గా పిలవబడుతున్న గ్రామంలో శ్రీ రాముడు ప్రతిష్టించిన లింగం ఉన్న ఆలయం ఉన్నది. పక్కనే శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్రుని ఆలయం కూడా ఉంటుంది. 
ఇలా రెండు చోట్ల దశరథ రాముడు శివలింగాలను ఏకకాలంలో ప్రతిష్టించడం వలన వీటిని ఉభయ రామేశ్వర క్షేత్రాలు అని పిలుస్తారు. 

ఆలయ విశేషాలు 





ఆలయం లోనికి వెళ్ళడానికి పడమర మరియు ఉత్తర దిశలలో ప్రవేశ ద్వారాలుంటాయి. ఎత్తైన రాజగోపురాలు కనపడవు గానీ పడమర ద్వారం పైన శ్రీ నటరాజ మూర్తిని ఉంచారు. ఉత్తర ద్వారం పైన ఆలయ పౌరాణిక గాధను తెలిపే శిల్పాలను ఉంచారు. శ్రీ సీతారామ లక్ష్మణులు, భుజం మీద  కాశీ లింగం తోకతో సైకత లింగాన్ని పెకలించడానికి ప్రయత్నం చేస్తున్న అంజనాసుతుని విగ్రహాలు సుందరంగా మరియు సందర్భోచితంగా కనిపిస్తాయి. ఇలాంటి శిల్పాలను ఆలయ విమాన గోపురం మీద కూడా ఉంచారు. 
ఈ క్షేత్రానికి శ్రీ కాలభైరవ స్వామి క్షేత్ర పాలకుడు. ఈయన సన్నిధి ప్రధాన ఆలయానికి వెనుక దక్షిణ ముఖంగా ఉంటుంది. 
ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్థంభం, నాగ ప్రతిష్టలు, నవగ్రహ మండపం, శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధులు కనిపిస్తాయి. 
పొడవైన ముఖమండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు ఉంటాయి. ఒక దానిలో శ్రీ గణపతి మరో దానిలో శ్రీ పార్వతీ దేవి కొలువై దర్శనమిస్తారు. 
ప్రధాన గర్భాలయంలో చిన్న వర్తులాకార పానవట్టం పైన శ్రీ రామలింగేశ్వర స్వామి పంచలోహ మండపం క్రింద పైన చిన్న కొప్పు మరియు బ్రహ్మసూత్రం ధరించి చక్కని విబూధి, చందన కుంకుమ మరియు పుష్ప అలంకారణంలో కొలువై ఉంటారు. 
ఈ ప్రాంతంలో కొన్ని ఆలయాలలో కొప్పుతో ఉన్న శివలింగాలు కనిపిస్తాయి. అలా కనపడటానికి వేరువేరు గాధలు వినిపిస్తాయి.  కానీ ఇక్కడ కొప్పు ఉండటానికి కారణం ప్రతిష్టించిన లింగం పెరగడాన్నిగమనించిన భూజాత గుప్పెడు ఇసుకను ఉంచడంతో పెరుగుదల నిలిచిపోయిందట. 
లింగం మీద కనిపించే ప్రత్యేకమైన బ్రహ్మ సూత్రం స్వయంగా సీతారాములు లిఖించినట్లుగా తెలుస్తోంది. గమనిస్తే లింగంపైన తాడు చుట్టిన గుర్తులు కనిపిస్తాయి. వాటిని ఆంజనేయుని తోక గుర్తులు అని చెబుతారు. 
నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. 
కార్తీకమాస పూజలు గొప్పగా జరుగుతాయి. మహాశివరాత్రికి పెద్ద ఉత్సవం ఏర్పాటు చేస్తారు. 
కృష్ణానదీ తీరంలో పది కిలోమీటర్ల పరిధిలో శ్రీ రామ, శ్రీజానకీదేవి మరియు శ్రీ లక్ష్మణ స్వామి ప్రతిష్టించిన శివ లింగాల సందర్శన చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.  అదే సమయంలో అక్కడే కొలువైన శ్రీ వైకుంఠ నారాయణుని వివిధ అవతారాల ఆలయాలు ఆ అనుభూతిని స్థిరపరుస్తాయి. 










తూములూరు మరియు చిలుమూరు గ్రామాలకు గుంటూరు, మంగళగిరి, విజయవాడ మరియు  తెనాలి పట్టణాల నుంచి రహదారి మార్గంలో చేరుకోవచ్చును. 








వసతి మరియు భోజనాలు పై పట్టణాలలోలభిస్తాయి. స్వంత వాహనంలో వెళితే చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న మరికొన్ని పురాతన ఆలయాలను దర్శించుకునే అవకాశం స్వంతం చేసుకోవచ్చును. 

 నమః శివాయ !!!!



 
 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...