అవనిగడ్డ ఆలయాలు
ఆలయ సందర్శనం అనగానే మనందరి దృష్టి తమిళనాడు, కేరళ లేకపోతే కర్ణాటక వైపు మళ్లుతుంది. కానీ మన రాష్ట్రంలో గ్రామగ్రామాన ఒక చక్కని పురాతన ఆలయం కనపడుతుంది.
సుందర శిల్పకళ , కొలువైన అర్చామూర్తి, గొలుసుకట్టు ఆలయాలలో భాగం ఇలా ఎన్నో విశేషాలు ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక ఆలయాలలో కనిపిస్తుంది.
లేపాక్షి, గుంటూరు సమీపంలోని చేబ్రోలు ఆలయాలు, చందోలు, మాచర్ల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం, చెరుకూరు, దుగ్గిరాల, నందివెలుగు, కొలకలూరు, శ్రీ వల్లభస్వామి ఆలయం, వంగిపురం, శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయాలు పొన్నూరు, బాపట్ల, మరియు చినగంజాం. మరో గమనించదగిన అంశం ఏమిటంటే ప్రతి చోట ఒక శివాలయం మరియు ఒక విష్ణాలయం పక్కపక్కన ఉండటం నాటి పాలకుల ముందు చూపు తెలుపుతుంది.
ప్రతిఒక్క ఆలయం ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఒకదానిని మరో దానితో పోల్చలేము. అంతటి గొప్ప ఆలయాలు. ఆ కోవకు చెందినవే పవిత్ర కృష్ణానదీతీరంలోని అవనిగడ్డ పట్టణంలో నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం మరియు శ్రీ రాజశేఖర స్వామి ఆలయం.
శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం నేటికీ తన ప్రత్యేకతలను నిలుపుకొని చరిత్రకు సాక్షిగా నిలిచి ఉన్నది.
పక్కనే ఉన్న శ్రీ రాజశేఖర స్వామి ఆలయం(శివాలయం) అనేక మార్పులు చేర్పులకు గురి అయినప్పటికీ తన పురాతన చిహ్నాలను ప్రదర్శిస్తుంది.
శ్రీ రాజశేఖర స్వామి ఆలయం
చోళరాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం అనేక ప్రత్యేకతలతో నిండి ఉన్నది. అసలు ఈ ఆలయం ప్రధాన ఆలయం అయిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంకి ఉపాలయంగా ఉండేది. అనంతర కాలంలో శివాలయంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకొన్నది.
సువిశాల ప్రాంగణంలోనికి తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ద్వారం గుండా ప్రవేశిస్తే ఎదురుగా పద్మాసన భంగిమలో ఉపస్థితులైన మహేశ్వరుని విగ్రహం కనిపిస్తుంది. ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు.
ముఖమండపం చేరుకొని లోనికి వెళితే వరుసగా మూడు సన్నిధులు కనిపిస్తాయి. మధ్యలో ఉన్న గర్భాలయంలో శ్రీ రాజశేఖర స్వామి లింగ రూపంలో చక్కని చందన విభూతి లేపనాలతో కుంకుమ అలంకరణలో దివ్యంగా దర్శనమిస్తారు. మరో సన్నిధిలో అమ్మవారు, మూడో సన్నిధిలో విఘ్ననాయకుడు శ్రీ వినాయకుడు కొలువై ఉంటారు.
ఒకపక్కన శ్రీ కాలభైరవ స్వామి ఉంటారు.
ఈ ఆలయంలో మూడు విశేషాలు కనిపిస్తాయి. ప్రధాన ద్వారా తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ గర్భాలయం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది. చాలా అరుదుగా పడమర ముఖంగా ఉండే శివాలయం కనిపిస్తుంది. శ్రీ రాజశేఖర స్వామి లింగం విశేషమైన బ్రహ్మ సూత్రం ఉంటుంది. మూడో విశేషం ఏమిటంటే మన రాష్ట్రంలో అరుదుగా కనిపించే శ్రీ చెండికేశ్వర సన్నిధి ఈ ఆలయంలో ఉత్తరం వైపున సరిగ్గా గోముఖి క్రింద ఉంటుంది. ఇలాంటి శ్రీ చెండికేశ్వర సన్నిధి మరెక్కడా కనిపించదు.
చోళ రాజుల కాలంలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించిన ఆలయ ప్రధాన రూపం అలానే ఉంచి అభివృద్ధి చేయడం అభినందనీయం !!
శ్రీ వినాయక చవితి, దసరా నవరాత్రులు, కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు.
నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే శ్రీ రాజశేఖర స్వామి ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల సౌకర్యార్ధం తెరిచి ఉంటుంది.
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం
అవనిగడ్డలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అంటే తెలియక పోవచ్చును కానీ గాలిగోపుర ఆలయం అంటే ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.
ఏడు అంతస్థుల తొంభై తొమ్మిది అడుగుల ఎత్తైన ఈ రాజ గోపురం పట్టణంలోని ఏ మూల నుంచి అయినా కనిపిస్తుంది. మన రాష్ట్రంలో మంగళగిరి ఆలయ రాజగోపురం అత్యంత ఎత్తైనదిగా ప్రసిద్ధి. రెండవ స్థానం మాత్రం అవనిగడ్డ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయానిదే !!
రాజగోపుర ప్రవేశ మార్గానికి ఒక పక్కన వినుతా సుతుడు మరో పక్క అంజనా తనయుడు ప్రభు సేవకు సదా సిద్ధం అన్నట్లుగా నమస్కారభంగిమలో ఉంటారు.
విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన రాతి పీఠం మీద రధం ఆకారంలో చెక్కిన ఆలయం చూపరుల దృష్టిని యిట్టె ఆకర్షిస్తుంది.
నిజానికి కృష్ణాతీరంలో అయిదు లక్ష్మీ నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి అవని గడ్డ, నల్లూరు, రాచూరు, పెదముత్తేవి మరియు నడకుదురు. ఈ అయిదు క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకొంటే మనోభీష్టాలు నెరవేరతాయి అంటారు.
ఎలాంటి రాతి మీద అయినా రమ్యమైన శిల్పాలు చెక్కే సామర్ధ్యం కలిగిన శిల్పులు చోళ రాజుల కాలంలో ఉన్నారు అనడానికి అవనిగడ్డ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం మరో ఉదాహరణ.
ఎఱ్ఱ ఇసుక రాతిని రమణీయమైన శిల్పాలుగా మలిచారు.
శ్రీ రామ పట్టాభిషేకం, శివతాండవం లాంటి శిల్పాల నుండి సన్నని సూక్ష్మ శిల్పాల వరకు గొప్పగా చెక్కారు.
ముగ్గురు స్త్రీలు ఒకరి చేతులను మరొకరు వారి పాదాలను ఇంకొకరు పట్టుకొని ఒక వృత్తాకారంలో ఉన్నట్లుగా చెక్కిన "కంకణ బంధ" శిల్పం నేటి జిమ్నాస్టిక్ విన్యాసాలు నాటికే ప్రజలకు పరిచయం ఉన్నట్లుగా చెబుతున్నాయి.
ముఖం మండపంలోని ముప్పై రెండు స్తంభాలు చక్కని శిల్పాలను ప్రదర్శిస్తాయి.
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ నిర్మాణం రెండవ కుళోత్తుంగుని కాలంలో జరిగినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. అందువలననే స్వామిని "చోళ నారాయణ దేవర" అని కూడా పిలుస్తారు.
ఆలయం మొత్తాన్ని ఎత్తైన గద్దె మీద రథాకారంలో నిర్మించి క్రిందచక్రాలు,
అశ్వాలు, రథసారధులను చెక్కిన విధానం అద్భుతంగా ఉంటుంది. కోణార్క సూర్య దేవాలయం కన్నా ముందు చెక్కిన నిర్మాణం నాటి శిల్పుల నేర్పరితనాన్ని స్పష్టం చేస్తుంది.
పురాణ గాథ
త్రేతాయుగంలో అవనిగడ్డ ప్రాంతాన్ని శ్రీ రామచంద్రుని కులగురువైన శ్రీ వశిష్ట మహర్షి తన ఆశ్రమంగా చేసుకొని ఉన్నారట. ఆ సమయంలో జానకీ దేవి ధర్మశాస్త్రాల గురించి వశిష్టుని వద్ద అభ్యాసం చేశారట. అందువలన ఈ ప్రాంతాన్ని "అవనిజపురం" అని పిలిచేవారట. కాలక్రమంలో అదే అవనిగడ్డగా మారింది అని అంటారు.
ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మూలవిరాట్టును శ్రీ రామచంద్రమూర్తి స్వయంగా ప్రతిష్టించారని కూడా చెబుతారు.
దక్షిణ భారత దేశాన్ని తమ అధీనం లోనికి తెచ్చుకోవాలన్న సంకల్పంతో దండయాత్రకు వచ్చిన చోళ రాజులు ఇక్కడి ప్రాంతాలని గెలవడమే కాకుండా తమ రాకను మరియు విజయాన్ని తెలిపే చిహ్నాలను ఆలయాల రూపంలో భావితరాలకు తెలియచేసే ప్రయత్నం చేసారు.
గతంలో ఈ క్షేత్రం ఒక నృత్య శిక్షణా కేంద్రంగా మరియు ఆయుర్వేద వైద్యశాలగా ఉండినది అని శాసనాధారాలు తెలియచేస్తున్నాయి.
ఆలయ పూజలు మరియు ఉత్సవాలు
గర్భాలయంలో అమ్మవారు శ్రీ లక్ష్మీ దేవిని తన వామాంకం పైన కూర్చోపెట్టుకొని, చుట్టూ తమ ఎడమచేతిని ఉంచి, మగతనాన్ని తెలిపే మీసకట్టుతో ప్రత్యేకంగా దర్శనమిస్తారు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి.
స్వామి వారు ఇక్కడ భూ నీలా రాజ్యలక్ష్మీ సమేత నారాయణ మూర్తిగా కొలవబడతారు.
ఉత్సవిగ్రహాలలో మిగిలిన ఇద్దరు అమ్మవార్లు ఉంటారు.
ఉపాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి కొలువై దర్శనమిస్తారు. వాయునందనుడు భక్తసులభుడు.
స్వామిని ఆశ్రయించి తమ కష్టం చెప్పుకొని నియమంగా ప్రదక్షిణాలు చేస్తే కోరిక సిద్ధిస్తుందని, కష్టాలు తొలగిపోతాయని చెబుతారు.
నిత్యం ఉదయం ఆరుగంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుచి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుగుతాయి.
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, శ్రీ రామనవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఉగాది ఆస్థానం, దీపావళి మరియు ఇతర పర్వదినాలను జరుపుతారు.
వైశాఖ పౌర్ణమి నాడు శ్రీ లక్ష్మీ నారాయణనుల తిరుకళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. వేలాదిగా భక్తులు పాల్గొంటారు.
చక్కని శిల్పకళకు, ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం అవనిగడ్డ. తప్పక సందర్శించవలసిన క్షేత్రం.
మరో విశేషం
శ్రీ రాజశేఖర స్వామి మరియు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాల మధ్య రుక్మిణీ సత్య భామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కొలువైన గీతామందిరం నిర్మించారు. తమ మనోభీష్టాలను నెరవేరాలని కోరుకొంటూ భక్తులు మందిరానికి నియమంగా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి. " ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం క్లిమ్ కృష్ణాయ గోవిందాయ, గోపీజన వల్లభాయ నమః ఓం నమో నారాయణాయ శ్రీ కృష్ణాయ నమః" అని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేస్తే మనోభీష్టం తొందరగా నెరవేరుతుంది అని అంటారు.
విశిష్ట చరిత్రకు నిలయమైన అవనిగడ్డ చుట్టుపక్కల ఎన్నో విశేష ఆలయాలు, విశేషాలు కలవు. విజయవాడ, మచిలీపట్నం మరియు రేపల్లె నుండి రహదారి మార్గం లో సులభంగా అవనిగడ్డ చేరుకోవచ్చును. వసతి సౌకర్యాలు తగు మాత్రంగా లభిస్తాయి.