5, ఆగస్టు 2023, శనివారం

Swayam Bhu Selva Ganapati Temple, Vellore

 

                            ఏక దంతుని ఏకాదశ మూర్తులు 

పురాణ కాలం నుండి తమిళనాడులోని పాలరు నదీ తీరంలో ఉన్న వెల్లూరు ప్రసిద్ధ పర్యాటక మరియు వ్యాపార కేంద్రం. 
భారతదేశంలోని ప్రతి గ్రామంలోనూ ఏదోఒక దేవీ దేవతల ఆలయాలు కనిపిస్తాయి. ఇవి కాస్త ఎక్కువ తమిళనాడులో ! 
ప్రపంచ ప్రఖ్యాత ఆలయాలను నిర్మించిన చోళ, పాండ్య, పల్లవ, హొయసల, విజయనగర పాలకులు ఏలిన ఈ ప్రాంతంలో అనేక ఆలయాలు కనపడటం సామాన్య విషయం. గమనించవలసిన అంశం ఏమిటంటే వీటిలో కొన్ని విశేషభక్తాదరణ పొందినవి కావడం ! 
నగరంలో శ్రీ జల కంఠేశ్వర స్వామి ఆలయం (కోటలో) ఎంతో చరిత్ర కలిగినది. కైలాసనాధుని ఆలయాలు మేల్పడి, తిరువళ్ళం, విరించిపురం, ముల్లిపట్టు, సిఱుకరంబూరు మరియు సంపత్ మహర్షులు ప్రతిష్టించిన లింగాలు కలిగిన సదారణ్య క్షేత్రాలు ఏడు. ఇవి బాగా ప్రచారంలో ఉన్నవి. ఇంకా ఎన్నో ఉన్నాయి.
అలాంటి ఆలయాలను వెదుకుతూ మొన్న 30.07.2023 న వెల్లూరులో కొలువైన శివ పరివార ఆలయాలను సందర్శించుకునే భాగ్యం దక్కింది. 
మూడు ఆలయాలలో మొదట సందర్శించినది  నగర శివార్లలో శెంబాక్కం అనే ప్రాంతంలో కొలువైన శ్రీ స్వయంభూ సెల్వ వినాయక ఆలయం. 
ఈ ఆలయం సుమారు పదిహేడవ శతాబ్దం నాటిదిగా లభించిన ఆధారాల వలన తెలియవస్తోంది. 
















ఆలయ గాధ 

సుమారు పదహారవ శతాబ్దంలో నేటి తంజావూరు మరాఠా రాజుల పాలన లోనికి వెళ్ళింది. వారు సుమారు నూట అరవై సంవత్సరాలు తంజావూరు ప్రాంతాన్ని తమ పాలనలో ఉంచుకొన్నారు. ఆ సమయంలో వారి తక్కిన తమిళ ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరింప తలపెట్టారు. కానీ విజయవంతం కాలేకపోయారు. 
అలాంటి ఒక సమయంలో "తుక్కోజి" మరాఠా రాజు ఈ ప్రాంతాలకు వచ్చారట. దురదృష్టవశాత్తు ఆయన ప్రయాణిస్తున్న రధం తాలూకు చక్రం ఇక్కడ విరిగిపోయిందట. 
వెంట ఉన్నవారు మరమ్మత్తులు చేయసాగారు.రాత్రివేళ కావడాన ఆయన అక్కడే విశ్రమించారట. 
నాటి రాత్రి మరాఠావారు ఎక్కువగా పూజించే విఘ్ననాయకుడు వినాయకుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చారట. " నీ రధ చక్రం విరిగిన చోట భూమిలో నేను పదకొండు సాలగ్రామ లింగ రూపాలలో స్వయంభూ గా ఉద్భవించాను. వెలికి తీసి ఆలయం నిర్మించు" అని ఆదేశించారట. తుక్కోజి బయలుదేరిన పనిని పక్కన బెట్టి పార్వతీనందనుని వెలికితీసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. 
కొంత లోతుకు త్రవ్వగా అక్కడ గణపతి చెప్పినట్లుగా పదకొండు సాలగ్రామ లింగరూపాలు దర్శనమిచ్చాయట. అవన్నీ కూడా వివిధ దిక్కులను చూస్తూ ఉన్నాయట. గజాననుడు చెప్పినట్లు వాటి స్థానాలను కదిలించకుండా, పై కప్పు లేకుండా ఆలయ నిర్మాణం చేశారట తుక్కోజి. 
నేటికీ అదే విధంగా పైకప్పు లేకుండా కనపడతారు ఏకాదశ ఏకదంతుడు. మధ్యలో ఉన్న పెద్ద లింగాకార "సెల్వ వినాయకుడు"  పక్కన  తుక్కోజి రధం తాలూకు విరిగిన చక్రం యొక్క భాగం కనపడుతుంది. 















ఆలయ విశేషాలు 

వెల్లూరు నగర శివార్లలో ఉన్న శెంబాక్కం లో విశాల ప్రాంగణంలో తూర్పు ముఖంగా నిర్మించారు దేవాలయాన్ని. వెలుపల దీప మండపం, ఈశాన్యంలో కోనేరు ఉంటాయి. ప్రవేశ ద్వారం పైన దీప మండపం పైన శ్రీ సిద్ది బుద్ది వినాయకుని విగ్రహాన్ని సుందరంగా మలిచి ఉంచారు. 
ప్రవేశ ద్వారానికి ఇరుపక్కలా వర్ణమయ శివ పరివార శిల్పాలను ఏర్పాటు చేశారు. ఎత్తైన ముఖ మండపానికి పైన షట్భుజ గణపతి దేవేరులు సిద్ది బుద్ది, నంది సమేతంగా మూషిక వాహనులై కనిపిస్తారు. 
నేలలో ఉపస్థితులైన స్వయంభూ సెల్వ వినాయకుడు, మహా గణపతి, హేరంబ గణపతి, బాల గణపతి ఆదిగా గల వారి చుట్టూ  నలుచదరపు మండపం నిర్మించబడింది. మండపంలో అష్ట వినాయక రూపాలను ఏర్పాటు చేశారు. ఈశాన్యంలో నవగ్రహ మండపం ఉంటుంది. దీనిలో విశేషం ఏమిటంటే శనీశ్వరుడు కొద్దిగా పక్కకు తిరిగి సెల్వ వినాయకుని చూస్తూ కనపడతారు. 
సెల్వ వినాయకునికి గరిక పూజ చేయిస్తే శని ప్రభావం తొలగిపోతుందని చెబుతారు. 
ఏకాదశ వినాయకుల వెనుక పక్కన శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, శ్రీ మీనాక్షీ అమ్మవారు కొలువై ఉంటారు. పక్కన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. 
పైకప్పు లేని మధ్య భాగంలో ఏకాదశ వినాయకులు కొలువై ఉంటారు. మధ్యలో శ్రీ స్వయంభూ సెల్వ వినాయకుడు, పక్కన, ఎదురుగా మిగిలిన రూపాలు దర్శనమిస్తాయి. దక్షిణం పక్కన చుట్టూ నీరు నిండిన గుంటలో ఉన్న చిన్నలింగాన్ని బాల గణపతి అంటారు. ఈయనకు అభిషేకం అర్చన చేస్తే  చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నది స్థానిక నమ్మకం. 
మరో ముఖ్య విషయం ఏమిటంటే స్వయంభూ సెల్వ వినాయకుడు సంవత్సరానికి కొద్ది కొద్దిగా పెరుగుతున్నాడన్నది. కాణిపాకంలో మాదిరి పది సంవత్సరాల క్రిందట చేయించిన వెండి కవచం నేడు స్వామికి సరిపోవడం లేదన్నది అర్చకుల మాట. 
ధ్వజస్థంభం ఈ ఏకాదశ వినాయకుల మధ్య ఉండటం మరో ప్రత్యేకత. 











నిత్యం నాలుగు పూజలు జరిగే ఈ ఆలయంలో పౌర్ణమి, అమావాస్య, చవితి రోజులలో, సంకట హర చతుర్థి నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. 
గణపతి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, త్రయోదశి పూజలు, శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. 
వెల్లూరు బస్టాండ్ లేదా కాట్పాడి రైల్వే స్టేషన్ నుండి ఆటోలో సులభంగా శెంబాక్కం శ్రీ స్వయం భూ సెల్వ వినాయక ఆలయానికి చేరుకోవచ్చును. 

ఓం గం గం గణపతయే నమః !!!!

 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...