14, ఆగస్టు 2023, సోమవారం

Vamasamudram Temple, Kurnool


    నిరాకారుని మరో నివాసం 

లోకేశ్వరునికి భూలోకంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో లెక్క తెలియదు. ప్రముఖ క్షేత్రాలలో, మారుమూల పల్లెలలో, త్రవ్వకాలలో ఇలా ఎక్కడో అక్కడ ఒక లింగం కనపడుతూనే ఉంటుంది. 
అలా ఒక మారుమూల పల్లెలో ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రిందట నిర్మించిన ఆలయంలో నిరాకారుడు లింగాకారంలో దర్శనమివ్వడం మనందరి అదృష్టం గా భావించాలి. 















ఈ ఆలయం వెనుక దాగి ఉన్న గాధల గురించి ఏమాత్రం తెలియడం లేదు. ఎవరు నిర్మించారు అన్నదానికి కూడా తగిన ఆధారాలు లేవు. 
కానీ నిర్మాణ శైలి ప్రకారం అంతరాలయం చాళుక్యుల కాలంలో నిర్మించినట్లుగా అర్ధం అవుతుంది
ముఖ మండపం, ఆలయ ప్రవేశ ద్వారం, పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, రెండింటి మధ్య మరో మండపం విజయనగర రాజుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది. 
చక్కని శిల్పాలను మండప స్థంభాలపైన చెక్కారు. 
మండపం లోని స్తంభాల మధ్య ఎలాంటి సున్నము, అతుకు పెట్టకుండా రాళ్లను ఒకదాని మీద మరొకటి సమానంగా పేర్చిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుమారు ఆరు వందల సంవత్సరాల తరువాత కూడా నేటికీ అవి స్థిరంగా ఉండటం నాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. 
ఆలయం వెలుపల చుట్టూ గదుల లాంటి నిర్మాణాలు ఉండేవని  శిధిలాలు తెలుపుతున్నాయి. ఒకప్పుడు గ్రామం చుట్టూ పెద్ద మట్టి ప్రహరీ గోడ ఉండేదని పెద్దలు చెబుతారు. వారి మాటలు నిజమని అందానికి నిదర్శనంగా గోడ శిధిలాలు గ్రామానికి వెలుపల కనపడతాయి.  













ముఖమండపంలో శ్రీ గణపతి, శ్రీ వీరభద్రస్వామి కొలువై ఉంటారు. 
అర్ధ మండపంలో నందీశ్వరుడు స్వామివారి ఆజ్ఞకు ఎదురు చూస్తున్నట్లుగా ఉపస్థితులై ఉంటారు. గర్భాలయంలో శ్రీ చంద్రమౌలీశ్వర స్వామి లింగ రూపంలో చందన , విభూతి కుంకుమ లేపనాలతో, చక్కని వస్త్రధారణతో పుష్ప మాలాలంకృతులై దర్శనమిస్తారు. 
లింగం పైన బ్రహ్మ సూత్రం కనిపిస్తుంది. 
నేను ఇప్పటి దాకా చూసిన అనేక బ్రహ్మ సూత్ర లింగాల పైన లిఖించిన బ్రహ్మ సూత్రాలు ఏ రెండూ కూడా ఒక మాదిరిగా లేకపోవడం విచిత్రంగా అనిపించింది.  











చాలా కాలం నిర్లక్ష్యానికి గురైన ఈ ఆలయం స్థానిక యువకుడు శివ భక్తుడైన శ్రీ ప్రవీణ్ చొరవతో నేటి రూపాన్ని సంతరించుకొన్నది. 
నవగ్రహ మండపం, నూతన ధ్వజస్తంభాలు, నాగ ప్రతిష్టలు, ఆలయానికి నీటి వసతి, ఒకపక్కన దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు విశ్రాంతి తీసుకోడానికి రెండు గదులు. ఇవన్నీ శ్రీ ప్రవీణ్ తీసుకొన్న నిర్ణయాల వలన దాతల ద్వారా సమకూరాయి. 
నిత్య పూజకు కూడా కొందరు భక్తులు నెల నెలా కొంత మొత్తాన్ని ఇవ్వడం జరుగుతోంది. 
మరికొన్ని వసతుల కొరకు కావలసిన నిధుల కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
ఈశ్వరానుగ్రహంతో అవి కూడా త్వరలోనే సమకూరుతాయని ఆశిద్దాము. 
























వామ సముద్రం గ్రామం కర్నూలు పట్టణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో డోన్ రహదారిలో వచ్చే బృందావన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (బిట్స్ )కాలేజీ వద్ద నుండి లోపలికి వెళ్ళాలి. 
నేరుగా బస్సులు లభించవు. 
బిట్స్ కాలేజీ వద్ద దిగితే అక్కడ నుండి ఆటోలు లభిస్తాయి. 

నమః శివాయ !!!!



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...