12, ఫిబ్రవరి 2023, ఆదివారం

Sri Vilvanatheswara Temple, Thiruvalam

           శ్రీ విల్వనాథేశ్వర స్వామి ఆలయం, తిరువాళం 


కైలాసనాధుడు పుడమిలో కొలువైన అనేక క్షేత్రాల గాధలు, ప్రత్యేకతలు ఒక్కదానితో మరొకటి పోల్చలేనివి. అంతటి విశేషతలు కలిగినవి. అలాంటి వాటిలో శ్రీ విల్వనాథేశ్వర స్వామి కొలువైన తిరువాళం ఒకటిగా పేర్కొనాలి. 
తిరువాళం ముక్తి స్థలంగా కీర్తించబడినది. 
 క్షేత్రంలోని వినాయకుడు, అమ్మవారు,నందీశ్వరుడు ఆలయ వృక్షం అన్నీ కూడా తమవైన ప్రత్యేకతలు కలిగి ఉండటం చెప్పుకోవలసిన విషయం. 









ఆలయ పురాణ గాథ 

ఆలయ గాథ మనం అనేక శైవ క్షేత్రాలలో విన్నదే ! యుగాల క్రిందట ఈ ప్రాంతమంతా బిల్వ వృక్షాలతో నిండి ఉండేదట. సమీపంలోకి పశువుల కాపరులు తమ గోవులను మేత కోసం ఇక్కడికి తోలుకొని వచ్చేవారట. 
గోవుల మందలో ఒక ఆవు బిల్వ వృక్షం క్రింద ఉన్న చీమల పుట్టలో పాలను ధారగా వదిలేదట. చూసిన కాపరులు గ్రామపెద్దకు మనవి చేశారట. వారు పుట్టాను తొలగించి చూడగా లోపల లింగరాజు దర్శనమిచ్చారట. 
విషయం తెలిసిన ప్రాంత పాలకుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారని ఆలయ గాథ\ తెలుపుతోంది. 
అనంతర కాలంలో అరణ్యాన్ని, పక్కన ఉన్న పర్వతాలను"కంజన్"అనే రాక్షసుడు ఆక్రమించుకొని ప్రజలను ఇక్కట్లకు గురి చేయసాగాడట. అతడు పెడుతున్న ఇబ్బందుల గురించి ఆలయ పూజారి పరమాత్మకు ప్రతిరోజు విన్నవించేవారట. ఒకనాడు మహేశ్వరుడు వాహనమైన నందీశ్వరుని పిలిచి అసురుని అంతం చేయమని ఆదేశించారట. 
లయకారుని ఆజ్ఞ మేరకు శిలాద తనయుడు వాడి కొమ్ములతో రాక్షసుని శరీరాన్ని ఎనిమిది భాగాలుగా చీల్చి ఎనిమిది దిక్కులకు విసిరివేశారట. 
అప్పటికీ మరణించని అసురుడు తనను క్షమించి తన పాపాలను తొలగించమని ఆర్తితో ప్రార్ధించాడట. కరుణామూర్తి అయిన కైలాసనాధుడు కరుణించి కంజన్ కు ముక్తిని ప్రసాదించారట. అంతే కాకుండా అతని శరీరభాగాలు పడిన ప్రదేశాలలో తాను కొలువై ఉంటానని, అతని రక్తపు బిందువులు పడిన పర్వత ప్రాంతమంతా శివ నిలయంగా మారిపోతుంది అని వరమిచ్చారట. అదేవిధంగా కంజన్ దేహపు భాగాలు పడిన "లాలాపేట్టై, శీకరాజపురం, మావేరి, వడక్కాల్,  తెంకల్, మాణియంపట్టు, కుగయనల్లూరు మరియు నరసింగపురం గ్రామాలలో సర్వేశ్వరుడు స్వయంభూ లింగంగా ఉద్భవించారు అని చెబుతారు. తరువాత అక్కడ ఆలయాలు నిర్మించబడినాయి అని తెలుస్తోంది. 
 నేటికీ కంజగిరి పర్వతం మీద ఎక్కడ త్రవ్వినా లింగాలు లభిస్తాయి స్థానిక విశ్వాసం. 



















సహజంగా శివాలయాలలో నందీశ్వరుడు గర్భాలయంలో కొలువు తీరిన లింగరాజును తదేక దృష్టితో వారి పిలుపుకు సదా సిద్ధం అన్న భంగిమలో కనపడతారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే ! కానీ ఇక్కడ నంది గర్భాలయానికి వ్యతిరేక దిశలో కొలువై కనపడతారు. దానికి కారణం 
కంజన్ మృతి చెందినా భవిష్యత్తులో మరి కొందరు అసురులు రావచ్చన్న అనుమానంతో కంజనగిరి వైపు చూస్తూ కనపడతారు. దీనిని ఒక ముందు చూపు చర్యగా అభివర్ణిస్తారు. 
ఇలా నందీశ్వరుడు స్వామికి వ్యతిరేక దిశలో కొలువై కనిపించే ఆలయం తమిళనాడులో మరొకటుంది. 
చెన్నై చుట్టుపక్కల చోళ రాజులు పదో శతాబ్ద కాలంలో నిర్మించిన "తొండై మండల నవ గ్రహ ఆలయాలు" ఉన్నాయి. వీటిల్లో"సోమ మంగళం"లో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం"(చంద్ర గ్రహానికి ప్రతి రూపం) లో కూడా నంది తూర్పు వైపుకు తిరిగి ఉంటారు. ఆ కథ వేరు. 
ఆ వివరాలు ఈ బ్లాగ్లో ఉన్నాయి. 
 










శ్రీ విల్వనాథేశ్వర స్వామి భక్త సులభుడు, కోరకనే భక్తుల కోర్కెలు తీర్చేవారు అన్నది స్థానిక విశ్వాసం. దీనిని నిరూపించే మరో ఘటన గురించి స్థానికంగా వినపడుతుంది. 
స్వామివారి పూజాదికాలు నిర్వహించే అర్చకస్వామి వృద్దుడయ్యారట. ఆ కారణంగా స్వామి అభిషేకానికి కావలసిన నీరు నది నుండి తేవడానికి శ్రమ పడేవారట. 
గమనించిన గంగాధరుడు ఆలయానికి దూరంగా ప్రవహించే నదిని "నీ... వా" అని ఆదేశించారట. దీనికి అర్ధం "నీవు ఇక్కడికి రా " అని. నాటి నుండి క్షేత్రానికి సమీపంలో ప్రవహించే నదిని "నీవా " అని పిలుస్తారు. 









పేరు వెనుక కథ 

కొన్ని వందల సంవత్సరాల క్రిందట "తీక్కలి" అనే భక్తుడు స్వామిని తదేక భక్తిశ్రద్దలతో సేవించుకొనేవాడట. ఆయన పేరు మీదగా ఈ గ్రామాన్ని "తీక్కలి వళ్ళం"అని పిలిచేవారట. 
అది "తిరువాళం" గా మారడానికి సంబంధించిన గాథ "విఘ్న రాజాధిపత్యం" గురించి ఆది దంపతుల పుత్రులైన శ్రీ గణపతి మరియు శ్రీ కుమార స్వామి మధ్య నెలకొన్న ఆధిపత్య నిరూపణ పోటీకి సంబంధించినది కావడం విశేషం. 
పరమేశ్వరుడు నిర్ణయించిన నిబంధన మేరకు ముల్లోకాలలో ఉన్న నదులలో స్నానమాచరించాలి అన్న సంకల్పంతో మయూర వాహనుడు రివ్వున వెళ్ళిపోయాడు. అలా వెళ్లలేని మూషిక వాహనుడు పరిపూర్ణ విశ్వసంతో, భక్తిగా తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి విజయం సాధించాడు.
తమిళంలో "వాళం" అనగా ప్రదక్షిణ. ఆది దంపతుల చుట్టూ చేసిన పవిత్ర ప్రదక్షిణంగా "తిరు వాళం" గా పిలవబడుతోంది.    










ముక్తి క్షేత్రం 

పురాతన తమిళ గ్రంధాల ఆధారంగా మరో గాథ ప్రచారంలో ఉన్నది. 
ఒక విషయంలో సందేహనివృత్తి కొరకు  వైకుంఠవాసుడు కాంజ గిరి మీద కైలాసనాధుని సాక్షాత్కారం ఆశిస్తూ తపస్సు చేశారట. 
దర్శనం ఇచ్చిన జ్ఞాన ప్రదాత శ్రీహరి కోరిక మేరకు తిరు వాళం మోక్ష క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చారట. 
దానిని నిరూపించే ఘటన గురించి ఆలయ విశేషాలలో ఇలా  వివరించబడింది అని తెలియవస్తోంది. 
సమీప గ్రామంలో నివసించే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పావన గంగా నదిలో నిమజ్జనం చేయదలచి బయలుదేరారట. మార్గంలో ఇక్కడ ఆగి పుష్కరణి పక్కన తండ్రి అస్థికలు ఉన్న పాత్రను ఉంచి స్నానం చేసి పరమాత్మను సందర్శించుకొన్నారట. తిరిగి ప్రయాణం ఆరంభించబోతూ చూడగా పాత్రలో అస్థికలను బదులుగా సువాసనలను వెదజల్లుతున్న మల్లెపూల దండ కనపడిందట. 
క్షేత్ర మహత్యాన్ని తెలుసుకొన్న అతను వారణాసి వెళ్లే ఆలోచన విరమించుకొని  అక్కడే తండ్రికి చేయవలసిన కర్మకాండను పూర్తి చేశారట. 
ఇలాంటి గాధలు ఎన్నో వినిపిస్తాయి. 

















ఆలయ విశేషాలు 

ఊరికి ఈ పేరు రావడానికి గల రెండు కారణాలను పైన తెల్పబడినాయి. అదే విధంగా మరో కారణం కూడా చరిత్ర పుస్తకాలలో పేర్కొనబడినట్లుగా అవగతం అవుతోంది. 
దాని ప్రకారం ఒకటవ రాజరాజ చోళుని సోదరి "కుందవై" ని వివాహమాడిన "వల్లవరాయన్ వండియదేవన్" వంశీకుల కులదైవం శ్రీ విల్వనాథేశ్వర స్వామి. వల్లవరాయన్ తొండై మండలాన్ని పరిపాలించినట్లుగా తెలియవస్తోంది. 
ఆలయంలోని చాలా నిర్మాణాలు ఆయన కాలంలో జరిగినట్లుగా శాసనాధారాలు పేర్కొంటున్నాయి. 
తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి మూడు ప్రాకారాలు కలవు. ఆలయానికి వెలుపల శ్రీ వినాయక సన్నిధి, ఆలయాభివృద్దికి పాటుపడిన శ్రీ శివానంద మౌన స్వామిగళ్ జీవ సమాధి ఉంటాయి. 
మూడంతస్థుల రాజగోపురం దాటి రెండవ ప్రాకారం లోపలికి ప్రవేశించడానికి దారి తీసే రెండవ గోపురం వద్ద రాతితో మలచిన సుందర తొట్టెలు కనిపిస్తాయి. వాటిని మలచిన తీరు అబ్బురపరుస్తాయి. 
రెండవ ప్రాకారంలో శ్రీ వినాయక, శ్రీ ఆత్మలింగేశ్వర, శ్రీ కాలభైరవ, శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్ల సన్నిధులుంటాయి. మరొక వైపున శ్రీ సహస్ర లింగేశ్వర సన్నిధి కనపడుతుంది. 
మూడవ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వనాథ, శ్రీ అరుణాచలేశ్వర, శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీ సదాశివేశ్వర, శ్రీ ఆనందేశ్వర, శ్రీ అంబికేశ్వర ఇత్యాది సన్నిధులు కనపడతాయి. 
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సన్నిధి విడిగా ఉంటుంది. ప్రముఖ కవి శ్రీ అరుణగిరి నాథర్ తన "తిరుప్పుగళ్"లో స్వామిని కీర్తిస్తూ కీర్తనలు రచించారు. 
ప్రత్యేక మండపంలో గాయక శివభక్తులైన అరవై మూడు మంది నయనారులు కొలువై కనిపిస్తారు. 
అమ్మవారు శ్రీ వళ్ళాంబిక లేక శ్రీ తనుమాథ్యాంబాల్ ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తారు. ఒకప్పుడు అంబికా ఉగ్రరూపంలో ఉండేవారట. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ప్రార్ధించడం వలన శాంతించారని చెబుతారు. 
గర్భాలయంలో శ్రీ విల్వనాథేశ్వర స్వామి లింగ రూపంలో సుందర చందన , విభూతి కుంకుమ రేఖలతో, వివిధ వర్ణ పుష్ప మాలలతో రమణీయంగా దర్శనమిస్తారు. 
గర్భాలయం పక్కన నీరు నిండిన చిన్న గుంటలో ఉన్నశ్రీ జలకంఠేశ్వర స్వామి కొలువై ఉంటారు. సకాలంలో వర్షాలు పడకపోతే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం వలన వానలు పడతాయని నమ్ముతారు. 
మహా నంది పక్కన నవగ్రహ మండపం ఉంటుంది. 
ప్రాంగణంలో శ్రీ మహావిష్ణువు సన్నిధి ఉండటం వలన తిరువాళం హరిహర క్షేత్రంగా పేర్కొనబడింది. 

ఆలయ ప్రత్యేకతలు 

ముఖ మండపంలోని మహా నంది, ధ్వజస్థంభం వద్ద నంది, అర్ధ మండపంలోని నంది విగ్రహాలు తూర్పు ముఖంగా ఉంటాయి. 
ఉపాలయాలో ఒక విమానం మీద ఇరవై ఏడు జన్మ నక్షత్ర దేవతల విగ్రహాలు ఉండటం మరెక్కడా చూడని విశేషం. 
సుమారు వెయ్యి సంవత్సరాల పైబడిన మామిడి వృక్షం కొంతకాలం క్రిందట గాలివానకు కూలిపోయింది. ప్రస్తుతం మోడును చూసే అవకాశం లభిస్తుంది. ప్రాంగణంలో వంద సంవత్సరాలకు పైబడిన పనస వృక్షం, ఆలయ వృక్షం అయిన బిల్వం కూడా కనపడతాయి. 
మండప స్థంభాలపైన చక్కని శిల్పాలను చెక్కారు. 
అర్ధ మండపంలో ఒక ప్రదేశంలో నిలబడితే హరిహరులను ఒకేసారి దర్శించుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. 
ప్రాంగణంలో ఎన్నో శిలాశాసనాలు అనేక రాజ వంశాలకు చెందినవి వారు ఆలయ నిర్వహణకు సమర్పించుకున్న కైంకర్య వివరాలను తెలుపుతాయి. వీటిల్లో ఒకటి రెండు తెలుగు శాసనాలు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
ఆలయ మండప స్థంభాలపైన అనేక దేవీదేవతలు విగ్రహాలను సుందరంగా మలచారు. ఆలయ గాధను తెలిపే శిల్పాలు కూడా వీటిలో కనపడతాయి. 

ఉత్సవాలు 

నీవా నది పడమర తీరంలో ఉన్న ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సౌకర్యార్ధం తెరిచి ఉంటుంది. 
నియమంగా ప్రతి నిత్యం అభిషేకాలు, అలంకరణలు, ఆరగింపులు జరుగుతాయి. 
అమావాస్య, పౌర్ణమి, మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. 
ప్రతి పౌర్ణమి రోజున కంజన్ గిరి పైన ఉన్న స్వయంభూ లింగానికి ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు. 
కార్తీక మాసంలో, మహా శివరాత్రికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. 
వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్టి, కాలభైరవ అష్టమి, దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. 
తమిళ "తై" మాసం (జనవరి-ఫిబ్రవరి)పదవ రోజు మహేశ్వరుడు కంజన్ కు ముక్తి ప్రసాదించారని చెబుతారు. ఆ రోజున స్వామి ఊరేగింపుగా పర్వతం వద్దకు తీసుకొని వెళతారు. 
ఆలయ బ్రహ్మోత్సవాలను ఫాల్గుణ మాసంలో పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

పడాల్  పెట్ర స్థలం 

నయనారులు గానం చేసిన పాటికాల కారణంగా రెండువందల డెబ్బై ఆరు శివ క్షేత్రాలు ఈ హోదాను పొందాయి. వీటిల్లో తొండై మండలంలో ఉన్న ముప్పై రెండు పడాల్ పెట్ర స్థలాలలో పదవది  తిరు వాళం. 
నయనారులలో ప్రముఖులైన శ్రీ తిరు జ్ఞాన సంబంధార్ శ్రీ విల్వనాథేశ్వర స్వామిని కీర్తిస్తూ పాటికాలను గానం చేసారు. 
కవి అరుణగిరి నాథర్ తన ఆరాధ్య దైవం అయిన శ్రీ కుమార స్వామి మీద ఎన్నో కీర్తనలను రచించారు. 

ప్రతినిత్యం ఎందరో భక్తులు శ్రీ విల్వనాదేశ్వర్ స్వామి దర్శనార్ధం తరలి వస్తుంటారు. ప్రసాదంగా అందించే బిల్వ పత్రాలను తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. 
ఇన్ని ప్రత్యేకతల నిలయమైన శ్రీ విల్వనాథేశ్వర స్వామి ఆలయం, తిరు వాళం కు  వెల్లూరు (కాట్పాడి) నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. 
చక్కని వసతి సౌకర్యాలు వెల్లూరులో లభిస్తాయి. 
      






నమః శివాయ !!!!!





            

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...