నరకోద్ధారక క్షేత్రం
మన భారత దేశం పుణ్య భూమి. జగన్నాటక సూత్రధారి, అంతర్యామి అయిన నిరాకారుడు వివిధ రూపాలలో స్వయంగా నడయాడి స్థిరపడిన ప్రాంతాలు అనేకం కనిపిస్తాయి.
ముఖ్యంగా లయకారుడైన పరమేశ్వరుని ఆలయాలు లెక్కలేనన్ని అనేక ప్రాంతాలలో నెలకొని ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి ఒక పురాణ ప్రాశస్త్యం కలిగినది కావడం విశేషంగా చెప్పకోవలసిన సంగతి.
అలాంటి విశేష క్షేత్రాలలో ఒకటి సర్వేశ్వరుడు శ్రీ పృథ్విశ్వర స్వామి గా కొలువు తీరిన నడకుదురు ఒకటి. చాలా విశేష క్షేత్రం గా వెలుగులోకి వచ్చిన ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకొందాము.
ద్వాపర యుగం నాటి గాధలతో ముడిపడి ఉన్న క్షేత్రం. నరకాసుర సంహారం ఇక్కడే జరిగిందని, దీపావళి పర్వదినానికి నాంది పలికింది కూడా ఇక్కడే అన్నది వ్యాప్తిలో ఉన్న క్షేత్రపురాణం మాట. స్కంద పురాణంలో ఈ క్షేత్ర ప్రస్తాపన ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.
నరకాసుర ప్రతిష్ఠిత లింగం
పావన కృష్ణా నదీ తీరంలో నెలకొన్న ఈ క్షేత్రంలో నరకాసురుడు ఈశ్వర కటాక్షం కొరకు మరియు చేసిన పాపం తొలగించుకోడానికి తపస్సు చేసినట్లుగా ఆలయ గాథ తెలుపుతోంది.
ఆధిపత్య పోరులో భాగంగా నరకాసురుడు పంచముఖుడు అనే అసురుని సంహరించాడట. ఆ కారణంగా సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోడానికి నారద మహర్షి సలహా మేరకు ఇక్కడ తపస్సు చేశారట.
భూదేవి పుత్రుడైన నరకుడు తల్లి పేరు మీద శ్రీ పృథ్విశ్వర అన్న పేరుతో లింగాన్ని ప్రతిష్టించి పుష్కర కాలం తపస్సు చేసి పొందిన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకో గలిగాడట. మహేశ్వర సాక్షాత్కారంతో మరింత గర్వంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టసాగాడట.
రాక్షస బాధలు తట్టుకోలేక దేవతలు, మహర్షులు కైలాసానికి వెళ్లి త్రిశూలధరుణి శరణు కోరారట. ఆయన వారితో "నరకుని మరణం అతని తల్లి చేతిలోనే ఉన్నది.శ్రీ కృష్ణుని భార్య అయిన సత్యభామ దేవి భూదేవి అంశ. కనుక ద్వారక వెళ్లి మురళీధరుని శరణు కోరండి" అని తెలిపారట.
అంతట వారంతా ద్వారకా నగరానికి వెళ్లి వాసుదేవునితో నరకుని వలన ఎదురవుతున్న ఇక్కట్లను తెలుపుకొన్నారట.
అభయమిచ్చిన నందనందనుడు దేవేరితో కలిసి నరకుని మీదకు దండెత్తి వెళ్లారట. సమరంలో శ్రీ కృష్ణుడు సొమ్మసిలిపోగా సత్యభామాదేవి రంగంలోకి దిగి నరకాసురుని సంహరించినది ఈ ప్రదేశంలోనే అన్నది స్థలపురాణ గాథ.
లోకకంటకుడి మరణంతో సంతసించిన దేవతలు పుష్పవర్షం కురిపించారట. యుద్ధంలో గాయపడిన అంతర్యామి త్వరగా కోలుకోవాలని స్వర్గం నుండి పాటలీ వృక్షాలను తెచ్చి ఇక్కడ నాటారట. అందుకే మరెక్కడా ఈ వృక్షాలు కనిపించవు. ఈ వృక్షాలకు మ్రొక్కి, మనసులోని కోరిక చెప్పుకొని ముడుపు కడితే మనోభీష్టాలు నెరవేరతాయన్నది భక్తుల విశ్వాసం.
తేరుకున్న శ్రీ కృష్ణుడు శ్రీ పృథ్విశ్వర స్వామిని సేవించుకొని కొంతకాలం స్వామి సేవలో గడిపారట. ఆ సమయంలో పాటలీ వృక్షం క్రింద కనిపించే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ప్రతిష్టించారట.
ఆలయ విశేషాలు
కృష్ణానదీ తీరంలో పసుపు, అరటి, జామ, కొబ్బరి తోటల మధ్య ప్రశాంత ప్రకృతిలో నెలకొని ఉన్న ఈ ప్రాంతాన్ని గతంలో "నరాకోత్తరక క్షేత్రం"గా ప్రసిద్ధి చెందినది. కాలక్రమంలో నరకొత్తూరు, నరకదూరుగా పిలువబడి నేడు "నడకుదురు"గా పిలువబడుతోంది.
కరకట్ట ను ఆనుకొని స్వాగత ద్వారం నిర్మించబడినది. క్రిందకు దిగి మట్టి రోడ్డులో ఆలయానికి చేరుకొంటే నూతనంగా నిర్మించిన నాలుగు అంతస్థుల రాజ గోపురం కనపడుతుంది.
గోపురం వద్ద శిలాద పుత్రుడు స్వామి వారి సేవకు నిరంతరం సిద్ధం అన్నట్లుగా కనపడతారు. విఘ్ననాయకుడు శ్రీ గణపతి, దేవసేనాధిపతి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రానికి మేము సదా రక్ష అన్నట్లుగా గోపురానికి ఇరువైపులా ఉంటారు. అక్కడే కైలాస ద్వారపాలకులు "ముండి మరియు దిండి"కూడా నిలబడి ఉంటారు.
ఆలయానికి వెలుపల గ్రామదేవత అయిన శ్రీ వనమలమ్మ తల్లి సన్నిధి ఉంటుంది.
పురాతన నిర్మాణాల స్థానంలో కొత్తగా సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఆలయంలో తొలుత కనిపించేది అంబరాన్ని చుంబించేలా కనిపించే ధ్వజస్థంభం.
మధ్య సన్నిధిలో శ్రీ పృథ్విశ్వర స్వామి లింగ రూపంలో చక్కని చందన కుంకుమ పుష్ప అలంకరణంలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. మరో సన్నిధిలో అమ్మవారు శ్రీ బాలా త్రివుర సుందరీ దేవి, మరో సన్నిధిలో శ్రీ వీరభద్రుడు కొలువై ఉంటారు.
పక్కనే ఉన్న పాటలీ వృక్ష వనంలో నూతనంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను, అష్టాదశ పీఠ పాలికలను ఏర్పాటు చేశారు. వనం మధ్యలో శ్రీ కృష్ణ దంపతులు ప్రతిష్టించిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి సన్నిధి, కొన్ని నాగ శిలలు కనిపిస్తాయి.
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు తిరిగి సాయంత్రం అయిదు గంటలకు తెరిచే ఈ ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుపుతారు.
పౌర్ణమికి, మాస శివరాత్రికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు.
గణపతి నవరాత్రులు, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, దేవీ నవరాత్రులు మరియు మహా శివరాత్రి పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఆహ్లాదకర పరిసరాలలో పవిత్ర నదీతీరంలో లభించే దైవదర్శనం మానసిక శాంతితో పాటు చక్కని అవసర ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించే క్షేత్రం నడకుదురు శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ పృథ్విశ్వర స్వామి కొలువైనది.
విజయవాడ నుండి కరకట్ట మార్గంలో అవనిగడ్డ వెళ్లే దారిలో వచ్చే నడకుదురు రహదారి మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. మార్గంలో తోట్లవల్లూరు, ఐలూరు, శ్రీ కాకుళం లాంటి ప్రదేశాలలో ఉన్న పురాతన ఆలయాలను సందర్శించుకునే అవకాశం కూడా లభిస్తుంది.
కానీ తగిన వసతి సౌకర్యాలు లభించవు. విజయవాడ నుండి వెళ్లి రావడం ఉత్తమం.
ఒక సెలవ దినాన్ని కుటుంబ సభ్యులతో ఒక విశేష క్షేత్రంలో గడిపిన అనుభవాన్ని పొందాలి అంటే తగిన ప్రదేశం నడకుదురు. కార్తీక సమారాధనలకు సరైన ప్రదేశం శ్రీ పృథ్విశ్వర స్వామి ఆలయం, నడకుదురు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి