నేను తెలుగు వల్లభుండ !
భారతదేశ నలుచెరగులా అనేక దేవాలయాలు కనిపిస్తాయి. కానీ ఏ ఒక్క ఆలయంలో కొలువైన స్వామిని కూడా ఆ ప్రాంత నామం కలిపి పిలవరు. ఆ గొప్పదనం ఒక్క ఆంధ్రదేశానికే దక్కింది అనడంలో అతిశయోక్తి లేదు.
అలా వైకుంఠ వాసుడు "శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు"గా పూజలు అందుకొంటున్న దివ్యధామం శ్రీకాకుళం. పావన కృష్ణాతీరంలో కలదు. స్వామిని ఆంధ్ర నాయకుడు, తెలుగు వల్లభుడు, ఆంధ్ర మహావిష్ణువు అని పిలుస్తారు.
శ్రీకాకుళం అనేక పౌరాణిక మరియు చారిత్రక సంఘటనలకు కేంద్ర బిందువని అనేక పురాతన గ్రంధాల మరియు చరిత్రకారుల రచనల ఆధారంగా తెలుస్తోంది.
క్షేత్ర చరిత్ర
బ్రహ్మాండ మరియు స్కాంద పురాణంలో శ్రీకాకుళ క్షేత్ర ప్రస్థాపన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర కౌముది అనే పురాతన గ్రంధంలో నాటి పాలకుల వివరాలు పేర్కొన్నట్లుగా చెబుతారు.
క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నాటికి ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన వారి తొలి రాజధాని శ్రీకాకుళం అన్నది దేశవిదేశీ చరిత్రకారుల మాటగా ఉన్నది. శాతవాహనుల తొలి పాలకుడైన శ్రీముఖుని కాలానికి ముందే శ్రీకాకుళం రాజధానిగా గుర్తింపు పొందినది అని వారంటారు.
శ్రీనాధ కవి సార్వభౌముడు తన "క్రీడాభిరామం " కావ్యంలో శ్రీకాకుళ క్షేత్ర మహత్యాన్ని, ఇక్కడ జరిగే ఆలయ ఉత్సవాల గురించి గొప్పగా వర్ణించారు. పదిహేడో శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణ భక్తులు గొప్ప కవి గాయకులూ అయిన శ్రీ నారాయణ తీర్థులు శ్రీకాకుళేశ్వరస్వామిని కీర్తిస్తూ ఎన్నో కీర్తనలను రచించారు.
విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారి స్వప్న దర్శనం పొందడమే కాకుండా వారి ఆజ్ఞ మేరకు ఆముక్త మాల్యద తెలుగు కావ్యాన్ని రచించారు.
పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన "శ్రీ కాసుల పురుషోత్తమ కవి" క్షేత్ర గొప్పదనాన్ని గురించి "ఆంధ్ర నాయక శతకం " రచించారు. వీరి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో చూడవచ్చును.
పదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు వెలనాటి చోళులు, కల్యాణి చాళుక్యులు, శాతవాహనులు, కాకతీయులు, గజపతులు, విజయనగర రాజులు వేయించిన దరిదాపు ముప్పయి పైగా ఉన్న శాసనాలు అనేక విషయాలను, వారు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుకు సమర్పించుకున్న కైంకర్యాల వివరాలు తెలుపుతాయి.
క్షేత్ర పురాణ గాధ
సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తాను సృష్టించిన మానవులలో పెరుగుతున్న అసమానతలను వారు అనుసరిస్తున్న అధర్మ మార్గాలను చూసి బాధపడి, పరిష్కారం ఏమిటా ? అని ఆలోచించారట. దీనికి తగిన తరుణోపాయం తెలుపగలిగినవారు శ్రీమన్నారాయణుడే అన్న విషయం గ్రహించి ఆయన అనుగ్రహం కొఱకు భూలోకం వచ్చి పవిత్ర కృష్ణా నదీతీరంలో తపస్సు చేశారట.
కమలాసనుని దీక్షకు సంతసించిన పన్నగశయనుడు సాక్షాత్కరించారట. స్తోత్రపాఠాలతో స్తుతించిన వాణీపతి ఇక్కడ కొలువుతీరి సేవించిన వారి పాపాలను ప్రక్షాళన చేయమని, ఈ క్షేత్రం తన పేరుతో పిలువబడాలని కోరారట.
అంగీకరించిన స్వామి ఈ స్థలంలో శాశ్విత నివాసం ఏర్పరచుకొన్నారట. "కా" అనగా విధాత, "కుళం" అంటే క్షేత్రం అని అర్ధం చెబుతారు. తొలినాళ్లలో కాకుళం, కాకులి అన్నపేర్లతో పిలువబడి కాలక్రమంలో గౌరవ "శ్రీ" చేరి శ్రీకాకుళం గా స్థిరపడింది.
శ్రీకాకుళేశ్వర స్వామి (శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ) దర్శనం సర్వపాహరణం అంటారు.
ఆలయ చరిత్ర
విశాల ప్రాంగణంలో తూర్పు ముఖంగా ఉన్న ఆలయం వర్ణమయ శోభిత మూడు అంతస్థుల రాజగోపురంతో అలరారుతున్నది. ఈ గోపురాన్ని 1081 వ సంవత్సరంలో వెలనాటి చోళరాజు అయిన అనంత చోడ దండపాలుడు నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి.
అనగా అంతకు ముందు ఎప్పటి నుండి శ్రీ మహావిష్ణువు అక్కడ కొలువుతీరి ఉన్నారో ?
ఒకప్పుడు ఈ నదీతీర ప్రాంతమంతా దట్టమైన అడవి నెలకొని ఉండేదట. అనేక మంది మునులు ముక్తిని కోరుకుంటూ శ్రీ లక్ష్మీపతిని సేవించుకొంటూఉండేవారట. కానీ నిశంభుడు అనే రాక్షసుడు వారిని రకరకాలుగా వేధించేవాడట.
మహర్షులు కల్యాణిని పాలించే ఆంధ్ర నాయకుని వద్దకు వెళ్లి అసురుని వలన తాము పడుతున్న అవస్థలను విన్నవించుకొన్నారట.సాధు సంతులను, సజ్జనులను కాపాడటం పాలకుని కర్తవ్యం కనుక నాయకుడు తారై వచ్చి రాక్షసుని అంతమొందించారట. పరిసరాలను చూసి పరవశం చెంది ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసుకొన్నారని ఒక కథనం స్థానికంగా వినిపిస్తుంది.
మరో కధనం ప్రకారం పరాయి పాలకులు దాడి చేసినప్పుడు స్థానికులు మూలవిరాట్టును రహస్య ప్రాంతంలో దాచిపెట్టారట. కాలక్రమంలోఆ విషయం మరుగున పడిపోయింది.
ఉత్కళ (ఒడిషా )దేశానికి చెందిన మంత్రి ఒకరు కాంచీపురానికి వెళుతూ ఇక్కడ బస చేశారట. చక్కని నిర్మాణంలో మూల విరాట్టు లేకపోవడానికి కారణం తెలుసుకున్నారట. సహజంగా శ్రీ జగన్నాధుని భక్తుడైన ఆయన తిరిగి విగ్రహాన్ని ప్రతిష్టించాలి అన్న పట్టుదలతో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తన సైనికుల చేత వెదికించారట. ప్రయోజనం లేక పోయింది. వ్యాకుల పడుతూ శయనించిన అమాత్యునికి స్వామి దర్శనమిచ్చిన స్వామి తన అర్చామూర్తి ఎక్కడ ఉన్నది తెలియజేశారట. ఆనందంతో గ్రామస్థులతో వెళ్లి మేళతాలతో తీసికొనివచ్చి శాస్త్రోక్తంగా ప్రతిష్టించారట.
ఇలా ఎన్నో విశేషాల నిలయం శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణువు కొలువు తీరిన శ్రీకాకుళం.
ఆలయ విశేషాలు
తొలి నిర్మాణం ఎప్పుడు జరిగింది అన్న వివరాలు లభించలేదు. కానీ పదవ శతాబ్దం నుండి వివిధ రాజ వంశాల పాలకులు ఆలయాభివృద్దికి పాటుపడ్డారు.
చోళ, శాతవాహన, కాకతీయ మరియు విజయనగర రాజులు పాత నిర్మాణాలను పటిష్ఠపరచి కొన్ని నూతన నిర్మాణాలనుచేశారు . పద్దెనిమిదో శతాబ్దంలో చల్లపల్లి జమిందారు ఆలయాన్ని పునః నిర్మించినట్లుగా తెలుస్తోంది. అనంతర కాలంలో జరిగిన మార్పులతో ఆలయం ప్రస్తుత రూపంలో కనిపిస్తోంది.
రాజగోపురం దాటిన తరువాత బలిపీఠం ధ్వజస్థంభం కనిపిస్తాయి. సువిశాల ముఖమండపంలో ద్వారపాలకులు ద్వారానికి ఇరువైపులా స్వామి సేవకు సదా సిద్ధం అన్నట్లు ఉంటారు.
రంగమండప దక్షిణ గోడలో ఉపస్థితురాలైన శ్రీ భాగ్యలక్ష్మీ దేవికి ఎదురుగా ఉత్తర గోడలో ముకుళిత హస్తాలతో శ్రీ ఆంజనేయుడుస్థానిక భంగిమలో ఉంటారు.
గర్భాలయంలో ప్రధాన అర్చనామూర్తి శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు స్థానిక భంగిమలో సుందర ఆభరణ, వర్ణమయ పుష్ప మరియు పట్టు పీతాంబర ధారిగా నయనమనోహరంగా దర్శనమిస్తారు.
స్వామి వారి పాదాలకు ఇరువైపులా శ్రీదేవి, భూదేవి దర్శనమిస్తారు.
స్వామివారిని భక్తులు అభిమానంగా శ్రీకాకులేశ్వరుడు, ఆంధ్ర మహావిష్ణువు, ఆంధ్ర నాయకుడు, తెలుగు వల్లభుడు అని పిలుచుకొంటారు.
గమనిస్తే మూల విరాట్టులో రెండు ప్రత్యేకతలు కనిపిస్తాయి.
స్వామి తన వెనుక హస్తాలలో శంఖు చక్రాలు అపసవ్యంగా అనగా ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం ధరించి ఉంటారు. చాలా అరుదుగా కనిపించే విధానం. రెండవది మకర తోరణంలోని దశావతారాలలో శ్రీకృష్ణుడు కనిపించరు. ఆయన స్థానంలో బుద్ధుడు ఉండటం విశేషంగా చెబుతారు.
శ్రీకాకుళం పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి. ఆశ్లేష, జేష్ఠ, రేవతి నక్షత్రాలలో జన్మించినవారు శ్రీవారిని సేవించుకొంటే జీవితం సుఖమయం అవుతుంది అంటారు. చక్కని ఉద్యోగంలో స్థిరపడతారు. అనుకూలవతి అయిన సహధర్మచారి లభిస్తుంది అని చెబుతారు.
ప్రధాన ఆలయానికి కుడి వైపున అనగా ఆలయ దక్షిణాన క్షేత్ర తాయారు శ్రీ రాజ్యలక్ష్మి దేవి విడిగా కొలువుతీరి ఉంటారు. అదేవిధంగా ఉత్తరాన ప్రత్యేక సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి కొలువై దర్శనమిస్తారు. మీసాలతో వీరాసన భంగిమలో దర్శనమిచ్చే స్వామివారిని కాకతీయ రాజులు ప్రతిష్టించినట్లుగా చెబుతారు.
ఆంధ్ర భోజుడు - ఆముక్త మాల్యద
తన ఆస్థానంలో అష్టదిగ్గజాలను ఉంచుకొని, కవి పండిత పక్షపాతిగా పేరొంది, తెలుగు భాషకు యెనలేని ప్రోత్సాహం ఇచ్చి, అభివృద్ధికి పాటుపడిన చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు. "దేశ భాషలందు తెలుగు లెస్స " అని ప్రకటించినవాడు.
ఆయన కాలంలో విజయనగర సామ్రాజ్య హద్దులు సుదూర తీరాలకు వ్యాపించాయి. రాజ్య విస్తరణ క్రమంలో కళింగ (ఒడిశా)దేశం మీదకు దండయాత్రకు తరలి వెళుతూ కృష్ణాతీరంలో విడిది చేశారట. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ఆలయం గురించి తెలుసుకొన్న రాయలు స్వామి వారిని దర్శించుకొని ఏకాదశి వ్రతం ఆచరించారట.
నాటి రాత్రి శ్రీవారు చక్రవర్తికి స్వప్న దర్శనమిచ్చి తెలుగులో ఒక కావ్యం రచించి తనకు అంకితం ఇవ్వమన్నారట. స్వతహాగా భహుభాషాప్రావీణ్యుడు అయిన రాయలు ఆలయ ఆగ్నేయంలో ఉన్న మండపంలో శ్రీ గోదా కల్యాణాన్ని "ఆముక్త మాల్యద అన్న ముకుటం క్రింద గ్రంధస్తం చేశారట.
శ్రీ మహావిష్ణు ప్రేరణతో లిఖించిన ఆ గ్రంధం పండిత పామర ఆదరణ పొందినది.
పురాతన మండపం శిధిలంకాగా నూతనంగా నిర్మించిన మండపంలో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
పూజలు - ఉత్సవాలు
నిత్యం నాలుగు పూజలు నియమంగా జరుగుతాయి.శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం రోజున విశేష పూజలు జరుపుతారు. రోహిణి, స్వాతి నక్షత్రాల రోజులలో, అష్టమి తిథి నాడు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెల ఒక ఉత్సవం నిర్వహించే ఆలయ ఉత్సవాలు చైత్ర మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున జరిగే రధోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు.
బుధవారం నాడు జరిగే విష్ణు సాలగ్రామ పూజలో పాల్గొంటే విశేష ఫలితం ఉంటుందని, మనోభీష్టాలు నెరవేరతాయని అంటారు.
వైకుంఠ ఏకాదశి నాడు వేలాదిగా భక్తులు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనానికి తరలి వస్తారు.
ఏకరాత్ర శ్రీ ప్రసన్న మల్లిఖార్జున స్వామి ఆలయం
శ్రీకాకుళం హరిహర క్షేత్రం.
శ్రీ ఆంధ్ర మహావిష్ణువు ఆలయం పక్కనే ఏకరాత్ర శ్రీ ప్రసన్న మల్లిఖార్జున స్వామిగా కైలాసనాధుడు పూజలు అందుకొంటుంటారు.
భక్తిశ్రద్దలతో లింగారాజుని సేవించుకొని, ఆలయంలోని మండపంలో ఒక రాత్రి నిద్ర చేస్తే అన్ని కోరికలు నెరవేరతాయని చెబుతారు. చాలా మంది భక్తులు వచ్చి నిద్ర చేస్తుంటారు.
నిత్యపూజలతో అలరారే ఆలయంలో కార్తీకంలో, మహాశివరాత్రికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.
ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది అని అంటారు.
ఇన్ని విశేషాలకు నిలయమైన శ్రీకాకుళంకు విజయవాడ నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. వసతి సౌకర్యాలు లభించవు. విజయవాడ లేక మచిలీపట్నంలో ఉండటం మంచిది.
విజయవాడ నుండి వెళ్లే దారిలో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి. అన్నీ దర్శనీయాలే !!!!
నమో వెంకటేశాయ !!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి