11, డిసెంబర్ 2022, ఆదివారం

Pallipadai Temples of Tamilnadu

                మళ్ళీ రాని  వారి కోసం పళ్లి పాడై ఆలయం 


మన పవిత్ర భారతదేశ నలుదిశలా వేలాది పురాతన హిందూ దేవాలయాలు కనపడతాయి. వెయ్యి పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం సాంకేతికంగా అంతగా ఎదగని (?) సమయంలో  ఎన్నో వ్యయ ప్రయాసలతో యేండ్ల తరబడి వాటిని నిర్మింపచేశారు నాటి పాలకులు. 
శిల్పులు కూడా తమ విద్యను వివిధ రకాలుగా ప్రదర్శిస్తూ కఠిన శిలలను రమణీయ శిల్పాలుగా మలచారు. సప్త స్వరాలను పలికించారు. 
అంత కష్టపడి నిర్మించిన వాటిల్లో కొన్ని నేడు ఎంతో అభివృద్ధి చెందాయి. భక్తులకు కొంగు బంగారంగా నిలిచాయి. మరికొన్ని స్థానికంగా మాత్రమే గుర్తింపు పొందుతున్నాయి. మిగిలినవి మాత్రం ఎలాంటి ఆలనా పాలన లేక శిథిలావస్థకు చేరుకొన్నాయి. దాదాపుగా అన్నీ పరాయి దేశాల వారి దాడులకు గురి కావడం చెప్పుకోవలసిన విషయం. 
వివరణ, గణాంకాలను పక్కన పెట్టి నిర్మించిన నిర్మాతలైన చక్రవర్తులు, మహరాజులు, పాలకులు ఏమైనారు ?
సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునికి విశిష్ట విశేష ఆలయాలు కట్టించిన వారు, తమ సామ్రాజ్యాన్ని నలుదిశలా వ్యాపింప చేసిన వారు, తమ వంశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన వారు   తమ కోసం ఎలాంటి కోటలు నిర్మించుకున్నారు ?  ఇంతటి పేరుప్రఖ్యాతులు సముపార్జించుకున్న వారి కీర్తి ప్రతిష్టలను చిరస్థాయిగా నిలబెట్టడానికి వారి వారసులు ఎలాంటి స్మారక చిహ్నాలను నిర్మించారు ?
నివసించించిన  రాజ భవనాల, కోటల గురించి కొంత సమాచారం లభిస్తోంది. సాక్ష్యంగా కొన్ని శిధిల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. 
వేల యోజనాల విస్తీర్ణం కలిగిన భూభాగాలను పాలించి ఎందరో సామంతుల నీరాజనాలు, వందిమాగధులు కైవారాలు, ప్రజల ప్రశంసలు, కవుల కావ్య కీర్తనలు అందుకొన్నచక్రవర్తులు  అంతిమ నిద్ర పోయిన ఆరడుగుల నేల ఎక్కడ ?
గుప్తులు, మౌర్యులు, చోళులు. పల్లవులు, పాండ్యులు, చాళుక్యులు, హోయసలలు, విజయనగర రాజులు, నాయక రాజులు ఇలా ఎన్నో రాజవంశాలు భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పరిపాలన చేశారు అని చరిత్ర తెలుపుతోంది. 
వివిధ కాలాలలో వీరు నిర్మించిన నిర్మాణాలు, అక్కడ వేయించిన శాసనాలు వారు సాధించిన విజయాలు, జయించిన రాజ్యాల, పొందిన బిరుదులు, సమర్పించుకున్న కైంకర్యాలు, చేసిన దానధర్మాల వివరాల గురించి వివరణ ఇస్తున్నాయి. 
కానీ తమకు అంతులేని అధికారాన్ని, రాజ్యాన్ని వారసత్వంగా ఇచ్చిన  వారి పెద్దలకు వారు చేసిన అంతిమ సంస్కారాల,అందించిన గౌరవాల గురించిన సమాచారం చాలా చాలా తక్కువగా లభ్యమౌతోంది. ఇక అందిన వారి సమాధుల వివరాలు ఏ మాత్రం స్పష్టంగా లేవు. 
ముఖ్యంగా సుదీర్ఘ కాలం దక్షిణ భూభాగాన్ని పాలించిన వారిలో చోళులు ప్రధమ స్థానంలో ఉంటారు. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుండి క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం వరకు చోళులు పాలన చేశారు అని తెలుస్తోంది. అనగా సుమారు 1600 సంవత్సరాలు.ఈ కాలంలో  34 మంది రాజులు పాలించారు. వీరిలో తొలినాటి వారైన కరికాళ, కొప్పెన్రున్ చోళన్, కొచ్చెంగన్ ప్రసిద్దులుగా పురాతన తమిళ గ్రంధాల ద్వారా అవగతమౌతుంది. తరువాత వచ్చిన వారిలో పరాంతక, సుందర, రాజరాజ, రాజేంద్ర, రాజాధిరాజ చోళ చక్రవర్తులు ప్రముఖులుగా గుర్తించబడినారు. 
పదకొండవ శతాబ్దం నుండి పాలించిన వారిలో ఒకటవ కుళోత్తుంగ, రెండవ కుళోత్తుంగ, రెండవ రాజరాజ, మూడవ కుళోత్తుంగ చోళులు ఎంతో కీర్తించబడినారు. 
వీరందరి పాలనాకాలంలో కట్టించిన ఆలయాలు నేటికీ కనపడతాయి. కానీ వీరిలో ఒకరిద్దరి సమాధుల వివరాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. అవి కూడా వారు పాలన చేసిన రాజధానులలో కాదు. మారుమూల పల్లెలలో!

భారత దేశానిది యుగయుగాల చరిత్ర అని మన పురాణాల ద్వారా అవగతమౌతుంది. వందల సంవత్సరాల చరిత్రకి సాక్షులుగా ఆయాకాలాలలో పాలకులు నిర్మించిన అద్భుత ఆలయాలు, అక్కడ  వేయించిన శాసనాలు నిలుస్తున్నాయి. అవన్నీ కూడా నాటి ప్రజల జీవన విధానాన్ని, పాలకుల శక్తి సామర్ధ్యాలను తెలుపుతున్నాయి. 
గుప్తులు, మౌర్యులు ఉత్తర భారతాన్ని ఎక్కువ కాలం పాలించారు. దక్షిణ భారత దేశాన్ని పల్లవులు, పాండ్యులు, చోళులు, హొయసల, శాతవాసన ఆదిగా గల రాజ వంశాల వారు పాలించారు అని శాసన ఆధారాలు తెలుపుతున్నాయి. 
అందరికన్నా అత్యధిక కాలం పాలించిన వారు చోళులు. వీరు క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నుండి క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం వరకు తమిళనాడు లోని వివిధ రాజధానుల నుండి పాలించారని చరిత్ర చెబుతోంది. 
మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు వారు అంతగా వెలుగులో లేకున్నా పాలించిన కాలంలో అన్ని రంగాలలో తమ ప్రభావాన్ని చాలా బలంగా చాటారు. సుదూర ప్రాంతాలను తమ ఏలుబడిలోకి తెచ్చుకొన్నారు. వాటిని తమ వారసులకు కానుకగా ఇచ్చారు. కానీ తమకంటూ ఆరడుగుల నేల సంపాదించుకోలేక పోయారు అనిపిస్తుంది కొంచెం శ్రద్దగా గమనిస్తే !
అవును నిజమే !
వారు నిర్మించిన ఆలయాలు, భవనాలు మరియు వేయించిన శాసనాలను మనం చూడగలుతున్నాము కానీ ఆ ఏలికలు శాశ్వితంగా నిదురించిన ప్రదేశాలు ఎక్కడైనా కనపడుతున్నాయా?
కనపడవు. కనపడినా వాటి విషయంలో ఏకాభిప్రాయం, ఖచ్చితత్వం ఉండదు. 

ఒకటవ రాజరాజ చోళుడు 

 ముప్పది సంవత్సరాలు పాలించిన ఒకటవ రాజ రాజ చోళుని విషయం తీసుకొందాము. సుమారు పాతిక మంది చోళ చక్రవర్తులలో ఈయనది ప్రత్యేక స్థానంగా చరిత్ర గుర్తించింది. చోళ సామ్రాజ్య  స్థిరపడటానికి ఈయన చేసిన కృషి ఎన్నదగ్గదిగా చెబుతారు. దక్షిణాదిన సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఉత్తరభారత దేశంలో కూడా అధిక భాగాలను జయించారు. నేటి శ్రీలంక, మాల్దీవులు, లక్ష ద్వీపాలను తన  యేలుబడి లోనికి తెచ్చుకొన్నారు. ఎన్నో పరిపాలనా విధానాలను రూపొందించారు. ప్రజలకు మేలు చేసే నీటి పారుదల, పంటల సంరక్షణ చర్యలను చేపట్టారు. అద్భుత ఆలయాలను నిర్మించారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది  శ్రీ బృహదీశ్వర ఆలయం, తంజావూరు. నేటికీ చెక్కుచెదరని నిర్మాణ విశిష్టతను ప్రదర్శించే ఈ ఆలయం ప్రతి నిత్యం వేలాది మందిని ఆకర్షిస్తోంది. 
శత్రు రాజులను పాదాక్రాంతులను చేసుకొని కవి పండితుల ప్రశంసలు, బిరుదులు పొంది, అఖండ ఐశ్వర్యాన్ని మరియు అధికారాన్ని అనుభవించిన ఈ చోళ చక్రవర్తి శాశ్విత నిద్ర పోయిన ప్రదేశం ఏది  ?  ఎక్కడ ఉన్నది ? అంటే సరైన సమాధానం లభించదు. అనేక వివాదాలు, పరిశోధనల తరువాత ఆయన సమాధి కుంభకోణానికి సమీపంలోని కావేరి  ఉప నది అయిన ముదికొండ తీరాన ఉన్న ఉదయలూరు గ్రామం లోని పొలాల  ఉన్నది తేల్చారు. 
ఇక్కడికి సమీపంలోనే పొలాల మధ్యలో కనుగొన్నభూమి లోనికి క్రుంగి సగానికి ఒంగిపోయిన శివలింగాన్ని, అక్కడే లభ్యమైన శిలాశాసనం ఆధారంగా అదే రాజరాజ చోళుని సమాధి మందిరం అన్నారు తొలుత. కానీ శిలాశాసనం లో పేర్కొన్న విషయాలలో  సమాధి మందిరం గురించి ఏమీ లేనందున చివరకు ఉదయలూరు దానినే చోళ మహా చక్రవర్తి పళ్లిపాడై ఆలయం అని నిర్ధారించారు చరిత్రకారులు/ ప్రభుత్వం కూడా దానికి అంగీకరించినది.  

 పళ్లి పాడై ఆలయం అంటే ఏమిటి ? 

మరణించిన పాలకుని దేహాన్ని సమాధి చేసిన స్థలంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించి ఆ రాజు లేదా వారి వారి వంశం పేరు మీదనో ఆ లింగాన్ని పిలుస్తారు. ఒక చిన్న ఆలయాన్ని శిల్పులు నిర్ణయించిన కొలతలతో నిర్మిస్తారు. చక్కని శిల్పాలను కూడా ఏర్పాటు చేస్తారు. బ్రహ్మ, లింగోద్భవ మూర్తి, దుర్గ, శ్రీ దక్షిణామూర్తి ఇలా గోష్ఠ దేవతా రూపాలను కూడా గర్భాలయానికి వెలుపల  చెక్కుతారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆలయానికి ఉండే అన్ని హంగులు అమరుస్తారు. నిత్య పూజలు కూడా చేస్తారు. 
ఒక పాలకుని మృత శరీరం లేదా అవశేషాల మీద నిర్మించిన శివాలయాన్ని "పళ్లిపాడై ఆలయం" అని పిలుస్తారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇలా పాలకులకు మరణానంతరం పళ్లిపాడై ఆలయం నిర్మించడం అన్నది పదవ  శతాబ్దం నుండి ఆరంభమైనది. 
ఇప్పటి వరకు గుర్తించబడినపళ్లిపాడై ఆలయాలన్ని పదవ శతాబ్దం తరువాతి నిర్మాణాలే కావడం పేర్కొనదగ్గ అంశం. పరమేశ్వరుడు లయకారకుడు, శ్మశాన వాసి కావడమో లేక చోళులు శైవులు కావడమో తెలియదు కానీ పళ్లిపాడై ఆలయాలన్నీ శివాలయాలే !

పంచవన్ మాదేవి పళ్లిపాడై ఆలయం, పట్టీశ్వరం 

ఒకటవ రాజరాజ చోళుని సమాధి ఉదయలూరుకు సమీపంలోని పట్టీశ్వరం గ్రామం వద్ద ఒకటవ రాజరాజ చోళుని మూడవ భార్య అయిన రాణి పంచవన్ మాదేవి  పళ్లిపాడై ఆలయం ఉంటుంది. 
శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయంగా పిలవబడుతున్న ఈ ఆలయాన్ని నిర్మింపచేసింది రాజరాజ చోళుని కుమారుడైన రాజేంద్ర చోళుడు. తన కన్నతల్లికి, పట్టపు రాణికి కాకుండా మూడవ స్థానంలో ఉన్న రాణి పంచవన్ మాదేవికి రాజేంద్ర చోళుడు పళ్లిపాడై ఆలయం నిర్మించడానికి గల కారణం చిన్నతనం నుండి అతని ఆమె  పట్ల చూపిన ప్రేమాభిమానాలు, అతను రాజు కావడానికి ఆమె పడిన శ్రమ. 
చక్కని శిల్పాలతో అలరారే ఈ ఆలయ ద్వారపాలకుల స్థానంలో రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు ఉండటం అతనికి ఆమె పట్లగల యెనలేని అభిమానం, గౌరవంగా పేర్కొంటారు. లభించిన శిలాశాసనంలో పేర్కొన్న విధంగా  రాజేంద్ర చోళుడు ఆలయ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. ఆడవారి పేరున నిర్మించిన ఏకైక పళ్లిపాడై ఆలయం ఇదే ! 
నేటికీ రాజేంద్ర చోళుని పుట్టిన  ఆరుద్ర నక్షత్రం రోజున, ఆయన పట్టపురాణి  జన్మ నక్షత్రం అయిన  రోహిణి నాడు వారి పేరు మీద ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడం చెప్పుకోదగిన అంశం. 
తిరువణ్ణామలై జిల్లాలోని బ్రహ్మదేశం గ్రామంలో ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాన్ని ఒకటవ రాజేంద్ర చోళ, ఆయన పట్టపురాణి వీరమాదేవి అస్థికలు మీద నిర్మించిన పళ్లిపాడై ఆలయంగా స్థానికులు భావిస్తుంటారు. కానీ తొమ్మిదవ శతాబ్దంలో పల్లవ రాజులు  ఈ ఆలయం నిర్మించారని  అని శాసనాలు నిర్ధారించాయి. రాజేంద్ర చోళుడు పదకొండవ శతాబ్దానికి చెందినవారు. 
వృధాప్యంలో ఒకటవ రాజేంద్ర చోళుడు ఇక్కడ మరణించారని, ఆయన భార్య సహగమనం చేశారన్నది మాత్రమే నిజం అని చరిత్రకారులు ధృవీకరించారు. గతంలో ఎందరో రాజుల ఆదరణ పొందిన పన్నెండు వందల సంవత్సరాల నాటి ఈ నిర్మాణం  ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది.  సుమారు ఎనభై దాకా వివిధ వంశాల రాజులు వేయించిన శాసనాలు ఇప్పటికీ కనపడతాయి. 

శ్రీ చోళేశ్వర స్వామి ఆలయం, మేల్పడి 

వెల్లూరుకు సమీపంలో పాలరు నదీతీరంలో ఉన్న మేల్పడి అనే చిన్న గ్రామంలో ఉంటుందీ ఆలయం. ఇక్కడ రాష్ట్రకూట రాజులతో జరిగిన యుద్ధంలో అరింజయ చోళుడు మరణించారట. 
ఒకటవ పరాంతక చోళుని ముగ్గురు కుమారులలో చిన్నవాడు ఇతను. రాజరాజ చోళుని తండ్రి అయిన  సుందర చోళుని తండ్రి. 
తమను చోళ  సామ్రాజ్య పాలకులుగా చేసిన తాత మీద గౌరవంతో ఆయన మరణించిన నలభై ఏడు సంవత్సరాల తరువాత రాజరాజ చోళుడు ఈ పళ్లిపాడై ఆలయం  నిర్మించినట్లుగా తెలుస్తోంది. గర్భాలయ గోడల మీద ఆయన, ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు వేసిన అనేక శాసనాలు కనపడతాయి. ఆలయ దక్షిణ భాగాన శివపూజ చేస్తున్న రాజరాజ చోళుని శిల్పం కనపడుతుంది. చిన్నదైన గర్భాలయంలో శ్రీ చోళేశ్వర స్వామి  రూపంలో కొలువై ఉంటారు. మండపంలో లింగానికి ఎదురుగా నందీశ్వరుడు స్వామి సేవకు సిద్ధం అన్నట్లుగా కనపడతారు. 
మొత్తం నల్లరాతితో నిర్మించబడిన ఆలయంలో చక్కని శిల్పాలు చెక్కబడి ఉంటాయి. 
నిత్య పూజలు నియమంగా నిర్వహిస్తారు. 
రాజరాజ ముత్తాత అయిన ఒకటవ పరాంతక చోళుని కాలంలో నిర్మించబడిన శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంటుంది.  ఈ రెండు నిర్మాణాలు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి.  

శ్రీ కోదండ రామేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తి 

క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దం నుండి చోళ రాజులు తిరిగి వెలుగు లోనికి వచ్చారు అన్నది చరిత్రకారుల అభిప్రాయం. వీరిలో శాసనాలలో కనిపించిన తొలి రాజు విజయాళ చోళుడు. 
ఆయన కుమారుడు ఒకటవ ఆదిత్య చోళుడు (871-907). సామ్రాజ్య విస్తరణలో ఈయన ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.   
ఈ ప్రాంతంలో పల్లవులతో జరిగిన సమరంలో విజయం సాధించారట. కానీ గాయాల  ఏర్పడిన కారణాల వలన  మరణించినది శ్రీ కాళహస్తికి సమీపం లోని "తొండమనాడు" వద్ద అని ఒకటవ పరాంతక చోళుడు వేయించిన శాసనం తెలియజేస్తోంది. శ్రీకాళహస్తికి చేరువలో తొండమనాడు పక్కన ఉన్న "బొక్కసంపాలెం "లోని శ్రీ ఆదిత్యేశ్వర లేదా శ్రీ కోదండరామేశ్వర ఆలయమే ఒకటవ ఆదిత్య చోళుని పళ్లిపాడై ఆలయం. ఈ విషయాన్ని ఒకటవ పరాంతకుడు కన్యాకుమారి వద్ద వేయించిన శాసనంలో కూడా ఉదహరించడం జరిగిందని తెలుస్తోంది. ఆలయాభివృద్దికి చేసిన గురించి ఇక్కడి శాసనంలో  సవివర సమాచారం లభిస్తుంది
మన రాష్ట్రంలో ఉన్న ఒకే  ఒక్క పళ్లిపాడై ఆలయం ఇదే ! శ్రీ కాళహస్తి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమనాడుకు సులభంగా చేరుకోవచ్చున. 
తొండమనాడులో తొండమాన్ చక్రవర్తి నిర్మించిన "శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు.  

గండరాధిత్య చోళ పళ్లిపాడై ఆలయం 

ఒకటవ పరాంతక చోళుని రెండవ  కుమారుడు గండరాధిత్య చోళుడు. ఇతను గొప్ప శివ భక్తుడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు. స్వయంగా కవి. కవి పండితులను ఆదరించేవారు.  రాజ్య కాంక్ష కలవాడు కాదు. యుద్ధాల పట్ల వ్యతిరేక అభిప్రాయం కలవారు. కేవలం  సంవత్సరాలు మాత్రమే పాలించారు. 
కొంతకాలం క్రిందటి వరకు కర్ణాటక లోని  నంది హిల్స్ లో ఉన్న శివాలయం ఈయన పేరిట నిర్మించిన  పళ్లిపాడై ఆలయంగా పరిగణించబడినది. 
ఈ మధ్య లభించిన కొత్త ఆధారాల ద్వారా చరిత్రకారులు నామక్కల్ జిల్లాలోని పర్యాట ప్రదేశమైన "కొల్లి హిల్స్" లోని శ్రీ చోళముడైయార్ ఆలయం  గండరాధిత్య చోళుని పైన నిర్మించబడినది అని నిర్ధారించారు.  దీనికి వారు చెప్పిన చారిత్రక ఆధారాలు మూడు. 
గండరాధిత్య చోళునికి మాత్రమే "చోళముడైయార్" అన్న బిరుదు ఉండేది. చోళుల పాలనలో కొల్లి హిల్స్ వారి సైనికశిక్షణా కేంద్రం గా పేరొందినది.  ఆలయం వద్ద  ఇతని భార్య చెంపియన్ మాదేవి, కుమారుడు ఉత్తమ చోళుడు వేయించిన శాసనాలు.ఇక్కడికి సమీపంలోని శ్రీ అరపల్లీశ్వర స్వామి ఆలయానికి అనేకమంది చోళరాజులు  నిధులు ఇచ్చారు అని తెలిపే వివిధ కాలాలకు చెందిన రాజులు శాసనాలు. 

మరికొన్ని  పళ్లి పాడై ఆలయాలు 

 ఇప్పటి దాకా మనం చోళ రాజుల పళ్లిపాడై  ఆలయాల గురించి తెలుసుకున్నాము. వీరు కాకుండా మరి కొన్ని రాజ వంశాల ఏలికలకు నిర్మించిన వాటి గురించి కూడా తెలుసుకొందాము.   
పదవ శతాబ్దంలో బద్ద వైరులుగా ప్రసిద్ధి కెక్కిన పల్లవ మరియు పాండ్యుల మధ్య నేటి తంజావూరు సమీపంలోని "పుఱమ్బియం" వద్ద భీకర యుద్ధం జరిగింది. పల్లవులు విజయులుగా నిలిచారు. వారి తరుఫున చోళులు మరియు గంగ వంశ రాజులు పోరాడారు. సమరంలో మరణించిన గంగ వంశ రాజైన ఒకటవ పృథ్వి పతికి ఆయన కుమారుడు రెండవ పృథ్వి పతి ఒక  పళ్లిపాడై ఆలయం తండ్రి జ్ఞాపకార్ధం  ఇక్కడ నిర్మించారని లభించిన శాసనాలు తెలియచేస్తున్నాయి. 
నిర్మాణానికి వెలుపల పోరులో  మరణించిన సైనికుల పేర్ల మీద వేసిన "తట్టు కాల్"( జ్ఞాపక చిహ్నాలుగా వేసిన రాళ్లు) కనపడతాయి. 
ప్రస్తుతం ఆలయంలో శివ లింగం లేదు. ఆలయం కూడా శిధిలావస్థలో ఉండటం విచారకరం. 
అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. 
మదురై కి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది "పళ్ళిమాడం" అనే చిన్న గ్రామం.గుండార్ నాదీ తీరంలో ఉన్న ఈ గ్రామంలో శ్రీ సుందర పాండ్య ఈశ్వరన్ ఆలయం.  అదే  పదవ శతాబ్దంలో మదురైని పాలించిన పాండ్య వంశానికి చెందిన సుందర పాండ్యుని పేరిట నిర్మించిన  పళ్లిపాడై ఆలయం. రాజ కార్య నిమిత్తం ఇక్కడికి వచ్చిన పాండ్యుడు మరణించడం జరిగిందట. ఆయన సోదరుడైన వీర పాండ్యుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. 
ప్రస్తుతం ముళ్ళ పొదల మధ్య శిధిలావస్థలో ఉన్నది ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుగారి సమాధి మందిరం. 
విశ్వ విఖ్యాత బృహదీశ్వర ఆలయం ఉన్న తంజావూరును చోళుల తరువాత మరికొన్ని రాజా వంశాలు పాలించాయి. వారిలో ఎక్కువ కాలం పాలించినవారు ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశానికి చెందిన  మరాఠా రాజులు.  వీరు సుమారు నూట ఎనభై సంవత్సరాలు రాజ్యమేలారు. 
చోళుల మాదిరి వీరు కూడా శైవ మతాన్ని అనుసరించేవారు. 
తంజావూరులోని కైలాసమహల్ వీరి అంతిమ గమ్యస్థానం. సుమారు  ఇరవై దాకా నాటి ఏలికల సమాధి మందిరాలు కనపడతాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా శిధిలావస్థలో ఉండటం విచారకరం. 
 భారతదేశ ఘన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలైన వీటిని  భావి తరాల కోసం పరిరక్షించి, అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అది పర్యాటక రంగాన్ని మరో కోణంలో ఆవిష్కరించడానికి ఉపయోగపడుతుంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...