24, అక్టోబర్ 2022, సోమవారం

                    మానవత్వం మరిచిపోతున్న మనుషులు 

"సోగ్గాడే చిన్ని నాయన " అంటూ బొంగురు గొంతు వినపడగానే పిల్లలమంతా పరిగెత్తేవాళ్ళము. చినిగిపోయిన గళ్ళ లుంగీ, మాసిపోయి ఏ రంగో చెప్పడం కష్టమయ్యే జుబ్బా తో మేడలో ఒక సంచి ధరించిన సాయుబు పై పాట పాడుతుంటే వెనక కాళ్ళ మీద నిలబడి తలా, ముందు చేతులను కదిలిస్తూ ఎగిరే ఎలుగుబంటిని చూడటమే పది సంవత్సరాల వయస్సు లోపల ఉన్నమాకు  ప్రధాన ఆసక్తి. 
దీని తరువాత కోతులను ఆడించేవారు కూడా వచ్చేవారు. మధ్యమధ్యలో గోసాయి ముఠాల వారు తెచ్చే ఏనుగు అన్నిటికన్నా పెద్ద ఆకర్షణ మాకు. 
ముక్కుల్లో వేసిన ఇనుప కళ్లెం పెట్టే ఇబ్బందిని, మూతికి కట్టిన ఇనుపవల భాధను భరిస్తూ ఆ మూగ ప్రాణి నృత్యం చేస్తోంది అన్న ఆలోచన  మాకు ఆ వయస్సులో కలిగేది కాదు. కోతులను ఆడించేవాడి చేతిలోని  కర్రను చూసిన భయంతో అవి చెప్పినట్లు చేస్తున్నాయి అన్న స్పృహ మాకు ఉండేది కాదు. కాళ్లకు కట్టిన బరువైన ఇనుప గొలుసుల వలన కలిగిన గాయాల నొప్పిని సహిస్తూ, రోజుకు పదుల సంఖ్యలో కిలోమీటర్ల నడుస్తుంటాయి ఏనుగులు అన్న విషయం తెలిసేది  కాదు. 
ఆ వయస్సులో అడవి జంతువులను దగ్గర నుండి చూస్తున్నాము అన్న ఆనందం తప్ప మరొకటి మా పసి మనస్సులలో తలెత్తేది కాదు. మాకే కాదు మా పెద్ద వాళ్లకు కూడా ! ధాన్యం, అన్నం,  పచ్చడో, డబ్బులో ఇచ్చేవారు. 
ఇదంతా 1970 సంవత్సరాల కాలంలో గుంటూరులో మా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు. 
బలపడిన వన్య మృగ సంరక్షణ చట్టాలు, వన్యప్రాణి ప్రేమికుల పోరాటం వలన పైవన్నీ క్రమేపీ కనుమరుగయ్యాయి. కానీ కొన్ని మాత్రం ఇంకా కనపడుతున్నాయి. అవే చిలక జోశ్యం మరియు పావురాల పందేలు. 
వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే రామ చిలక పట్టుపడి చిన్న పంజరంలో ఉంటూ తన భవిష్యత్తు ఏమిటో తెలియక బాధ పడుతూ  మన భవిష్యత్తును చెబుతుంది అంటే నమ్మడం మనలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలకు నిదర్శనం. లోపించిన ఆత్మ విశ్వాసానికి మరో రూపం. 
మండుటెండలో మనం నడవడానికే భయపడతాము. కానీ ఆ చిన్ని పావురం నిప్పులు చెరిగే సూర్య తాపంలో ఉదయం నుండి సాయంత్రం దాకా  ఎక్కడా వాలకుండా ఎగరాలి. నీరు తిండి లేకుండా అన్ని గంటలు నిండు వేసవిలో ఎగిరి తిన్నగా యజమాని ఇంటి ముందు వాలితే అప్పుడు గెలిచినట్లు ! ఎవరు విజేత ? కపోతామా ? కాదు. దాని యజమాని. 
మానవుడు ఎంత కర్కోటకుడు !
తాను బుద్ది జీవి అన్న ఒక్క కారణంతో తన కన్నా ముందు నుండి ఉన్న జంతువుల, పక్షుల, అన్నింటికీ మించి తాను జీవించడానికి కావలసిన ప్రాణ వాయువును అందించే చెట్ల, దాహార్తిని తీర్చే నదుల, బ్రతకడానికి అవసరమైన ఆహారాన్ని ఆపండించుకోడానికి అవసరమైన భూమి పట్ల ఇంతటి కాఠిన్యాన్ని ఎలా చూపగలుగుతున్నాడు ?
తాను నాటిన మొక్క తన తరువాత కూడా ఉంటుంది తన వారికి కూడా రక్షణగా ఉంటుంది అన్న విషయాన్నీ ఎందుకు గ్రహించడం లేదు ?
తాను నిల్వచేసిన నీరు ముందు తరాలవారికి జీవ జలం అవుతుంది అన్న కఠోర వాస్తవాన్ని ఎందుకు అర్ధం చేసుకోలేక పోతున్నాడు ?
తాను పరిరక్షించిన భూమి భావి తరాల వారికెందరికో అన్నపూర్ణ అవుతుందన్న నగ్న సత్యాన్ని ఎందుకు పరిగణలోనికి తీసుకోలేక పోతున్నాడు ?
తాను ఎముకల కోసం, చర్మాల కోసం, అదనపు రుచి కోసం సంహరిస్తున్న జంతువులూ, పక్షులు తన మనుమలకే కాదు వారి మనుమలు కూడా ఆహ్లదాన్ని కలిగిస్తాయన్న నిజాన్ని ఎందుకు 
గుర్తించలేక పోతున్నాడు ?
బుద్ది జీవి కావడం వలననా ? లేక తాను సంపాదించిన హోదా, ఇల్లు, కార్లు,నగలు, డబ్బు వారికి ఇవన్నీ ఇస్తాయన్న అహంకారమా ?
ఖచ్చితంగా రెండోదే అన్న అనుమానం కలుగుతోంది. కానీ అది అసాధ్యం. 
బాష గురించి, కులాల గురించి, మతాల గురించి,  ప్రాంతాల గురించి, హోదాల గురించి, పదవుల కోసం ఇలా అన్నింటి కోసం ఘర్షణలకు దిగే వారు మనందరికి తల్లి అయిన ప్రకృతి పట్ల ఇంతటి నిర్లక్ష్య ధోరణి ఎందుకు ప్రదర్శిస్తున్నారు ? 
ఇదంతా మా పిల్లల కోసం అనేవారు అవి అందరి పిల్లలకు అత్యంత ఆవశ్యకం అన్న విషయాన్నీ ఎందుకు పరిగణ లోనికి తీసుకోవడం లేదు ? అవి లేని నాడు ఇవన్నీ వృధా అన్న గ్రహింపు ఎందుకు ఉండటం లేదు ?
పిల్లలకు హాని చేసే పదార్ధాలను పెడతామా ! పెట్టము కదా ! అదే సూత్రం పై వాటికి వర్తించదా !
మనం ఎందుకు గుర్తించడం లేదు. 
మన  ముందు తరాల వారు ప్రకృతి పట్ల  తగినంత గౌరవం చూపడం వలన మనం రోజు కొంత వరకు ఇబ్బందులు లేని జీవితాన్ని గడప గలుగుతున్నాము. మనకు వారసత్వంగా లభించిన దానిని మన తరవాత వారికి అందించడం మన భాద్యత కాదా ! మందిరాలు, ఆకాశాన్ని తాకే విగ్రహాలు కాదు ప్రస్తుతం మనకు కావలసినది. స్వచ్ఛమైన వాతావరణం. బాధల నుండి ఉపశమనం కలిగించే ప్రకృతి. పరిశుద్ధమైన నీరు. హానికర అణువులు లేని గాలి. 
ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన సమయం దాటిపోయింది. ఇప్పుడు బాగు చేయవలసిన సమయం వచ్చేసింది. 
పనికి రాని విభేదాలను పక్కన పెడదాం. జలం మన జీవం, నేల మన కన్నతల్లి, ప్రకృతి మా దేవత, గాలి మా తండ్రి. ఈ ఒక్కటే నినాదం దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగక్కరలేదు. 
కార్యాచరణలో చూపిస్తే చాలు. 
అందరం గుంపులు గుంపులుగా రానక్కరలేదు. ఎవరి పరిధిలో వారు కార్యసాధనకు ఉపక్రమిస్తే చాలు. మనవారికి హాని చేసే (మనకి మనం సృష్టించుకొన్న) వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూతాపం, శబ్ద కాలుష్యం మీద అదే ఒక తిరుగుబాటు. అదే ఒక విప్లవం. అదే ఒక దండయాత్ర. కాలుష్యం పైన ప్రకటిద్దాం కదనం. 
సీసాల నీరు కాదు దోసిళ్ళతో తాగగలిగిన నీరు, మాస్కు లేకుండా ఊపిరితిత్తుల నిండా పీల్చుకో గలిగిన శుభ్రమైన గాలి అందిద్దాము. కంటికి వంటికి మనస్సుకు హానిచేసే టాబ్లు కాదు. నేత్రానందం కలిగించే ప్రకృతి పచ్చదనాన్ని ఇద్దాము. 
సంఘటిత పోరులో గెలుద్దాం ! భావి తరాలకు వారిదైన సుందర స్వచ్ఛ లోకాన్ని అందిద్దాం !
కడుపున పుట్టిన వారికి ఇంతకన్నా పెద్ద ఆస్తి ఏమి ఇవ్వగలం !

విజయం మనదే !!!!
 



 

Arunachala Giri Pradakshana

                      అరుణాచల గిరి ప్రదక్షిణా మహత్యం  

                                               ( విధివిధానాలు, విశేషాలు, ఫలితాలు)


పరమేశ్వరుడు పుడమిలోని పలు ప్రదేశాలలో లింగరూపంలో కొలువై వివిధ పేర్లతో పిలవబడుతూ ఆరాధించబడుతున్నాడు. భక్తులను ఈతి బాధల నుండి కాపాడుతున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి కావలసిన అనుభూతిని, జ్ఞానాన్ని అనిగ్రహిస్తున్నాడు. "శివా" అని పిలిస్తే చాలు శుభాలను ప్రసాదిస్తున్నారు. అసలు "శివ" అంటే "శుభం" అని కదా అర్ధం. 
అంతటి అల్ప సంతోష స్వామికి మన దేశం లోనే కాకుండా ఇరుగు పొరుగు దేశాలలో కూడా విశేష ఆలయాలు కలవు. వీటన్నింటిలో భక్తులు అధికంగా సందర్శించడానికి సిద్ధపడేవి "ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ". అవి "సోమనాథ, శ్రీశైలం, ఉజ్జయిని, ఓంకారేశ్వర, కేదారనాథ్ , భీమశంకరం, వారణాసి, త్రయంబకేశ్వరం, వైద్యనాథేశ్వర్,నాగేశ్వరం, రామేశ్వరం మరియు గృష్ణేశ్వర్. 
ద్వాదశ లింగ దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం జ్యోతి అనగా చీకటిని తొలగించేది అని అర్ధం. జ్యోతిర్లింగాల సందర్శనతో మన మనసుల లోని చీకటి అనే అసుర గుణం తొలగిపోయి వెలుగును ప్రసరింపచేసే ఆధ్యాత్మిక ధర్మ భావాలను పెంపొందిస్తాయి అని విశ్వసిస్తాము. అసురులు చీకటి లోక నివాసాలు కదా ! మరో విషయం  ఏమిటంటే ఈ క్షేత్రాలలో లింగరాజు స్వయం భూ లింగంగా వెలిశారన్నది అసలు నమ్మకం. 
ఈ జ్యోతిర్లింగాల ప్రధాన క్షేత్ర గాధ స్కాంద మరియు శివ పురాణాల ప్రకారం ఒక్కటే ! కానీ శివ పురాణం జ్యోతిర్లింగాల సంఖ్య అరవై నాలుగు అని తెలుపుతోంది. ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేక విశేషానికి కేంద్రాలని అని కూడా శివ పురాణం చెబుతోంది. తైత్రీయ ఉపనిషత్ "మాయ, జీవ, మనస్సు (బుద్ధి), ఆత్మ మరియు అహంకారం" అనే పంచ భూతాలకు ప్రతీక జ్యోతిర్లింగాలు అని పేర్కొంటోంది. పన్నగ భూషణుడు కొలువైన పంచభూత లింగాలు వేరుగా ఉన్నాయి అని తెలుసు కదా ! సర్వము శివ మాయం !!
పురాణాలలో పేర్కొన్న ప్రకారం జ్యోతిర్లింగాల ప్రధాన గాధ ఇలా ఉన్నది. అహం ఆవరించడం వలన సృష్టికర్త పద్మసంభవునికి , సృష్టి సంరక్షకుడు అయిన పద్మనాభునికి  మధ్య తమలో ఎవరు అధికులు అన్న విషయంలో వివాదం తలెత్తినది. అది సమసిపోక పోగా శృతి మించి తీవ్రస్థాయికి చేరుకొన్నది. ఉచితానుచితాలు మరచి కలహించుకోసాగారు. అప్పుడు వారికి తగిన ఉపదేశం చేయాలని సంకల్పించుకొని వారిమధ్య జ్యోతి లింగ రూపంలో ఆవిర్భవించారు లయకారకుడు. 
తన జ్యోతిర్లింగ ఊర్ధ్వ అధో భాగాలలో ఒక దానిని కనుగొన్నవారే అధికులు అని వారికొక పరీక్ష పెట్టారు. విధాత హంస వాహనం మీద గగన మార్గం పట్టగా, శ్రీహరి భూవరాహ రూపంలో పాతాళం లోనికి వెళ్లారు. ఎంత ఎత్తుకు వెళ్లినా, ఎంత లోతుకు వెళ్లినా ఊర్ధ్వం కానీ మూలం కానీ కనుగొనలేకపోయారు. అనంతశయనుడు తమ మద్య తలెత్తిన స్పర్ధ అసంబద్దమైనది అని, తమకి మించిన శక్తి ఒకటి ఉన్నది అని అర్ధం చేసుకొని వెలుపలికి వచ్చి తన ఓటమిని అంగీకరించారు. బ్రహ్మ మాత్రం ఓటమిని ఒప్పుకోవడం ఇష్టపడలేదు.  తాను  పైకి వెళుతున్నప్పుడు  లింగాగ్రము నుండి భువికి వెళుతున్న మొగలి పువ్వుని సాక్ష్యంగా తీసుకొని వెళ్ళాడు. ఊర్ధ్వ భాగాన్ని సందర్శించానని చెప్పిన చతుర్ముఖుని చూసి ఆగ్రహించాడు రుద్రుడు. ఆయనకు భూలోకంలో పూజార్హత లేదని శపించారు. అబద్దపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వు పూజకు పనికి రానిది అని కూడా శపించారు. 
బ్రహ్మవిష్ణువులు ఇరువురూ తమ స్తోత్రపాఠాలతో ఆయనను చల్లబరిచారు. శాంతపడిన శంకరుడు నిజరూపంలో వారి ముందు నిలిచారు. " అధికారం అహాన్ని పెంచకూడదు. లోకసంరక్షకులమైన తమ ముగ్గురిలో ఎవరూ గొప్పకాదు. ముగ్గురమూ సమానమే !" అని హితోపదేశం చేశారు. అనంతరం సర్వ దేవతల అభ్యర్ధన మేరకు కైలాసనాధుడు అక్కడే కొండ రూపంలో కొలువైనారు. కొండంత దైవాన్ని కొలవడం మానవులకు అసాధ్యం అన్న వారి విన్నపాన్ని మన్నించిన మహేశ్వరుడు పర్వతం పక్కన లింగ రూపంలో ఉద్భవించారు. అలా ఇలలో తొలి లింగం "అరుణాచలం". మొట్టమొదటి జ్యోతిర్లింగం. కృత యుగంలో రత్నాచలం, త్రేతా యుగంలో కనకాచలం, ద్వాపర యుగంలో రజతాచలం గా కనపడిన గిరి కలియుగంలో ఎరుపు రంగులో ప్రకాశిస్తూ అరుణాచలంగా పిలవబడుతోంది. 
సర్వేశ్వరుడు స్వయంగా క్షేత్ర మహత్యాన్ని ఇలా తెలిపారని పురాణాలు తెలుపుతున్నాయి. 
"తిరువారూరులో జన్మించినవారు, చిదంబరాన్ని సందర్శించినవారు, కాశీలో మరణించిన వారు కైలాసవాస భాగ్యాన్ని పొందుతారు. కానీ అరుణాచల అని స్మరించినంతనే ముక్తిని పొందగలరు"









చావుపుట్టుకలు మా చేతుల్లో లేవు. సందర్శన ప్రాప్తం కూడా భగవంతుని అనుగ్రహంతోనే సాధ్యం. కానీ స్మరించడం మన తప్పకుండా చేగలిగినది. స్మరణ మాత్రాన సద్గతులను ప్రసాదించే క్షేత్రం అరుణాచలం గురించి అనేకానేక ప్రాచీన సంస్కృత మరియు తమిళ గ్రంధాలలో విపులంగా విశదీకరించబడింది. 
భగవాన్ శ్రీ రమణ మహర్షి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో స్కాంద పురాణంలోని ఉపపురాణాలైన క్షేత్ర ఖండముల నుండి, శివ రహస్యం, శివ మహాపురాణం, విద్వేశ్వర సంహితం మరియు విద్యాసాగర సంహితం అనే అయిదు గ్రంధాల లోని రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది శ్లోకాలను సేకరించి "అరుణాచల మాహత్యం" అనే గ్రంథాన్ని రచించారు. 











స్కాంద పురాణంలోని ఎనభై ఒక్క వేళా సంహితాలలో మొదటిదైన మహేశ్వర ఖండంలోని కేదార, కౌమారికాల తరువాత వచ్చేది "అరుణాచలేశ్వర మహత్యం" అంటే ఈ క్షేత్ర  ప్రాముఖ్యం అర్ధం అవుతుంది. దీనిలో బ్రహ్మ దేవుడు సనక మహర్షికి, నంది మార్కండేయ మహామునికి అరుణాచల మహత్యాన్ని సవిరం గా తెలియజేస్తారు. 
నిరంతరం నటరాజ సమక్షంలో ఉండే నందీశ్వరుడు అరుణగిరి గురించి ఇలా అన్నారు. 
                                      " అద్ది యేయంచ స్థల మరుణాచలంబు  
                                         స్థలము లన్నింటి లోనమి గులన నధికము !!
                                         అదియే  భూహృద యంబగు నదియే మరియు 
                                        శివుని హృత్క్షేత్ర  మగుమర్మ చిత్వ  లంబు  
                                         పతియ  గునతడు వసించు సతత మందే 
                                         అలరు గిరివేష మనయరు  ణాచలమన !!










అరుణాచల మాహత్యం 

అహంకారంతో ప్రవర్తించి, ఆధిక్యం కొరకు అర్రులు చాచి అంతిమంగా అపజయాన్ని అందుకొన్న బ్రహ్మ విష్ణువుల తో పాటు ముక్కోటి దేవతలు, మహర్షుల కోరిక మేరకు కొండగా కొలువు తీరిన కపర్ది ఇలా శెలవిచ్చారు. 
" నాకు ప్రతి రూపమీ పర్వతం. ఉత్తమమైనది. శుభప్రదమైనది. మోక్షము పొందుటకు గని వంటిది. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉఛ్ఛ స్థితిలో ఉండగా నా జ్యోతి రూపానికి జ్యోతులతో అలంకరించినా , అర్చించినాసర్వ పాపములు హరించి అభీష్టసిద్ధి కలుగును. ఈ క్షేత్రమునకు మూడు యోజనాల పరిధిలో నివసించు వారికి నా సాయుజ్యం లభించును. గిరి ప్రదక్షిణ చేయువారి సకల కోర్కెలు నెరవేరును. ఇహపర సుఖాలను పొందగలరు"
" ఈ క్షేత్రంలో చేసిన చిన్న పుణ్యకార్యం కూడా అనేక రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ బీదసాదలకు, బ్రాహ్మణులకు, అన్నదానం చేసిన వారికి సర్వ అభీష్టాలు తీరి సార్వభౌమత్వం పొందగలరు. ఓకే జీవి ఎక్కడ మరణించినా అరుణాచలంలో శ్రాద్ధకర్మలు జరిపితే ఆ జీవికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. సప్త ముక్తి క్షేత్రాల కన్నా అరుణాచలం అత్యంత విశిష్టమైనది. అరుణాచల స్మరణ, శ్రవణ, సందర్శన మాత్రములచే మానవుడు పునీతుడు అవుతాడు. నా వాక్కు నిశ్చయము". 
"మహర్షులు, యోగులు, ముక్కోటి దేవతలు, దిక్పాలకులు, బ్రహ్మ విష్ణు సమేతంగా అందరూ అదృశ్య రూపాలలో ఈ గిరి చుట్టూ సంచరిస్తుంటారు. నేను సైతం యోగిగా కౌపీనధారినై గిరి మార్గంలో అదృశ్యంగా సంచరిస్తుంటాను. అర్హులైన వారికి దర్శనమిస్తాను". 
గిరికి  తూర్పున లింగరూపంలో వెలసిన స్వామికి దేవశిల్పి విశ్వకర్మ తొలి ఆలయాన్ని నిర్మించాడు. 











ఇరవై అయిదు ఎకరాల సువిశాల స్థలములో వివిధ కాలాలలో  నిర్మించిన నిర్మాణాలతో గిరి మార్గంతో కలిపి మొత్తం సప్త ప్రాకారాలు. కైలాసానికి ప్రతి రూపం. తూర్పున రాజ గోపురం, పడమర పై గోపురం, దక్షిణాన తిరుమంజన గోపురం, ఉత్తరాన అమ్మణి అమ్మన్ గోపురం, వాటి మీద అనేకానేక దేవీదేవతలు రూపాలను, శివ లీలా విన్యాసాలను సుందరంగా మలచారు. ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కనిర్మాణానికి, ఉపాలయంలో కొలువైన పరివార దేవతల గురించి విశేష పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉండటం ఈ దేవాలయ గొప్పదనాన్ని, ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుపుతున్నాయి. 
ఈ ప్రముఖ ఆలయం నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన  గోపురాలతో పాటు అంతర్భాగంలోని వాటితో కలిపి మొత్తం తొమ్మిది గోపురాలతో శోభిల్లుతుంటుంది.  ఆలయ అంతర రెండు ప్రాకారాలు తొలి నిర్మాణాలుగా పేర్కొనబడుతున్నాయి. మూడో ప్రాకారం కుళోత్తుంగ చోళ రాజు కాలంలో నిర్మించబడగా, వెలుపలి రెండు ప్రాకారాలు హొయసల మరియు విజయనగర రాజుల కాలంలో నిర్మించబడినాయి.  ప్రాకార గోడల పైన తమిళ, తెలుగు భాషల శాసనాలు అనేకం కనపడతాయి. ఇవన్నీ వివిధ కాలాలకు చెందినవి.  
తూర్పు రాజగోపురం నుంచి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే మనకు కుడి వైపున సుందర శిల్పాలతో, ద్రావిడ, విజయనగర శైలిలో నిర్మించబడిన వెయ్యి కాళ్ళ మండపం ఉంటుంది. దానికి ఆనుకొనే ఒక మహనీయుని సమాధి మీద ప్రతిష్టించిన శ్రీ పాతాళ లింగం ఉంటుంది. ఇక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షి తిరువణ్ణామలై వచ్చిన తొలినాళ్లలో కొంత  కాలం తపస్సు చేశారు. ఎడమ వైపున "శ్రీ కంబత్తు  ఇళయనార్ (శ్రీ సుబ్రమణ్యస్వామి)"  ఆలయం, దాని వెనుక ప్రధమ పూజ్యుడు శ్రీ గణపతి ఆలయం, వల్లే కప్పు మరియు రుద్రాక్ష మండపం, పెరియ నంది ఉంటాయి. శివగంగ పుష్కరణి కూడా మొదటి ప్రాకారంలో ఉంటుంది. ఈ  కోనేరు లోనే పర్వదినాలలో ఉత్స విగ్రహాలకు  తిరుమనజనం నిర్వహిస్తారు. తిరువణ్ణామలై లో నందీశ్వరునికి విశేష ప్రాధాన్యత ఉన్నది. ప్రాంగణానికి ఒకటి చొప్పున మొత్తం అయిదు నందులుంటాయి. లోపలి వెళుతున్న కొద్దీ వాటి ఆకారాలు కూడా ప్రాంగణం నుండి ప్రాంగణానికి తగ్గుతూ ఉండటం గమనించదగిన సంగతి. వాటిల్లో మొదటిది పెరియ నంది. 











రెండో ప్రాంగణానికి దారి తీసే వళ్ళల రాజ గోపురానికి ఇరుపక్కలా శ్రీ గోపుర అయ్యనార్ (శ్రీ కుమార స్వామి), శ్రీ కళ్యాణ సుందరార్ (ఈశ్వరుడు) సన్నిధులుంటాయి.
వళ్ళాల గోపురం గుండా రెండో ప్రకారం లోనికి వెళితే పురవి మండపం, ఆలయ కార్య నిర్వాహణ కార్యాలయం,ప్రసాద విక్రయ కేంద్రం ఉంటాయి. పురవి మండపంలో ఆలయ నమూనాను చూడవచ్చును. ఇదే ప్రాంగణంలో శ్రీ కాలభైరవ, తీర్థవారి మండపం, గోశాల, బ్రహ్మలింగేశ్వర, విద్యాధరేశ్వర, నళేశ్వర మరియు వినాయక, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలతో పాటు బ్రహ్మ తీర్థం, తిరుమనజాన, అమ్మణి అమ్మన్ గోపురాలుంటాయి.
ఈ ప్రాంగణంలో ఉన్న రెండో నంది మండపము మీద వళ్లాలరాజు, ఆయన కుటుంబ సభ్యుల మూర్తులను చూడ వచ్చును. ఈ ప్రాంగణ పడమర దిక్కున అమావాస్య మండపం, ఆదిముడి కన్న అణ్ణామలైయార్ సన్నిధి, శివపాద, వినాయక, మురుగ మరియు కార్తీక మండపాలు
ఉంటాయి.









గొప్ప సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు అయిన అరుణగిరినాథర్ తో ముడిపడి ఉన్న "కిళి గోపురం" గుండా మూడో ప్రకారం లోనికి ప్రవేశిస్తాము. ఈ ప్రాంగణంలో కట్చి మండపం, చిదంబర, జంబుకేశ్వర, ఏకాంబరేశ్వర, పిదారి, శ్రీ కాళహస్తీశ్వర లింగాలతో పాటు శ్రీ రేణుకా దేవి ఉపాలయాలుంటాయి. ఎదురుగా స్వర్ణమయ ధ్వజస్థంభం, బలి పీఠం, మూడోవది  అయిన కొడి కంపత్తు నంది ఉంటుంది. ప్రధాన ఆలయ నిర్మాణానికి కుడి వైపున గణేష, ఎడమ వైపున శ్రీ దండాయుధ పాణి కొలువుతీరి ఉంటారు.
శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయ వృక్ష పొగడ చెట్టుతో పాటుగా పురాతన మండపాలు, విజయనగర రాజులు నిర్మించిన కళ్యాణ మండపం కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి.
ప్రదక్షిణ పూర్తి చేసుకొని వరుస క్రమంలో నాలుగో ప్రాకారం లోనికి వెళితే అనేక శివలింగాలు, శ్రీ వినాయక, ఉత్సవిగ్రహ మండపం, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ షణ్ముఖ, ఆదిత్య, శ్రీ ఆంజనేయ, శ్రీ లక్ష్మి, అరవై మూడు మంది నయనారులు, అలంకార మండపం, శ్రీవారి శయన మందిరం అన్నీ ఇక్కడే ఉంటాయి. నాలుగోవది అయిన ప్రదోష నంది కూడా ఇక్కడే కనపడతాడు. మండపం అంతా  సుందర చెక్కడాలతో నిండిన స్తంభాలతో ఉంటుంది. గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ దక్షిణామూర్తి, శ్రీ లింగోద్భవ మూర్తి, బ్రహ్మ, దుర్గ, శ్రీ చండికేశ్వరులను ప్రతిష్టించారు. గర్భాలయంలో రమణీయ పుష్పాలంకరణలో శ్రీ అణ్ణామలేశ్వర స్వామి నయనమనోహరంగా దర్శనాన్ని అనుగ్రహిస్తారు. భక్తులు "ఆరోం హర" అంటూ అయ్యకు మొక్కుతూ తమ కోర్కెలను విన్నవించుకొంటారు.











శ్రీ అపిత కుచాంబిక ( శ్రీ ఉణ్ణామలై అమ్మన్ )

ఆది దంపతులు కైలాసంలో చతురోక్తులతో సమయం గడుపుతున్నారు. వినోదంగా పార్వతీ దేవి త్రినేత్రుని నేత్రాలను తన హస్తాలతో మూసివేశారు. లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యచంద్రులా నేత్రాలు. లోకమాత క్షణకాలం కనులను మూయడం వలన లోకాలన్నీ వేల సంవత్సరాలు అంధకారంలో మునిగిపోయాయి. లోకాలలో  పరిస్థితులన్నీఅల్లకల్లోలంగా మారిపోయాయి. అమ్మవారికి తాను చేసిన తప్పు అవగతమైనది. లోకాలను కాపాడే ఆదిశక్తి వాటిని అస్తవ్యస్తంగా మార్చినందుకు ఆమె దోష నివారణకు సిద్దపడింది. మహేశ్వరుడు ఆమెను సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటైన కాంచీపురంలో చూత వృక్షం క్రింద తన దర్శనం కొరకు తపస్సు చేయమని మార్గోపదేశం చేశారు. 
ఆ ప్రకారం పర్వత రాజ పుత్రి చెలులతో కలిసి భూలోకం చేరుకొన్నది. మామిడి చెట్టు క్రింద సైకత లింగం ప్రతిష్టించి తదేక దీక్షతో తపస్సు చేయసాగింది. ఆమె దీక్షకు సంతసించిన సదాశివుడు పరీక్షింప నెంచారు. కంపా నదికి వరద సృష్టించారు. క్షణక్షణానికి ఉదృతమవుతున్న నీటి ప్రవాహానికి ఇసుక లింగం ఎక్కడ జలార్పణం అవుతుందో అని భయపడింది దేవి. అప్పుడు పడిన పార్వతి హస్త కంకణాల, స్థనాల ముద్రలను నేటికీ శ్రీ ఏకాంబరేశ్వర లింగం మీద చూడవచ్చును.  అప్పుడు ఆకాశవాణి " దేవి! నీ భక్తి శ్రద్ధలు అపూర్వం. నీవు అరుణగిరి చేరుకొని అక్కడ గౌతమ ముని ఆశ్రమంలో ఉండుము. నీ మనస్సులో స్థిరనివాసమేర్పర్చుకొన్న మహేశ్వరుడు అక్కడ నీకు దర్శనం ఇస్తారు. ఆయన ఆదరణ పొందగలవు" అని పలికింది. 
ఆకాశవాణి అమ్మవారిని అరుణాచల వెళ్ళమని ఆదేశించడం మహేశ్వరుడు పలికిన "సప్త ముక్తి క్షేత్రాల కన్నా అధికం అరుణాచలం" అన్న మాటలకు బలం చేకూరుతుంది.కంచిలో శ్రీ కామాక్షి దేవి శ్రీ ఏకాంబరేశ్వరుని కన్నా ఎంతో ముందు కొలువు తీరారు.
అశరీరవాణి వాక్కుతో ఆనందించింది. సైకత లింగ భాద్యతను మహర్షులకు అప్పగించి తానె చెలులతో కలిసి తిరువణ్ణామలై దిశగా బయలుదేరింది. పార్వతీ దేవిని ఆదరంగా  ఆహ్వానించారు గౌతమ మహర్షి. దేవి కోరిక మేరకు అరుణాచల ఆవిర్భావ వృత్తాంతాన్ని, మాహాత్యాన్ని, గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యాన్ని, ఫలితాలను సవిరంగా తెలియజెప్పారు. గిరి ప్రదక్షిణ మహిమ తెలుసుకొన్న పార్వతి నిత్యం నియమంగా చెలికత్తెలతో కలిసి అరుణాచల ప్రదక్షిణ మరియు శ్రీ అరుణాచలేశ్వరుని సేవించుకోసాగింది.
గౌతమాశ్రమంలో విడిది చేసిన దేవేరి వద్దకు దేవతలు, మహర్షులు, మునులు తరలి వచ్చారు. ఆమెను సేవించుకొని మహిషాసురుని వలన తామెదుర్కొంటున్న ఇబ్బందులు ఏకరవు పెట్టి, కాపాడమని అర్ధించారు. వరగర్వంతో లోకకంటకునిగా మారిన అసురుని భాధ తగిన సమయంలో తొలగిపోతుందని అభయమిచ్చారు. అధర్మ మార్గంలో నడిచే వాని పాపం ఏదో ఒకనాటికి పండుతుంది. వాని అహంకారమే మృత్యువుగా మారుతుంది. అదే జరిగింది మహిషాసురుని విషయంలో కూడా !









ఒకనాడు వేట నిమిత్తం ఇక్కడికి వచ్చిన రాక్షస రాజు గౌతమాశ్రమములో ధ్యానంలో ఉన్న లోకేశ్వరిని చూసాడు. కర్మ పరిపక్వానికి రావడం వలన ఆమెలో అతనికి అమ్మ కనిపించలేదు. అతిలోక సౌందర్యరాశి దర్శనమిచ్చింది. అసురునిలో మోహావేశం తలెత్తినది. ఆమె ఎవరో తెలుసుకోడానికి మారువేషంలో ఆశ్రమానికి వెళ్ళాడు. చెలికత్తె " ఆమె తన పతి గురించి తపమాచరిస్తోంది. ఆయన దయ ఇంకా కలుగలేదు. ఆయన అనుగ్రహం కలిగే వరకు ఈమె తపము ఆగదు " అని తెలిపింది.
నిజరూపం దాల్చిన మహిషుడు " ఆ పతిని నేనే! ఈ సుందరాంగి నిరీక్షణ ఫలించింది" అని అంటూ మితిమీరిన అహంతో తన గొప్పలు చెప్పుకోసాగాడు. ఉన్మాద ప్రేలాపనకు కనులు తెరచిన కాత్యాయని ఉగ్ర రూపమైన దుర్గ గా అవతరించినది. క్షణకాలంలో అసుర సైన్యాన్ని బూడిద చేసింది. లోకాలకు ఆనందం కలిగే విధంగా మహిషుని శిరస్సును త్రిశూలంతో ఖండించి మహోగ్రంగా దాని మీద నాట్యం చేయసాగింది. దనుజుని తురిమిన దుర్గను  దేవతలు, మహర్షులు స్తోత్రం చేసి కీర్తించారు. శాంతించిన శాంభవి రాక్షసుని కంఠాన్ని అలంకరించిన శివ లింగాన్ని చేతి లోనికి తీసుకున్నది. రాక్షసుని రుధిరంతో తడిసిన లింగం ఆమె హస్తాన్ని అంటుకొని ఉండిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఊడి రాలేదు.
గౌతమ ముని " దేవదేవి ! అసురుడైనా మహిషుడు అమిత శివ భక్తుడు. లింగ దారుడు. పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా లోకనాయకివైన నీ చేతిలో మరణం పొందాడు. శివభక్తుని సంహరించడం వలన సంక్రమించిన దోషం కారణంగా లింగం నీ చేతికి అంటుకొనిపోయింది. సర్వతీర్ధాల జలంలో స్నానమాచరించి అరుణాచలేశ్వరుని సేవించుకొంటే దోషం తొలగిపోతుంది" అని పక్కన ఉన్న శిలను పగులగొట్టమని సలహా ఇచ్చారు. అమ్మవారు ఖడ్గంతో రాతిని ఖండించగా నీరు ఉబికివచ్చింది. దానిలో శుచిగా మారి మహాముని చెప్పిన ప్రకారం తిరిగి తపస్సు మీద దృష్టిని కేంద్రీకరించింది.














శ్రీ దుర్గ దేవి మహిషుని సంహరించింది తిరువణ్ణామలై లోనే. ప్రస్తుతం బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీ దుర్గాదేవి కోవెల ఉన్న స్థలం లోనే సమరం జరిగిందని తెలుస్తోంది. దీనికి బలం చేకూర్చే విధంగా ఇక్కడ శ్రీ దుర్గాదేవి నిలువెత్తు రూపంలో మహిషాసురుని శిరస్సు మీద స్థానిక భంగిమలో దర్శనమిస్తారు. పక్కనే ఆమె చేతికి అంటుకున్న లింగం " శ్రీ పాపనాశేశ్వర స్వామి" గా పూజలందుకొంటుంటుంది. ప్రాంగణంలో అమ్మవారి ఖడ్గ ఘాతానికి పెల్లుబికిన నీటితో ఏర్పడిన ఖడ్గ తీర్ధం కూడా ఉంటుంది. ఉపాలయంలో  అరుదైన శ్రీచక్రం ఉంటుంది. భంగమైన శ్రీచక్రాన్ని భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వహస్తాలతో సరిదిద్దారు. నిత్య పూజలు జరుగుతుంటాయి. తిరువణ్ణామలై లో తప్పక సందర్శించవలసిన ఆలయాలలో ఇదొకటి.
 నియమంగా గిరిప్రక్షిణ చేయసాగింది అమ్మవారు. కార్తీక పౌర్ణమి నాడు నందివాహనుడై, సమస్త శివ పరివారం, గణాలతో కలిసి దర్శనమిచ్చారు. తన నిరీక్షణ ఫలించడంతో సంతోషించిన పార్వతి స్వామికి ప్రణమిల్లింది.
" దేవీ! ఇంతటితో మన ఎడబాటుకు చరమ వాక్యం పలుకుతున్నాను. ఇంకెన్నటికీ విడిపోకుండా నీకు నాలో సగభాగం ఇస్తున్నాను" అని ఆప్యాయంగా అమ్మవారిని తన ఒడిలోకి తీసుకొన్నారు అర్ధనారీశ్వరుడు. వామభాగాన్ని అర్ధాంగికి ఇచ్చి వామదేవునిగా కీర్తించబడుతున్నారు. అనురాగ, ఆప్యాయతలకు నిదర్శనంగా శివశక్తుల ఐక్య రూపం అందరికి నయనానందకరంగా కనపడింది. ఒకపక్క ధవళవర్ణం, రెండో వైపు రుధిర వర్ణంతో శోభిల్లుతూ ఒక నూపురం, ఒక స్థనం తో, సగం స్వర్ణాభరణాలతో, సగం సర్ప, రుద్రాక్ష మాలలతో అర్ధనారీశ్వర రూపం మనోహరంగా ఉన్నది.
ఐక్య శక్తికి దేవతలు, మహర్షులు భక్తిభావంతో నమస్కరించి స్తుతించారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరునిగా మారిన మహోన్నత క్షేత్రం అరుణాచలం.
ఈ సంఘటన జరిగింది తిరువణ్ణామలై లోని  "ప్రవాళ పర్వతం"గా పిలవబడే "పావళ కున్రు" మీద. ఈ చిన్న కొండ పావళ కున్రు వీధి  చివర ఉంటుంది. ఇక్కడి ఆలయ మండపంలోనే  భగవాన్ శ్రీ రమణ మహర్షి తల్లి అళగమ్మాళ్ కి తొలి సందేశం ఇచ్చారు. శ్రీ రమణాశ్రమం వారు శ్రీ అర్ధనారీశ్వర స్వామి కొలువు తీరిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మండపంలో భగవాన్ తల్లికి రాసి ఇచ్చిన సందేశాన్ని తమిళ, ఆంగ్ల భాషలలో ఉంచారు.










అమ్మవారికి అర్ధభాగాన్ని ఇచ్చిన తరువాత మహేశ్వరుడు " నేను ఇక్కడ అరుణగిరీశ్వరునిగా స్థిరనివాసం ఏర్పరచుకొంటున్నాను. తాను చేసిన చిన్న పొరబాటును సరిదిద్దుకోడానికి మహోన్నతరీతిలో తపమాచరించినది దేవి. దీనికోసం తల్లి పాలు తాగవలసిన  పసివాడైన కుమారుని గంగాదేవికి అప్పగించింది. అందువలన ఈమె ఇక్కడ "అపితకుచాంబిక" (పుత్రునికి స్తనమివ్వనిది) అన్న పేరుతొ కొలువుతీరి ఉంటుంది. భూలోక కైలాసమైన అరుణాచలంలో చేసుకొనే మా దర్శనం పరమపావనం. సర్వపాప హారం. ఈ క్షేత్ర సందర్శన, గిరి ప్రదక్షిణ చేయువారు అన్ని దోషాల నుండి విముక్తులై సకలైశ్వర్యాలతో సుఖంగా జీవితాన్ని గడుపుతారు" అని అభయమిచ్చారు. నివాసాలుగా కలిగిన సర్వేశ్వరుడు స్వయం శిలగా వెలిసిన దివ్య స్థలం.

అపితకుచాంబ లేదా ఉణ్ణామలై అమ్మన్ ప్రధాన ఆలయానికి ఉత్తరం పక్కన ఉంటుంది. గణపతి, నవగ్రహాలు, చిత్రగుప్త ఆలయ ముఖ మండపంలో దర్శనమిస్తారు. చక్కని శిల్పాలను ఇక్కడి స్థంభాలపైన కనపడతాయి. గర్భాలయంలో అమ్మవారు స్థానక భంగిమలో దర్శనమిస్తారు.

అరుణాచల ఉత్సవములు 

భోగ యోగ క్షేత్రమైన అరుణాచలంలో ప్రతి రోజు ఒక పర్వదినమే ! నిత్యం ఆరు పూజలు నియమంగా జరుపుతారు. అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు, ఆరగింపులు చేస్తారు. ప్రతి మాసంలోను విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. నెలకు రెండు త్రయోదశులను, అమావాస్య, సోమ మరియు శుక్రవారాలలో చేసే ప్రత్యేక పూజలను " పంచ పర్వ విళ" అని అంటారు. అన్ని హిందూ పర్వదినాలను, స్థానిక పండుగలను ఘనంగా చేస్తారు. సంవత్సరానికి నాలుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఉత్తరానయన పుణ్యకాలంలో మకర సంక్రాంతితో ముగిసే పది రోజుల ఉత్సవం జరుగుతుంది. 
కనుమనాడు " తిరువూడల్ ఉత్సవం" జరుపుతారు. ఇది ఒక ముఖ్యమైన చూడవలసిన ఉత్సవం. 
భృంగికి మోక్షం ఇవ్వడం గురించి ఆది దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. తనను పూజించని భృంగికి మోక్షం ఇవ్వడానికి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అంగీకరించారు. భక్త సులభుడైన మహేశ్వరుడు ఇవ్వ సంకల్పిస్తారు. ఈ ప్రణయ కలహాన్ని ఆలయ పూజారులు బహు చక్కగా ప్రదర్శిస్తారు. చివరికి అయ్య మాటే నెగ్గుతుంది. ఎవరు గెలిచినా భక్తులకు అది సంబరమే ! కారణం ఏమిటంటే హర అంటే శివుడు. అర అనగా పార్వతి. తిరువూడల్ ఉత్సవాన్నివీక్షించిన భక్తులు మాత్ర "అరోంహర"అంటూ ఇరువురినీ కలిపి కైవారాలు చేస్తారు.
మరునాడు సపరివారంగా సతీ సమేతంగా శ్రీ అన్నమలేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేస్తారు. 
మహా శివరాత్రి మరో ముఖ్యమైన పండుగ దినం. ఆ రోజు ఉదయం రెండు గంటల నుండి మధ్యాహన్నం రెండు గంటల వరకు లక్ష బిల్వార్చన జరుగుతుంది. తిరిగి సాయంత్రం ఆరు నుండి జాముకొక పూజ చొప్పున చేస్తారు. 
ఫాల్గుణ మాసంలో వసంతోత్సవాన్ని పది రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్తరాయణంలో వలే దక్షిణాయనంలో కూడా పది రోజుల ఉత్సవాన్ని జరుపుతారు. ధనుర్మాసంలో "ఆర్ద్రా ఉత్సవం" జరుగుతుంది. ఈ రోజునే పరమ శివుడు బ్రహ్మ విష్ణువులకు జ్యోతి లింగంగా దర్శనమిచ్చినది. మాణిక్యవాచకులు రచించిన ముఫై కీర్తనల గానం " తిరువెంబావై " ఈ రోజుతో  పూర్తి అవుతుంది. 
ఇవి కాకుండా శ్రీ గణేష చతుర్థి, శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, దసరా నవరాత్రులూ ఘనంగా చేస్తారు. 
శివునికి ప్రీతికరం కార్తీకం. ఆ నెలంతా విశేష పూజలు జరుగుతాయి. చివరగా కార్తీక పౌర్ణమినాటి " అరుణాచల దీపం"తో ఈ ఉత్సవం పూర్తి అవుతుంది. 















 అరుణాచల దీపోత్సవం 

" అరుణాచల దీప దర్శనం సర్వపాప క్షయకరం. ఆయుష్యవృద్ధికరం. ఆరోగ్యప్రదాయకం. ఐశ్వర్యప్రాప్తికరం, కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ప్రదోష సమయంలో జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసినవారు సహస్ర అశ్వమేధ యాగాలు చేసిన ఫలం పొందగలరు, అని ఈశ్వరుడు నాతొ స్వయంగా చెప్పారు" అని గౌతమ మహర్షి గౌరీ దేవితో అరుణాచల మాహత్యం వివరించే క్రమంలో తెలిపారు. 
" ఎవరైతే  ఏ రోజైనా అరుణాచల రాజగోపురం లేదా ప్రాంగణంలో (నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే) మరియు గిరి మార్గంలో నందుల వద్ద నేతి, నువ్వుల నూనె లేదా ఆముదం నూనె తో దీపాలను వెలిగిస్తారో వారికి అన్ని దానాలు చేసిన  ఫలం దక్కించుకోగలరు. ఇహపర సుఖాలు లభ్యం కాగలవు" అన్నది శాస్త్ర వాక్యం. 

గత రెండువేల సంవత్సరాలుగా నిర్వహించబడుతోంది అని శాసనలు ధృవీకరించిన అరుణాచల దీపోత్సవం మొత్తం పదహారు రోజుల పండుగ. తొలి మూడు రోజులూ దేవీ దేవత లను ప్రసన్నం చేసుకొని ఆహ్వానించడం జరుగుతుంది. తరువాత పది రోజులూ కొండ మీద దీపం వెలిగించడానికి జరిగే సన్నాహాలు ఉంటాయి. చివరి మూడు రోజులూ దీపం వెలిగించిన తరువాత జరిగే ఉపసంహారం ప్రక్రియ ఉంటుంది. 
మొదటి మూడు రోజుల కార్యక్రమం తరువాత శ్రీ ఉణ్ణామలై సమేత శ్రీ అరుణాచలేశ్వరుని "కట్చి మండపం"లో ఉపస్థితులను చేస్తారు. పండుగ పది రోజులూ అమ్మ అయ్య దర్శనం ఈ మండపంలోనే లభిస్తుంది. ఉదయం సాయంత్రం మాడ వీధులలో రోజుకొక్క వాహనం మీద సుందరంగా అలంకరించి ఊరేగిస్తారు. అయిదవ రోజు రాత్రి జరిగే రజత నంది ఊరేగింపు ఒక అద్భుతం. ఆ నాడు నంది వాహనం పైన ఊరేగే ఆదిదంపతుల దర్శనం జన్మసాఫల్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఎనిమిదవ రోజు సమస్త పరివార సమేతంగా స్వామి నేత్రపర్వంగా ఊరేగుతారు. 
పదవనాడు ఉదయం భరణి దీపం వెలిగిస్తారు. ఈ దీప ప్రాముఖ్యం లేదా సంకేతం ఏమిటంటే ఆ దేవదేవుని పంచభూత రూపంగా ఆరాధించడమే ! అందువలననే పంచభూతాలకు ప్రతీకగా అయిదు దీపాలను వెలిగిస్తారు. మట్టి ప్రమిదల్లో వెలిగించిన ఈ దీపాల నుండి కాగడాను వెలిగించి దానితో కొండా మీద కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. ఉదయం నుండి  అనేక ద్రవ్యాలతో  శ్రీ అరుణాచలేశ్వరునికి  అభిషేకం చేస్తారు. సాయంత్రంప్రత్యేకంగా నేసిన వస్త్రాన్ని వత్తిగా చేసి వెయ్యి కిలోల నేతితో నింపిన రాగి పాత్రను తీసుకొని అరుణగిరి పైభాగానికి చేరుకొంటారు. సంధ్యా చీకట్లు కమ్ముకోగానే కాగడాతో కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. దీపం వెలుగులు చిమ్ముతూ కనిపించగానే తిరువణ్ణామలై నగరమంతా "ఆరోం హర" అన్న నామంతో మార్మ్రోగిపోతుంది. దీపాన్ని దర్శించుకొని భక్తులు బృందాలు బృందాలుగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. 
ఈ దీపం వారం నుండి పది రోజుల దాకా వెలుగుతుంది. తిరువణ్ణామలై కి పది కిలోమీటర్ల పరిధి లోని గ్రామాల వాసులకు కూడా అరుణాచల కార్తీక దీప దర్శనం లభిస్తుంది. దీపోత్సవం జరిగిన మూడో రోజున శ్రీ అరుణాచలేశ్వరుడు సపరివారంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. వేలాదిగా భక్తులు స్వామిని అనుసరిస్తారు. 
దీపోత్సవంలో పాల్గొని తరించడానికి ఎక్కడెక్కడి నుండో లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. చూడని వారు జీవితంలో ఒక్కసారైనా ఈ ఉత్సవంలో పాలు పంచుకొని దీప దర్శనం చేసుకోవాలి. 
భగవాన్ శ్రీ రమణ మహర్షి తన శ్రీ అరుణాచల స్తుతి పంచకంలో అరుణాచల దీప దర్శనా తత్వాన్ని ఇలా వివరించారు. 
                                           "  ఈ శరీరమే ఔదు నేనను మదిని 
                                                నాశనమొనర్చి పూర్ణముగ, యా బుద్ది 
                                                హృద్వాసి యగుచు, లో దృష్టి వలనను  
                                                నద్వైతమగు నిజాహంజ్యోతి గాంచు 
                                                టరయ భూమధ్యమౌ నరుణాద్రి దీప 
                                                దరిశనమై యొప్పు తత్వార్ధ మగును "












అరుణాచల మాహత్యం 

"స్వయం నేనే అరుణాచలం" అని సర్వేశ్వరుడు ప్రకటించిన అరుణాచల మాహత్యం గురించి నందీశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, గౌతమ మహర్షి, మార్కండేయుడు మరియు సనక మహాముని ఇలా ఎందరో ఎన్నో రకాలుగా వివరించారు. 
విరంచికి, విష్ణువుకు జ్ఞానోపదేశం లభ్యమైన క్షేత్రం అరుణాచలం. 
జటాధరుడు జ్యోతి రూపంగా ప్రకటితమైన క్షేత్రం అరుణాచలం. 
మేరువు, వింధ్య ఆదిగా గల పర్వతాలు శివుని నివాసాలు మాత్రమే ! కానీ స్వయం శివుడే అరుణాచలం. 
పార్వతీదేవి లోకకంటకుడైన మహిషాసురుని సంహరించిన ప్రదేశం అరుణాచలం. 
పరమేశ్వరుడు పార్వతికి అర్ధభాగం అనుగ్రహించిన ప్రదేశం అరుణాచలం. 
స్మరణ మాత్రముననే ముక్తిని ప్రసాదించే పావన క్షేత్రం అరుణాచలం. 
దేవతలు, మహర్షులు నివాసముండే పవిత్ర స్థలం అరుణాచలం.   
స్వయంగా అర్ధనారీశ్వరుడే ఆత్మ ప్రదక్షిణ చేసే మహోన్నత క్షేత్రం అరుణాచలం. 
దిక్పాలకులు, గ్రహాలూ, దేవతలు, ముముక్షువులు, మహామునులు నిరంతరం ప్రదక్షిణాలు చేసే పావన గిరి అరుణాచలం. 
భగవాన్ శ్రీ రమణమహర్షి, శ్రీ శేషాద్రి స్వామి లాంటి ఆధ్యాత్మిక మార్గదర్శకులు నడయాడిన క్షేత్రం అరుణాచలం. 
జీవులకు అత్యంత అవసరమైన నీరు, నెల, నింగి, నిప్పు, వాయువులను పంచభూతాలు అంటారు. వీటిల్లో అగ్ని క్షేత్రం అరుణాచలం. 
జీవులకు ఇహపర సుఖాలను ప్రసాదిస్తూ, అంతిమంగా వారిలోని అజ్ఞానాన్ని తొలగించి తనలో లీనం చేసుకొనే జ్యోతి స్వరూపం అరుణాచలం. 
అరుణాచల మాహత్యం ఇంతని చెప్పగలమా !
అరుణగిరికి  తూర్పున శ్రీ సూర్యనారాయణమూర్తి, దక్షిణాన శ్రీ విశ్వామిత్ర మహర్షి, పడమరలో వరుణదేవుడు, ఉత్తరాన త్రిశూలం పరివేష్టించి ఉంటారు. ముక్కోటి దేవతలు అదృశ్య రూపంలో సంచరిస్తుంటారు. ఇక్కడి పుష్కరుణలోనికి సర్వ జీవ నదుల నీరు అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.  ఒక్కో కోనేరులో స్నానం చేసి అరుణాచలనుని సేవిస్తే ఒక్కో ఫలితాన్ని పొందగలరని అరుణాచల పురాణం మరియు అరుణాచల మాహత్యం లాంటి గ్రంధాలు తెలుపుతున్నాయి. 
ఒకప్పుడు వందల సంఖ్యలో కోనేరులు గిరి చుట్టూ నెలకొని ఉండేవట. కాలప్రభావం, నగరీకరణ, మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా వరకు ధరణీ గర్భంలో కలిసిపోయాయి. ఇలా జరగవచ్చును అన్న అనుమానం మార్కండేయ మహర్షికి నాడే కలిగిందేమో ! ఒకనాడు నేరుగా 
గంగాధరుని " సామాన్యులకు ఈ తీర్ధాల మహత్యం తెలియదు కదా ! మరి వారు ఏ విధంగా ఈ తీర్ధ ప్రయోజనం పొందగలరు ?" అని ప్రశ్నించారట. 













దానికి సమాధానంగా స్వామి " నాయనా! నేను ఆహరం స్వీకరించే లేదా స్వీకరించిన తరువాత సమస్త తీర్ధాలు నాలోనే ఉంటాయి. నైవేద్యానంతరం నన్ను దర్శిస్తే అన్ని తీర్ధాలలో స్నానమాడిన ఫలం లభిస్తుంది", అని తెలిపారు. ఈ కారణంగా శ్రీ అరుణాచలేశ్వరుని ప్రదోష కాల దర్శనం సకల వాంఛా ఫలప్రదాయకం. ఒక్క తిరువణ్ణామలై లోనే కాదు ఎక్కడైనా లింగ రాజును సాయంత్రం పూట సందర్శించుకోవడం వాంఛనీయం. అందుకే పెద్దలు ఏనాడో సెలవిచ్చారు ఉదయం విష్ణాలయ, సాయంత్రం శివాలయ దర్శనం విశిష్ట ఫలదాయకం. 
గౌతమ మహర్షి పార్వతీ దేవితో "వ్రత, తీర్ధ, తపో, దాన, యజ్ఞ, యాగ, నియమనిష్టల వలన లభించు పుణ్యఫలం ఒక్క అరుణాచల సందర్శన మాత్రాన లభిస్తుంది. అంతటి విశిష్ట క్షేత్రమిది " అని తెలిపారు. 
ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీటిని అభిషేకించినా భక్తసులభుడు కోరిన కోర్కెలు తీరుస్తాడు. ఒక్క బిల్వపత్రాన్ని ఉంచినా చాలు సంతుష్టుడవుతారు. వెన్నంటి కాపాడుతారు. తిరువణ్ణామలైలో ఈ రెండింటి తరువాత దీప ప్రజ్వలనానికి, అన్న దానానికి అమిత ప్రాధాన్యత ఉన్నది. అరుణాచలం పంచభూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రం. ఆలయంలో లేదా గిరి మార్గంలో ఎక్కడైనా దీపాన్ని వెలిగించిన భక్తుల జీవితం నిత్య దీపావళిగా శోభాయమానంగా ఉంటుంది అన్నది శాస్త్ర వాక్యం. 
ఈ క్షేత్రంలో చేసే అన్నదానానికి విశేష ఫలితం ఉన్నది. ఈ విషయాన్ని నారద మహర్షి స్వయంగా చెప్పారు. ఇతర క్షేత్రాలలో లక్షమందికి చేసిన అన్నదానం కాశి లో ఒక్కరికి చేస్తే లభిస్తుంది. కాశీలో కోటిమందికి చేసిన అన్నదాన ఫలం అరుణాచలంలో ఒక్కరికి పెడితే లభ్యమవుతుంది. ఇక్కడ ద్వాదశి తిధి నాడు చేసే అన్నదానం ఒక సంవత్సరమంతా లక్షమందికి అన్నదానం చేసిన దానితో సమానం" అని తెలిపారు త్రిలోకసంచారి.అందువలన అరుణాచలంలో సర్వాభీష్టసిద్ధికి, వంశాభివృద్ధికి, ఐశ్వర్యాభివృద్దికి అన్నదానం చేయడం అభిలషణీయం. 
అరుణాచలంలో చేసే చిన్న పుణ్యకార్యమైన పదహారు రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని తెలిపారు యోగులు. 

అరుణాచల ప్రదక్షిణ 

" యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ ! థానిథాని ప్రణశ్వంతి ప్రదక్షిణం పదేపదే !!"

ప్రదక్షిణ అనే పదం లోని ప్రతి ఒక్క అక్షరం ఒకో విశిష్టార్థం కలిగి ఉంటుంది అని పండితులు చెబుతారు. "ప్ర" అనగా తనలోని పాపాలు తొలిగిపోవాలని, "ద" అంటే కోరిన కోర్కెలు నెరవేరాలని , "క్షి" కి మరో జన్మలోనైనా మంచి నడతను ప్రసాదించమని, "ణ"అనగా అజ్ఞానాన్ని హరించి ఆత్మజ్ఞానం అనుగ్రహించమనిగా విశ్లేషించారు. 
మనం జన్మించినది మొదలు మరణించే వరకూ జరిగే అన్ని సంఘటనలకు కేంద్ర బిందువు భగవంతుడు. లీలా మానుష రూపుడైన ఆ దేవదేవునికి ఒక రూపం కల్పించుకొంటాము. ఆయనకు ఒక ఆలయం నిర్మిస్తాము. వేదమంత్రాలతో నిత్య పూజలు జరిపిస్తుంటాము.  మన జీవితాలు ఆయన దయతో సుఖప్రదంగా సాగిపోవాలని వాంఛిస్తాము. మన కోరికలు అన్నీ తీరాలని మనస్సులో తలచుకొంటూ గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాము. 
పవిత్ర, ప్రశాంతత నెలకొని ఉండే దేవాలయంలో నిత్యం పఠించే వేదం మంత్రాలు ఒక విధమైన శక్తివంతమైన వాతావరణం సృష్టిస్తాయి. ప్రదక్షిణ చేసే క్రమంలో ఆ శక్తివంతమైన వాతావరణం మనలో నెలకొని ఉన్న ప్రతికూల భావాలను తొలగించి పూర్తి అనుకూల స్పందనలు నెలకొనేలా చేస్తాయి. ఇది మనకు సరైన మార్గదర్శకం లభించేలా చేస్తాయి. అందుకే ఆలయాల్లో ప్రదక్షిణ చేయడం తప్పనిసరి చేశాయి మన సంప్రదాయాలు.
హిందూ సంస్కృతిలో ప్రకృతి, పరమాత్మ వేరు కాదు. జీవనానికి కావలసినవి అందించే ప్రకృతి పరమేష్ఠి ప్రతి రూపం. అందువలననే అశ్వద్ధ, ఔదంబర వృక్షాలకు, తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ వృక్షాల, మొక్కల నుండి వీచే గాలి ఔషధ భరితం. ఆరోగ్యకరం. ఆధ్యాత్మిక భావనల వృద్ధికరం.












అదే విధంగా నాగ ప్రతిష్టలకు, అగ్నికి, జలానికి కూడా ప్రదక్షిణాలు చేస్తారు. జలం జీవం. నీరు లేకపోతే మానవ జీవితాలు ముందుకు సాగవు. గమనిస్తే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, నగరాలు అన్నీ నదీతీరాలలోనే అభివృ ద్ధి చెందాయి. అన్ని నాగరికతల జన్మస్ధలాలు నదులే !. అందుకే
మన హిందూ సంస్కృతిలో నదులకు మాతృస్థానం ఇచ్చి గౌరవించారు. సప్త పుణ్య నదులలో ఒకటి నర్మద. మధ్యప్రదేశ్లోని అమరకంటక్ వద్ద జన్మించి ఒక వెయ్యి నూట పదిహేను కిలోమీటర్ల దూరం ప్రవహించి గుజరాత్ లోని "గల్ఫ్ ఆఫ్ ఖంబట్" వద్ద అరేబియా సముద్రంతో సంగమిస్తుంది. ఈ నదీమతల్లి ప్రవాహ మార్గంలో ఎన్నో పుణ్య ధామాలు నెలకొన్ని ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలుగా సాధుసంతులకు, ఆధ్యాత్మిక మార్గదర్శకులకు, జ్ఞానమార్గాన్ని అన్వేషించేవారికి నర్మదా నది పరిక్రమ చేయడం ఒక సామ్,సంప్రదాయంగా వస్తున్నది. రాను పోనూ మొత్తం మూడువేల మూడు వందల కిలోమీటర్ల దూరం. ఒక సంవత్సరకాలం పడుతుంది. అదే విధంగా గోదావరి పరిక్రమ కూడా చేస్తుంటారు.
ప్రకృతిలో భాగమైన అడవులు కూడా హిందువులకు పూజ్యనీయాలు. అన్నీ పరమాత్మ మానవ రూపంలో సంచరించిన పావన ప్రదేశాలు. ఇక "నైమిశరాణ్యం" స్వయం నారాయణుడే !
గిరుల విషయానికి వస్తే కైలాస, గోవర్ధన గిరుల ప్రదక్షిణ ఏనాటి నుండో చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంద్రకీలాద్రి {విజయవాడ}, సింహ గిరి {సింహాచలం}, కోటప్పకొండ {నరసరావుపేట} ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ అరుణాచలం స్వయం శంకరుడే !గిరియే గౌరినాధుడు, పర్వతమే పరమేష్ఠి, కొండయే కైలాసపతి.














ఆద్యంతాలు లేని తేజో లింగ రూపంలో సాక్షాత్కరించి లక్ష్మీపతి, వాణీపతి కి దర్శనమిచ్చి, వారి అహంకారాన్ని అణిచివేశారు. వారు తమ కలహం లోకహితమైనది కాదు, అహంకారపూరితమైనది అని గ్రహించారు. తేజోలింగ దర్శనంతో వాటికి ఈశ్వర తత్వం అవగతమైనది. వారి అభ్యర్ధన మేరకు లింగరాజు సమోన్నత శిఖరంగా ఇక్కడ కొలువు తీరారు. ఆయన ఆదేశం మేరకు యుగాల నుండిఎందరెందరో చేపడుతున్న  అరుణాచల ప్రదక్షిణ జ్ఞానమార్గానికి పర్యాయ పదంగా మారింది.
నిరంతరం నిరాకారుని సేవలో గడిపే నందీశ్వరుడు అరుణాచల ప్రదక్షిణ మాహాత్యాన్ని ఇలా వివరించారు. " కోటి అశ్వమేధ యాగాల, కోటి తీర్ధ స్నాన ఫలాలను ఒక్క అరుణగిరి ప్రదక్షిణతో పొందవచ్చును. ఎంతటి నికృష్ట దుర్మార్గ జీవితాన్ని గడుపుతున్నవారైనా అరుణాచల ప్రదక్షిణలో వేసే తొలి అడుగుతో మానసిక పాపము, రెండో అడుగుతో వాక్కు చేత చేసిన పాపము, మూడో అడుగుతో శారీరకంగా చేసిన పాపం తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు  శివానుగ్రహం లేకుండా ఎవరూ తిరువణ్ణామలైలో అడుగు పెట్టలేరని అరుణాచల మాహత్యం లాంటో గ్రంధాలు తేటతెల్లం చేస్తున్నాయి.
" నన్ను హృదయాన నిలుపుకొని, నన్నే స్మరిస్తూ, శోణాద్రికి నమస్కరిస్తూ, దిక్కులకు మొక్కుతూ, ఎవరి సహాయం తీసుకోకుండా , ప్రసవాసమయం సమీపించిన గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుందో అలా నడవాలి. ఒకరి అడుగుల శబ్దం మరొకరికి వినిపించకూడదు. సమస్త దేవతలు, మహర్షులు, దిక్పాలకులు, నవగ్రహాలు, అదృశ్య రూపంలో మార్గంలో సంచరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారు," అని మహేశ్వరుడే తెలిపారు. 
శారీరక దుర్బలులు, అనారోగ్య పీడితులు, తమంత తాముగా గిరి ప్రదక్షిణ చేసిన యెడల వారి రుగ్మతలు నెమ్మదిగా తగ్గు ముఖం పడతాయి అన్నది భక్తుల నమ్మకం. చాలా మంది తిరువణ్ణామలై లో ఉంటూ నియమంగా కొంతకాలం గిరి ప్రదక్షిణ చేసి స్వస్థులైనారని తెలుస్తోంది.
ప్రధాన ఆలయ తూర్పు రాజ గోపురం వద్ద నుండి ప్రారంభించి తిరిగి అక్కడే ముగించాలి. కొందరు ఆలయం తెరిచి ఉన్న సమయంలో ప్రదక్షిణ చేయ సంకల్పిస్తే రెండో ప్రాకారంలో తిరుమంజన గోపురం వద్ద ఉన్న శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం వద్ద తమ కోరిక తెల్పుకొని ప్రారంభిస్తారు. ఆలయం మూసివేసినప్పుడు గోపురం వద్ద కర్పూరం వెలిగించి తమ కోరిక విన్నవించుకొని బయలుదేరుతారు. గిరి ప్రదక్షిణలో ఎలాంటి కోరికలు, మొక్కులు మొక్కుకో కూడదు అని అంటారు.
గిరి మార్గం మొత్తం పదునాలుగు కిలోమీటర్లు. ఆధ్యాత్మిక భావాలను పెంపొందించే ఈ ప్రదక్షిణా మార్గంలో ఎన్నో ఆలయాలు, మఠాలు, మందిరాలు, మండపాలు ఎదురవుతాయి. వీటిల్లో తప్పక సందర్శించవలసినవి అష్ట  దిక్పాలక ఆలయాలు ఎనిమిది, రెండు గ్రహ ఆలయాలు , ముగ్గురు మహర్షుల ఆలయాలు, పంచ ముఖ దర్శనం , రెండు మహనీయుల ఆశ్రమాలు, , శ్రీ ఆది అణ్ణామలై స్వామి ఆలయం, శ్రీ తిరునెర్ అణ్ణామలై స్వామి ఆలయం, శ్రీ పళని ఆండవర్ ఆలయం, శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయం, ఇడుక్కి పిళ్ళయార్,  ఏడు నంది మండపాలు ముఖ్యమైనవి.
గిరి ప్రదక్షిణ చేసే సమయంలో తరుచు కొండ వైపుకు చూస్తుండాలి. పదునాలుగు కిలోమీటర్ల దూరంలో వివిధ ప్రదేశాల వద్ద వివిధ రకాలుగా కనిపిస్తుంది. వీటిని "ముఖ దర్శనాలు" అంటారు. ఇవి మొత్తం ఇరవై రెండు. ఒక్కో ముఖదర్శనం ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడే నందీశ్వరునికి చెప్పారని ఆయన గౌతమ మహర్షికి తెలిపారని భగవాన్ శ్రీ రమణ మహర్షి వెల్లడించారు.
పర్వతం చుట్టూ వాస్తు శాస్త్రప్రకారం దిక్పాలక లింగాలు ఉంటాయి. వివిధ కారణాల వలన వీరు శ్రీ అరుణాచలేశ్వరుని శరణు కోరారు. స్వామి అనుగ్రహంతో కలిగిన కష్టం దూరం కావడం వలన కృతజ్ఞతాపూర్వకంగా తమ పేర్ల మీద లింగాలను ప్రతిష్టించారు. అదే విధంగా లోకాలకు వెలుగు అందించే సూర్య చంద్రులు కూడా స్వామి అనుగ్రహం పొంది లింగాలను ప్రతిష్టించారు అని వీటితో ముడిపడి ఉన్న పురాణ గాధలు తెలుపుతున్నాయి.మరో విశేషం ఏమిటంటే మన జన్మ రాశి ప్రకారం ఏ దిక్పాలక ఆలయంలో పూజలు చేయించుకొంటే శుభఫలితాలు జీవితాలలో నెలకొంటాయో కూడా పెద్దలు ఏనాడో నిర్ణయించారు.
ప్రతి రోజు గిరి మార్గంలో వందల సంఖ్యలో భక్తులు కనపడుతుంటారు. అన్ని ఆలయాలు, మఠాలు భక్తులతో కళకళ లాడుతుంటాయి. కానీ అధిక సంఖ్యలో పౌర్ణమి నాడు కనపడతారు. ఆరోజున ఉదయం కన్నా రాత్రి సమయంలో ఎక్కువగా ప్రదక్షిణ చేస్తుంటారు. పండు వెన్నెలలో నిండుగా మెరిసిపోతూ కనిపిస్తారు అరుణగిరీశ్వరుడు.
పౌర్ణమినాడు మాత్రమే  గిరి ప్రదక్షిణ చేయాలని భక్తులు భావిస్తుంటారు. అయితే గౌరీనాధుడే స్వయంగా ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం భక్తులు పొందగలరో తెలియ చెప్పారు. ఆ ప్రకారం  సోమవారం - ఆరోగ్యం, దీర్ఘాయువు, మంగళవారం - ఋణ బాధల నుండి విముక్తి. సుఖమయ జీవనం. బుధవారం - పాండిత్య ఉద్దీపనం, జ్ఞానాభివృద్ది. గురువారం - ఆధ్యాత్మిక భావాభివృద్ది. శుక్రవారం - అపార సంపత్తి, సంఘంలో పేరుప్రతిష్టలు, అంతిమంగా వైకుంఠ వాసం. శనివారం - గ్రహబాధల నుండి విముక్తి, సకల దేవతల ఆశీర్వాదంతో జీవితంలో పురోగమనం. ఆదివారం -  శివసాయుజ్యం.












వీటిల్లో కూడా మంగళవారం మరియు కనుమ నాడు చేసే గిరిప్రదక్షిణ అమిత ఫలదాయకంగా, సకలాభీష్ట ప్రదాయనిగా చెప్పబడింది. ఇక గిరి ప్రదక్షిణ ఎంచుకొన్న రోజున ఏ సమయంలో అయినా చేయవచ్చును. కానీ తిరువణ్ణామలై ఎండ వేడిని తట్టుకోవడం కష్టం. అగ్ని క్షేత్రం కదా ! అందుకని భక్తులు తెల్లవారుజామున, రాత్రి పూట చేయడానికి సిద్ధపడతారు. వేగంగా నడిచే వారికి నాలుగు గంటలు పడుతుంది. నెమ్మదిగా నడిచేవారికి కొద్దిగా అధిక సమయం తీసుకొంటుంది. ప్రదక్షిణకు ముందు శుచిగా స్నానం చేసి కుంకుమ విభూతులను నుదుట ధరించి, సంప్రదాయ వేషధారణతో, పాదరక్షలు ధరించ కుండా చేయడం అభిలషణీయం. మార్గానికి ఎడమ పక్కనే నడవాలి.
గిరి ప్రదక్షణ విధివిధానాలు, వివరాలు తెలుసుకోడానికి ముందు ఒక మహనీయుని గురించి తెలుసుకోవాలి.





శ్రీ మూపనార్ స్వామి 

ఈ నాడు నిత్య పూజలతో భక్తులను ఆకర్షిస్తున్న దిక్పాలక, గ్రహ ఆలయాలు అర్ధ శతాబ్దానికి ముంది పూర్తిగా శిధిలావస్థలో ఉండేవట. తిరునెల్వేలికి చెందిన శ్రీ మూపనార్ స్వామిలో  ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండేవి. ఆయన స్వస్థలాన్ని విడిచి తీర్ధయాత్రలు చేస్తూ చివరికి 1968 వ సంవత్సరంలో యోగభూమి అయిన తిరువణ్ణామలై చేరుకొన్నారు. 
స్థానికంగా నివాసముంటూ నియమంగా గిరి ప్రదక్షిణ చేసేవారు. అపురూపమైన, విశేష పౌరాణిక చారిత్రక నేపధ్యం కలిగిన దిక్పాలక , గ్రహ ఆలయాలు శిధిలావస్థలో ఉండటం ఆయనను        భాధించింది.
ఎలాగైనా వాటిని పునరుద్దరించాలని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయనకు స్థానిక ఆశ్రమాల వారు, శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయ కార్యవర్గం, భక్తులు సహకరించారు. అలా శ్రీ మూపనార్ స్వామి ఆరంభించిన కార్యక్రమం విజయవంతమైనది. ఈ నాడు మనం పూర్తిగా పునరుద్దరించబడి, నిత్యపూజలతో శోభాయమానంగా ఉన్న ఆలయాలను దర్శించుకోగలుగుతున్నాము. ప్రతి ఆలయంలో శ్రీ మూపనార్ స్వామి చిత్ర పటాన్ని చూడవచ్చును. నిత్య స్మరణీయులు. పూజ్యులు శ్రీ మూపనార్ స్వామి. 
మరెన్నో విశేషాలు గిరి ప్రదక్షిణతో ముడిపడి ఉన్నాయి. నడక సాగిస్తూ వాటి గురించి ఒకదాని తరువాత ఒకటి తెలుసుకొందాము. 

ఏక మునిక్కల్ కూంబు ముఖ దర్శనం

గిరి మార్గంలో లభించే ఇరవై రెండు ముఖ దర్శనాలలో ఇది మొదటిది. తూర్పు రాజగోపురం వద్ద కర్పూరం లేదా నేతి దీపం వెలిగించి, మనస్సులోని కోరికను తెలుపుకొని గిరి  వంక చూస్తే 
పర్వతం మొత్తం ఏక రూపంగా కనపడుతుంది. ఈ ఏక మునిక్కల్ కూంబు ముఖ దర్శనం వలన తెలిసోతెలియకో ఇచ్చిన మాట తప్పడం లేదా అసత్యమాడటం  మూలంగా సంక్రమించిన దోషం తొలగిపోతుంది. మనలో ఎవరు ఇచ్చిన మాట మీద నిలబడుతుంది ? సత్యమే చెబుతోంది ? అందువలన ప్రతి ఒక్కరూ చేసుకోవలసిన దర్శనమిది. 

 ఇంద్ర లింగం 

ఆలయాలలో ఎలా ప్రదక్షిణ మం ఎడమ వైపుకి తిరిగి అలానే గిరికి కూడా మన ఎడమ చేతి వైపు నుండి ప్రారంభించాలి. నడక ప్రాంభించిన కొద్దీ దూరానికి  ప్రధాన ఆలయానికి సమీమంలో వస్తుంది అష్టదిక్పాలక లింగాలలో మొదటిదైన ఇంద్రలింగం. దుకాణ సముదాయం మధ్యలో కానీ కనపడనట్లుగా ఉంటుంది. ఆలయాన్ని తెలిపే సూచీ ఉంటుంది.
కొద్దిగా దిగువకు ఉన్న ఈ ఒక్క ఆలయంలోనే మహేశ్వరుడు సతీ, పుత్ర సమేతంగా కనపడతారు. పురాతన ఆలయం.
దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడు వృత్తాసురుడు, బాలుడు, నముచి లాంటి అనేక మంది రాక్షసులను వధించారు. అది లోకకల్యాణ నిమిత్తం చేసినా వారంతా శివభక్తులు. ఆరాధ్యదైవం అనుగ్రహం పొందినవారు. శివభక్తులను హతమార్చడం వలన ఇంద్రునకు హత్యా దోషం  చుట్టుకొన్నది. ఆ దోష కర్మ వలన దేవలోకాధిపతి సర్వశక్తులను కోల్పోయి శక్తిహీనుడయ్యారు. దిక్కుతోచక శంకరుని  శరణు కోరారు. పాపహరుని సలహా మేరకు అరుణగిరి ప్రదక్షిణ, సేవ చేసుకొని కోల్పోయిన శక్తులను తిరిగి పొందారు. ఆ కృతజ్ఞతతో తన పేరు మీద ఒక లింగాన్ని ప్రతిష్టించారు. ఇంద్రునిచేత ప్రతిష్టించబడినది కావున ఇంద్ర లింగంగా పిలవబడుతోంది.  ఆలయానికి కొద్దీ దూరంలో ఉన్న "అయ్యన్  కుళం" ఇంద్రుడు ఏర్పాటు చేసినదే ! ఈ లింగాన్ని అర్చించడం వలన ఆవరించిన అజ్ఞానం తొలగిపోతుంది. ఈ లింగ      స్థానానికి ఆది దేవతలు సూర్యుడు, శుక్రుడు. వీరు ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నత స్థానాన్ని, దీర్గాయువును అనుగ్రహిస్తారు. వృషభ మరియు తులా రాశులలో జన్మించిన వారు ఇంద్రలింగానికి ప్రదక్షిణాలు చేస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి.
ఇంద్ర లింగాన్ని సేవించుకొని ముందుకు సాగితే తిరుమంజన గోపురం ఎదురుగా ఉన్న నాలుగు వీధుల కూడలిలో ఉన్న శ్రీ కర్పగ గణపతి కి గిరి ప్రదక్షిణ సక్రమంగా ఎలాంటి అడ్డంకులూ, ఇబ్బందులూ  లేకుండా పూర్తి చేసుకోవాలని కోరుకోవాలి.

అగ్ని లింగం 

శ్రీ కర్పగ వినాయక ఆలయం వద్ద దారి రెండుగా చీలుతుంది. ఏ మార్గం లో నడిచినా అగ్ని తీర్ధం వద్దకు చేరుకొంటాము. అగ్ని లింగానికి అనుబంధంగా ఉంటుందీ పుష్కరణి. పురాతన ఆలయాలు, నంది ఈ కోనేరు ఎప్పటిదో అన్న విషయాన్ని ద్రువీకరిస్తాయి. పక్కనే సందులో ఉంటుంది అగ్ని లింగాలయం. 
చిత్రమైన విషయం ఏమిటంటే గిరి మార్గంలో అన్ని దిక్పాల, గ్రహ ఆలయాలు దారికి ఎడమ పక్కనే ఉంటాయి ఒక్కటి తప్ప. అదే అగ్ని లింగం. అగ్ని మహర్షులు చేసే యజ్ఞ యాగాల ఫలం దేవతలకు అందజేసేవాడు. అగ్ని లేకుండా మం జీవితాలను ఊహించలేము. అంతటి ప్రధాన పాత్ర అగ్నిదేవునిది. సర్వభక్షకుడు ఇక్కడ తన పేరు మీద లింగాన్ని ప్రతిష్టించడానికి సంబంధించి ఒక కధ ప్రచారంలో ఉన్నది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హవ్యవాహనునికి వివాహం కాలేదట. విధాత వద్దకు వెళ్లి తనకు అసలు కళ్యాణ యోగం ఉన్నదా ? అని ప్రశ్నించారట. ఆయన అగ్ని దేవుని అరుణాచల ప్రదక్షిణ చేస్తే పెళ్ళికి అడ్డంకిగా ఉన్న దోషాలు తొలగిపోతాయని చెప్పారట. 












ఆ ప్రకారం చేయడం వలన స్వాహా దేవితో వివాహం జరిగిందట. ఆనందించిన అగ్ని అర్ధాంగితో కలిసి  తన పేరుతొ ఒక లింగాన్ని గిరికి ఆగ్నేయ దిశలో ప్రతిష్టించారు. ఈ లింగానికి అధిపతి చంద్రుడు. ఈ లింగాన్ని సేవించడం వలన వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. భయాందోళనలు, ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా  సింహ రాశి లో జన్మించిన వారు అగ్ని లింగానికి అలంకారం చేయించిన యెడల  జీవితం సుఖమయంగా సాగుతుంది.










శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం 

అరుణాచలం యోగ క్షేత్రం అంటారు. అందుకే శతాబ్దాలుగా ఎందరో ఆధ్యాత్మిక భావాలు కలిగినవారు, అంతర్యామి అనుగ్రహంతో జన్మతః యోగులుగా జన్మించిన వారు, సర్వసంగపరిత్యాగులు తమ అంతిమ గమ్యంగా అరుణాచలాన్ని ఎంచుకొన్నారు. అలాంటి వారిలో నయనారులు, శ్రీ మాణిక్యవాసగార్, శ్రీ అరుణగిరినాథర్, గుహాయ్ నమః శివాయ, గురు నమః శివాయ, వళ్లాల రాజు, అమ్మణి అమ్మన్, ఈశాన్య దేశికర్, శ్రీ శేషాద్రి స్వామి, భగవాన్ శ్రీ రమణ మహర్షి, శ్రీ వాశిష్ఠ కావ్యకంఠ గణపతి ముని,, తిన్నయ్ స్వామి,,ఇసక్కి స్వామి, శ్రీ రామ సూరత్ కుమార్, మురగనార్, అరుణాచల స్వామి, యోగి రామయ్య ఇలా ఎందరో !
వీరందరి మఠాలు , ఆశ్రమాలు, నివసించిన గుహలు నేటికీ మనం అరుణాచలంలో చూడవచ్చును.
మనకు తెలిసి గత శతాబ్దంలో అరుణాచలంలో  నడయాడిన మహనీయులలో ఒకరు శ్రీ శేషాద్రి స్వామి. వీరి స్వస్థలం కాంచీపురం. మనుమలను ఎత్తుకోవాలన్న ఆశతో తాతగారు శ్రీ కామకోటి శాస్త్రి గారు శ్రీ కామాక్షీ దేవిని ప్రార్ధించారు. ఆమె ఆదేశంతో కూతురు "మరకతమ్మ"  "నవనీతం" (వెన్న) స్వీకరించింది. 1870వ సంవత్సరం జనవరి ఇరవై రెండో తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినది. శనివారం జన్మించడం వలన కులదైవమైన శ్రీవారి పేరైన "శేషాద్రి" అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న బాలుడు జన్మతః అవధూత అని నిరూపించాయి. అక్షరాభ్యాసం చేసిన కొద్దిరోజులకే సంస్కృత, తమిళ శ్లోకాలు నేర్చుకొన్నారు. ఉపనయనం తరువాత పలు శాస్త్రాలను అధ్యయనం చేశారు. పెళ్లి చేద్దామని జాతకం చూపిస్తే సర్వసంగపరిత్యాగిగా మారుతారని చెప్పారు జ్యోతిష్యులు.
తల్లి ఆఖరి దశలో "అరుణాచల, అరుణాచల , అరుణాచల" అని స్మరించినది. ఆ మాట ఆయన మీద త్రీవ్ర ప్రభావం చూపించింది. తన పద్దెనిమిదో ఏట శ్రీ బాలాజీ స్వామి వద్ద సన్యాసం స్వీకరించి భగవంతుడు నిర్ణయించిన గమ్యమైన "తిరువణ్ణామలై" చేరుకొన్నారు. అప్పటి నుండి చివరి దాకా అక్కడే ఉంది పోయారు. నిరంతరం నవ్వుతూ ఒక తన్మయావస్థలో ఉండే ఆయన తిన్నది చూసినవారు లేరు. ప్రధాన ఆలయం తో పాటుగా ఎక్కువగా శ్రీ దుర్గా దేవి కోవెలలో ధ్యానంలో గడిపేవారు. ఒక్కో రోజు ఉన్మాద స్థితిలో ఏదో ఒక దుకాణం లోనికి వెళ్లి సామానులు చిందర వందర చేసేవారు. అలా జరిగిన రోజు ఆ దుకాణదారు పంట పండినట్లే ! ఆ రోజు అత్యధిక లాభాలు ఆర్జించేవారు. తిరువణ్ణామలై దుకాణదారులు ఆయన తమ అంగడికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవారంటే అతిశయోక్తి కాదు !
మర్మగర్భమైన వ్యాఖ్యలతో, అవసరమైనప్పుడు తన మహిమలతో దరి చేరిన భక్తులకు బోధనలు చేసేవారు. వారి ఆర్ధిక, ఆరోగ్య సమస్యలను తీర్చేవారు.  తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉండే గుహ వద్దకు వెళ్లేవారు. అలాని ఇద్దరూ ఏమీ మాట్లాడుకునేవారు కాదు. ఒకరినొకరు అలా చూసుకునేవారు అంతే !
నిరాడంబరంగా తిరువణ్ణామలై వీధులలో నడయాడిన మహా అవధూత 1929 వ సంవత్సరం జనవరి నాలుగవ తేదీన ఆ అరుణాచలేశ్వరునిలో ఐక్యం అయ్యారు.
వీరి పవిత్ర సమాధిని శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమంలో దర్శించుకోవచ్చును. ప్రస్తుతం వీరి శిష్యుల ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ ఆశ్రమంలో భక్తులు ఉండటానికి అద్దెకు గదులు లభిస్తాయి. అన్నప్రసాదం వితరణ ప్రతి నిత్యం జరుగుతుంది.మహనీయునికి మొక్కి కదిలితే తరువాతి గమ్యం భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం. ఈ రెండు ఆశ్రమాల మధ్యలో ప్రధమ గురువు, జ్ఞానప్రదాత శ్రీ దక్షిణా మూర్తి ఆలయం ఉండటం ఆ భగవంతుని నిర్ణయంలా అనిపిస్తుంది. శ్రీ దక్షిణామూర్తి మాదిరి వీరిద్దరూ కూడా  ఎందరికో ఆధ్యాత్మిక ప్రాధాన్యత, జ్ఞానం ప్రసాదించారు. రమణీయంగా పుష్పాలతో అలంకరించిన శ్రీ దక్షిణామూర్తి రూపం నయనమనోహరంగా ఉంటుంది.





తేజో ముఖ లింగం 

శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం వెలుపలి నుండి అరుణగిరిని వీక్షిస్తే లభించేది " తేజో ముఖ లింగ దర్శనం". ఇక్కడ నుండి కొండ యొక్క దక్షిణ భాగం, దాని వెనుక ఎత్తుగా శిఖరం కనిపిస్తాయి. ఈ దర్శనం భవిష్యత్తు గురించి ఊరికే ఆందోళన పడే వారికి అపార శాంతిని ప్రసాదిస్తుంది. జీవితంలో అభివృద్ధి చెందడానికి కావలసిన మనో ధైర్యాన్ని, మార్గాన్ని ఎంచుకొనే విజ్ఞతను అందిస్తుంది.

భగవాన్ శ్రీ రమణ మహర్షి 

తిరువణ్ణామలై (అరుణాచలం) కి పర్యాయ పదం శ్రీ భగవాన్. శ్రీ దక్షిణామూర్తిలా మౌనమే తన బోధగా ఎందరినో ప్రభావితులను చేసిన వెంకట్రామన్ 1879 వ సంవత్సరం డిసెంబర్ ముపై న మధురై కి సమీపంలోని "తిరుచ్చులి" అనే గ్రామంలో జన్మించారు. తల్లితండ్రులు శ్రీ సుందర అయ్యర్, శ్రీమతి అళగమ్మాళ్.  
చిన్నతనంలో స్నేహితులతో ఆడుతూపాడుతూ ఆ వయ స్సు పిల్లల మాదిరే ప్రవర్తించేవారు. చదువులో, ఆటల్లో ముందు వరుసలో ఉండేవారు. ఒక బంధువు పలికిన "అరుణాచలం" అన్న పదం పదమూడేళ్ల వెంకట్రామన్ లో అమిత సంచలనం కలిగించింది. ఆ పద ప్రభావంతో శివగాయక భక్తులైన అరవైమూడు మంది నయనారుల జీవిత చరిత్రలను తెలిపే "పెరియ పురాణం" చదివారు. నిరాకారుడైన సర్వేశ్వరుని పట్ల వారికి గల అచంచల భక్తి విశ్వాసాలు బాల వెంకట్రామన్ ఆలోచనలను ప్రభావితం చేసింది. ఇంతటి  ఆ చిన్న హృదయంలో భక్తి విశ్వాసాలు వారిలో ఎలా సాధ్యమైనది ? అలాంటి అనన్యసామాన్యమైన భక్తిని ఎలా సాధించగలం ? అన్న ప్రశ్నలు తలెత్తినాయి. ఇవి రానున్న కాలంలో ఆయన ప్రయాణించిన ఆధ్యాత్మిక మౌన మార్గానికి బాటలు వేసాయి. 
ఆ సమయంలో అతనికి ఒకనాడు మరణభయం కలిగింది. ఆ వయస్సులో కలగకూడని అనుభవం మరెన్నో ప్రశ్నలకు దారితీసింది. మరణం శరీరానికా ? లేక ఆత్మకా ? అశాశ్వితమైన దేహం నశించిన తరువాత శాశ్వితమైన  ఆత్మ నిలిచే ఉంటుంది. అనగా నేను అన్నది మరణం లేని ఆత్మ. ఇది ఆయన జీవితంలో పెను మార్పులకు కారణమైనది. అప్పటి దాకా ఆలయ దర్శనాన్ని పెద్దగా పట్టించుకోని అతను నిత్యం మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళ సాగారు. అమ్మవారి ముందు, సోమసుందరేశ్వరుని ముందు ఇది అని తెలియని తాదాప్యంతో అలా చూస్తుండిపోయేవారు. కొంతకాలం తరువాత ఆ బాలునిలో ఆధ్యాత్మిక భావాలు ఒక నిర్ణయం తీసుకొనే స్థాయికి వెళ్లాయి. ఎప్పుడో విన్న అరుణాచలం అన్న పదం హృదయమంతా వ్యాపించింది. అంతే మరో ఆలోచన లేకుండా ఇల్లు విడిచి గమ్యం వైపుకు బయలుదేరారు. తెలియని మార్గంలో చేసే ప్రయాణంలో ఆరంభంలో ఇబ్బందులు సహజం. చివరికి 1896 సెప్టెంబర్ ఒకటో తారీఖున తన తండ్రి గృహానికి చేరుకొన్నారు. 








అయ్యన్ కుళం వద్ద వస్త్రాలను విసర్జించి కౌపీనం ధరించారు. కులాన్ని సూచించే యజ్ఞోపవీతాన్ని వదిలివేశారు. అప్పటి నుండి అదే ఆయన వేషధారణ. మౌనమే ఆయన ఉపదేశం. అరుణాచలేశ్వరుని ఆలయంలో ప్రారంభమైన ఆయన మౌన ధ్యాన తపస్సు ఎన్నో ప్రదేశాలలో జరిగి చివరికి స్కంద గుహ వద్దకి  చేరుకొన్నది. అప్పటికి మౌన స్వామిగా భక్త సమూహంలో పేరు పొందారు. అరుణాచలం వచ్చే యాత్రీకులు గుహలో ఉండే మౌన బ్రాహ్మణ స్వామిని దర్శించుకోవడం ఒక అలిఖిత నియమంగా మారింది. 
ఎందరో శిష్యులు ఏర్పడ్డారు. పండితుడు, సకల శాస్త్రపారంగతుడు ఐన శ్రీ వాశిష్ఠ కావ్యకంఠ గణపతి ముని తన సందేహం తీరిన ఈయన సాక్షాత్ పరమేశ్వర స్వరూపమని నమ్మి భగవాన్ శ్రీ రమణ మహర్షి గా ప్రసిద్ధి కెక్కారు. ఎందరో దేశవిదేశాల ఆధ్యాత్మిక మార్గ అన్వేషకులు భగవాన్ వద్దకు వచ్చేవారు. మౌనంతో చాలా మంది సందేహ నివృత్తి చేసేవారు. అర్ధం చేసుకోలేనివారికి సంజ్ఞల ద్వారా అప్పటికీ తెలుసుకోలేనివారికి మర్మగర్భమైన వ్యాఖ్యలతో వివరించేవారు. వేలాది మందిని ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక మార్గదర్శి భగవాన్ శ్రీ రమణ మహర్షి 1950వ సంవత్సరం ఏప్రిల్ పదునాలుగో తారీఖున తన తండ్రి అరుణాచలేశ్వరునిలో ఐక్యం అయ్యారు. 
శ్రీ రమణాశ్రమంలో భగవాన్ తల్లిగారు అళగమ్మాళ్ మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షి సమాధి మందిరాలను దర్శించుకోవచ్చును. రమణుల రచనలు, భగవాన్ గురించి అనేక మంది భక్తులు రచించిన రచనలు ఆశ్రమంలో లభ్యమవుతాయి . భగవాన్ తపస్సు చేసిన విరూపాక్ష మరియు స్కాంద గుహలకు చేరుకోడానికి ఆశారాం వెనక వైపు నుండి దారి కలదు. 
ముందుగా తెలియజేస్తే పరిస్థితిని బట్టి వసతి ఏర్పాటు చేస్తారు. అన్నప్రసాద వితరణ ప్రతి నిత్యం జరుగుతుంది.

ఏరు పంచ ముఖ లింగ దర్శనం 

శ్రీ రమణాశ్రమం బయట నుండి పర్వతాన్ని పరీక్షగా చూస్తే  పంచ ముఖ శివలింగం మాదిరి కనిపిస్తుంది. దీనినే ఏరు పంచ ముఖ లింగ దర్శనం అంటారు. దీని  వలన ధర్మవిరుద్దంగా చేసిన చెడు కర్మల పాప ఫలం తొలగిపోతుంది. 

ఏక ముఖ లింగ దర్శనం 

శ్రీ రమణాశ్రమం లోనికి ప్రవేశించేటప్పుడు ఎదురుగా ఉన్న కొండ నిలువెత్తు  ఏక ముఖ లింగంగా కనపడుతుంది. ఇది అత్యంత అరుదైన దర్శనం. ఇలా మరెక్కడా కనిపించదు అరుణగిరి. దీని దర్శన ప్రభావం తెలియకుండా చేసిన పాప ఫలం హరించుకొని పోతుంది. శ్రీ రమణాశ్రమానికి ఎదురు వీధి లోనికి వెళితే మరో అవధూత శ్రీ రామ సూరత్ కుమార్ ఆశ్రమం ఉంటుంది.
















దిడ ముఖ లింగ దర్శనం 

శ్రీ రమణాశ్రమం దాటినా తరువాత వచ్చే శ్రీ మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి ఆలయం వస్తుంది. ఆలయం వెనుక కనపడే పర్వతం ఒక పక్క పల్లంగా, మరో పక్క ఎత్తుగా కనపడుతుంది. దీనినే దిడ ముఖ లింగ దర్శనం అని అంటారు. భవిష్యత్తును ఉన్నత మార్గంలో నడిచేలా తీర్చిదిద్దుకోడానికి కావలసిన అవగాహన లభ్యమవుతుంది. 
ఈ ఆలయానికి ఎదురుగా పాదచారులు నడిచే మార్గం మధ్యలో ప్రముఖ తెలుగు రచయిత కీర్తి శేషులు శ్రీ గుడిపాటి వెంకటాచలం (చలం) సమాధి ఉంటుంది. జీవితంలో అధిక భాగం నాస్తికునిగా ఉన్న చలం, భగవాన్ శ్రీ రమణ మహర్షి దర్శనంతో మారిపోయి తమ జీవిత ఆఖరి భాగాన్ని తిరువణ్ణామలై లోనే రమణుల సన్నిధిలోనే గడిపారు. 
 ఇదే దర్శనం కొద్దిగా ముందు పర్వత పాదాల వద్ద ఉన్న పురాతన శ్రీ ద్రౌపదీ అమ్మన్ కోవెల నుండి కూడా లభిస్తుంది. 

భృంగి ముని మాయన ముఖ లింగ దర్శనం 

వేకువ వెలుగులు మధ్య ప్రశాంత వాతావరణంలో అరుణగిరి మీద నుండి వీచే  స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, దారికి ఇరుపక్కలా వచ్చే చిన్న చిన్న ఆలయాలను చూస్తూ, అరుణాచేలేశ్వరుని స్మరించుకొంటూ  ముందుకు సాగే నడక ఏమాత్రం అలసట కలిగించదు. పైగా మనస్సును, శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసినదే కానీ మాటల్లో చెప్పేది కాదు.
రహదారికి ఎడమవైపున సుమారు నలభై అడుగుల ఎట్టు గల గుండ్రాయి ఒకటి కనపడుతుంది. దాని మీద ఒక పురాతన చిన్న మండపం. గతంలో భృంగి మోక్షాన్ని ఆపేక్షిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణ చేసేవారట.  ఆ సమయంలో ఈ గుండ్రాతి మీద ఒక దీపం వెలిగించి ధ్యానం చేసేవారట. ఆయన భక్తి ప్రపత్తులకు సంతసించిన సర్వేశ్వరుడు మోక్షం అనుగ్రహించారట. కనుమ నాడు జరిగే "తిరు ఊడల్" ఉత్సవం దీనికి సంబంధించినదే !
మనం రాతిని ఎక్కలేము కనుక దారి నుండి  భృంగి ముని మాయన ముఖ లింగ దర్శనాన్ని పొందవచ్చును. ఆధ్యాత్మిక పురోగతికి కావలసిన సక్రమ ఆలోచనలను పెంచే ఈ దర్శనం అంతిమంగా శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది. 

యమ లింగం 

గిరికి దక్షిణ దిశలో ఉంటుంది ఆలయం. యముని స్థానం దక్షిణం కదా ! సూర్య పుత్రుడు. నరకాధిపతి. ధర్మానికి ప్రతినిధి. ఎవరికీ లొంగనివాడు యమధర్మరాజు. అలాంటి వానికి ఎందుకో తెలియకుండా బ్రహ్మాస్త్ర భయం వెంటాడినదట. ఏమి చేయాలో తెలియక సత్యలోకం వెళ్లి బ్రహ్మ దేవుని మార్గోపదేశం చేసి, ఈ భయం నుండి బయటపడమేయమని అర్ధించారట. విధాత ఆయనను అరుణగిరి ప్రదక్షిణ చేసి, అయ్యను సేవించుకొంటే అంతా కుదుటపడుతుంది అని చెప్పారట. బ్రహ్మ మాటల ప్రకారం చేసి అనవసర ఆందోళన నుండి  బయటపడినాడట. తన సంతోషానికి నిదర్శనంగా ఈ లింగాన్ని ప్రతిష్టించారట.
ఈ క్షేత్రానికి అధిపతి అంకారకుడు. కుజ దోషం ఉన్నవారు, వివాహం కానివారు, ఋణ భాధితులు యమలింగానికి ప్రదోష పూజ చేయిస్తే కష్టాలు దూరం అవుతాయి. అదే విధంగా వాహన చోదకులు, తరచూ ప్రమాదాల బారిన పడే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు యమలింగాన్ని దర్శించుకొంటే ప్రమాదాలు దూరం అవుతాయి. ఇక్కడ పఠించే అంగారక రుణవిమోచన స్తోత్రం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అని చెబుతారు.
ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ స్వామిని సేవిస్తే జీవితాన్ని సుఖవంతంగా గడుపుతారు. తరచూ వచ్చే చీకాకులు తొలగిపోతాయి.

ప్రధమ నంది 

గిరి మార్గంలో అష్ట దిక్పాల లింగాల మాదిరి మొత్తం ఏడు నందులు కనపడతాయి. అన్ని విశేష ప్రాధాన్యత కలిగినవి. మొదటి అయిదు పంచభూత నందులు. ఆరవది సింహ నంది. ఏడవది అధికార నంది. ప్రతి నందికి మొక్కాలి. కుదిరితే దీపం వెలిగించడం మంచిది. నందుల వద్ద నంది స్తోత్రం పఠించడం ఉత్తమం.
" నందీశ్వర  నమస్తుభ్యం ! సాంబనంద ప్రదాయకం !!
   మహాదేవస్య సేవార్ధం ! అనుజ్ఞం దేహిమే ప్రభూ !!

వీటిల్లో ప్రధమంగా దర్శనమిచ్చేది "పృథ్వి నంది". ప్రధాన రహదారి నుండి గిరి వెనుకకు చీలే కూడలికి కొద్దిగా ముందు మనకు ఎడమపక్కన మండపంలో ఉపస్థితుడై గిరిని చూస్తుంటాడు శిలాద తనయుడు. దీపం వెలిగించి మొక్కితే శివ సేవకు అనుమతిని ఇస్తాడు.
ప్రథమ నంది మండపం నుండి పర్వతాన్ని వీక్షిస్తే లభించేది "పృథ్వి బంగారు ముఖ లింగ దర్శనం". ఈ దర్శనం అష్ట దరిద్రాల నుండి విముక్తి కలిగిస్తుంది.

కామకాడు 

పృథ్వి నందిని సేవించుకొని గిరి మార్గం లోనికి ప్రవేశించిన తరువాత కుడివైపున ఏపుగా దట్టంగా పెరిగిన చెట్లు. చిట్టడవిని తలపిస్తాయి. మార్గంలో మరెక్కడా ఇంత గుబురుగా పెరిగిన వృక్షాలు కనిపించవు.  అలానే ఈ చెట్ల వలన అరుణగిరి అసలు కనపడదు. అందుకే పెద్దలు దీనిని "కామనాడు" అని పిలిచారు. అనగా కోరికల అడవి లేదా వనం అని అర్ధం.  మానవుడి కోరికలకు అంతుండదు అని మనందరికీ అనుభవమే ! ఒక దాని తరువాత మరొకటి. ఆశకు హద్దులుండవు. ఆశల వలలో చిక్కుబడిన వానికి భగవంతుడు గుర్తుకురాడు. మనిషికి వయస్సు, ఆరోగ్యం, హోదా, ధనం ఉన్నప్పుడు అహం అధికస్థాయిలో ఉంటుంది. అహం పరాకాష్టలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్కచేయడు. అంతర్యామి అసలు తలపుకు రాడు.  అన్ని రకాలుగా ఎదిగి, చివరికి ఒదిగి బ్రతుకుతున్నప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. పై రెండు దశలను కామకాడు తో పోల్చారు. అందుకే అడవి నుండి చూసినప్పుడు జ్ఞానప్రదాయని అయిన గిరి కనపడదు.
అందరూ అరుణాచలేశ్వరుని కోరికల కొలిమిలో పది కాలిపోకుండా కాపాడమని కోరుకొందాము.

శ్రీ దుర్వాస మహాముని ఆలయం 

అరుణాచల ప్రదక్షిణా మార్గంలో రెండు గ్రహ, అష్ట దిక్పాలక ఆలయాలు, ఏడు నంది మండపాలతో పాటు మూడు మహర్షుల ఆలయాలు కూడా ఉన్నాయి. ఇల్లాంటి విశేషం మరెక్కడా కనపడదు. 
వీటిల్లో మొదటగా వచ్చేది శ్రీ దుర్వాస మహర్షి ఆలయం. అత్రి, అనసూయ దంపతుల కుమారుడైన ఈయనను రుద్రంశసంభూతునిగా పరిగణిస్తారు. దరిదాపులుగా అన్ని పురాణాలలో పేర్కొనబడింది. ముక్కోపిగా ప్రసిద్ధి. 
లక్క ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదం నుండి బయటపడిన పాండవులు తల్లి కుంతీ దేవితో కలిసి కొంతకాలం తిరువణ్ణామలై పరిసరాలలో తలదాల్చుకొన్నారట. ఆ సమయంలో కుంతీ దేవి శ్రీ దుర్వాస మహాముని విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. ,
వివాహానికి ముందు ఆమె తండ్రి కుంతిభోజుని వద్దకు అతిధిగా వచ్చారు దుర్వాసుడు. ఆయన సపర్యలకు కుమార్తెను నియమించారు కుంతిభోజుడు. ఆగ్రహానికి ప్రతిరూపమైన అతనికి అణుకువగా అన్ని సేవలు చేసింది కుంతి. సంతసించిన మహాముని ఆమెకు "అధర్వ వేద మంత్రం" ఉపదేశించారు. 
కుతూహలంతో కళ్యాణానికి ముందే సూర్యదేవుని ప్రార్ధించి కర్ణునికి జన్మనివ్వడం, వివాహానంతరం ధర్మ, భీమ, అర్జునునకు జన్మనిచ్చినది. సవతి మాద్రికి అదే మంత్రం ఉపదేశించి ఆమె నకుల సహదేవులు తల్లి అయ్యేట్లుగా సహాయపడింది. తనకు తల్లి అయ్యే యోగం ప్రసాదించిన మహర్షి పట్ల కృతజ్ఞతతో పావన క్షేత్రమైన తిరువణ్ణామలైలో ప్రతిష్టించినది. 
  ముఖమండపం, గర్భాలయం మాత్రమే ఉండే ఈ చిన్న ఆలయంలో శ్రీ దుర్వాసముని శిఖ, రుద్రాక్ష మాలలు ధరించి పద్మాసనంలో ధ్యానముద్రలో దర్శనమిస్తారు. ఆలయానికి పక్కన ఉన్న వేప చెట్టుకు పసుపు వస్త్రాన్ని కడతారు సంతానం లేని దంపతులు. అలా చేస్తే బిడ్డలు కలుగుతారని విశ్వసిస్తారు. చెట్టుకు ఆకుల కంటే పసుపు వస్త్రాలే ఎక్కువ ఉంటాయి అంటే అతిశయోక్తి లేదు. నమ్మకాన్ని మించినది లేదు కదా !

నంది ముఖ దర్శనం 

శ్రీ దుర్వాస మహాముని ఆలయం దాటినా వెంటనే వస్తుంది అప్పు నంది. ఇక్కడ నుండి పర్వత దక్షిణం వైపుకు చూస్తే కొండవాలులో నంది ముఖం కనపడుతుంది. ఇది ఎవరో చెక్కినది కాదు. సహజసిద్ధంగా కొన్ని రాళ్లు కలిస్తే ఏర్పడినది. ప్రకృతి ఎంత గొప్పదో కదా ! 
ఈ నంది ముఖ దర్శనం సకల శుభాలను కలిగించేదిగా ప్రసిద్ధి. 

" వృషస్య వృషణం సృష్ట్వా శృంగ మధ్యే శివాలయం 
    దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధం " 

 మిత్ర చారు ముఖ లింగ దర్శనం 

నడక దారి మధ్యలో ఉంటుంది రెండవది అయిన అప్పు నంది. చిన్న మండపంలో ఉన్న ఈ నందీశ్వరుని వద్ద దీపం వెలిగించి గిరి వంక దృష్టి సాగిస్తే లభించేది "మిత్ర చారు ముఖ లింగ దర్శనం" .  దీని వలన దూరమైన బంధుమిత్రులు చేరువవుతారు. తోడబుట్టిన వారితో నెలకొన్న విభేదాలు తొలగిపోతాయి. గతంలో చేజార్చుకొన్న విలువైన వస్తువులు, ధనం తిరిగి పొందుతారు అని నమ్ముతారు. 

చతుర్ముఖ లింగ దర్శనం 

నైరుతి లింగానికి కొద్దిగా ముందు వస్తుంది మూడవది అయిన "తేయు నంది". స్తోత్రం చేసి దీపం వెలిగించి కొండ దిక్కుకు చూస్తే దొరికేది "చతుర్ముఖ లింగ దర్శనం". గతంలో చతుర్ముఖుడైన బ్రహ్మ ఈ స్థలంలో సృష్టికి కావలసిన జ్ఞానాన్ని పొందారట. ఈ దర్శనం వలన మనలో స్థిరపడిన 
అజ్ఞానం తొలగిపోతుంది. జీవితంలో అభివృద్ధి చెందడానికి కావలసిన జ్ఞానం ప్రసాదిస్తుంది అని చెబుతారు. 

నైరుతి లింగం 

నైరుతి ఒక రాక్షస  రాజు. గొప్ప శివభక్తుడు. కొందరు నైరుతి ఒక రాక్షస స్త్రీ అని అంటారు. దేవదానవులు క్షీరసాగర మధనం చేసినప్పుడు శ్రీ మహా లక్ష్మి జన్మించినది కదా ! ఆమె కన్నా ముందు మరొక స్త్రీ మూర్తి ఉద్భవించినది. ఆమె నైరుతి అంటారు. ఆమెకు ఉన్న  మరో పేరు "అలక్ష్మి" అనగా దుఃఖాలను దూరం చేసేది అని అర్ధం. ఇది అలా ఉంచితే నైరుతి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు దిక్పాల హోదా ప్రసాదించారు. దానికి ప్రతిగా ఆయన పట్ల తన భక్తిని చాటుకోడానికి తన దిక్కులో తన పేరు మీద ఈ లింగాన్ని స్థాపించినట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి అధిదేవత రాహువు. నైరుతి లింగానికి భక్తి శ్రద్దలతో అర్చన జరిపించుకొంటే సత్సంతానం, ధనం , కీర్తి లభిస్తాయని చెబుతారు. అదే విధంగా చాతబడులు, దుష్ట గ్రహాల ప్రభావం అంటే భయపడేవారు నైరుతి లింగానికి ప్రదక్షిణాలు చేస్తే భయం తొలగిపోతుంది అని కూడా అంటారు. ప్రత్యేకంగా మేష రాశిలో జన్మించినవారు నైరుతి లింగానికి అభిషేకాలు చేయించుకొంటే జీవితం పురోగమిస్తుంది అని విశ్వసిస్తారు.  

శ్రీ తిరునేర్ అణ్ణామలేశ్వర స్వామి ఆలయం  

సరిగ్గా శ్రీ అరుణచేలేశ్వర స్వామి ఆలయానికి పడమర దిశలో గిరి వెనుక పక్క ఉంటుందీ ఆలయం. ఒకప్పుడిక్కడ అగస్త్య, గౌతమ మహర్షులు తపమాచరించిన పవిత్ర స్థలమిది. నేటికీ ఆలయం వెనుక పక్కన ఉన్న పుష్కరణి ఒడ్డున చాలా మంది సాధువులు ధ్యానం చేస్తుంటారు. 
అలా అని ఇది పెద్ద ఆలయం ఏమీ కాదు. రెండు భాగాలుగా ఉండే ఒక పురాతన మండపం. ముఖ మండపానికి ఇరువైపులా అగస్త్య గౌతమ ఋషుల మూర్తులు స్తంభాల పైన చెక్కబడి కనపడతాయి.   
కొద్దిగా ఎత్తులో ఉండే గర్భాలయంలో పెద్ద లింగరూపంలో చక్కని పుష్పాలంకరణలో దర్శనమిస్తారు. నూతనంగా నిర్మించిన ఆలయాలలో శ్రీ ఉణ్ణామలై అమ్మన్, శ్రీగాయత్రి దేవి, నవగ్రహాలు కొలువై ఉంటారు. ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రాఘవేంద్ర బృందావనం ఉంటాయి. ఈ ఆలయంలో ఒక విశేషం ఉన్నది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదునాలుగు తారీఖున ఉదయారుణ కిరణాలు నేరుగా శ్రీ తీరునేర్ అణ్ణామలై స్వామిని తాకుతాయి. ఆ రోజు తమిళ ఉగాది. ఎందరో భక్తులు ఈ విశేషం చూడటానికి తరలి వస్తారు. 
ఇక్కడి నుండి చూస్తే రెండు కొండలు పక్కపక్కన ఉన్నట్లుగా కనిపిస్తాయి. దీనినే " శక్తిశివ ముఖ లింగ దర్శనం" అంటారు. ఈ దర్శనం వలన ఆలుమగల మధ్య నెలకొన్న విభేదాలు తొలగి పోతాయి. అలాగే బంధువుల మధ్య ఏర్పడిన అపోహలు సమసిపోతాయి. 
నడకతో అలసట చెందిన వారికి కొద్దిగా విశ్రాంతి తీసుకోడానికి తగిన ప్రదేశం కూడా ఇదే. 
ఉపాహారం, టీ , కాఫీలు దొరికే ప్రదేశం. నీడనిచ్చే వృక్షాలు, కూర్చోడానికి బల్లలు ఉంటాయి. 






పళని ఆండర్ ( శ్రీ దండాయుధపాణి)

శివ పార్వతుల ముద్దు బిడ్డడైన శ్రీ కుమారస్వామికి ఎన్నో ప్రఖ్యాత ఆలయాలున్నాయి. వాటిల్లో తిరుత్తణి, పలమథురై చోళై, తిరుప్పరంకుండ్రం. స్వామిమళై, తిరుచెందూర్ మరియు పళని ఆరుపాడై వీడులుగా ప్రసిద్ధి. 
అలిగి కైలాసం వీడి ఇక్కడికి వచ్చి దాక్కున్న కుమారుని బుజ్జగిస్తూ " నీవే నిజమైన ఫలం" అని అన్నారు ఆదిదంపతులు. నాటి నుండి ఈ క్షేత్రం "పళని" గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ స్వామి బాలునిగా దర్శనమిస్తారు. పళని దండాయుధపాణి గా ఆర్తులను ఆడుకొనే వాడు.సరిగ్గా అదే      రూపంతో ఈ క్షేత్రంలో కనపడతారు. 
పళని ఉదంతం తెలుసుకొన్న భృంగి పార్వతీనందనుని దండాయుధపాణి రూపంలో వీక్షించాలని ఆపేక్షించి ఈ క్షేత్రంలో తపస్సు చేసి కృతకృత్యుడయ్యారు. అందుకే స్వామిని స్వయంవ్యక్త మూర్తి అని చెబుతారు. ప్రతి నిత్యం చక్కని అలంకరణ చేస్తుంటారు. ఎంతో సుందరంగా దర్శనమిస్తారు. ఇది తరచుగా గిరి ప్రదక్షిణ చేసేవారికి అనుభవమే !  ఇక్కడే నాలుగో నంది దర్శనం లభిస్తుంది. 
పక్కనే ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం కూడా విశేషమైనదే !

శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయం 

శతాబ్దానికి పూర్వం భగత్సేవకులైన మొదలియార్ కుటుంబంచే  నెలకొల్పబడిన శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఒకటి. 
దేవీ భాగవతం ప్రకారం ప్రధమంగా ఉద్భవించిన దేవీ రూపం శ్రీ రాజరాజేశ్వరి. తరువాతే మిగిలిన దేవీ దేవతలు. 
మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతం లో ఎన్నో అమ్మవారి ఆలయాలున్నాయి. 
కానీ తిరువన్నమలై లో ఉన్న ఈ ఆలయం కొన్ని ప్రత్యేకతలకు నిలయం.
  సరిగ్గా పార్వతీ పర్వతం మొదలయ్యే చోట ఈ ఆలయం ఉండటం చిత్రమే!
ఆలయాన్ని నిర్మించినప్పుడు ఒక్క గర్భాలయం మాత్రమే ఉండేదట. కాలక్రమంగా ఆలయము అభివృద్ధి చెంది ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 
మూలవిరాట్టు పాదాల చెంత త్రిమూర్తి స్వరూపులైన శ్రీ శ్రీ శ్రీ దతాత్రేయ స్వామి రూపొందించిన "కూర్మ 
మేరు యంత్రం" ఉంటుంది. పూజించిన వారి సమస్త మనోభీష్టాలను నెరవేర్చిదిగా, సకల ఆటంకాలను తొలగించేదిగా కూర్మ మేరు యంత్రం ప్రసిద్ది. 
ఆలయం ముఖ మండపంలో నిల్పిన  "దశ మహావిద్యా మూర్తులు" అయిన   శ్రీ కాళీ, శ్రీ తార, శ్రీ త్రిపురసుందరి,  శ్రీ భువనేశ్వరి, శ్రీ బాల భైరవి, శ్రీ చిన్న మస్తా దేవి, శ్రీ దూమవతి, శ్రీ భాగలా ముఖి, శ్రీ మాతంగి మరియూ శ్రీ కమలాత్మిక దర్శమిస్తారు.  సమస్త విద్యలకు అధిదేవతలైన ఈ పది రూపాలు మానవులకు జ్ఞానాన్ని ప్రసాదించేవిగా ప్రసిద్ది. విద్యతో పాటు జ్ఞానం కూడా సమపాళ్ళలో ఉంటేనే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకొని, శాశ్విత కీర్తికి అర్హుడు కాగలడు. 
కాళీ, దుష్టులను సంహరించి, లోకాలను కాపాడటం. ఉగ్ర రూపం. తాంత్రిక పూజలకు ప్రతి రూపం.  నల్లటి రూపంలో ఉండే ఈమె కాలానికి మరియు నలుపుకూ ప్రతి రూపం. బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించే దేవత. ఈమె సర్వ విద్యలకు అధిదేవత కీర్తించబడినది. 
దశ మహా విద్యలలో రెండో రూపం తార. కొద్దిగా కాళీ రూపవిన్యాసాలు దోక్యమవుతాయి. దుర్గ, మహాదేవిగా పిలబడే తార భక్తులు సమస్యలను ఎదుర్కొనేందుకు  కావలిసిన సమయాస్పూర్తిని, బుద్దిబలాన్ని అనుగ్రహించేదిగా ప్రసిద్ది. తార అంటే రక్షించేది అన్న అర్ధం కూడా కలదు.  కొలిచిన వారిని కాపాడే కారుణ్యమూర్తి. 







పేరుకు తగిన రూపం.  శాంత సుందరం గా దర్శనమిచ్చే ఈమెను లలిత, శ్రీ రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు. ముల్లోకాలను పాలించే ఆది పరాశక్తి. స్థూల, సూక్ష్మ, పర రూపాలలో పూజలందుకొనే దేవి సృష్టి,స్థితి,  లయలకు మూలం. జ్ఞాన శక్తిని అనుగ్రహిస్తుంది. 
ముల్లోకాలను పాలించేది శ్రీ భువనేశ్వరి.  భక్తులకు అండగా నిలిచే ఈ త్రిభువన పాలిని సకలసుగుణాలను  అనుగ్రహిస్తుంది.  
భైరవి అంటే శక్తివంతమైనది లేక తన తేజస్సుతో ఎంతటి వారినైనా అదుపులో పెట్టగల సమర్ధురాలు. అందుకే యుద్దసమయాలలో విజయం గురించి ఈమెనే ఆర్ధించేవారు.తన తేజస్సుతో అహం అనే శత్రువును దహించే తేజస్విని.   ఆత్మ జ్ఞానం ప్రసాదిస్తుంది. 
చిన మాష్టాదేవి శరీర భాగం మాత్రమే కనిపిస్తుంది. శిరస్సు ఆమె చేతిలోనే ఉంటుంది. రూపం భయం గొలిపే విధంగా ఉన్న ముఖములో చిరునవ్వు దోక్యమవుతుంది. ఆత్మ సమర్పణకు ప్రతిరూపం. సంపూర్ణ శరణాగతి తో పరమాత్మను చేరుకోవచ్చును అని తన రూపంతో తెలియజేస్తుంది. 
దశ విద్యారూపాలకు మార్గదర్శి ధూమావతి.  జీవన్మరణాల మీద ఆధిపత్యం గల దేవత. గ్రహ భాధలను తొలగించేది. సిద్దులను ప్రసాదించేది.  స్వానుభవాల నుండి పాఠాలను నేర్చుకొనే శక్తిని అనుగ్రహిస్తుంది. చివరకి ఆధ్యాత్మికత వైపుకు మళ్ళిస్తుంది. 
వాక్కుకు అది దేవత భాగలా ముఖి . భక్తుల అజ్ఞానాన్ని తొలగించి, సందేహ నివృత్తి చేసేది ఈ దేవీ. సమయానుకూలంగా మాట్లాడగల వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది. మనం మాట్లాడే మాటలే కదా మన మానసిక పరిస్థితిని, పరిపక్వతను తెలిపేది !
మాతంగి మనస్సును, ఆలోచనలను నియంత్రించేది. అన్ని విద్యలను ఆకళింపు చేసుకోడానికి స్థిర చిత్తం ప్రధానం కదా ! సంపూర్ణ చిత్తంతో అభ్యసించే విద్య వలన జీవితంలో ఉన్నతిని, ఖ్యాతిని పొందవచ్చును. 
కమలాత్మిక, కమలాసని.  సకల సంపదలకు అది నాయకురాలైన సాక్షాత్తు శ్రీ మహా లక్ష్మి. నమ్మి కొలిచిన వారికి ఈమె  అనుగ్రహించనిది లేదు. ఐశ్వర్యం, అభివృద్ధి, అందం, ఆనందం, ప్రేమ ఇలా ఎన్నో. 
మరో విశేషమేమిటంటే తిరువన్నామలై కి పది కిలోమీటర్ల దూరం వరకూ కనిపించే "కార్తీక దీపం" ఈ ఆలయం వద్ద నుండి కనిపించదు. పరమేశ్వర ఛాయ పడకపోవడంతో అమ్మవారు మరింత శక్తితో భక్తులను అనుగ్రహిస్తారన్నది స్థానిక విశ్వాసం.  ప్రతి పౌర్ణమి రాత్రి విశేష పూజలు, భజనలను నిర్వహిస్తారు. 
గర్భాలయంలో శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారు స్థానక భంగిమలో రజత కవచ దారినిగా దర్శనమిస్తారు. ప్రతినిత్యం ఎన్నో పూజలు, అలంకరణలు జరుపుతారు. సాయం సంధ్యా సమయంలో హారతి తరువాత ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. 
గిరివాలంలో ఎదురయ్యే ప్రతి ఆలయాన్నికుదిరితే  సందర్శించాల్సినదే ! కానీ శ్రీ రాజ రాజేశ్వరి ఆలయంతప్పక సందర్శించాలి.  లోనికి పరిపూర్ణ భక్తి బావనతో ప్రవేశించాలి. 
సమస్త మనోభిష్టాలను సిద్ధించుకోవచ్చును. 
ఈ రెండు ఆలయాలకు ఎదురుగా ఉన్న అడవిలో ఉంటుంది శ్రీ కన్నప్ప ఆలయం. 

భక్త కన్నప్ప ఆలయం 

తిన్నడు అంటే ఎవరు ? అని అడగవచ్చు ! అదే భక్త కన్నప్ప అని అంటే తెలియని వారు ఉండరు. భక్త కన్నప్ప కధ అందరికీ తెలిసినదే!
ప్రసిద్ద శైవ క్షేత్రం శ్రీ కాళహస్తితో ముడిపడి ఉన్న పరమ భక్తాగ్రేశ్వరుడు తిన్నడు. తన భక్తుని పరీక్షించడానికి పరమ శివుడు పెట్టిన పరీక్షలో తన కన్నులను కపర్ధికి సమర్పించుకొన్న   అచంచల భక్తి విశ్వాసాలు తిన్నని సొంతం. స్వయంగా సర్వేశ్వరుడే అతని భక్తికి మెచ్చి "కన్నప్ప" అని నామకరణం చేసారు. 
శ్రీ కాళహస్తి ఆలయ చరిత్రతో విడదీయని బంధం ఏర్పరచుకొన్న కన్నప్ప , గాయక భక్తులైన అరవై  మూడు మంది నయమ్మారులలొ ఒకనిగా శాశ్విత కీర్తి పొందాడు. తమిళ గ్రంధాలలో "కన్నప్ప నయనార్ లేదా నేత్రేశ నయనార్" గా పిలవబడే ఈయనకి రెండు ఆలయాలు ఉన్నాయి.
ఒకటి తిన్ననికి శాశ్విత కైలాసవాసం కల్పించిన శ్రీ కాళహస్తిలో చిన్న కొండ మీద ఉంటుంది. శ్రీ కాళ హస్తీశ్వరుని ఆలయంలో ఒక చోట నుండి కొండ మీద ఉన్న భక్త కన్నప్ప ఆలయాన్ని చూడవచ్చును.రెండవది ఇక్కడ ఉన్నాయి. తిరువణ్ణామలై  గిరివలయంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఎవరు ఎప్పుడు కట్టించారో అన్న వివరాలు అందుబాటులో లేవు. కాకపోతే కొంత మేర శిధిలమైన  ఆలయాన్ని పునః నిర్మించారు. కొన్ని పురాతన తమిళ శాసనాలు కూడా కనపడతాయి ఆలయ గోడలమీద. గిరివలయంలో వచ్చే నిత్యానంద ఆశ్రమం పక్కన అడవిలో ఉంటుందీ ఆలయం.గతంలో అనుమతి ఉన్న లోపలి గిరివలయ మార్గంలో ఉన్న ఈ ఆలయానికి ప్రస్తుత గిరివలయం నుండి కూడా నిత్యానంద ఆశ్రమ ప్రహరీ గోడ  పక్కగుండా వెళితే చిన్న కొండ రాయి మీద ఉంటుంది.
మరో గుర్తు ఏమిటంటే మనకు ఎడమ పక్కన శ్రీ దండాయుధ పాణి మరియు శ్రీ రాజ రాజేశ్వరీ అమ్మవారి దేవాలయాలుంటాయి. ఎదురుగా రహదారికి అటుపక్కన ఉన్న కంచె దాటి అడవి మార్గంలో అర కిలోమీటరు నడిస్తే వస్తుందీ ఆలయం.
చిన్న మండపం మరియు గర్భాలయంతో ఉన్న పై భాగానికి చేరుకోడానికి సోపాన మార్గం కలదు. మండప స్థంభాల మీద ఎలాంటి చెక్కడాలు కనపడవు.ప్రశాంత ప్రకృతిలో, దట్టమైన అడవిలో ఆహ్లాదకర వాతావరణంలో  ఉన్న ఈ ఆలయం మనస్సుకు ఎంతో శాంతిని ప్రసాదిస్తుంది. గర్భాలయంలో స్థానక భంగిమలో పులి చర్మం ధరించి, ధనుర్భానాలు పట్టుకొని విగ్రహరూపంలో  శ్రీ కన్నప్ప నయనారు దర్శనమిస్తారు.
నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో భక్తుల సంఖ్య దాదాపుగా ఉండదు. ఎందుకంటే ఈ అరుదైన ఆలయం గురించి సామాన్య భక్తులకు తెలిసింది దాదాపుగా ఏమీ లేదు. అదీ కాక అడవిలోకి ప్రవేశానికి అనుమతి కావాలి. పౌర్ణమి రోజులలో, కార్తీక మాసంలో, కన్నప్ప నయనారు జన్మ దిన ఉత్సవాలలో కొంత మేర భక్తుల సందడి కనిపిస్తుందని అక్కడ ఉండే సాధువులు తెలిపారు. కుదిరితే తప్పక దర్శించవలసిన అరుదైన ఆలయం.


సంసార మాయ 

పుట్టినప్పటి నుండే బంధాలు ఏర్పడతాయి. పెరిగి పెద్దదైన తరువాత అవి బలపడతాయి. అవి మరణంతో మాయమైపోతాయి. కానీ ఒకసారి మానవుడు సంపాదన, పెళ్లి, పెళ్ళాం, పిల్లలు అన్న సంసార బంధంలో మునిగిపోయినప్పుడు అతను పూర్తిగా సంసార మాయలో చిక్కుకొని ఉంటాడు. జీవిత చక్రం గురించి ఆలోచన కలుగదు. ఉన్నత స్థానం, ఇల్లు, స్థిరపడటం అంటూ నిరంతరం సంపాదనకై అర్రులు చాస్తుంటాడు. దేవుని తలచుకొన్నప్పటికీ అది ఇహలోక సంబంధిత అంశాలకు సంబంధించే ఉంటుంది. ఈ మాయ మహేశ్వరునికి కూడా తప్పినట్లు లేదు.  దానిని భక్తులకు ప్రత్యక్షంగా చూపించాలనుకొన్నారో మరి పళని ఆండర్ ఆలయం వద్ద నుండి సూర్య లింగం  మరోసారి అరుణగిరి కనపడదు.  మూసివేస్తూ కనపడే చిన్న కొండని "పార్వతీ పర్వతం" అంటారు. ఈ అర కిలోమీటర్ దూరం అరుణాచలం అస్సలు కనపడదు. పరమేశ్వరుడు కూడా సతి చాటు పతిగా ఉంటారు. దీనికి అర్ధం సంసారం మాయలో చిక్కుపడి ఉన్నవారు ఆత్మజ్ఞానం తొందరగా అర్ధం చేసుకోలేరు. పొందలేరు. వారి ఆశలు, ఆశయాలు అశాశ్వితమైన ఇహలోక సుఖాల పట్ల గల వ్యామోహంలో మునిగిపోయి అదే నిజమైన జీవిత పరమార్ధం అనుకొంటారు. చరమాంకంలో చింతించే బదులు మొదట నుండి దీనిని నియంత్రణలో ఉంచుకొవడం ఆ అభిలషణీయంఅన్న సందేశం లభిస్తుంది ఇక్కడ. 


సింహతీర్థం 

ఒకప్పుడు ఎన్నో తీర్ధాలు తిరువణ్ణామలై లో ఉన్నాయని తెలుసుకున్నాము కదా. గతించినవి పోగా మిగిలి ఉన్న వాటిల్లో ఒకటి "సింహతీర్థం" రహదారి నుండి కొద్దిగా లోపలి ఉంటుంది. పుష్కరణి ముఖద్వారం నోరు తెరుచుకున్న మృగరాజు మాదిరి ఉంటుంది. వెలుపల వేప వృక్షం క్రింద ఒక నంది చిన్న శివ లింగం ఉంటాయి. 
కాశీ సందర్శించినవారు గంగ ఒడ్డున తమకు ఇష్టమైన ఒక ఆహార పదార్ధాన్ని వదిలివేస్తారు. దీని వెనుక పరమార్ధం ఏమిటంటే ఆ పదార్ధాన్ని తినవలసిన ప్రతిసారి మాటలో, మదిలో శ్రీ కాశీవిశ్వేశ్వరుడు, ముక్తి క్షేత్రం వారణాసి గుర్తుకువస్తాయి. ఆధ్యాత్మిక స్పందనలు కలుగుతాయి. ఆ ప్రేరణతో శివనామ స్మరణ చేస్తారు అన్నదే !
దీనికి వ్యతిరేకం సింహతీర్థం. తీర్ధంలో స్నానం చేయక పోయినా పాదప్రక్షాళన చేసుకొని చెట్టు క్రింద ఉన్న నందీశ్వరుని వద్ద మనకున్న చెడ్డ అలవాట్లలో ఒకటి లేదా రెండు వదిలేస్తున్నామని ప్రమాణం చేయాలి. అంటే పొగ త్రాగడం, మద్యపానం, జూదం, పరస్త్రీ వ్యామోహం , మోసం, దొంగతనం ఇలాంటివన్నమాట. మరి జీవితంలో వాటి జోలికి పోకూడదు. 
అనారోగ్య సమస్యలు తలెత్తిన తరువాత మానివేసి కన్నా ముందుగా వదిలేయడం వలన ఆరోగ్యకరమైన జీవితము గడపవచ్చును కదా !

శ్రీ గౌతమ మహర్షి ఆలయం 

గిరి మార్గంలో వచ్చే ముగ్గురు మహర్షుల ఆలయాలలో ఇది రెండవది. గౌతమ మహర్షి 
సప్త మహర్షులలో ఒకరు. రాహుగణ మహర్షి కుమారుడు. పలు హిందూ పురాణాలతో పాటు వేదాలలో కూడా ఈయన ప్రస్థాపన ఉన్నది. మానవాళికి మార్గదర్శనం, హితం చేసే ఎన్నో మంత్రాలను అందించారు. మంత్ర దృష్ట గా ప్రసిద్ధి. మానవాళి పాటించవలసిన, అనుసరించవలసిన ధర్మ సూత్రాల గురించి ఒక గ్రంధం రచించారు. ఈ ధర్మ సూత్ర గ్రంధంలో నాలుగు ఆశ్రమాలు, నలభై సంస్కారాలు, చాతుర్వర్ణాలు, రాజ ధర్మాలు, శిక్షాస్మృతులు, స్త్రీలు పాటించవలసిన ధర్మాలు, ఆహార నియమాలు, ప్రాయశ్చిత్తానికి నియమాలు, మొదలైన హిందూ ధర్మ శాస్త్రంలోని అన్నీఈ గ్రంధంలో ఉన్నాయి. 
గౌతమ ధర్మశాస్త్రము అత్యంత పురాతనమైన న్యాయ శాస్త్ర గ్రంధంగా పేర్కొనబడుతోంది. 
కంచి నుండి అశరీరవాణి ఆదేశం మేరకు తిరువణ్ణామలై చేరుకొన్న పార్వతీ దేవి ఇక్కడ ఉన్న గౌతమాశ్రమంలోనే  గంగాధరుని అనుగ్రహం కొరకు తపస్సు చేసింది. 
నేటికీ ఇక్కడ శ్రీ గౌతమాశ్రమంతో పాటు పక్కనే శ్రీ గౌతమ మహర్షి ఆలయం కూడా ఉంటుంది. 
మహామునికి మొక్కడం మన కనీస కర్తవ్యం. 

సూర్య లింగం 

లోకాలను అల్లకల్లోలం చేస్తున్న రాక్షస మూక నుండి కాపాడమని దేవతలు, మహర్షులు అరుణాచలేశ్వరుని ప్రార్ధించారు. ప్రసన్నుడైన ఆయన త్వష్ట ప్రజాపతి అసుర సంహారానికి అరుణుని నియమించామని ఆదేశించారు. దివాకరుడు దనుజులను తన తీవ్రమైన కిరణాలతో దహించేశారు. అందరూ ఆయనను ప్రశంసించారు. దానితో అహం పెరిగి పోయింది సూర్యునికి. శోణగిరిని దాటటానికి యత్నించాడు. కానీ అరుణగిరి తేజస్సు ముందు నిలువలేక శక్తిహీనుడయ్యాడు. అదను చూసి రాక్షసులు ఆయన మీద దాడి చేశారు. వారిని ఎదిరించలేక, వారు పెట్టే ఇబ్బందులకు తాళలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు ఆదిత్యుడు. ఆయన ఆదేశం మేరకు బ్రహ్మ తీర్ధంలో స్నానమాచరించి, గిరి ప్రదక్షిణ చేసి కోల్పోయిన తేజస్సును తిరిగి పొందడంతో పాటు ఎదుటి వారి తేజస్సును హరించే శక్తిని సంపాదించాడు. అసురబాధ తొలగిపోయింది. నేడు సూర్య గమనాన్ని గమనిస్తే అరుణగిరిని చుట్టి వెళతారు తప్ప దాటరు. 
కృతజ్ఞతాపూర్వకంగా తన పేరు మీద ఈ లింగాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో భక్తి పూర్వకంగా పఠించే ఆదిత్య హృదయం పలు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. అనారోగ్యాలను తొలిగిస్తుంది అని విశ్వసిస్తారు. 

వరుణ లింగం 

గిరిమార్గంలో వచ్చే అష్టదిక్పాలక లింగాలలో అయిదవది. మానవులకు అత్యంత అవసరమైన జలానికి అధిపతి. మకరవాహనుని అనుగ్రహం వలననే సకాలంలో వర్షాలు కురుస్తాయి అని చెబుతున్నాయి మన పురాణాలు. ఈయనను మనుషుల సుఖ సంతోషాలకు కారకునిగా పేర్కొన్నాయి కూడా. మానవులు చేసే పాపపుణ్య కార్యాల వివరాలను గమనిస్తుంటారట. 
కొన్ని కారణాల వలన వరుణుడు శరీరాకృతిని నిలిపే అస్థిపంజరాన్ని కోల్పాయారట. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందిట. సకాలంలో వానలు కురిపించ లేకపోయారట. అప్పుడు సప్త మహా ఋషులు ఆయనను అరుణగిరి ప్రదక్షిణ చేయమని ఆదేశించారట. ఆ ప్రకారం చేయడంతో తన ఆకారాన్ని తిరిగి పొందారట. ఆనందంతో గిరికి పడమర దిశలో తన పేరు మీద ఈ లింగాన్ని ప్రతిష్టించారట. వరుణ లింగ ఆలయంలో మకర సంక్రాతి రోజున పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు.  
శనిదేవుడు ఈ క్షేత్రానికి అధిదేవత. వరుణ లింగానికి ప్రదక్షిణలు చేస్తే మన జాతకాల మీద సూర్యపుత్రుని ప్రభావం గణనీయంగా తగ్గుతుంది అని అంటారు.శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వరుణ లింగానికి అభిషేకం చేయించుకొంటే స్వస్థులు అవుతారని నమ్ముతారు. వరుణుని ప్రసన్నం చేసుకొంటే గత జన్మల పాపం కూడా హరించుకొని పోతుందని అంటారు. మకర, కుంభ రాశులవారు ఈయనను పూజించడం అత్యంత శ్రేయస్కరం. 

సోమస్కంద ముఖ లింగ దర్శనం 

వరుణలింగం దాటిన తరువాత గిరి వంక చూస్తే లభించేది " సోమస్కంద ముఖ లింగ దర్శనం". ఆది దంపతుల మధ్య స్కందుడు( కుమారుడు) ఉన్న మూర్తిని సోమస్కంద స్వామి అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా పార్వతి, అరుణాచల పర్వతాల మధ్య మరో చిన్న పర్వత శిఖరం కనపడుతుంది. సంతానం లేనివారు ఈ దర్శనం చేసుకొని శ్రీ అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తే సత్సంతానం కలుగుతుంది అంటారు. అదేవిధంగా కుమారులు జీవితంలో స్థిరపడకపోతే తల్లితండ్రులు గిరి ప్రదక్షిణ చేసి, ఈ దర్శనం చేసుకొని ఆది అణ్ణామలేశ్వరుని సన్నిధిలో కొబ్బరికాయ కొడితే పుత్రుల జీవితం స్థిరపడుతోంది అని చెబుతారు. 

శ్రీ ఆది అణ్ణామలై స్వామి ఆలయం

అరుణ గిరికి వెనుక అంటే పడమర భాగంలో గిరి వలయంలో ఉన్న ఈ ఆలయం క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి ముందే నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆలయం ఉన్న గ్రామం పేరు కూడా ఆది ఆన్నామలై కావడం విశేషం. అరుణాచలానికి ఎదురుగా తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం ప్రధాన ఆలయం తో పోలిస్తే చాలా చిన్నది. సుమారు ఒక ఎకరా స్థలంలో ఉన్న ఈ ఆలయానికి తూర్పున మూడు అంతస్తుల రాజ గోపురం ఉంటుంది. రాజ గోపురం పైన వర్ణమయ శివలీల శిల్పాలు సుందరంగా ఉంటాయి. నలువైపులా ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించారు. ప్రాంగణంలో ప్రహరీ గోడకు మూడు వైపులా విశాల మండపాలు నిర్మించారు. ముఖ మండపానికి ఇరుపక్కలా ఒక వైపు శ్రీ గణపతి, మరో వైపు శ్రీ కుమార స్వామి ఉపాలయాలలొ కొలువుతీరి ఉంటారు. ముఖ మండప స్తంభాల అమరిక, వాటి మీద ఉన్న శిల్పాలు ఆకట్టుకొంటాయి. కొంచెం ఎత్తులో ఉన్న గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ ఆది అణ్ణామలై  స్వామి రమణీయ పుష్పాలంకరణలో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. తమిళనాడు లోని శివాలయాలలో పుష్పాలతో లింగ రాజుకి చేసే అలంకరణ అద్భుతంగా ఉంటుంది. వివిధ వర్ణ పుష్పాలతో చేసే అలంకరణ భక్తుల మనస్సులలో చెరగని ఆధ్యాత్మిక భావాలను నెలకొల్పుతుంది. 
శ్రీ ఆది అణ్ణామలై  స్వామి  ఇక్కడ ఎలా కొలువు తీరారో  తెలిపే స్థల పురాణం యుగాల నాటిది. దేవలోకంలో ఉన్న అప్సరసలలో ఒకరు తిలోత్తమ. అపురూప సౌందర్య రాశి.విధాత బ్రహ్మ దేవుడు ఒక బలహీన క్షణంలో తాను సృష్టించిన తిలోత్తమ అందానికి మోహితుడై పావురం రూపంలో ఆమెను వెంట పడ్డారట. తనను సృష్టించిన వాడే వెంటపడే సరికి బెదరిన తిలోత్తమ పరమేశ్వరుని శరణు కోరిందట.  ఆయన వేటగాడి రూపంలో బ్రహ్మ దేవుని అడ్డగించి, మోహ విముక్తిని చేసారట. తను చేసిన అనుచిత చర్యకు భాద పడిన పద్మ సంభవుడు ఆ పాపానికి నివృత్తిగా అక్కడ ఒక లింగాన్ని స్థాపించారట.  అదే ఆది అణ్ణామలై స్వామి లింగం. రుద్రుడు అణ్ణామలై స్వామిగా సాక్షాత్కరించడానికి ముందే ఈ సంఘటన  జరిగినట్లుగా చెబుతారు. అందుకే స్వామికి ఆది అణ్ణామలై స్వామి  అన్న పేరు వచ్చింది. పక్కనే ఉన్న మరో ఉపాలయంలో శ్రీ ఉణ్ణామలై  అమ్మవారు కొలువుతీరి భక్తుల సేవలను స్వీకరిస్తుంటారు. ప్రతినిత్యం గిరి వలయం చేసే  భక్తులతో ఆలయం కళ కళలాడుతుంటుంది.
తన గిరి ప్రదక్షిణ సమయంలో ఎన్నో రోజులు ఇక్కడ విడిది చేసిన శ్రీ రమణ మహర్షి ఈ ఆలయం గురించి రెండు అద్భుత విషయాలు తెలిపారు. 1918 వ సంవత్సరంలో ఆలయ మరమత్తులు చేస్తున్న సమయంలో ప్రాంగణ తూర్పు భాగంలో పెద్ద గుహ ఒకటి బయల్పడినది. మరో సారి అంటే 1949లో గర్భాలయంలో మరో గుహ వెలుగు చూసింది. ఆలయ నిర్వాహకులు  రమణులను సంప్రదించగా "ఈ గుహా మార్గము గుండా మునులు, యోగులు, సిద్దులు రాత్రి సమయంలో వచ్చి శ్రీ ఆది అన్నామలై స్వామిని సేవించు కొంటారు. కనుక వాటిని మూసి వేయవలసినది " అని మహర్షి తెలిపారు.

శివ యోగ ముఖ లింగ దర్శనం 

ఆది అన్నామలై ఆలయం నుండి లభించే దర్శనం  "శివ యోగ ముఖ దర్శనం". తొలిసారిగా ఈ దర్శనాన్ని పొందిన వారు "తిరుమూలర్" అనే సిద్ద యోగి. యోగ విద్యలో నిష్ణాతుడు. స్వయంగా కైలాసంలో ఈశ్వరుని వద్ద యోగ విద్య అభ్యసించారని అంటారు.  అరవై మూడు మంది శైవ గాయక భక్తులైన నయనారులలో  కూడా ఒకరుగా ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని సందర్శించి, అరుణ గిరికి మొక్కితే ఈ సిద్దుని  ఆశీస్సులతో ఇహపర సుఖాలను పొందవచ్చునని శ్రీ రమణులు తెలిపినట్లుగా తెలుస్తోంది. ఈ దర్శనం వలన అన్వేషిస్తున్న ఆధ్యాత్మిక గురువు దర్శనం మరియు మార్గదర్శకత్వం లభిస్తాయి. 

మాణిక్య వాసగార్ 

మహాశివ భక్తుడు, కవి అయిన మాణిక్యవాసగార్ ను శివ గాయక భక్తులైన నయనారుల జాబితాలో చేర్చలేదు. అరవై మూడు మంది నయనారులలో ప్రముఖులు తిరుజ్ఞాన సంబందార్, అప్పార్ , సుందరార్లతో జత చేసారు. ఈ నలుగురిని కలిపి "నలువర్" అని గౌరవంగా పిలుచుకొంటారు. 
మాణిక్యాల లాంటి మాటలు పలుకుతూ, రాస్తూ ఉండే ఈ మహాకవి తిరువణ్ణామలై లో ఉన్నప్పుడే " తిరువెంబావై" రచించారు. 
పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఒకరైన " ఆండాళ్(గోదా దేవి)" గానం చేసిన "తిరుప్పావై" ని తిరుమలలో సహా అన్ని విష్ణు ఆలయాల్లో ధనుర్మాసంలో గానం చేస్తారు. అదే విధంగా మార్గశిర మాసంలో అన్ని శివలయాలలో " తిరువెంబావై" ని గానం చేస్తారు. 
గిరి మార్గంలో ఆది అణ్ణామలై స్వామి ఆలయానికి వెళ్లే వీధి మొదలులో శ్రీ మాణిక్యవాసగార్   ఆలయం కలదు. మహనీయునికి మొక్కడం విధాయకం. 

అరుణాచల లావణ్య శుక బ్రహ్మముని దర్శనం 

మాణిక్యవాసకర్ ఆలయం వద్ద నుండి పర్వతాన్ని చూస్తే కలిగేది " లావణ్య శుక బ్రహ్మముని దర్శనం". దీని వలన జీవితంలో అందం ఆనందం లభిస్తాయి. ముఖ్యంగా గాయాల కారణంగా అందవిహీనంగా మారిన వారికి ఈ దర్శనం వలన చేయించుకునే శస్త్ర చికిత్సలు అనుకూలిస్తాయి. విజయవంతమౌతాయి.  పూర్వవు లావణ్యాన్ని పొందగలరు. 

వాయు లింగం 

గిరికి వాయువ్య భాగంలో ఉంటుంది వాయు లింగం. అగ్ని, నీరు తరువాత మానవునికి కావలసినది వాయువు. గాలి లేకపోతే ఊపిరి లేదు. ఈశ్వర ఆదేశం మేరకు ఇక్కడ తన పేరుతొ లింగాన్ని ప్రతిష్టించారట. గిరి ప్రదక్షిణ చేసే వారికి ఉపశమనం కలిగిస్తారని అంటారు. 
మనం ఇక్కడ అది గమనించవచ్చును. మండపం లోనికి ప్రవేశించగానే చల్లని గాలి తెమ్మెరలు తాకి శరీరానికి హాయిని కలిగిస్తాయి.  
ఈ క్షేత్రానికి అది దేవత కేతువు. వాయు లింగాన్ని భక్తి శ్రద్దలతో సేవించుకొంటే హృద్యోగ భాధలు, జీర్ణాశయ వ్యాధుల నుండే గాక మిగిలిన ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  వాయు లింగం వద్ద నుండి కొండను చూస్తే కలిగేది "అరుణాచల కండ నీరు ముఖ దర్శనం". ఈ దర్శనం చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందులోనూ ఉబ్బసం, ఆయాసం లాంటి శ్వాసకోశ వ్యాధులతో   బాధపడే వారికి గుణం కనపడుతుంది అన్నది శాస్త్ర వాక్యం. 

జన్మసాఫల్య ముఖ లింగ దర్శనం 

వాయు లింగాన్ని దాటగానే ఎడమ పక్కన  కొద్దిగా లోపల ఉన్న పంచభూత నందులలో ఆఖరి నంది  కనపడుతుంది. నంది మండపాన్ని చేరుకోడానికి దారి ఉండదు. వెలుపల నుండే నమస్కరించు కొని గిరిని చూడాలి. దీనిని " అరుణాచల జన్మ సాఫల్య ముఖ దర్శనం " అని అంటారు. ఈ దర్శనం జన్మజన్మల పాపాన్ని హరించి వేస్తుంది అని అరుణాచల మాహత్యం లాంటి పురాతన గ్రంధాలు తెలుపుతున్నాయి. 

అరుణాచల దశముఖ లింగ దర్శనం 

గిరి మార్గం నుండి తిరిగి ఉత్తరం వైపున ఉన్న కంజి దారి కి వెళ్లే దానికి కొద్దిగా ముందు అంటే వాయు లింగం దాటిన తరువాత కుడి వైపున ఒక చిన్న మండపం కనపడుతుంది. ఇక్కడే పార్వతీ దేవి శివానుగ్రహం కొరకు తపస్సు చేసింది అని అంటారు. ఈ మండపం వద్ద నుండి గిరిని వీక్షిస్తే లభించేది  జీవితంలో ఎదురయ్యే సమస్యలకు శీఘ్రగతిన పరిష్కారం లభించేలా చేసే " అరుణాచల దశ ముఖ లింగ దర్శనం". దశకంఠుడైన లంకాధిపతి రావణా బ్రహ్మ ఈ దర్శనం పొందాడని చెబుతారు.  













చంద్ర లింగం 

హృదయాలకు హాయిని కలిగించే వెన్నెలను ప్రసాదించే వెన్నెల రేడు చంద్రుడు. దక్ష ప్రజాపతి అనవసర ఆగ్రహంతో ఇచ్చిన శాపకారణాన క్షయ వ్యాధిగ్రస్తుడయ్యాడు. రోజు రోజుకు క్షీణించిపోతూ తన తేజస్సును కోల్పోసాగాడు. శ్రీ మహావిష్ణువు ప్రోద్బలంతో అరుణాచల ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుని సేవించుకొన్నాడు.ఈశ్వరానుగ్రహంతో, శ్రీహరి చొరవతో దక్షుని శాపానికి చిన్న సడలింపు చేశారు. చంద్రశేఖరుని శిరస్సున స్థిరనివాసం ఏర్పరచుకొంటే మాసానికి పక్షం రోజులే దక్షుని శాప ప్రభావం ఉంటుంది అని తేల్చారు. అలా అరుణాచలేశ్వరుడు శశిశేఖరుడుగా మారారు. 
సంతసించిన చంద్రుడు తన పేరు మీద ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించారు. చంద్రలింగానికి అర్చన చేయించుకొంటే మానసిక ఆందోళనలు తొలగి మానసిక దృఢత్వం కలుగుతుంది అని చెబుతారు. 

శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్త్య మహర్షి ఆశ్రమం 

కైలాసనాధుని ఆజ్ఞ మేరకు వింధ్య పర్వతం దాటి దక్షిణ భారతదేశం వచ్చారు. సప్త ఋషులలో ఒకరు. గొప్ప శివభక్తుడు. సంస్కృత, తమిళ భాషలకు వ్యాకరణం రచించారని విశ్వసిస్తారు. ఎన్నో పావన క్షేత్రాలను మానవాళికి అందించారు. దరిదాపుగా అన్ని పురాణాలలో, వేదాలలో ఈయన ప్రస్థాపన ఉన్నది. 
రామరావణ యుద్ధ సమయంలో శ్రీ రామచంద్రునికి విజయాన్ని సిద్దించడానికి " ఆదిత్య హృదయం" ఉపదేశించారు. మానవాళికి మేలు చేసే ఎన్నింటినో అందజేశారు. 
గిరి మార్గంలో వచ్చే మూడో మహాముని ఆశ్రమ వద్ద నుండి గిరి పూర్తిగా దర్శనమిస్తుంది. 
దీనినే " శివశక్తి ఐక్య ముఖ లింగం " అని అంటారు. ఈ దర్శనం వలన విభేదాలతో విడిపోయిన ఆలుమగలు కలుసుకొంటారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు వస్తాయి. 

కుబేర లింగం 

సకల సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి తపమాచరించి స్థలం. ధనానికి అధిపతి ఐన కుబేరుడు స్థాపించిన లింగమిది. నవ గ్రహాలు కుబేర లింగాన్ని సేవించి తమ శక్తులను ద్విగిణీకృతం చేసుకొన్నారు. తమ గ్రహ స్థానాలను సుస్థిరం చేసుకొన్నారు. కుబేరుడు ఎవరికీ తన వద్ద ఉన్న ధనాన్ని ఇవ్వరు. కానీ సంపదను ఆర్జించే మార్గాన్ని సూచిస్తారు. గ్రహించినవారు ధనవంతులు అవుతారు. 
ఈ క్షేత్రానికి అధి దేవత బృహస్పతి (గురువు).కుబేర లింగానికి అలంకరణ చేయిస్తే ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ధను మరియు మీనా రాశి వారు కుబేర లింగాన్ని ఆశ్రయిస్తే అన్నింటా విజయం ఖాయం. 

అధికార నంది 

గిరి మార్గంలో వచ్చే ఆఖరిది అధికార నంది. కుబేర లింగం దాటిన తరువాత వస్తుంది. ఇక్కడ మన గోత్రనామాలు చెప్పుకొని దీపం వెలిగించాలి. నందీశ్వరుడు అరుణాచలేశ్వరునికి మన వివరాలు తెలియజేస్తాడు. అలా మనకి స్వామి వారి అనుగ్రహానికి బాటలు వేస్తారు అధికార నంది. 
ఇడుక్కు పిళ్ళయార్ 

ఆలయాలు కాకుండా చిత్రంగా నిర్మించిన ఒక నిర్మాణం గిరి ప్రదక్షనం చేసే వారికి కర్మ ఫాలాన్ని తొలగించేదిగా,
మానసిక స్థిరత్వాన్ని , శారీరక ధృడత్వాన్ని కలిగించేదిగా ప్రసిద్దిని సొంతం చేసుకొన్నది.
అదే "ఇడుక్కు  పిళ్ళయార్".
ఇడుక్కు పిళ్ళయార్ ఒక చిత్రమైన ప్రత్యేక నిర్మాణం. చిన్న గది లాంటి ఇడుక్కు పిళ్ళయార్ లో మూడు చిన్న చిన్న సన్నని ద్వారాలు ఉంటాయి. లోపల ఎలాంటి దేవీ దేవతల మూర్తులుండవు. భక్తులు తూర్పు వైపు నుంచి సన్నని ద్వారం గుండా ప్రవేశించి మధ్యలో ఉండే ఇంకా సన్నని ద్వారం దాటి పడమర వైపున ఉన్న మూడో ద్వారం నుండి వెలుపలికి వస్తుంటారు.
ముఖ్యంగా మధ్యలో ఉండే ద్వారాన్ని చూస్తే అసలు పట్టగలమా ? వెలుపలికి రా గలమా? అన్న సందేహాలు కలుగుతాయి.
కానీ పరిశోధకుల అంచనా ప్రకారం ఈ ద్వారాలు మానవ అస్థిపంజరం కొలతల ప్రకారం నిర్మించారని. అంటే మనిషి ఎంత లావుగా ఉన్న శరీర  ఎముకల అమరిక దాదాపుగా  అందరికీ ఒకేలా ఉంటుంది.
కొద్దిగా పక్కకు తిరిగితే యెంత లావుగా ఉన్న వారైనా సులభంగా బయటికి వస్తారు.
ఇడుక్కు పిళ్ళయార్ని తత్వవేత్తలు తల్లి గర్భం నుండి శిశువు ఈ ప్రపంచం లోనికి వచ్చే మార్గంతో  పోలుస్తారు.
దీని ప్రకారం ఈ జన్మకు ముందు అనేక జన్మలు ఎత్తిన ఒక జీవి యొక్క జన్మ జన్మల పాపాలను తొలగిస్తుంది ఈ
ఇడుక్కు పిళ్ళయార్ ప్రవేశం.
అంతే కాదు ఒక జీవిని ఆవరించి ఉండే  "నేను" అనే  అహం  పొరను తొలగించడమే కాకుండా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేస్తుంది.
దీనికి సంభందించిన ఒక గాధ స్థానికంగా వినిపిస్తుంది. 
శ్రీ ఇదయ కట్టార్ సిద్దార్, తమిళ నాడులో ప్రసిద్ది చెందిన సిద్ద పురుషులలో ఒకరు. అనేక సిద్ద మూలికలతో పళని 
లోని శ్రీ పళని ఆండవర్ ( దండాయుధ పాణి / కుమార స్వామి) విగ్రహాన్ని తయారు చేసిన ప్రముఖ సిద్ద వైద్య 
నిపుణుడు శ్రీ బోగార్ శిష్యుడు ఈయన. గురువు నుండి ఉపదేశం పొంది యోగ, సిద్ద విద్యలలో ఎన్నో నూతన శిఖరాలను అధిష్టించిన ప్రతిభాశాలిగా  గురువుచే పొగడబడిన వాడు. వీరి కాలం క్రీస్తు పూర్వం అయిదో శతాబ్దంగా పేర్కొంటారు. జీవిత చరమాంకంలో తిరువన్నామలై చేరుకొని అరుణాచలేశ్వరుని సేవించుకొని ఇక్కడే జీవ సమాధి చెందారు. ఆ సమయంలో శ్రీ ఇదయ కట్టార్ సిద్దార్ ఈ ఇడుక్కు పిళ్ళయార్  రెండు అత్యంత మహిమాన్విత యంత్రాలను ప్రతిష్టించారట. 
ఆ యంత్రాలు లోపలి ప్రవేశించిన వారి మీద పైన చెప్పిన ప్రభావాన్ని చూపుతాయి అన్నది తరతరాల విశ్వాసం. 
మరో రెండు నమ్మకాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. 
మొదటిది తూర్పు నుండి ప్రవేశంచి పడమర నుండి వెలుపలికి వస్తే ఇహంలో అన్నింటా జయం, ధన లాభం లభిస్తాయట.  అదే పడమర  నుండి ప్రవేశించి తూర్పు వైపు నుండి వెలుపలికి వస్తే ముక్తి లభిస్తుందిట. 
మూడు సార్లు లోపలి వెళ్లి వెలుపలికి వస్తే ఎముకల సంభందిత రోగాల నుండి ఉపశమనం కలుగుతుందని అంటారు. 
ఒకటి మాత్రం ప్రతి ఒక్కరికీ అనుభవం అయ్యేది ఏమిటంటే  పదునాలుగు కిలోమీటర్ల గిరి మార్గం లో ఇదుక్కు పిళ్ళయార్ పన్నెండో కిలోమీటరు దగ్గర ఉంటుంది.   నడక అలవాటు లేక పోవడం వలన కాళ్ళ నొప్పులు, శరీరం అలసిపోవడం సహజం.
ఇడుక్కు పిళ్ళయార్ లో ప్రవేశించిన తరువాత ఆ భాదల నుండి ఉపశమనం పొందుతారు.  కారణం ఏమిటంటే ఇది ఒక ఆటలాగ అనిపించి ఆలోచనలు నడక మీద నుంచి లోపలి పోవడం గురించి సాగుతాయి. ఇంకా గిరి వలయం చేస్తున్న భక్తులు ఇక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకొనే ఏర్పాటు కూడా ఉన్నది. రాతి అరుగులు ఏర్పాటుచేశారు.

పంచ ముఖ లింగ దర్శనం 

గిరి మార్గం మొత్తం మీద ఈ స్థలంలోనే మనం అరుణగిరి యొక్క అయిదు శిఖరాలను చూడగలము. శంకరుడు శయనించినట్లుగా చెబుతారు. ఈ దర్శనం సకల పాపహరం. జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందగలిగేలా మార్గదర్శకత్వం చేస్తుంది ఈ పంచముఖ లింగ దర్శనం. 
ఇక్కడే శ్రీ ఇసక్కి స్వామి అనే యోగి సమాధి మందిరం ఉంటుంది. ఈయన కొన్ని వేల గిరి ప్రదక్షిణాలు చేసిన గొప్ప యోగి. వైద్యుడు. ఆ రోజుల్లో పదునాలుగు కిలోమీటర్ల గిరి మార్గంలో అంగ ప్రదక్షిణం చేసేవారట. 






ప్రస్తుతం వీరి శిష్యులు శ్రీ మణి స్వామి ఇక్కడ ఉంటారు. ఈయననే శంఖం స్వామి అని కూడా పిలుస్తారు. వీరి దర్శనం అరుదుగా లభిస్తుంది. గోత్రనామాలు అడిగి గిరి వైపుకి తిరిగి శంఖం పూరిస్తారు. అర్హులైన భక్తులకు మంత్రోపదేశం చేస్తారు. లేదా వారు ప్రస్తుతము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం తెలుపుతారు. 

అరుణాచల కోన ముఖ లింగ దర్శనం 

ప్రధాన రహదారి నుండి ఈశాన్య లింగానికి వెళ్లే కూడలి నుండి కొండను చూస్తే లభించేది
 " అరుణాచల కోన ముఖ లింగ దర్శనం". ఇక్కడ మరల పర్వతం యొక్క ఉత్తర భాగం మూడు కోణాలతో  కనిపిస్తుంది. 
ఈ దర్శన త్రినేత్రుని అనుగ్రహాన్ని కలిగిస్తుంది. క్రమంగా ఇహలోక సుఖాల పట్ల విరక్తి కలుగుతుంది. ఈశ్వరుని గురించి తపిస్తుంది  హృదయం. అంతిమంగా మానవ జీవిత పరమార్ధం గ్రహిస్తాడు జీవుడు. 
అంతటి విశేష దర్శనం అరుణాచల కోన ముఖ లింగ దర్శనం 

ఈశాన్య లింగం 

ఈశాన్యం పితృదేవతల స్థానం. జీవితంలో వృద్ధి లోనికి రావాలంటే పెద్దల ఆశీర్వాదం ఆవశ్యకం. ఈశానుడు, శివును సప్త రుద్ర రూపాల్లో ఒకరు. జటాజూటాలతో, సర్పభూషణాలతో, విభూతి పూసుకొని ఢమరు,  త్రిశూలధారియై దర్శనమిస్తారు. ఈ క్షేత్రాన్ని రుద్రగణాలు, నవగ్రహాలు పరివేష్టించి ఉంటాయి. 
ఈ క్షేత్రానికి అధిదేవత బుధుడు. శాంతి ప్రదాత. జీవితంలో అన్ని ఉన్నప్పుడు అశాంతికి అవకాశం లేదు కదా !
ఈశాన్య లింగానికి ఎదురుగా శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయ ఉత్తర గోపుర నిర్మాత అమ్మణి అమ్మన్ జీవ సమాధి ఉంటుంది. దర్శనీయం. సందర్శన పూర్తి చేసుకొని ముందుకు వెళితే గొప్ప యోగి అయిన శ్రీ ఈశాన్య దేశికర్ సమాధి మరియు ఆశ్రమం ఉంటుంది. తప్పని సరిగా దర్శనం చేసుకొని ఆ మహనీయుని ఆశీర్వాదం, ఆశీస్సుల కొరకు ప్రార్ధన చేయడం శుభదాయకం. 

కుబేర లింగం నుండి ప్రధాన ఆలయం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అష్టదిక్పాల, గ్రహ లింగ ఆలయాల దర్శనం, ముగ్గురు మహర్షుల ఆశ్రమాలు, సప్త నందుల దర్శనం పూర్తి అయినది. ప్రధాన ఆలయానికి చేరుకొనే లోపల మరో రెండు ఆలయాల సందర్శన మాత్రమే మిగిలి ఉన్నాయి. ముఖ్యమైన శ్రీ దుర్గ కోవెల, శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయం, పావళ కున్రు మరియు శ్రీ పచ్చయమ్మన్ కోవెల విడిగా వెళ్లడం మంచిది.

అరుణాచల మాయ కుళి వాడు ముఖ లింగ దర్శనం 

అమ్మవారు మహిషాసురుని సంహరించిన గొప్ప క్షేత్రం శ్రీ దుర్గా దేవి కోవెల. ఆ ఆలయం ఎదురుగా నిలబడి పర్వతాన్ని చూస్తే కలిగేది " అరుణాచల మాయ కుళి వాడు ముఖ లింగ దర్శనం". 
మనలో పరివర్తన కలుగుతుంది. పుట్టిన తరువాతనే బంధాలు ఏర్పడతాయి. పెరిగే కొద్దీ అవి బలపడతాయి. కానీ మరణంతో ముగిసిపోతాయి. ఆ ఆకళింపు ఏర్పడుతుంది. జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి సిద్దపడతాము. 

పావళ కున్రు ముఖ లింగ దర్శనం 

పావళ కున్రు వీధి మొదటి నుండి గిరి శిఖరాన్ని వీక్షిస్తే కలిగేది పావళ కున్రు ముఖ లింగ దర్శనం. ఇది పళని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కృపాకటాక్షాలను ప్రసాదిస్తుంది. 

పశుపతి ముఖ లింగ దర్శనం 

శ్రీ అణ్ణామలై స్వామి ఆలయ ఉత్తరం పక్కన రహదారి కూడలిలో  ఉంటుంది  శ్రీ భూతనాధ (శ్రీ మహావిష్ణు) ఆలయం వస్తుంది. ఒక విశేష ప్రత్యేక రూపంలో కనపడతారు. స్వామిని దర్శించుకొని అమ్మణి అమ్మన్ గోపురం మీదగా అరుణగిరి పైపు దృష్టిని సారిస్తే లభించేది శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహాన్ని కలిగించేది. 

ఇరట్టు పిళ్ళయార్ 

ఒకే పీఠం మీద ఇద్దరు గణపతులు కొలువై ఉంటారు. పక్కనే శ్రీ కుమార స్వామి కూడా దర్శనమిస్తారు. ఇది గిరి పదక్షిణలో ఆఖరి ఆలయం. తదుపరి గమ్యం అమ్మను, అయ్యను సేవించుకోవడమే !
ఎన్నో శుభ ఫలితాలను అందించే అరుణగిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. 

శ్రీ అరుణాచలేశ్వర ఉవాచ 

1. అరుణాచలం ఇలలో కైలాసం. కదిలే కపర్ది కదలని కొండ గా కొలువు తీరిన క్షేత్రం. స్మరణ            మాత్రముననే ముక్తిని ప్రసాదించే పావన క్షేత్రం. స్మరణ మాత్రముననే ! పరముక్తి ఫలదం !
     కరుణామృత జలధి ! అరుణాచలమది !!
 2. కైలాస, మేరు పర్వాతాలు పరమేశ్వరుని నిలయాలు మాత్రమే ! కానీ అరుణాచలం స్వయం         ఈశ్వరుడే !
3. ఈ క్షేత్రానికి మూడు యోజనాల పరిధిలో నివసించేవారు ఎటువంటి దీక్షలు, పూజలు                     చేయకపోయినా కైలాస ప్రాప్తి పొందగలరు. 
4. ఇక్కడ చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా పదహారు రెట్లు అధిక ఫలాన్ని ఇవ్వగలదు. 
5. శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసిన పాపములు అన్నీ అరుణాచల దర్శనం వలన                  తొలగిపోతాయి. 
6. తేజో లింగం కొలువైన అరుణగిరి ప్రదక్షిణ, నమస్కారం, పూజ, స్తోత్రం, స్మరణం వలన                జనులు సకల పాపముల నుండి రక్షించబడుదురు. సర్వాభీష్టాలను సొంతం చేసుకొని                  సుఖంగా జీవితం గడపగలరు. 
7. ఆలయంలో, గిరి మార్గంలో దీపం వెలిగిస్తే గౌరీశంకరుని కృపకు పాత్రులు కాగలరు. 
8. అరుణాచలంలో ఒక్కరికి పెట్టే అన్నం కాశీలో  కోటి మందికి చేసిన అన్నదానంలో సమానం.
9. అరుణాచల కార్తీక దీప దర్శనం సర్వ పాప క్షయకరం. ఆరోగ్యం, ఐశ్వర్య కారకం.                      10. గిరి ప్రదక్షిణం సర్వ దాన ఫలం, సర్వ తీర్ధములలో స్నానమాచరించిన ఫలితం, అశ్వమేధ          యాగ ఫలం లభిస్తాయి.
                      
                                       అరుణాచల నివాసం  సకల ఋణ మోచనం  !!
                                       అరుణాచల దీప దర్శనం సకల పాపపుణ్య హరణం  !!
                                       అరుణాచల ప్రదక్షిణం సకల జన్మలకు సరిపడే నమస్కారం !!
                                       అరుణాచల కీర్తనం సకల జన్మల పరంపరకు అంతిమ గీతం !!
                                       అరుణాచల శివ ! అరుణాచల శివ !! అరుణాచల !!!

                                                         















Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...