16, అక్టోబర్ 2020, శుక్రవారం

Dabaleshwar Mahadev Mandir, Titlagarh

                 శ్రీ ధవళేశ్వర్ మహాదేవ్ మందిర్, టిట్లాగర్హ్  



లయకారుడైన నిరాకారునికి పుడమిలో ఉన్న ఆలయాలకు లెక్కలేదు. అందులోనూ ప్రతి ఒక్క ఆలయం తనదైన ప్రత్యేకతను చాటుకొంటాయి. అవడానికి లింగాకారుడైనా ఆ లింగాలు కూడా భిన్న రూపాలలో ఉండి వివిధ నామాలతో పిలవబడటం విశేషం. ఈ లింగాలలో చాలా వరకు స్వయం భూలు కావడం మరో ప్రస్తావించవలసిన అంశం. 
ఈ లింగాలు ఎక్కువగా దట్టమైన అడవులలో, పర్వత ప్రాంతాలలో, సాగర సంగమ ప్రదేశాలలో  మరియు పవిత్ర నదీ తీరాలలో ఉన్నాయి. కానీ శక్తి ఆరాధన అధికంగా ఉండే ఒడిశా రాష్ట్రంలో అనేక లింగాలు కొండ గుహలలో ఉంటాయి. అన్నీ కూడా ఎత్తుగా, పెద్ద కైవారంతో కొద్ది కొద్దిగా పెరుగుతుంటాయి. ఉదాహరణకు కోరాపుట్ జిల్లాలో ఉన్న గుప్తేశ్వర్ గుహాలయాన్ని పేర్కొనవచ్చును. ఇలాంటి ఆలయాలు ఎక్కువగా మల్కనగిరి, బాలేశ్వర్, సంబల్పూర్ మరియు బోలంగిర్ జిల్లాలలో కనిపిస్తాయి. వీటి వెనుక చెప్పుకోదగిన పౌరాణిక లేదా చారిత్రక విశేషం ఉన్నది. 
అలాంటి ఒక విశేష ఆలయం గత నెలలో సందర్శించుకునే అవకాశం వచ్చింది.ఆ విశేషాలు అందరితో పంచుకొందామన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ రాస్తున్నాను.  









ఒడిషా పశ్చిమ ప్రాంతంలోని జిల్లాలలో ఎండ, వేడి, చలి, వర్షాలు అన్నీ ఎక్కువే ! శీతాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలకు పడిపోతాయి. అదే విధంగా ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలకు చేరుకొంటాయి. ఈ విషయంలో బలంగీర్ జిల్లాలోని టిట్లాగర్హ్ ప్రాంతంలో ఇవి రెండూ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ పట్టణంలో చిన్న కొండ మీద ఉన్న శ్రీ ధవళేశ్వర మహాదేవ్ మందిరంలో మాత్రం ఏ  కాలంలో అయినా చల్లగా ఉంటుంది. వెలుపల యాభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా లోపల మాత్రం పదిహేను డిగ్రీలు ఉండటం చెప్పుకోవలసిన అంశం. చలి కాలంలో అయితే రగ్గులు కప్పుకోవాలి అంటారు. మహేశ్వరుని నివాసం మంచు కొండలు కదా !
పది అడుగుల ఎత్తు యాభై అడుగుల వెడల్పు కలిగిన ఈ గుహాలయం గురించిన విశేషాలు అశోక చక్రవర్తి కాలానికి చెందినవిగా తెలియవస్తోంది. 














ఆలయ గాధ 

 క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన మగధ సామ్రాజ్యాధినేత అయిన అశోకుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో చేసిన సమరాలలో  అతి భయంకరమైనది కళింగ యుద్ధం. సుమారు లక్ష మంది మరణించారని అశోకుడు స్వయంగా వేయించిన శాసనాల ద్వారా అవగతమౌతుంది. అంతకు రెండింతల సంఖ్యలో అశ్వాలు మరియు గజాలు చనిపోయాయి. ఇక గాయపడిన వారి సంఖ్య ఎంత అన్నది లెక్క లేదు. 
తాను సల్పిన చూడలేని కనీసం ఊహించలేని రక్తపాతాన్ని స్వయంగా చూసిన మౌర్య చక్రవర్తి తట్టుకోలేక పోయాడు. నాటి నుండి ఆయన అహింసావాదిగా మారిపోయారు. బౌద్ధమతాన్ని స్వీకరించారు. కళింగ యుద్ధమే ఆయన చేసిన ఆఖరి యుద్ధంగా అభివర్ణిస్తారు చరిత్రకారులు. 
విజయం వరించినా వివరించలేని విచారాన్ని అనుభవిస్తూ తిరుగు ప్రయాణం అయిన అశోకుడు మార్గమధ్యంలో ఇక్కడి కుమహదా పర్వత పాదాల వద్ద విడిది చేశారట. 











భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రాంతమంతా కలయ తిరుగుతున్న సైనికులకు కొన్ని గుహలు కనబడ్డాయట. వాటిల్లో ఒకదానిలో శివ లింగం కనపడినదట. మరో గుహలో తన సహజ క్రూరత్వాన్ని ప్రదర్శించక సాధు జంతువు  మాదిరి ప్రవర్తిస్తున్న పెద్ద పులి కూడా కనపడినదట. 
దీనిని గమనించిన అశోక చక్రవర్తి తాను అహింసావాదిగా మారడానికి తీసుకొన్న నిర్ణయానికి సర్వాంతర్యామి ఆశీస్సులుగా భావించి పూజాదులు నిర్వహించి, గుహ వెలుపల చిన్న మండపాన్ని నిర్మించి నిత్య పూజలు చేయడానికి కావలసిన ధనసహాయం ఏర్పాటు చేసి వెళ్లిపోయారట. 
నాడు పులి కనపడిన గుహను పులి గుహ అని పిలుస్తారు నేటికి.  









టిట్లాగర్హ్ రైల్వే స్టేషన్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది "కుమహదా పర్వతం". పచ్చదనం ఏమాత్రం ఉండకుండా నున్నగా ఉండే ఈ పర్వతం రెండు అంచెలలో ఉంటుంది. కొండ పక్కన పట్టణానికి మంచి నీటిని అందించే పెద్ద చెరువు ఉంటుంది.  
పర్వత పాదాల వద్ద ఎత్తైన చెట్లు పచ్చదనాన్ని, చల్లని గాలి, నీడలను అందించడమే కాకుండా పరిసరాలను ఆకర్షణీయంగా చేశాయి. రాష్ట్ర పర్యాటక శాఖ వారు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జలక్రీడలు ఏర్పాటు చేస్తుంటారు. అలానే ఒక చక్కని ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
తోలి అంచెలో ఉన్న మందిరాన్ని చేరుకోడానికి సుమారు యాభై మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఆలయానికి వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దె మీద స్వామివారి వాహనం అయిన శ్రీ నందీశ్వరుడు ప్రభువు ఎప్పుడు పిలుస్తారా అన్నట్లుగా ఏకాగ్ర చిత్తంతో ఆలయం వంకే చూస్తుంటారు. 
 









నాడు అశోకుడు గుహకి అనుబంధంగా నిర్మించిన మండపం కాలగతిలో కనుమరుగయ్యింది. స్థానికులు కొత్తగా ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. మండపానికి ముందు పక్క యాగశాల కనపడుతుంది. 
విశాలమైన మండపం గుండా గుహ లోనికి మార్గం ఉన్నది. సుమారు ఎనభై అడుగుల వెడల్పు, యాభై అడుగుల లోతు కలిగిన గుహ మధ్యలో ఎత్తైన పానువట్టం మీద స్వయంభూ లింగాకారంలో శ్రీ ధవళేశ్వర మహాదేవుడు దర్శనమిస్తారు. 
పది అడుగుల ఎత్తు లో ఉండే గుహాంతర్భాగం లోనికి వెళ్ళగానే మంచు పర్వతాలలో శరీరాలను తాకే శీతల పవన స్పర్శ అనుభూతి ప్రతి ఒక్క భక్తునికి అనుభవం అవుతుంది. ఎందుకంత చలి గుహ లోపల ఉంటుందో చెప్పలేకపోయారు. కానీ బయట చమటలు కక్కే వేడి లోపల గజగజ వణికించే చలి. ప్రకృతి పరమాత్మ ఎంత గొప్పవి ! 














ఉపాలయాలలో ఘంటాసిని, తులసి చండి కొలువై ఉంటారు. మెట్ల మార్గంలో పర్వతాగ్రం చేరుకొంటే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం దర్శనమిస్తుంది. నున్నటి రాతి కొండ పై భాగం మీద కురిసిన వానల తాలూకు నీటితో ఒక సహజ కోనేరు ఏర్పడింది. వర్షాలు బాగా కురిస్తే అది నిండి నీరు కొండ క్రిందకు ప్రవహించడం వలన అక్కడ కూడా ఒక చెరువు ఏర్పడినది. దాని క్రింద చాలా ఎకరాలలో పంటలు పండుతున్నాయి. పైనుండి టిట్లాగర్హ్ నగరం మొత్తాన్ని చూడవచ్చును. కొండకు ఒక వైపు పట్టణం మరో వైపు పచ్చని పొలాలు. నాయన మనోహరంగా ఉంటుందా దృశ్యం. 
కొండ పైన ఉన్న కోనేరు పక్కన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ దశరధ రాముని మందిరం నిర్మించారు. అలానే ఒక పక్కన తార తరణి మందిరం కూడా కలదు. 
ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం. నియమంగా నిత్య పూజలు, అభిషేకాలు జరుపుతారు. ముఖ్యంగా శ్రావణ మరియు కార్తీక మాసాలలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీ ధవళేశ్వర మహాదేవుని దర్శనానికి తరలి వస్తుంటారు. మహా శివరాత్రి పర్వదిన సమయంలో మూడు పాటు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. 
దేశంలోని అన్ని ప్రాంతాల నుండి టిట్లాగర్హ్ చేరుకోడానికి రైలు సౌకర్యం కలదు. ఉండటానికి అందుబాటు ధరలలో వసతి మరియు  ఆహార శాలలు లభిస్తాయి. 
ఒక అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించే  అరుదైన ఆలయం టిట్లాగర్హ్ లోని శ్రీ ధవళేశ్వర మహాదేవ్ మందిర్.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...