4, అక్టోబర్ 2020, ఆదివారం

Marundeeshwara Temple, Thirukachur

                 సర్వరోగాలకు మందు ఈ మహేశ్వరుడు 





సింగపెరుమాళ్ కోయిల్ కి సమీపం లోని తిరుకచూర్ క్షేత్రం లోని మరో విశేష దేవాలయం శ్రీ మరుండేశ్వర స్వామి వారు కొలువైనది. ఈ ఆలయం ఉన్న రుద్రగిరి గతంలో అనేక మంది తాపసులకు నిలయంగా పేరొందినది అని పురాతన తమిళ గ్రంధాలు పేర్కొన్నాయి అని తెలుస్తోంది. ఎన్నో ఋష్యాశ్రమాలు ఇక్కడ ఉండేవట. ఎంతో పవిత్ర ప్రదేశంగా ఋషులు భావించిన ఈ క్షేత్ర గాధ దక్ష యజ్ఞం తో ముడి పడినట్లుగా తెలుపుతోంది. 
పిలవని పేరంటానికి పతిదేవుని మాట దాటి వెళ్లిన దాక్షయాణి అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞ గుండలో దూకి ఆత్మాహుతి చేసుకొన్న విషయం మనందరకూ తెలిసినదే ! 
ఆగ్రహించిన పరమేశ్వరుడు వీరభద్రాది గుణాల ద్వారా దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయించి సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని విరాగిగా సంచరించసాగారట. 
ఆయనను తిరిగి మామూలు స్థితికి తీసుకొని రమ్మని ముల్లోకవాసులు శ్రీమహావిష్ణువును ప్రార్ధించారట. అప్పుడు ఆయన తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా విభజించారట. అలా చక్రాయుధ వేగానికి సతీదేవి శరీరభాగాలు పుడమి మీద పలు చోట్ల పడినాయి.  అవే శక్తి పీఠాలుగా పేరొందాయి. అవి మొత్తం యాభై రెండు అని అంటారు. వీటిల్లో ముఖ్యమైనవిగా అష్టాదశ పీఠాలు పేరొందాయి.  
ఆ సమయంలో సతీదేవి చర్మంలోని కొంత భాగం ఈ రుద్రగిరి మీద పడినదట. అమ్మవారి చర్మం పడటం వలన రుద్రగిరి మీద మన్ను,మొక్కలు అన్నీ సంజీవని స్వరూపాలుగా మారిపోయాయట. 
ఎన్నో అపురూప అరుదైన మూలికలు నిలయంగా రుద్రగిరి పేరొందినది అని అంటారు. నేడు రుద్రగిరి కనుమరుగైన దేవాలయంలో ధ్వజస్థంభం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలోని మన్నును సర్వరోగ నివారిణి గా ప్రజలు విశ్వసిస్తారు. 











అసలు "మరుండు" అంటే ఔషధం అని అర్ధం. కొలిచినవారి ఆరోగ్యాన్ని రక్షించే స్వామి అన్న అర్ధంలో శ్రీ మరుండేశ్వర స్వామి అని పిలుస్తారు. ఒకసారి దేవతలా రాజైన దేవేంద్రుని అంతు తెలియని వ్యాధి సంక్రమించిందట. దేవ వైద్యులైన అశ్వనీ దేవతలు ఎన్నో రకాల ఔషధాలను  
ప్రయోగించినా ఫలితం లేకపోయినదట. దిక్కు తోచక ఇంద్రుడు. అశ్వనీ దేవతలు కైలాసానికి వెళ్లి మహేశ్వరుని ప్రార్ధించారట. 
ఆయన వారికి రుద్రగిరి మీద లభించే ఒక మూలిక గురించి తెలిపి దానిని వెలుతురులోనే సేకరించాలని తెలిపారట. భూలోకానికి వచ్చిన దేవవైద్యులు ఎంత వెదికినా సాయం సంధ్యా సమయం లోపల సేకరించలేక పోయారట. చీకట్లు కమ్ముకొనసాగాయిట. అంతట వారు అమ్మలగన్నఅమ్మ లోకనాయకిని ప్రార్ధించారట. రుద్రగిరి మీద పడినది సతీదేవి చర్మం కదా !  
కరుణించిన అమ్మవారు ఆ ప్రాంతమంతా వెలుగులతో నిండిపోయేలా చేసిందట. ఈ కారణంగా ఇక్కడ కొలువు తీరిన అమ్మవారిని "అంజనాక్షి లేదా అంధక నివారిణి" అని పిలుస్తారు. ఈమెను భక్తి శ్రద్దలతో సేవిస్తే జీవితంలో ఆవరించిన కష్టాల చీకట్లు తొలగి వెలుగులు నిండిపోతాయని విశ్వసిస్తారు స్థానికులు. ఆమె సన్నిధి వద్ద నేతి దీపాలను వెలిగించి తమ కష్టాలను తొలిగించమని ప్రార్ధిస్తుంటారు. 
 ఆ వెలుగులలో మూలికను సేకరించడంతో దేవేంద్రునికి స్వస్థత చేకూరిందట. ఆయన వినతి మేరకు స్వామి ఇక్కడ కొలువు తీరారట. కొలిచిన వారి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే వానిగా స్వామిని శ్రీ మరుండేశ్వర స్వామి అని పిలుస్తారు. 
  
 





ఈ క్షేత్రంలో సృష్టి కర్త బ్రహ్మ మరియు ఆయన అర్ధాంగి విద్యల అధిదేవత సరస్వతీ దేవి శ్రీ మరుండేశ్వర స్వామి వద్ద వైద్య  శాస్త్రం అభ్యసించారట. అసుర గురువు శుక్రాచార్యుడు రుద్రగిరి మీద తపస్సు చేసి పరమేశ్వరుని సంతుష్ట పరచి "మృత సంజీవని విద్య"ను తెలుసుకొన్నారట. 
కలియుగ తొలినాళ్లలో ఈ ప్రాంతమంతా భయంకరమైన అంటువ్యాధి ప్రబలి పోయిందట. వేలాదిగా ప్రజలు మరణించసాగారట. 










ప్రజాభిమాని శివభక్తుడైన ఆ ప్రాంత పాలకుడు మునీశ్వరులు సలహా మేరకు శ్రీ మరుండేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేయించారట. నాటి రాత్రి ఆయనకు స్వప్న దర్శనమిచ్చిన స్వామి దేవాలయంలోని ఒక ప్రదేశాన్ని చూపి అక్కడ ఉన్న మట్టిని ఔషధంగా స్వీకరిస్తే వ్యాధి బారి న  పడరని  స్వస్థత చేకూరుతుందని తెలిపారట. ఆప్రకారం చేయగా కొద్దీ రోజుల లోనే వ్యాధి అంతరించి పోయింది. అప్పుడు లోకేశ్వరుడు రాజుకు చూపిన స్థలం నేటికీ ఉన్నది. ధ్వజస్థంభం వద్ద ఉన్న ఈ స్థలం నుండి భక్తులు అనారోగ్య నివారణకు మన్ను తీసుకొని వెళుతుంటారు.  











సుమారు ఒక ఎకరా విస్తీర్ణంలో చోళ రాజులు నిర్మించిన ఈ ఆలయం సుమారు క్రీస్తు శకం ఏదో శతాబ్దానికి చెందినది అంటారు. అనంతర కాలంలో నాయక రాజులు ఆలయానికి మర్మత్తులు చేయించి కొన్ని నూతన నిర్మాణాలను చేసినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 








రాజ గోపురం లేని తూర్పు ద్వారం గుండా వెళితే నేరుగా గర్భాలయానికి చేరుకోవచ్చును. గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ మరుండేశ్వర స్వామి పూజలందుకొంటుంటారు. అమ్మవారు అంజనాక్షి ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. నవగ్రహ మండపంతో సహా శ్రీ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి ఉపాలయాలలో దర్శనమిస్తారు. 
తమిళనాడులో గర్భాలయానికి ఉత్తర భాగాన దక్షిణ ముఖంగా శ్రీ చెండికేశ్వరుడుప్రత్యేక సన్నిధిలో కొలువై కనిపిస్తారు. ఆయన వద్ద భక్తులు తమ గోత్రనామాలను చెప్పుకొని తమ కోరిక విన్నవించుకొంటారు . ఆలా చేయడం వలన మనోభీష్టం శీఘ్రగతిన ఈడేరుతుందని విశ్వసిస్తారు. 
ఈ ఆలయంలో కూడా శ్రీ చెండికేశ్వరుడు ఉన్నారు. కానీ అయన చతుర్ముఖునిగా కనిపిస్తారు. ఇలా నాలుగు ముఖాలు కలిగి ఉన్న చండికేశ్వరుని మరెక్కడా చూడలేము. 
ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు గంటల వరకూ తెరిచి ఉండే ఈ ఆలయంలో నియమంగా రోజుకు మూడు పూజలు చేస్తారు. అన్ని పర్వ దినాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు. శ్రీ కచ్చభేశ్వర స్వామి ఆలయానికి ఇది జంట ఆలయం కావడాన రెండు ఆలయాలకు కలిపి చైత్ర మాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. 


నమః శివాయ !!!!  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...