17, ఏప్రిల్ 2018, మంగళవారం

Sri Bhuvaraha Swamy Temple, Srimushnam


             శ్రీ భూవరాహ స్వామి ఆలయం, శ్రీముష్ణం 






ఎన్నో పుణ్య క్షేత్రాలకు నిలయమైన తమిళనాడులోని  క్షేత్రాల పేర్లు అరుదుగా "శ్రీ"తో మొదలవుతాయి. శ్రీ రంగం, శ్రీ విల్లిపుత్తూరు ఇలా కొన్ని మాత్రమే కనపడతాయి. ఆ కోవలోకి వచ్చే మరో క్షేత్రం "శ్రీముష్ణం" (శ్రీముషినం). 



  















ఈ క్షేత్రానికి ఉన్న గొప్పదనం  శ్రీ హరి అవతారరూపము అయిన శ్రీ వరాహ స్వామి కొలువైన అత్యంత అరుదైన ప్రదేశం గానే కాదు శ్రీ మహావిష్ణువు భువిలో స్వయంవ్యక్తగా వెలసిన ఎనిమిది దివ్య ప్రదేశాలలో ఒకటి శ్రీ ముష్ణం.మిగిలిన ఏడు శ్రీ రంగం,తిరుమల,నైమిశారణ్యం, పుష్కర్, బద్రీనాథ్, వనమామలై మరియు ముక్తినాథ్(నేపాల్).శ్రీ వైష్ణవులే కాదు అన్ని సిద్ధాంతాలను అనుసరించేవారు ఈ అష్ట వ్యక్త క్షేత్రాలను సందర్శించడం వలన ముక్తిని పొందవచ్చు అని విశ్వసిస్తారు. 
దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ స్వామికి ఉన్న ఆలయాలు చాలా తక్కువ.వాటిల్లో శ్రీముష్ణం ప్రత్యేకమైనది. కారణం ఏమిటంటే భూదేవిని అపహరించుకొని పోయిన హిరణ్యాక్షుని వైకుంఠవాసుడు భూవరాహ రూపం ధరించి వధించిన స్థలం ఇదే అని అంటారు. 















సాగర జలాల లోనికి వెళ్లి విరాట్రూపం ధరించి అసురుని అంతం చేసి భూమిని తిరిగి ఆదిశేషుని పడగల పైన ఉంచినది యజ్ఞ వరాహ మూర్తి. శ్రీముష్ణం ఆలయంలో ఉత్సవమూర్తి శ్రీ యజ్ఞ వరాహుడే ! చిత్రమైన విషయం ఏమిటంటే శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ యజ్ఞవరాహ స్వామి మానవ వదనంతో చతుర్భుజాలతో సుందరంగా దర్శనమిస్తారు. 
వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు సనకసనందనాదులు శపించడం, వారిని కాపాడటానికి తన శత్రువులుగా జన్మించి మూడు జన్మల తరువాత తిరిగి వైకుంఠం చేరేలా అనుగ్రహించారు శ్రీ మహా విష్ణువు. వారే తొలి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు, రెండో జన్మలో రావణ కుంభకర్ణులు, మూడో జన్మలో శిశుపాల దంతవ్రక్తులు గా జన్మించి, శ్రీమన్నారాయణుని చేతిలో మరణించారు. ఈ ఉదంతం గురించి విష్ణుపురాణం, వరాహపురాణం, భాగవత పురాణం, పద్మ పురాణం, దేవి భాగవతం, వాయు మరియు అగ్ని పురాణాలలో విపులంగా వివరించబడినది అని తెలుస్తోంది. 


















స్థానిక గాధల ప్రకారం శ్రీముష్ణంలో స్వామి మూడు రూపాలలో ఉంటారని అంటారు. మొదటిది ఆలయం వెనక భాగాన ఉన్న "నిత్య పుష్కరణి".  శ్రీవారు రాక్షసునితో తలపడినప్పుడు శరీరం నుండి వెలువడిన స్వేదంతో ఏర్పడినట్లుగా చెబుతారు.మూలవిరాట్టుకు చేసే నిత్య తిరుమంజనం(పవిత్ర స్నానం) ఈ నీటి తోనే జరుపుతారు. స్వామివారి కంటి నుండి వెలువడిన తేజస్సు వలన  జన్మించిన అశ్వద్ధ వృక్షం  రెండవది. ఆలయ వృక్షం కూడా అశ్వద్ధమే ! గర్భాలయంలో కొలువైన అర్చనామూర్తి మూడవది. 
వివాహ ఘడియలు ఆలస్యం అవుతున్నయువతీయువకులు అదే విధంగా సంతానం లేని దంపతులు కోనేరులో స్నానం ఆచరించి, వరాహ కవచం పఠిస్తూ ఒడ్డున ఉన్న అశ్వద్దవృక్షానికి పన్నెండు ప్రదక్షణాలు చేస్తే ఆశించిన ఫలితాలు పొందుతారన్నది తరతరాల నమ్మకం. అశ్వద్దవృక్షం క్రింద శ్రీ అశ్వద్దనారాయణ స్వామి కొలువై ఉంటారు. ఆలయం చుట్టూ లెక్క లేనన్ని నాగప్రతిష్టలు కనపడతాయి.రాహుకేతు గ్రహాల వక్ర దృష్టితో ఇక్కట్లు ఎదుర్కొంటున్న     వారు ఈ విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ కారణంగా శ్రీముష్ణం రాహుకేతు పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి. ఇక్కడే అరుదైన ఉపస్థిత శ్రీ రామ చంద్రమూర్తి ఆలయం ఉంటుంది. సీతాదేవి శ్రీరాముని వామాంకం మీద కూర్చొని దర్శనం ప్రసాదిస్తారు. 



















ప్రముఖ శ్రీవైష్ణవ గురువులు శ్రీ మానవళ మహర్షి ఈ క్షేత్రంలో కొంతకాలం నివసించారని, క్షేత్ర అభివృద్ధికి పాటుపడ్డారని తెలియవస్తోంది. ప్రముఖ మధ్వాచార్యులు అవతార పురుషులు అయిన శ్రీ రాఘవేంద్రస్వామి సుమారు పన్నెండు సంవత్సరాలు శ్రీ భూవరాహస్వామిని ఆరాధించినట్లుగా తెలుస్తోంది. అప్పుడు ఆయన నివసించిన గృహాన్ని ప్రస్తుతం మందిరంగా మార్చారు శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర మఠం వారు.  
హొయసల రాజులు నిర్మించిన ఆలయాన్ని మధురై ని పాలించిన నాయక రాజులు పునః నిర్మించి అభివృద్ధి పరిచినట్లుగా శాసనాల ఆధారంగా తెలుపుతున్నాయి. మహా మండపంలో కుటుంబ సభ్యులతో సహా అనంతప్ప, అచ్యుతప్ప, గోవిందప్ప మరియు కొండప్ప నాయక విగ్రహాలను వీక్షించవచ్చును. చక్కని విజయనగర శిల్పాలకు నిలయమీ ఆలయం. 
ప్రాంగణంలో శ్రీ మానవుల మహర్షి, శ్రీ సంతాన వేణుగోపాలస్వామి, సప్త మాతృకలు సన్నిధులు ఉంటాయి. అమ్మవారు శ్రీ అంబుజవల్లీ తాయారు తూర్పు ముఖంగా ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. గర్భాలయంలో శ్రీ భూవరాహ స్వామి రెండు అడుగుల ఎత్తు సాలగ్రామ శిలా విగ్రహ రూపంలోనడుము మీద చేతులను పెట్టుకొని దక్షిణ దిక్కును చూస్తూ దర్శనం ఇస్తారు. మానవ శరీరం, వరాహ శిరస్సుతో జీవం ఉట్టిపడుతుంటుందీ విగ్రహం. 







































నిత్య పుష్కరణి ఒడ్డున శ్రీ భూవరాహ స్వామి ఆలయానికి వెనుక తూర్పు ముఖంగా పురావస్తు శాఖ వారి నిర్వహణలో ఉన్న శ్రీ నీతేశ్వర స్వామి వారి పురాతన ఆలయం ఉంటుంది.
చైత్ర మాసంలో పది రోజుల పాటు ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో నిర్దేశిత పూజలను నియమంగా జరుపుతారు.
శ్రీముష్ణం చిదంబరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వృద్ధాచలం నుండి కూడా చేరుకోవచ్చును. కానీ చిదంబరం నుండి రావడమే ఉచితం. ప్రతి అరగంటకు ఒక బస్సు ఉన్నది. ఉండటానికి చిదంబరంలో నటరాజ స్వామి ఆలయం, బస్సు స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ దగ్గర అందుబాటు ధరలలో వసతి సౌకర్యాలు లభిస్తాయి. చిదంబరానికి చెన్నై, మధురై, తిరుచ్చి నుండి నేరుగా చేరుకోడానికి రైలు మరియు బస్సులు ఉన్నాయి. 
చిదంబరం వెళ్లే ప్రతివొక్కరూ ఈ అరుదైన స్వయంవ్యక్త క్షేత్ర దర్శనం చేసుకోవడం అభిలషణీయం. 

ఓం నమో నారాయణాయ !!!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...