పుదుచ్చేరి ఆలయాలు
భారత దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలన్నీపర్యాటకంగా మంచి గుర్తింపుగలిగినవి. గోవా, అండమాన్ నికోబార్ ద్వీపాలు, చండీగఢ్ ఇలా ప్రతి ఒక్కటి దేశవిదేశాల పర్యాటకులను తమవైన వివిధ రకాల ప్రత్యేకతలతో ఆకర్షిస్తున్నాయి.
గోవా తరువాత దక్షిణాదిన ఉన్న పుదుచ్చేరి (పాండిచ్చేరి) సుందర సాగర తీరాలతో, విశిష్ట నిర్మాణ శైలిలో ఫ్రెంచి వారి హయాంలో నిర్మించిన ప్రార్థనాలయాలు, గృహాలతో దశాబ్దాలుగా పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా బెంగాలీయులు మరియు విదేశీయులు శ్రీ అరబిందో బోధనలకు ప్రభావితులై వస్తుంటారు.
పుదుచ్చేరిలో ప్రతి ఒక్క హిందువు తప్పక దర్శించుకునే శ్రీ మనకుల మహాగణపతి ఆలయానికి అత్యంత సమీపంలో శ్రీ అరబిందో ఆశ్రమం ఉంటుంది. శ్రీ మహాగణపతి ఆలయం కాక పుదుచ్చేరి నగరంలో ఉన్న పురాతన ప్రముఖ ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అవి శ్రీ వరదరాజ పెరుమాళ్ కోవెల, శ్రీ వేదపురేశ్వర స్వామి, శ్రీ కోకిలాంబాల్ సమేత శ్రీ తిరుకామేశ్వర స్వామి ఆలయం, విల్లియనూర్ (10 కిలోమీటర్లు), శ్రీ జయమంగళ పంచ ముఖ ఆంజనేయ ఆలయం, పంచవటి (పది కిలోమీటర్లు, విల్లుపురం దారిలో) . మనకుల మహాగణపతి ఆలయ విశేషాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి). ఇవే కాకుండా మరెన్నో విశేష ఆలయాలు పుదుచ్చేరి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ప్రముఖ క్షేత్రాలైన చిదంబరం, కుంభకోణం, తిరువణ్ణామలై లను పుదుచ్చేరి నుండి రైలు లేదా రహదారి మార్గంలో సులభంగా చేరుకోవచ్చును.
శ్రీ వేదపురీశ్వర స్వామి ఆలయం
శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం పక్కనే అదే మాదిరి రాజగోపురం తో నిర్మించబడినది శ్రీ వేదపురీశ్వర స్వామి ఆలయం. మూడు శతాబ్దాల క్రిందట స్థానిక భక్తులు నిర్మించుకున్న ఈ ఆలయం కూడా కాల ప్రవాహంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లుగా చరిత్ర తెలుపుతోంది.
పెరుమాళ్ ఆలయం కన్నా విశాలమైన ప్రాంగణం లో నిర్మించబడిన ఈ ఆలయంలో శ్రీ చిందబర నటరాజ, శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ దక్షిణామూర్తి,శ్రీ వినాయక మరియు శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి ఉపాలయాలు నెలకొల్పబడినాయి. ఆలయ గోడలు,
పైకప్పు శివ లీలల వర్ణచిత్రాలతో నిండిపోయి ఉంటాయి.
గోపురాలన్నీ వర్ణభరితమై దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. పార్వతీ అమ్మవారు ప్రత్యేక సన్నిధిలో భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. స్వామి శ్రీ వేదపురీశ్వర లింగ రూపంలో గర్భాలయంలో విభూతి, కుంకుమ, చందన లేపనాలతో పుష్ప మాలలను ధరించి కొలువై ఉంటారు.
భక్తులు తమ జీవితాలు సుఖమయంగా సాగాలన్న ఆకాంక్షతో స్వామివారికి పన్నీరు, విభూతి, చందనం, గంగాజలం, కొబ్బరి నీరుతో అభిషేకం జరిపించుకొంటారు. శివరాత్రీ, కార్తీక మాస పూజలు, వినాయక చవితి, శ్రీ సుబ్రమణ్య షష్టి విశేషంగా నిర్వహిస్తారు. గురువారాలు శ్రీ దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేకం,పూజలు జరుగుతాయి. త్రయోదశి నాడు జరిగే ప్రదోష పూజలలో ఎందరో భక్తులు పాల్గొంటారు.
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరిచి ఉంటుందీ ఆలయం.
శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం
ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట నిర్మించబడిన ఆలయంఈ సుదీర్ఘ కాలం లో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తొలుత మహ్మదీయుల తరువాత ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయుల దండయాత్రలలో శిధిలమైనది. భక్తులు ప్రధాన అర్చనా మూర్తులను
శత్రువులకు తెలీయకుండా దాచి పెట్టడం జరిగింది. పందొమ్మిదో శతాబ్దంలో తిరిగి పునఃనిర్మించబడిన ఆలయం నేడు ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది.
గర్భాలయంలో శ్రీ వరదరాజ పెరుమాళ్ స్థానిక భంగిమలో శంఖుచక్రాలు, గద ధరించి అభయ ముద్రతో, వర్ణమయ పుష్పాలంకరణతో నేత్రపర్వంగా కనపడతారు. అమ్మవారు శ్రీ పేరిందేవి ప్రత్యేక సన్నిధిలో కొలువు తీరి ఉంటారు. పరివార దేవతలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయుడు విడిగా కొలువై ఉంటారు. స్వామి వారి "ఊంజల్ సేవ" నిమిత్తం ప్రత్యేకంగా మండపం నిర్మించారు.
ఆలయ పైకప్పుకు సుందర చిత్రాలను చిత్రీకరించారు. గోడలపైన నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాల మూలవిరాట్టుల చిత్ర పటాలను అలంకరించారు. మొత్తం నూటఎనిమిది పెరుమాళ్ళను ఒకే సారి దర్శించుకునే అత్యంత అరుదైన అవకాశం లభిస్తుంది. గోదాపరిణయ చిత్రాలు చాలా సుందరంగా చిత్రించారు.
శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో శ్రీ రామనవమి, శ్రీ కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు.
భక్తులు తమ బిడ్డలకు అన్నప్రాసన శ్రీ వరద రాజ పెరుమాళ్ సమక్షంలో చేసుకోడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పెరుమాళ్ కృపతో వారి భావి జీవిత ఉన్నతంగా సాగుతుందని విశ్వసిస్తారు. భక్తులు గ్రహరీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల నుండి బయటపడటానికి స్వామివారికి తిరుమంజనం (అభిషేకం),పాయసం, తులసి మాలలను సమర్పించుకొంటుంటారు.
ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఈ ఆలయం మహాత్మా గాంధీ (M G) రోడ్ లో ఉంటుంది.
పుదుచ్చేరిలోని వాతావరణం కూడా యాత్రీకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సముద్ర తీరాన ఎన్నో పురాతన ఫ్రెంచ్ వారి నిర్మాణాలు ఆకర్షిస్తాయి. స్థానికంగా చక్కని వసతి ఆహార సదుపాయాలు లభిస్తాయి. చెన్నై నుండి బస్సులు లభిస్తాయి. మనరాష్ట్రం నుండి కూడా నేరుగా పాండిచ్చేరి కి లేదా దగ్గర లోని విల్లుపురానికి నేరుగా రైలు సౌకర్యం కలదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి