11, జూన్ 2016, శనివారం

Ganga Harathi, Varanasi

                                     గంగా హారతి - వారణాసి 

గంగ సాక్షాత్తు సదా శివుని శిరస్సు నుండి భువికి ప్రవహించిన పవిత్ర  తల్లి. 
ఈ పేరు ఎంతటి గొప్పదంటే సాధారణ జలాన్ని కూడా గంగ అని పిలిచేంత !భూమి  నివసించే సకల ప్రాణులకు అవసరమైన పంచ భూతాలలో అత్యంత ముఖ్యమైనది గంగే ( నీరు)!!









 హిమాలయాలలో ఉద్భవించిన గంగోత్రితో తొలుత భాగీరధి తరువాత అలక నంద కలువడం వలన అఖండ గంగా ప్రవాహం ప్రారంభం అవుతుంది. తన ప్రవాహ మార్గమైన రెండువేల అయిదువందల కిలోమీటర్ల  పైచిలుకు  యమునానదితో సహా ఎన్నో ఉపనదులను తనలో కలుపుకొని సాగే గంగ భవాని భారత మరియు బంగ్లా దేశాలలో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తోంది.


















ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించే గంగమ్మ తల్లి తీరాలలో మహోన్నత పుణ్య క్షేత్రాలైన హరిద్వార్, ప్రయాగ,వారణాసి లాంటివి నెలకొని ఉన్నాయి.
పవిత్ర గంగలో స్నానమాడి పరమాత్మను సేవించుకొంటే సకల జన్మల  స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు భారతీయులు. అంతే కాదు గతించిన తమ పూర్వీకులకు  ప్రయాగలో,వారణాసి లలో వారి ఆస్థి నిమజ్జనం లేదా పిండ తిల దానం చేస్తే వారికీ సద్గతులు లభిస్తాయన్నది హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరి నమ్మకం.
ఈ నమ్మకానికి కారణం గంగ దివి నుండి భువికి తరలిరావడానికి సంబంధించిన పురాణ గాధ !!










సూర్య వంశానికి చెందిన "సగరుడు " అనే రాజు ఎక్కడ తన స్థానానికి ఎదుగుతాడో అన్న భయంతో ఇంద్రుడు అతని యాగాశ్వాన్ని పాతాళం లోని కపిల మహర్షి తపస్సు చేసుకొంటున్న గుహలో దాచాడు.
సగరుని అరవై వేల మంది కుమారులు ఎన్నో ప్రాంతాలలో అన్వేషించి చివరికి పాతాళం చేరుకొన్నారు. అక్కడ దీర్ఘ తపస్సులో ఉన్న మహర్షిని పక్కనే ఉన్న అశ్వాన్ని చూసి ఆయనే దొంగ అని దుర్భాషలు ఆడారు. వారి చేష్టలకు దీక్ష సడలిన మహాముని కళ్ళు తెరవగా వెలువడిన అగ్ని మూలంగా రాకుమారులు అందరూ బూడిద అయ్యారు.
వారి తండ్రి, తదనంతర వారసులు వారికి పుణ్య లోకాలు లభించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు. చివరికి భగీధరుదు గంగను, మెప్పించి, శివానుగ్రహంతో దివిజ గంగను భువికి తీసుకురాగాలిగాడు.
తన వారు  సద్గతులు పొందేలా చేసాడు.













అలా నాటి నుండి సదా శివుని జటా జూటాల నుండి జాలువారిన గంగ అత్యంత పవిత్రమైనదిగా భావించడం ప్రారంభించారు భూలోక వాసులు.
పూజలు, హారతులు,ఇలా ఎన్నో ఆ నదీమ తల్లికి చేయడం మొదలయ్యింది.
అలాంటి వాటిల్లో "గంగా హారతి" ఒకటి.
ఏనాటి నుండో హరిద్వార్ లో నిర్వహిస్తున్నారు.










సప్త ముక్తి స్థానాలలో ఒకటిగా, పరమేశ్వరుడే కాశి తన శాశ్విత నివాసం అని ప్రకటించిన వారణాశి లో కూడా హారతి ఇవ్వడం ఆరంభించారు.
సుమారు నలభై అయిదు నిముషాల పాటు జరిగే ఈ గంగా హారతి ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణం నింపుకొని, వీక్షకుల హృదయాలలో అనిర్వచనమైన ఆనంద భరితమైన క్షణాలను శాశ్వితంగా నిలుపుతుంది.











ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల నలభై అయిదు నిముషాలకు గంగా హారతి ప్రారంభం అవుతుంది. దీనికి వేదిక వారణాశి లోని ఎనభై ఏడు ఘాట్లలో ప్రముఖమైన అయిన దశాశ్వమేద ఘాట్.
కాశీ నగరం లోనికి ప్రవేశిస్తున్న విశ్వేశ్వరునికి విధాత బ్రహ్మ ఈ ఘాట్ లోనే స్వాగతం పలికారని పురాణాలు తెలుపుతున్నాయి.










ధూపం, దీప హారతి, పుష్పాంజలి, చామర సేవ ఇలా రాగయుక్తంగా సాగే గానానికి అనుగుణంగా లయబద్దంగా సాగే గంగా హారతిని చూడటానికి వేలాదిగా యాత్రికులు ఆ సమయానికి ఘాట్ లోని మెట్లను, నదిలో నిలిపిన పడవలను ఆక్రమిస్తారు.

















కాశీలో గంగ స్నానం, విశ్వేశ్వరుని సందర్శనం, గంగా హారతి వీక్షణం  సమస్త పాప సంహారం. 
ఇహ పర సుఖ ప్రదం. 
మోక్ష దాయకం !!!!

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...