10, జూన్ 2016, శుక్రవారం

Bodh Gaya

                                             బౌద్ద గయ 

గౌతమ బుద్దుడు. 
పేరొందిన ఆధ్యాత్మిక గురువులలో ప్రధమ స్థానం పొందిన పేరు. 
క్రీస్తు పూర్వం అయిదు మరియు నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో తన శిష్య ప్రశిష్యుల ద్వారా భారత దేశంతో సహా పెక్కు దేశాలలో తాను ప్రవచించిన సిద్దాంతాలను వ్యాపింప చేసి ప్రభువుల దగ్గర నుండి సామాన్యుల వరకూ ప్రభావితం చేసినవాడు. 
కపిలవస్తు దేశ రాజకుమారునిగా జన్మించిన సిద్దార్ధుని, తండ్రి శుద్దోధనుడు చిన్న కష్టం కూడా తెలియకుండా పెంచాడు. 
వివాహం చేసుకొని ఒక బిడ్డకు తండ్రి అయిన తరువాత ఒకనాటి నగర విహార సమయంలో సామాన్యుల కష్టాలను స్వయంగా చూసి విరక్తి చెంది జ్ఞానాన్వేషణ కోసం రాజప్రాసాదాన్ని ఒదిలి పెట్టాడు సిద్దార్ధుడు.
మహాభినిష్క్రమణ తరువాత సిద్దార్ధుడు ఇద్దరు గురువుల వద్ద శిష్యరికం చేసారు. వారు "అలరకలమ మరియు ఉదక రామపుత్త " వీరిరువురూ అతి దీక్ష పట్టుదలలకు, జిజ్ఞాసకు సంతృప్తి చెంది తమ గురు పీఠాన్ని అందించడానికి సిద్దపడ్డారు. కానీ సిద్దార్ధుడు సంతృప్తి చెందక "కౌండిన్యుడు" అనే యోగి వద్ద కొంత సమయం యోగ విద్య అభ్యసించాడు.
అది కూడా సరి అయిన మార్గం కాదు అన్న తలంపుతో ఆశ్రమాన్ని వీడి గయ చేరుకొని భోధి వృక్షం క్రింద ధ్యానం చేసి జ్ఞానం సాధించాడు.
   











మొత్తం నలభై తొమ్మిది రోజులలో లభించిన అనుభూతుల సారాన్ని మొట్టమొదటగా "భల్లాక మరియు తపుస్సా" అనే ఇద్దరు వ్యక్తులకు ఉపదేశించాడు.
అలా సిద్దార్ధుడు బుద్ధునిగా మారిన ప్రదేశమే "బౌద్ద గయ."
బౌద్ద మతాన్ని అనుసరించేవారికి బౌద్ద గయ అత్యంత పవిత్రమైన నాలుగు ప్రదేశాలలో ముఖ్యమైనది.
మిగిలిన మూడు " లుంబిని, సారనాథ్ మరియు కుషినగర్ "









లుంబిని సిద్దార్ధుని జన్మస్థానం, సారనాథ్ తొలిసారిగా బుద్ధునిగా మారిన సిద్దార్ధుడు తనతో పాటు కౌండిన్యుని వద్ద శిష్యరికం చేసిన అయిదుగురికి ఉపదేశం చేసిన స్థలం కాగా కుషి నగర్ లో బుద్దుడు నిర్యాణం చెందిన ప్రదేశం.
లుంబిని నేటి నేపాల్ లో, సారనాథ్ వారణాశి కి సమీపంలో, కుషి నగర్ ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్  కు సమీపంలో ఉన్నాయి.









విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ బౌద్ద గయలో ఎన్నో చిన్న చిన్న స్థూపాలు నిర్మించబడినాయి.
వీటి మీద చెక్కిన ధ్యానంలో ఉన్న సూక్ష్మ బిక్షువుల రూపాలు అబ్బుర పరుస్తాయి.
సిద్దార్ధుడు ధ్యానం చేసిన భోధి వృక్షం మహా భోధి ఆలయం వెనుక ఉంటుంది. ఈ పవిత్ర చెట్టు క్రిందనే ప్రతి నిత్యం సంఘ సమావేశాలు నిర్వహిస్తుంటారు.
ఇక్కడే సిద్దార్ధుడు ఎక్కడక్కడ తన ధ్యానం సందర్భంగా గడిపారో తెలిపే సూచికలను ఏర్పాటు'చేసారు.




















ప్రధానమైన నిర్మాణమైన మహా భోధి ఆలయాన్ని బుద్దుని నిర్యాణం తరువాత మూడు శతాబ్దాలకు ఈ ప్రాంతాన్ని సందర్శించిన అశోక చక్రవర్తి తొలి సారిగా నిర్మించినట్లుగా తెలుస్తోంది.
తదనంతరం తొలి శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన "కుషాన్"వంశరాజులు పునఃనిర్మించినట్లుగా చరిత్ర కారులు భావిస్తున్నారు.
పాత నిర్మాణాలకు తగిన మరమత్తులు చేసి పరిరక్షించి నేటి స్థితిలో ఉండటానికి తగిన పరిశ్రమ   ఆంగ్లేయుడైన   "కేన్నిగ్ హాం " చేసాడు.









యాభై అయిదు మీటర్ల ఎత్తైన ఈ ఆలయ ప్రధాన గోపురం చాలా దూరానికి కనపడుతుంది. వెలుపల గోడలపైన బుద్దుని జీవిత విశేషాలను తెలిపే శిల్పాలను అమర్చారు.
అంతర భాగంలో ఎత్తైన గద్దె మీద ధ్యాన ముద్రలో ఉన్న బుద్దుని విగ్రహం సందర్శకులకు అమిత శాంతిని ప్రసాదిస్తుంది. ప్రాంగణమంతా నెలకొని ఉండే ప్రశాంత మౌన వాతావరణం మరింత శాంతిని పొందడానికి దోహదం చేస్తుంది.










ప్రాంగణంలో ఎందరో స్థానిక మరియు విదేశీ బిక్షువులు నిరంతరం ప్రార్ధనలతో, ధ్యానంతో గడుపుతుంటారు.
తమ ప్రాంతములో అవలంభించే ఆరాధనా విధానాలతో తమ ఆర్యాధ్య మార్గదర్శకుని సేవించుకొంటుంటారు.
తమను సన్మార్గంలో నడిపించే మార్గదర్శకాలను రూపొందించిన బుద్దుని, ఇతర బిక్షువులను మనసులో నిలుపుకొని, ధ్యానంలో కాలం గడిపే వారిని చూస్తే వారి విశ్వాసానికి, శ్రద్దా దీక్షలకు చకితులము అవుతాము.































ప్రాంగణాన్ని అత్యంత శుభ్రంగా ఉంచుతారు. ప్రతి నిత్యం బిక్షువులే నీటితో ఆలయాన్ని, పరిసరాలను కడుగుతారు.



















































శాంతి భోదకునికి అంజలి ఘటిస్తున్నశాంతి కపోతం 
















మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో బౌద్ద మతం అనుసరించబడుతోంది. ఆ దేశాలన్నీ తమ మఠాలను బౌద్ద గయలో ఏర్పాటు చేసుకొన్నాయి.
ఆయా దేశాల నిర్మాణ శైలిలో ఉండే ఈ నిర్మాణాలు సందర్శకులను ఆకట్టుకొంటాయి.
నేపాల్, శ్రీ లంక, జపాన్, చైనా, మలేషియా, భూటాన్, థాయిలాండ్, వియత్నాం ఇలా ఎన్నో దేశాల మఠాలు ఉన్నాయి.
వీటన్నింటి లోనికి చైనా మఠం లో ఉన్న బుద్దుని విగ్రహం రెండు వందల సంవత్సరాల నాటిదిగా చెబుతారు. చినా లోనే తాయారు చేసి ఇక్కడికి తెచ్చినట్లుగా తెలుస్తోంది.















చైనా మతం లోని బుద్దుని విగ్రహం 






ఈ మఠాలను సందర్శించుకొంటూ వెళితే 1989లో ప్రతిష్టించబడిన ఎనభై అడుగుల తధాగతుని రాతి విగ్రహం చేరుకోవచ్చును.
తొలి సారి బోధనలను అందుకొన్న అయిదుగురు శిష్యులతో పాటు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం దర్శకులను ఆకర్షిస్తుంది.

















ప్రతినిత్యం ప్రపంచ నలుమూలల నుండి దేశీయ, విదేశీయ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. 
ఈ ప్రశాతః వాతావరణంలో అంతులేని శాంతిని అనుభవిస్తుంటారు. 
బీహార్ రాష్ట్రం లోని గయ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌద్ద గయ ను పాట్నా నుండి లేదా గయ నుండి సులభంగా చేరుకో వచ్చును. 
అన్ని రకాల వసతి సదుపాయాలూ ఇక్కడ లభిస్తాయి. 








శాంతి భోదకునికి అంజలి ఘటిస్తున్నశాంతి కపోతం 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...