24, మే 2016, మంగళవారం

Sri Baidyanath Dham, Deogarh

                                  శ్రీ వైద్యనాధ్ ధామం, దేవ్ ఘర్ 

            


ఆత్మ స్వరూపునిగా పురాణాలు కీర్తించే సర్వేశ్వరుడు ఎన్నో పవిత్ర స్థలాలలో లింగ రూపంలో స్థిర నివాసము ఏర్పరుచుకొని భక్తుల ప్రార్ధనలను ఆలకిస్థున్నారు.
పంచ భూత స్థలాలు, పంచ నాట్య సభలు, అష్ట వీరట్ట స్థలాలు, పంచారామాలు, పంచ క్రోశ ఆలయాలు, సప్త విదంగ క్షేత్రాలు, పంచ బ్రహ్మ క్షేత్రాలు, సప్త స్థాన స్థలాలు, నవ నందులు, నవ కైలాసాలు ఇలా ఎన్నో !
ఇవన్ని నయమ్మారులు గానం చేసిన తేవరాల ద్వారా పడాల్ పెట్ర మరియు తేవర వైప్పు స్థలాల్లో శాశ్వత స్థానం పొందినవే !
వీటన్నిటికన్నాహోదాలో పై స్థాయిలో ఉన్నవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. కారణం ఆయా క్షేత్రాలలో  స్వామి స్వయంభూ గా ఉద్భవించడమే !




సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువులకు తామిద్దరిలో ఎవరు గొప్ప అన్న సందేహం తలెత్తి వివాదంగా మారింది. 
ముదిరి వాదులాటగా మారుతున్న వేళ  ఇద్దరి మధ్యన ఆద్యంతాలు లేని జ్యోతి ఒకటి వెలసింది. 
తన మూలాన్ని గానీ లేక తన పై భాగాన్ని కానీ ఎవరు దర్శించుకొని ముందుగా వస్తారో వారే గొప్ప అని తెలిపారు. 
శ్రీహరి భూ వరాహ రూపం ధరించి పాతాళం లోనికి వెళ్ళగా, విధాత తన హంస వాహనం మీద గగనతలం పైకి ఎగిరి వెళ్ళాడు.  






ఇద్దరికీ తమ గమ్యాలను చేరడం సాధ్యం కాలేదు. శ్రీమన్నారాయణుడు తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకొన్నారు. 
కానీ కమలాసనుడు తాను జ్యోతి అగ్ర భాగాన్ని చూసాను అని సాక్ష్యంగా మొగలి పువ్వును చూపారు. ఆగ్రహించిన కపర్ది భూలోకంలో సృష్టి కర్తకు భూలోకంలో  పూజార్హత లేదని, మొగలిని పూజకు పనికి రాని పువ్వు అని శాపం ఇచ్చారు. విధాత మరియు శ్రీ హరి, సకల దేవతల, మహర్షుల, మునుల కోరిక మేరకు పరమేశ్వరుడు పర్వత రూపంలో భువిలో స్థిర నివాస మేర్పరచు కొన్నారు. 
అదే తిరువన్నమలై ( అరుణాచలం). 
అనంతర కాలంలో  ప్రత్యేక కారణాలతో మహేశ్వరుడు  జ్యోతి రూపంలో సాక్షాత్కరించి వెలసిన కొన్ని స్థలాలను జ్యోతిర్లింగ క్షేత్రాలుగా  నిర్ణయించారు. 
గతంలో అవి అరవై నాలుగుగా ఉండేవట.  కలియుగానికి పన్నెండుగా మిగిలాయని తెలుస్తోంది. వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పేర్కొన్నారు.  






అవి వరసగా సోమనాథ్(గుజరాత్), శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్), మహాకాలేశ్వరం (ఉజ్జయిని, మధ్య ప్రదేశ్), ఓంకారేశ్వర్ (మధ్య ప్రదేశ్), కేదారనాథ్ (ఉత్తరా ఖండ్), భీమేశ్వరం(పూణే, మహారాష్ట్ర), వారణాశి (ఉత్తర ప్రదేశ్), త్రయంబకేశ్వరం (నాసిక్, మహారాష్ట్ర), నాగేశ్వరం (ద్వారకా, గుజరాత్), రామేశ్వరం (తమిళనాడు ), గృహ్నేశ్వరం (మహారాష్ట్ర)
మరియు వైద్యనాధ్  ధామం ( దేవ ఘర్, ఝార్ఖండ్).





మిగిలిన పదకొండు క్షేత్రాలలో లేని కొంత సందిగ్ధ పరిస్థితి వైద్యనాధ్ ధామం స్థల నిర్ణయం విషయంలో నెలకొని ఉన్నది. మహారాష్ట్రలోని పర్లి లో గల ఆలయాన్ని కూడా వైజ్యనాథ్ ధామం గా పిలుస్తారు. దానినే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని స్థానికులు వాదిస్తారు.
కాకపోతే శివ పురాణం, భవిష్య పురాణం, మత్స్య పురాణం, దేవీ భాగవతం తో పాటు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు రచించిన శ్లోకాల ఆధారంగా ఝార్ఖండ్ లో ఉన్న దానినే సరి అయిన ఆలయంగా నిర్ణయించడం జరిగింది.
హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరో బైజ్య నాథ్ ఆలయం ఉండటం విశేషం. అక్కడి వారు దానిని ద్వాదశ లింగ రూపంగా భావిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో భాగం కాకపోయినా ఈ రెండూ కూడా మహిమాన్విత క్షేత్రాలే !!






ఝార్ఖండ్ మరియు మహారాష్ట్రలలోని రెండు ఆలయాల పురాణ గాధ ఒకటే కావడం మరో విశేషం !
పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని ఆయనను తన లంకకు తీసుకొని వెళ్లాలని తలచినాడు  లంకేశ్వరుడు రావణుడు.
తన కోరిక నెరవేరడం  కొరకు భీకరమైన తపస్సు చేసాడు. చివరి ప్రయత్నంగా తన తలలను ఒకొక్కటిగా అగ్నికి సమర్పించాడు. భక్త సులభుడు కరుణించి దిగి వచ్చిస్వయంగా శిరస్సులను ఆతికించి అతనిని సజీవుని చేసారు.
ఈ కారణంగా స్వామిని "వైద్యనాధుడు"అని పిలుస్తారు.
తానూ లంకలో ఉండటం సాధ్యం కాదు అని తన బదులు తన ఆత్మ లింగం తీసుకొని వెళ్ళమని ప్రసాదించారు.
ఆనందంతో ఆకాశ మార్గాన వెళుతున్న సమయంలో సంధ్యా సమయం కావడంతో త్రికాల సంధ్యా వందనం చేసే రావణ బ్రహ్మ భువుకి దిగాడు.







కానీ  లంక చేరే దాక మధ్యలో ఎక్కడా నేల మీద ఆత్మ లింగం పెట్టకూడదన్న నిరాకారుని నిభందన గుర్తుకు వచ్చి సమీపంలో తిరగాడుతున్న బాలకుని బ్రతిమాలుకొని లింగాన్ని ఇచ్చి నదీ తీరానికి వెళ్ళాడు.
ఆత్మ లింగం లంకను చేరితే సంభవించే పరిణామాలను గురించి భయాందోళనలకు గురి అవుతున్న దేవతలు పంపగా మారు వేషంలో బాలకునిగా వచ్చినది విఘ్ననాయకుడే!
చెప్పిన మూడు సార్లు పిలిచి లింగాన్నినేల మీద ఉంచి మాయమై పోయాడు పార్వతీనందనుడు.
యెంత ప్రయత్నించినా కదిలించలేక పోయిన రావణుడు నిరాశగా వెళ్ళిపోయాడు.
పెద్ద ముప్పు తప్పినందుకు కీర్తించిన దేవతలకు, మునులకు జ్యోతి రూపంలో దర్శనాన్ని ప్రసాదించి వారి కోరిక మేరకు అక్కడే స్థిర నివాసము ఏర్పరచుకొన్నారు లింగ రాజు.
దేవతల ఆదేశం ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ తొట్ట తొలి ఆలయాన్ని నిర్మించారు.  గర్భాలయ కాల నిర్ణయం నేటికీ చేయలేక పోవడం మరియు ఎలాంటి మార్పులూ చేయలేక పోవడం దానికి నిదర్శనాలుగా చెబుతారు.
 (కర్నాటక లోని ప్రసిద్ద శైవ క్షేత్రం "గోకర్ణం" స్థల పురాణం కూడా ఇదే కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.)







తదనంతర కాలంలో ఎన్నో స్థానిక రాజ వంశాల వారు ఆలయ అబివృద్దికి విశేష కృషి చేసారని లభించిన ఆధారాల ద్వారా తెలుస్తోంది.
ముఖ్యంగా "గిధవుర్" వంశ రాజు "రాజా పురాణ సింగ్" ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు.
నివాస, వ్యాపార సముదాయాల మధ్యన ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు మరో ఇరవై ఒక్క ఆలయాలు ఉంటాయి.
వైద్యనాధ్ ధామం యొక్క ప్రత్యేకత మరోకటున్నది. ఇది యాభై ఒక్క శక్తి పీఠలాలో ఒకటిగా కూడా  గుర్తింపు పొందినది.
దక్ష యజ్ఞం సరంభానికి పిలవని పిలుపుగా పుట్టింటికి వెళ్ళిన సతీ దేవి అవమానానికి గురై యజ్ఞ గుండంలో దూకి ప్రాణత్యాగం చేసింది.
దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత సర్వేశ్వరుడు సతీ దేవి శరీరాన్ని భుజాన వేసుకొని విరాగిగా తిరగ సాగారు. 





లయకారుని తిరిగి ఇల లోనికి తేవడానికి శ్రీ మహా విష్ణువు  సుదర్శన చక్రంతో సతీ దేవి శరీరాన్ని ఖండించారు.ఆ శరీర భాగాలు భువిలోని వివిధ ప్రాంతాలలో పడినాయి.
అవే శక్తి పీఠాలుగా పేరొందాయి.
వైద్య నాధ్ ధామం కాకుండా జ్యోతిర్లింగాలతో పాటు శక్తి పీఠాలుగా గుర్తింపు పొందిన క్షేత్రాలు వారణాశి మరియు శ్రీశైలం.
ఇక్కడ అమ్మ వారి హృదయ భాగం పడినది. అందువలన గతంలో "హర్ష పీఠ"గా పిలిచేవారు.
 శ్రీ జయ దుర్గా దేవి అమ్మవారి ఆలయం శ్రీ వైద్యనాధ స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతి రూపమైన శివ శక్తి స్వరూపాలను కలపాలన్న తలంపుతో భక్తులు తమ కోరిక నెరవేరిన తరువాత ఎఱ్ఱని దారాలతో రెండు ఆలయాలను అనుసందిస్తారు.






పూర్వ కాలంలో ఈ క్షేత్రం తంత్ర సాధకులకు నిలయమని చెబుతారు. ఎందరో ఇక్కడ సాధన చేసి దివ్య శక్తులను పొందారని తెలుస్తోంది. ఈ కారణంగా కాబోలు  ప్రాంగణంలోని ఉపాలయాలొ  దేవీ రూపాలవే ఎక్కువగా కనిపిస్తాయి.
 గణపతి,నవదేవర, గౌరిశంకర, తార, కాళీ, అన్నపూర్ణ, బ్రహ్మ, సంధ్య, భైరవ, హనుమాన్, మానస, సరస్వతి, సూర్యనారాయణ, బంగ్లా, శ్రీ రామ సీత, ఆనంద భైరవ, గంగా, లక్ష్మీ నారాయణ, నీలకాంత, పార్వతి, జగజ్జననీ ఉపాలయాలలొ కొలువుతీరి ఉంటారు.
ప్రాంగణ ఈశాన్య భాగంలో ఉన్న "చంద్ర కూప"గా పిలవబడే  మంచి నీటి బావి జలాన్నే స్వామి వారి అభిషేకాలకు వినియోగిస్తారు.






ప్రతి నిత్యం దేశంలోని అన్ని ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. శ్రీ వైద్యనాధుని అభిషేకించి ఆనంద పరవశులవుతారు.
ముఖ్యంగా ఆదివారాలు సోమ వారాలు భక్తుల సంఖ్య విపరీతం.
శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం రోజున, అమావాస్య, పౌర్ణమి, మాస శివరాత్రి రోజులలో విశేష అభిషేకాలు నిర్వహిస్తారు.
శ్రావణ మరియు కార్తీక మాసాలలో శ్రీ వైద్యనాదునికి నిరంతర అభిషేకాలే!







మనం  కార్తీక మాసాన్ని శివునికి ప్రియమైన మాసంగా ఎలా భావిస్తామో ఉత్తర భారతంలో  శ్రావణ (జూలై - ఆగష్టు) మాసాన్ని శంకర సేవకు తగిన సమయంగా పరిగణిస్తారు.
ఇక్కడికి వంద కిలో మీటర్ల దూరంలో గల సుల్తాన్ గంజ్ దగ్గర గంగలో స్నానమాచరించి, ప్రత్యేక దీక్ష బూని చెంబులలో గంగా జలాన్ని తీసుకొని కావడిలో అమర్చుకొని కాలినడకన వైద్యనాధం చేరుకొనే భక్తులు భక్తి పారవశ్యాలతో పవిత్ర జలం తో పరమేష్టిని అభిషేకించుతారు.
మార్గ మాధ్యమంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా మార్గాయాసం తెలియకుండా "బోల్ బమ్" అని పెద్దగా పిలుస్తూ నడుస్తుంటారు.
ఈ బోల్ బమ్ ఉత్తరాది రాష్ట్రాలలో ప్రతి ఊరిలో అత్యంత భక్తి శ్రద్దలతో పాటిస్తారు.
కాక పోతే చాల చోట్ల సమీపంలోని ఈశ్వరాలయానికి వెళతారు. ఝార్ఖండ్, బిహార్, ఒడిస్సా మరియు పశ్చిమ  బెంగాల్ వాసులు మాత్రం అధిక సంఖ్యలో వైధ్యనాద్ ధామం వెళతారు.
శ్రావణ మాసమంతా వైధ్యనాదంలో అధ్యాత్మికతో కూడిన పండుగ వాతావరణం నెలకొంటుంది.
గంగాధరునికి నిరంతర గంగాభిషేకమే శ్రావణం అంతా !!








ఝార్ఖండ్ రాష్ట్రంలో దేవ్ ఘర్  పట్టణంలో ఉన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం దేశంలోని అన్ని పట్టణాల నుండి రైలు మార్గంలో చేరుకోవచ్చును.  దేవ్ ఘర్ పట్టణంలో  "వైద్య నాధ్ ధాం" అన్న పేరుతో రైల్వే స్టేషన్ ఉన్నది.  కాకపోతే అతి తక్కువ సంఖ్యలో రైళ్ళు ఉన్నాయి అక్కడికి.  వైధ్యనాద్ ధామం చేరుకోడానికి దేవ్ ఘర్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో గల "జసిది" రైల్వే స్టేషన్ అన్ని విధాలుగా తగినది. దేశం నలుమూలల నుండి జసిది చేరడానికి రైళ్ళు కలవు. 
తగిన వసతి మరియు భోజన సదుపాయాలూ అందు బాటు ధరలలో లభిస్తాయి. 

నమః శివాయ !!! 

  








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...