22, మే 2016, ఆదివారం

Pahari Temple, Ranchi

                               శ్రీ పహారీ బాబా మందిరం, రాంచీ 





మన పవిత్ర భారత దేశంలో  ఉన్న గొప్పదనం ఏమిటంటే దేశంలో ఏ మూలకు వెళ్ళినా ఆధ్యాత్మిక సౌరభాలు వెలువరించే అద్భుత ఆలయాలు దర్శనమిస్తాయి.
అన్నీ కూడా కొంత పౌరాణిక మరి కొంత చరిత్ర ఇంకొంత వర్తమాన నేపధ్యం కలగలసి ఉండటం విశేషం.  








బీహారు రాష్ట్రం నుండి విడదీసి  ఏర్పాటు చేయబడిన రాష్ట్రం ఝార్ఖండ్. ఈ రాష్ట్ర రాజధాని "రాంచీ".జలపాతాల నగరంగా ప్రసిద్ది పొందిన ఈ పట్టణంలో, చుట్టుపక్కల ఎన్నో పురాతన ఆలయాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యమైనది పహారీ బాబా మందిరం. పర్వతం మీద ఉన్న పరమేశ్వరుని  మందిరంగా  పేరొందినది. నగర నడిబొడ్డున ఉన్న కొండ మీద ఉన్నందున ఆ పేరు వచ్చినట్లుగా చెబుతారు. 





నగర నడి బొడ్డున చిన్న కొండ ( ఎత్తు 2140 అడుగులు )మీద కైలాస నాధుడు  రూపంలో కొలువు తీరి ఉండటం వలన భక్తులు ప్రేమగా పహారీ బాబా అని పిలుచు కొంటారు. ఏ కాలంలో స్వామి స్వయంభూ గా  ఇక్కడ వెలిశారు అన్న దానికి తగిన ఆధారాలు లభించకున్నా, ఎన్నో శతాబ్దాలుగా  సర్వేశ్వరుడు ఈ దివ్య క్షేత్రంలో  పూజలు అందుకొంటున్నారు  అన్నది స్థానిక విశ్వాసం.





స్వాగత ద్వారం దాటిన తరువాత ఎడమ పక్కన ఉన్న మందిరంలో ఇత్తడి తొడుగుతో అలంకరించిన సదా శివుడు పెద్ద లింగ రూపంలో అభిషేకాలు అందుకొంటుంటారు. ఎదురుగా ఉన్న మరో మందిరంలో నిలువెత్తు భీకర కపాల మాలాలంకృత శ్రీ కాళీ అమ్మ భక్తులను దుష్ట గ్రహ భాధల నుండి కాపాడుతుంటారు.
భూత గణాల భాధల నుండి గ్రహ భాధల నుండి రక్షణ కోరుకొంటూ భక్తులు మందిర ద్వారానికి తోరణాలు కడుతుంటారు.  (ఇక్కడ ఫోటోలు తీయడానికి అనుమతి లేదు)








ఉత్తరభారత దేశంలో కాశీతో సహా లభించే అద్భుత అవకాశం ఏమిటంటే లింగానికి స్వయంగా అభిషేకం చేసుకొవడం.
మందిరంలో ఒక పక్కన చిన్న చిన్న రాగి ఇత్తడి చెంబులు,కొళాయి ఉంటాయి. నీరు పట్టుకొని అభిషేకించడమే !!






చక్కగా ఎక్కడానికి అనువుగా నిర్మించిన నాలుగువందల పది సోపానాల ద్వారా పర్వత పైభాగానికి చేరుకోవచ్చును. మధ్యలో మరో చిన్న శివ మందిరం ఉంటుంది. 
దాదాపుగా శిధిలా వస్తకు చేరుకొన్న మెట్ల మార్గాన్ని ఆలయ సముదాయాన్ని పునః నిర్మించి ఇంకా అభివృద్ధి లోనికి తేవడానికి ఆలయ కమిటీ, స్థానిక ప్రముఖుల పాత్ర తో పాటు "జిందాల్ గ్రూప్ "వారి ఆర్ధిక సహాయం ఎంతో ఉన్నది. 
ప్రస్తుత ఆలయం స్థానంలో కమలాకారంలో శోభాయమానంగా సుందర నూతన ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.   











అగ్ర భాగాన అంటే కొండ కొమ్ము పైన కొలువైన పహారీ బాబా ను దర్శించుకోడానికి సన్నని మెట్లు ఎక్కాలి. అక్కడ నలుచదరపు గది లాంటి నిర్మాణం మధ్య భాగంలో ఎత్తైన పాను వట్టం మీద అడుగు ఎత్తు లింగ రూపంలో శంకరుడు పత్ర  పుష్ప కుంకుమ చందన విభూది లేపనాలతో నిరంతర అభిషేక ధారలలో తడిసి ముద్దవుతూ నేత్ర పర్వంగా దర్శన మిస్తారు. 










పక్క ఉన్న మార్గం గుండా అగ్ర భాగం నుండి క్రిందకి దిగితే అక్కడ అమ్మవారు శ్రీ పార్వతీ దేవి ప్రత్యేక మందిరంలో కొలువు తీరి ఉంటారు. పక్కనే పవన సుతుడు మరొక ఉపాలయంలో స్థానక భంగిమలో ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటారు.  
పైభాగాన ఎటు చూసినా వివిధ వర్ణ పతాకాలు కనపడతాయి. 
ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం నాడు ఈ పర్వతం మీద జాతీయ జెండా ఎగరవేయడం ఒక ఉత్సవంగా గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా జరుపుకొంటున్నారు రాంచీ నగర ప్రజలు. 











దీనికి తగిన చారిత్రిక కారణం ఉన్నది. ఆగ్లేయులకు ఎదురు తిరిగిన యోధులను విప్లవ కారులుగా ముద్ర వేసి ఇక్కడికి తీసుకొని వచ్చి ఉరి తీసేవారట ! ఆ అమర వీరుల స్మారకార్ధం స్వాతంత్రానంతరం ఇక్కడ జెండా పండుగ జరుపుకోవడం ఆరంభించారు.
 23.01. 2016న ప్రపంచంలోనే పెద్దదైన ఎత్తైన జెండా ఇక్కడ ఎగురవేశారు. రాంచీ పట్టణం అన్ని ప్రదేశాల నుండి సుస్పష్టంగా కనపడే విధంగా ఏర్పాటు చేసారు. దీనికోసం పర్వత పై భాగాన ప్రత్యేకంగా ఒక స్తంభాన్ని నిర్మించారు.కాకపోతే వీచిన బలమైన గాలుల కారణంగా జెండా చిద్రమైనది. మరింత సురక్షితంగా ఎగర వేయడానికి ప్రయాస పడుతున్నారు. ప్రయత్నిస్తున్నారు.












రాంచీ వాతావరణం చాలా గమ్మత్తుగా ఉంటుంది. సంవత్సరంలో మూడొంతులు చల్లని వాతావరణం నెలకొని ఉంటుంది.  చలి, వానలు ఎక్కువే !
ఎండాకాలంలో అత్యంత ఎక్కువగా 35 డిగ్రీల వరకూ వేడి ఉంటుంది. కానీ మధ్యహాన్నానికి మబ్బులు పట్టి ఈదురు గాలులు వీయడం గానీ వాన పడటం కానీ జరిగి ఎండ వేడి తగ్గి పోతుంది. ఈ వాతావరణం కారణంగా బీహారు రాష్ట్రానికి గతంలో వేసవి కాలపు విధాన సభ సమావేశాల కేంద్రంగా భాసిల్లినది రాంచీ. కొండ పై భాగం నుండి రాంచీ పట్టణాన్ని మొత్తం ఒక విహంగ వీక్షణం చేయవచ్చును. 
సర్వేశ్వరుని సన్నిధి, చుట్టూ పచ్చని ప్రకృతి, పరవశింపచేసే వాతావరణం, చల్లని స్వచమైన గాలి అన్నీ కలగలసి పహారీ మందిర సందర్శనాన్ని ఒక జీవిత కాల మధురానుభూతి గా మదిలో నిలిచి పోయేలా చేస్తాయి. 








మహా శివరాత్రి పర్వదినాన పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. ఝార్ఖండ్ రాష్ట్రం నలుమూలల నుండే కాక బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రావణ మాసంలో బొల్బమ్ భక్తులు వేలాదిగా వచ్చి పహారీ బాబాను దర్శించుకొంటారు. తాము కావళ్లలో తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకిస్తారు.
రాంచీ పట్టణాన్ని ఏకారణం వలన వెళ్ళినా తప్పక సందర్శించవలసిన వాటిల్లో మొదటి వరసలో ఉండేది మాత్రం పహారీ బాబా మందిరం !












రాంచీ నగరం చేరుకొనడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైలు మరియు విమాన సౌకర్యాలు లభిస్తాయి. స్థానికంగా ఉండటానికి అన్ని ధరలలో వసతి సౌకర్యాలు కలవు. 

నమః శివాయ !!!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...