18, జూన్ 2015, గురువారం

Hyderabad Temples

                      రామ్ బాగ్ శ్రీ రామ చంద్ర స్వామి ఆలయం 

 



శ్రీ రామ చంద్రుడు హిందువుల ఆరాధ్య దైవం. ప్రజలు గ్రామ గ్రామాన ఆలయాలు నిర్మించుకొని ఆరాధిస్తూ ఉంటారు. ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తుంటారు. భారతదేశ నలుమూలలా ఎన్నో రామాలయాలు కనపడటానికి కారణం ఇదే !






వీటిల్లో కొన్ని వివిధ చారిత్రక కారణాల వలన ప్రసిద్ది చెందాయి.
విశేష చరిత్ర కలిగివుండి కూడా సాధారణ ఆలయంగా నిలిచిపోయినదే హైదరాబాద్ లోని రామ్ బాగ్ శ్రీ రామ ఆలయం. కోదండ రాముడు కోరి కొలువైన కోవెలగా ప్రసిద్ధి.





రెండు వందల సంవత్సరాల క్రిందట మూడో నిజాం మీర్ అక్బర్ ఆలీ ఖాన్ కాలంలో ఈ ఆలయంనిర్మించబడినది. నవాబ్ సికిందర్ ఝా అన్న బిరుదు గల ఈ నిజాం ఆస్థానంలో ఆర్ధిక పరిపాలనా వ్యవహారాలను చూసేవారు రాజా భవానీ ప్రసాద్. ఈయన రామ భక్తుడు.అత్యంత భక్తి శ్రధలతో అయోధ్యా రాముని సేవించుకొనేవారు.నగరంలో ఒక రామాలయం నిర్మించాలన్న తలంపు కలిగింది ఆయనకు.అందుకు నిజాం అనుమతి తీసుకొన్నారు. స్థల సేకరణ కూడా జరిగింది. ఆలయ నిర్మాణం ఆరంభించారు. విగ్రహాలను ఎలా చేయించాలి అన్న చర్చ మొదలయ్యింది.








అదే సమయంలో గద్వాల్ సంస్థానాధీశుడు అయిన రాజా సొం భూపాల్ మదిలో కూడా రామునికి మందిరం నిర్మించాలని అనే కోరిక జనించినది. వెంటనే ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
శిల్పులు నియమంగా ఉంటూ భక్తితో సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ రామ రూపాలను సుందరంగా నాణ్యమైన శిల మీద మలిచారు. అప్పుడొక అరుదైన సంఘటన జరిగింది.
ఒక యోగి సోం భూపాల్ వద్దకు వచ్చి ఆలయంలో ప్రతిష్టించడానికి కావలసిన విగ్రహాలు నగర శివారులలో ఉన్న బావిలో ఉన్నాయని, వాటి మూలానే రాజు మనస్సులో ఆలయ నిర్మాణ ఆలోచన జనించినది అని తెలిపారట.
దానిని రామాజ్ఞ గా భావించి రాజు బావిలో వెతికించగా చక్కని నాలుగు విగ్రహాలు లభించాయి.
పరమానందభరితుడైన రాజు వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన జరిపించారు.కొత్తగా చేయించిన రూపాలను పక్కన భద్రపరిచారు.







విగ్రహాల గురించి ఆలోచిస్తున్న భవానీ ప్రసాద్ ఈ విషయం తెలిసి ఆ విగ్రహాలను తనకు ఇవ్వమని గద్వాల్ సంస్థానాధీశునికి అభ్యర్ధన పంపారు. ఆయన సంతోషంగా ఎన్నో కానుకలు, నగలతో పాటు విగ్రహాలను భాగ్య నగరానికి పంపారు.ఒక శుభ ముహూర్తాన నిజాం చేతుల మీదుగా ఆలయంలో శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామ మూర్తులను ప్రతిష్టాపన జరిగింది.
నిజాం ఎంతో భూమిని, ధనాన్ని ఆలయ నిర్వహణకు కానుకగా సమర్పించారు.
అక్కడితో ఆగకుండా  శ్రీరామ నవమికి తన తరుఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని ఆరంభింపచేసారు.ఆయన తరువాతి  నిజాములు కూడా రామ్ బాగ్ శ్రీ రామునికి  పట్టు వస్త్రాలు అందించినవారే అని తెలుస్తోంది. 








అరుదైన చారిత్రక కట్టడంగా ప్రభుత్వం గుర్తించిన ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో ఉంటుంది.మహా నగరంలో ఉన్నా అత్యంత ప్రశాంత వాతావరణం కలిగిన ఈ ఆలయంలో పెద్దగా శిల్పకళ కనిపించదు. కానీ ముఖ మండప స్థంభాల అమరిక ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ప్రధాన ఆలయానికి ఇరు పక్కలా పొడుగాటి విశాల మండపాలను నిర్మించారు.
ఆలయానికి ఎదురుగా పచ్ఛిక పెంచుతున్నారు. గర్భాలయంలో ఎత్తైన పీఠం మీద శ్రీ రాముడు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతులై స్థానక భంగిమలో నయనమనోహరంగా దర్శనం ప్రసాదిస్తారు.









శ్రీ భవానీ ప్రసాద్ వారసులే ఆలయ ధర్మ కర్తలుగా వ్యవహరిస్తున్నారు.





ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయం భక్తుల కొరకు తెరచి ఉంటుంది. హనుమాన్ జయంతి, శ్రీ రామ నవమి, వైకుంఠ ఏకాదశి, శ్రీ కృష్ణ జన్మాష్టమిలతో పాటు అన్ని హిందూ పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు.

జై శ్రీరామ్ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...