19, మార్చి 2014, బుధవారం

Tiruvattar sri aadi keshava perumal Temple


               శ్రీ ఆదికేశవ పెరుమాళ్ కోవెల - తిరువట్టార్ 

ప్రపంచ ప్రఖ్యాత చెందినది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం.
అలాంటి దానిని మరో ఆలయాన్ని చూసి ఆ ప్రకారం నిర్మించారని అంటే ఎవరైనా నమ్ముతారా ?
కాని అది నిజం. 
ఆధారాలు, ప్రమాణాలు, ప్రత్యక్ష నిదర్శనాలు తెలిపే వాస్తవం. 
ఆ వివరాలు తెలుసుకొందాము. 
భారత దేశ దక్షిణ భాగాన ఉన్న కన్యాకుమారి ఒక శక్తి క్షేత్రం. 
దేశ విదేశ సందర్శకులు ఎంచుకొనే పర్యాటక స్థలాలలో తప్పక ఉండేది.
ఎందరికో అద్భుత అనుభవాలను ప్రసాదించిన కన్యాకుమారి పరిసర ప్రాంతాలు పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ది చెందిన ఆలయాలకు మరియు కడ్డడాలకు పేరొందాయి.
అలాంటి వాటిల్లో ఒకటి " తిరు వట్టారు".
పరలియార్ లేదా వట్టారు నది ఒక ద్వీప కల్పంగా మార్చిన తిరు వట్టారు చేరనాడు శ్రీరంగం, పరశురామ క్షేత్రం లేదా దక్షిణ వైకుంఠము గా ప్రసిద్ది.
అనేక పురాతన తమిళ గ్రంధాలలో ఉదహరించబడిన తిరువట్టారు ఆలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాలుగా భక్తుల విశ్వాసాన్ని చూరగోన్నట్లుగా అవగతమౌతోంది.
సుమారు అరవై అడుగుల ఎత్తులో ఉండే ఆలయంలో కొలువు తీరిన "శ్రీ ఆది కేశవ పెరుమాళ్" ఈ ప్రాంతాన్ని పాలించిన ట్రావెంకూర్ రాజులకు, వారి బంధువులైన వేనాడ్ రాజుల ఆరాధ్య దైవం.
ఇక్కడికి సమీపంలోని పద్మనాభ పురం వీరి ఒకప్పటి రాజధాని.
పాత రాజ భవనాన్ని నేటికి వీక్షించవచ్చును.
ఈ ఆలయ నిర్మాణ శైలిలోనే తిరువనంత పుర శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించారు.
ఆలయ ప్రాంతం ఎత్తుగా ఉండటానికి, శ్రీ హరి ఆది కేశవ పెరుమాళ్ గా కొలువుతీరడానికి సంబంధించి ఒక పురాణ గాధ వ్యాప్తిలో ఉన్నది.
విధాత లోక కళ్యాణార్ధం ఒక యాగాన్ని తలపెట్టి, ఈ ప్రాంతాన్ని తగినదిగా ఎంచుకొన్నారట.
కానీ ఆయన తన సతీమణి సరస్వతి దేవి పక్కన లేకుండా యాగాన్ని మొదలుపెట్టడం ఆమెకు ఆగ్రహాన్ని కలిగించిందట.
దానితో దేవి పతిదేవుని యాగాన్ని భగ్నం చేయడానికి అనేక ఆటంకాలను సృష్టించినదట. ( ఇదే గాధ కంచి లోని పలు విష్ణు ఆలయాలతో ముడిపడి ఉండటం విశేషం ).
వాటిని ఎదుర్కోవటంతో కొంత మేరకు యాగం మీద ఏకాగ్రత కోల్పోవడంతో అనుకున్న విధంగా లోక కల్యాణం జరగకుండా లోక కంటకులైన కేశ మరియు కేశిని అనే ఇద్దరు రాక్షస సోదరీ సోదరులు ఉద్భవించారట.
యజ్ఞ గుండం నుండి పుట్టటం వలన వారికి చావు లేకపోగా, అనేక శక్తులు కూడా లభించాయట.
వారిరువురూ మునులను, మహర్షులను, సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టసాగగా, వారంతా కలిసి బ్రహ్మ వద్దకు ఆయన సలహా మేరకు వైకుంఠము వెళ్లారట.
వారి వేదనను విన్న వైకుంఠ వాసుడు కేశ కేశిని బారి నుండి లోకాన్ని కాపాడ భూలోకానికి వచ్చినారట.
స్వామి వారికి కేశ కు నడుమ భీకర యుద్ధం చోటుచేసుకోన్నదిట.
ఎంతో కాలం కొనసాగిన పోరాటంలో వానిని సంహరించలేక తన గదాఘాతంతో మూర్చిల్ల చేయగా అక్కడే ఉన్న ఆది శేషుడు వాని మీద పడి తన శరీరాన్ని చుట్టలుగా చుట్టు కొనగా వాటి మీద స్వామి శయనించారట.
లోపల బందీ అయిన అసురుడు తన చేతులను బయటికి చాపాడట.
అతని శక్తిని సంపూర్ణంగా నిర్వీర్యం చేయడానికి శ్రీ మన్నారాయణుడు ఆ చేతుల మీద పన్నెండు శివలింగాలను ప్రతిష్టించారట.
తిరు వట్టారు పరిసర ప్రాంతాలలో ఉన్న ఆ శివాలయాలు వరసగా తిరుమలై,తిరుపరప్పు, తిక్కురుచి,పొన్మనై, పన్నిప్పాక్కం,కాల్కుళం, మెలాన్కోడు, తిరు విదైకోడ్, తిరు విత్తంకోడ్, తిరుప్పన్నియోడ్ మరియు తిరునట్టాలం.
శివరాత్రి నాడు స్థానిక భక్తులు ఉదయాన్నేబయలుదేరి వరసగా పన్నెండు శివాలయాలను సందర్శించి చివరకు శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ని సేవించుకొని తమ శివరాత్రి యాత్రను ముగిస్తారు. 
సోదరుని పరాజయంతో ఆగ్రహించిన కేశిని తన నెచ్చెలి కోదై తో కలిసి నదిగా మారి స్వామి కొలువుతీరిన ప్రాంతాన్నిముంచేయడానికి వేగంగా రాగా భూదేవి వెంటనే ఆ ప్రాంతంలో తన ఎత్తును పెంచుకోగా రెండు నదులూ ఆ స్థలం చుట్టూ తిరిగి ఒకటై విడదీయలేని విధంగా మారిపోయాయట.
నేటికి ఫాల్గుణ మాసంలో వచ్చేఉత్సవాలలో స్వామి వారి "ఆరట్టు" ( పవిత్ర స్నానం ) ఈ సంగమ క్షేత్రంలో జరుపుతారు.
ఆ విధంగా అసుర సోదర సొదరిల భాధ లోకాలకు లేకుండా పోయిందిట.
అలా కేశి కేశిని లను శాశ్విత బందీలుగా మార్చి ఇక్కడే కొలువైన శ్రీ హరి ఆది కేశవ పెరుమాళ్ గా పిలవబడుతున్నారు.




ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయానికి చేరుకోడానికి సోపాన మార్గం ఉంటుంది.
కేరళ శైలిలో నిర్మించబడిన రెండస్థుల రాజ ద్వారానికి అనుసంధానంగా ముప్పై అడుగుల ఎత్తుతో ప్రాంగణానికి నలువైపులా ప్రహరీ గోడ నిర్మించారు.మిగిలిన మూడువైపులా ద్వారాలుంటాయి.
ప్రాంగణంలో శ్రీ కోవెల చుట్టూ రెండువందల ఇరవై నాలుగు స్తంభాలతో నిర్మించబడిన  "శ్రీ బలిప్పుర" గా పిలవబడే రాతి మండపం ఉంటుంది.
ఒక్కో స్తంభానికి దీప లక్ష్మి గా పిలిచే దీపం పట్టుకొన్న స్త్రీ శిల్పాలుంటాయి.
ఒక్కో శిల్పానిది ఒక్కో అందం. ఇలాంటి మండపమే  తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కనపడుతుంది. కానీ అక్కడి మండపం వైశాల్యంలో చాలా పెద్దది. 




శ్రీ కోవెలకు ఎదురుగా ఉన్న "ఉదయ మార్తాండ వర్మ మండపం"లో చెక్కిన చెక్క చెక్కడాల సౌందర్యం వర్ణింప లేనిది. 
విఘ్ననాధుని ఆరాధిస్తున్న భక్తులు, వివాహానికి తరలి వెళుతున్న బృందం, లక్ష్మణ, ఇంద్రజిత్, వేణుగోపాల, పరాశక్తి, బ్రహ్మ, విష్ణు, కాలభైరవ,నంది, నమ్మాళ్వార్, హనుమంతుడు, మహర్షులు, రతి మన్మదుల విగ్రహాలు అత్యంత రమణీయంగా ఉంటాయి. 
చెక్కతో చేసిన పెద్ద గొలుసు నాటి శిల్ప కారుల నైపుణ్యానికి మచ్చుతునక. 
మురళిని వాయిస్తున్న కృష్ణుడు ఆ గానానికి మైమరచిపోయి నాట్యం చేస్తున్న శివ కేశవులు, మృదంగం వాయించే విధాత.  సహజ జాతి వైరం మరచి పక్కపక్కనే ఉన్న పులి మేక, పాము ముంగీస ఇలా రకరకాల జంతువులను చెక్కిన తీరు చూపరులను మంత్రం ముగ్ధులను చేస్తుంది.






వందల సంవత్సరాల క్రిందట మండప గోడలపైన సహజ వర్ణాలతో చిత్రించిన చిత్రాలు కొంత మేరకు రూపం కోల్పోయినా చక్కగా ఉంటాయి. 
వర్తులాకార శ్రీ కోవెల ముందు పెద్దదైన "ఒట్టుక్కాల్ మండపం" ఉంటుంది. 
దాని మీదకు చేరుకొంటే  పడమర ముఖంగా ఆది శేషుని మీద శయనించిన ఆది కేశవ స్వామిని మూడు ద్వారాల గుండా చూడాలి. తిరువనంతపురం లో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని కూడా ఇదే మాదిరి మూడు ద్వారాల గుండా వీక్షిస్తాము.  
గర్భాలయంలో ఎన్నో దేవి దేవతా మూర్తులు మరియు మహర్షుల రూపాలు కూడా ఉంటాయి. 
మరో నిర్మాణ పరమైన అద్భుతం ఏమిటంటే ప్రతి సంవత్సరం మార్చి లోను, అక్టోబర్ లోను మూడు రోజులపాటు సాయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు నేరుగా మూల విరాట్టు పాదాలను తాకుతాయి. 
మరో విశేషం ఇక్కడ కూడా ప్రధాన అర్చనా మూర్తికి అభిషేకాలు జరగవు. ఉత్సవ మూర్తులకే అభిషేకాలు. 
ఖండసారి విధానంలో మూల విరాట్టును పదహారు వేల ఎనిమిది సాల గ్రామాలతో తయారు చేసి, పైన కప్పిన బంగారు కవచానికి  వజ్రాలను చాతీ భాగంలో అమర్చారు. 
కాక పోతే ఆది కేశవ పెరుమాళ్ నాభి భాగంలో ఉండే బ్రహ్మ ఉండడు. విగ్రహం కూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి అంత పెద్దదిగా ఉండదు. 
కొన్ని తరాల పాటు తిరు వట్టార్ శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ని కొలిచిన ట్రావెంకూర్ రాజులు వారికి వారు పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని తిరువనంతపురానికి రాజధానిని ( 1745 వ సంవత్సరంలో)తరలించి చిన్నగా ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని భారీగా పునః నిర్మించారు. 
ముందుగా చెప్పుకొన్నట్లుగా ఈ రెండు ఆలయాల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ముఖ్యమైన తేడాలు రెండు. మొదటిది తిరువట్టారు మూల విరాట్టు పడమర ముఖంగా ఉండగా తిరువనంతపురం స్వామి తూర్పు ముఖం కొలువై ఉంటారు. 
రెండవది  ఆకారంలో ఈ ఆలయం చిన్నది. ఆ ఆలయం పెద్దది. 
శ్రీ కోవెల ముందున్న "ఒట్టుక్కాల్ మండపం"  తిరువనంతపురంలో చిన్నది. ఈ  ఆలయంలో శ్రీ కృష్ణ, శ్రీ  నారసింహ సన్నిదులుండగా తిరువట్టారు లో ఉప ఆలయాలుండవు. 
 రెండు ఆలయాలలో పూజలు, ఉత్సవాలు ఒకే రీతిన ఉండటం మరో విశేషం. ప్రధాన ఉత్సవాలకు రాజు స్వయంగా తరలి వస్తారు. 
పాలకులైన ట్రావెంకూర్ రాజులు శ్రీ మహా విష్ణువు మీద అపరిమితమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. 
స్వామి వారిని ఆపత్ సమయాలలో ఆదుకొన్నారు అని తెలిపే కధనాలు ఎన్నో ప్రచారంలో ఉన్నా నేటికీ ఆలయ ఉత్సవాలతో, పూజలతో ముడిపడి ఉన్న కొన్నింటిని తెలుసుకొందాము. 
తిరు వట్టారు శ్రీ ఆది కేశవ పెరుమాళ్ విజయ కారకుడు. 
ఈ ప్రాంతాన్ని రాజా కేరళ వర్మ పాలించే కాలంలో మొఘలాయి సేనలు దండ యాత్రకు తరలి వచ్చాయిట. 
ఇరు దళాల మధ్యా జరిగిన భీకర పోరులో కేరళ సేనలకు  ఓటమి తప్పని పరిస్థితులలో నాటి సాయంత్రం రాజు ఆలయానికి వెళ్లి  ఆశువుగా పదు నాలుగు చరణాలతో కీర్తించారట. 
అది పూర్తయిన మరుక్షణం గర్భాలయం నుండి ఝుమ్మని శబ్దం చేస్తూ తేనే తీగల గుంపు వచ్చి మొఘలాయి సేనల పైన దాడి చేసాయిట. వారి సేనానితో సహా పెద్ద సంఖ్యలో సైనికులు మరణించడంతో విజయం కేరళ వర్మ ను వరించినది. 
నాటి నుండి నేటి వరకు సాయం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించేటప్పుడు కేరళ వర్మ గానం చేసిన " పద సంకీర్తన లేదా ఆది కేశవ స్తవం" పాడతారు. 
మరో సారి రాజా మార్తాండ వర్మ రాజ్యం కోల్పోయి శత్రువుల బారి నుండి తనను తాను కాపాడుకునే ప్రయతంలో ఒక బ్రాహ్మణ గృహానికి చేరుకోన్నాడట. 
భర్తను కోల్పోయిన పేద విధవరాలు వచ్చినది రాజని తెలియక, అతిధిని ఆకలితో పంపకూడదని ఇంటిలో మిగిలిన అన్నం తో ఉడక బెట్టిన మామిడి కాయ ఉప్పు పెట్టినదట. 
కేశవ పెరుమాళ్ ని సేవించుకొన్న తరువాత శత్రువులను ఓడించి రాజ్య పాలనను చేపట్టిన తరువాత మార్తాండవర్మ నాటి సంఘటనకు గుర్తుగా స్వామి వారికి అన్నంతో ఉడక బెట్టిన మామిడి కాయ ఉప్పు నైవేద్యంగా పెట్టడం ఆరంభించి అదే విధమైన నైవేద్యం ఆ బ్రాహ్మణ కుటుంబం వారే సమర్పించాలని శాసనం చేసాడట. 
అది నేటికి కొనసాగుతోంది. 
డచ్ వారి మీద విజయం సాధించిన తరువాత విజయ కారకుడైన కేశవ పెరుమాళ్ కు రాజా వీర కేరళ వర్మ తన పేరు వచ్చే విధంగా "వీరళం" అనే ఒక రకమైన పాయసాన్ని సమర్పించు కొన్నారట. 
స్వామి వారి విగ్రహంలో ఎన్ని సాల గ్రామాలున్నాయో అన్నింటికీ ఒక్కో దానికి ఇన్నిఅని లెక్క కట్టి వందల కిలోల బియ్యంతో ఈ నివేదన తయారు చేస్తారు నేటికి. ( ఎంతో రుచిగా ఉండే ఈ పాయసాన్ని స్వీకరించే భాగ్యం నాకు లభించినది. తెలియకుండానే ఈ రోజునే ఈ క్షేత్రాన్ని దర్శించుకొన్నాను). 
ఆలయంలో ఉన్న అనేక తమిళ శాసనాలు ఎందరో రాజులు, ప్రముఖులు స్వామికి సమర్పించుకొన్న కైకర్యాల వివరాలు తెలుపుతాయి. 
శ్రీ ఆది కేశవ పెరుమాళ్ మహత్యాన్ని తెలిపే మరో గాధ 1740 సంవత్సర కాలంలో జరినట్లుగా తెలుస్తోంది. 
ఆర్కాటు ను పాలించే నవాబు ఈ ప్రాంతం మీదకు దండ యాత్ర జరిపి విజయం సాధించి తిరిగి వెళుతూ స్వామి వారి తనతో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వెళ్లారట. 
తన రాజ భవనంలో పనికి రాని సామానులు పడవేసే గదిలో ఆ విగ్రహాన్ని అందునా కావాలని అన్నింటి క్రింద ఉంచారట సేవకులు. 
కానీ ఆశ్చర్యకరంగా  మరునాటి ఉదయానికి మూర్తి అన్నింటికన్నా పైన ఉండేదట. ఎన్నో   విధాలుగా విగ్రహాన్ని క్రింద ఉంచాలని చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయిట. 
అదే సమయంలో నవాబు భార్యకు త్రీవ్రమైన కడుపునొప్పి వచ్చి ఏ వైద్యానికి లొంగలేదట. 
సరిగ్గా అప్పుడే ఆలయ పూజారికి స్వామి స్వప్నంలో కనిపించి నవాబు భార్య అనారోగ్యం గురించి తెలిపి, విగ్రహాన్ని తిరిగి ఆలయానికి పంపితే ఆమె ఆరోగ్యం చక్కబడుతుందని ఈ విషయాన్ని నవాబుకు అందజేసి విగ్రహాన్ని తెచ్చే భాద్యత అతనికి అప్పగించారట. 
దేవ దేవుని ఆదేశం ప్రకారం వెళ్లి విషయాన్ని నవాబుకు తెలిపారట పూజారి. 
అప్పటికే భార్య అనారోగ్యం వలన మనస్థిమితం కోల్పోయిన ఆయన విగ్రహం పైకి రావడాన్ని పరిగణ లోనికి తీసుకొని పూజారి చెబుతున్నది సత్యమే అని నమ్మి మూర్తిని తిరిగి ఇచ్చేసారట. 
విగ్రహం ఆలయానికి చేరిన మరుక్షణం ఆమె స్వస్థతను పొందినదట. 
స్వామివారి మహత్యాన్ని పూర్తిగా నమ్మిన నవాబు ఒక బంగారు కలశం, బంగారు పళ్ళెం తన కానుకగా సమర్పించుకొన్నారట. 
నేటికి నివేదనకు వాటినే వాడుతున్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే "తిరు అల్ల పూజ "ను నవాబే ఆరంభించారట. ఆలయంలోని చిన్న మండపంలో నిర్వహించే ఈ కలశ పూజలో మహ్మదీయ ఆచారం ప్రకారం "అరిసె " నైవేద్యంగా పెడతారు. 
ఇవే కాకుండా ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, శ్రీ రామ నవమి, జన్మాష్టమి ఇతర స్థానిక పర్వదినాలలో ఆలయం వేలాది భక్తులతో కళ కళలాడుతుంది. 
తిరువట్టారు శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. 
శ్రీ నమ్మాళ్వార్ తన పది పాశురాలలో శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ని అనేక విధాలుగా కీర్తించారు. 
ఇక్కడికి తిరువనంతపురం, కన్యాకుమారి మరియు నాగర్ కొయిల్ నుండి చేరుకొనవచ్చును. 
ఎలాంటి సదుపాయాలు లభించవు. 
వాహనాన్ని అద్దెకు తీసుకొంటే సమీపంలోని ప్రదేశాలను తక్కువ వ్యవధిలో సందర్శించే అవకాశం ఉంటుంది. 
ఆలయంలో ఎట్టి పరిస్థితులలోను ఫోటోలను తియ్యనీయరు. 
అద్భుత శిల్ప చెక్క శిల్పాల నిలయమైన ఈ ఆలయ సౌందర్యాన్ని నేత్రాలతో చూసి మనస్సులో భద్రపరచుకోవాలి. 
జై శ్రీ మన్నారాయణ !!!! 
 


18, మార్చి 2014, మంగళవారం

Tiruvalla - Sri Vallabha Swamy Temple

   శ్రీ వల్లభ స్వామి ఆలయం - తిరువళ్ళ 

అరుదైన వల్లభ క్షేత్రాలలో తిరువళ్ళ ఒకటి. 
ఒకప్పుడు చిన్న పల్లె ప్రాంతం అయిన తిరువళ్ళ నేడు కేరళలో ఒక ప్రముఖ పట్టణం. 
మణిమాల నదీతీరంలో ఉండటం వలన గతంలో "వళ్ళ వాయి " ( నదీ తీరం) అని పిలిచేవారట. 
గౌరవ పదమైన "తిరు" (శ్రీ ) చేర్చి తిరువళ్ళ గా మార్పుచెందినది.  
శ్రీ వల్లభ స్వామి కొలువు తీరిన క్షేత్రంగా కూడా ఈ పేరు వచ్చినది అంటారు. .
ఇక్కడ  శ్రీమన్నారాయణుడు  "ఘంటాసురుడు " అనే శివ భక్తుడైన అసురునికి ముక్తి ప్రసాదించారని అంటారు. 
ఏడో శతాబ్దానికి చెందిన తమిళ గ్రంధాలలో తిరువళ్ళ ప్రస్తావన ఉన్నందున అంతకు పూర్వం నుండే ఈ క్షేత్రం గుర్తింపు పొందినదని భావించవచ్చును. 
ఇతర ఆధారాల ద్వారా తిరువళ్ళ ఒకప్పుడు పేరుపొందిన విద్యా కేంద్రం. 
కేరళ భూ భాగాన్ని సముద్రుని నుండి తీసుకొన్న తరువాత పరశురాముడు రప్పించిన అరవై నాలుగు బ్రాహ్మణ కుటుంబాలలో కొందరు ఇక్కడే స్థిరపడినారని తెలుస్తోంది. 
ప్రధాన ఆధారాలుగా పేరొందిన వివిధ కాలాల తామ్ర ఫలకాల ద్వారా ఆలయ పౌరాణిక గాధ, చరిత్ర రెండువేల సంవత్సరాల క్రిందటివని నిర్ధారించారు. 
శ్రీ వల్లభ స్వామి విగ్రహాన్ని దేవ శిల్పి విశ్వ కర్మ రూపొందించి ద్వాపర యుగాంతంలో శ్రీ కృష్ణుని సోదరుడైన సాత్యకి కి ఇచ్చారట. 
అప్పటికే అవతార సమాప్తికి నిర్ణయించుకొన్న లీలా మానుష రూప ధారి గరుడుని పిలిచి విగ్రహాన్ని భద్రపరచమని ఇచ్చారట. అతను ఇక్కడి నదీ తీరంలో నిక్షిప్త పరచారట. 
కలియుగారంభంలో కేరళ రాజైన "చేరమన్ పెరుమాళ్" కు ఒక నాటి రాత్రి స్వప్నంలో శ్రీ హరి నదీ తీరంలో నిక్షిప్త పరచిన విగ్రహం గురించి ఆధారాలు ఇచ్చారట. 
వాటి ప్రకారం స్థానిక నంబూద్రీలు మరియు ఇక్కడ స్థిరపడిన తుళు బ్రాహ్మణులూ సంయుక్తంగా జరిపిన అన్వేషణలో స్వామి వారి అర్చనా మూర్తి వెలుగులోనికి వచ్చినదట. 
అందుకే నేటికి ఈ రెండు వంశాల వారే ఇక్కడ పూజాదికాలు నిర్వహిస్తారు. 
అలా లభించిన మూర్తికి పాలకుడు క్రీస్తు పూర్వం యాభై తొమ్మిదో సంవత్సరంలో ఆలయం నిర్మించారని అంటారు. 
సుమారు పది ఎకరాల వైశాల్యంలో ఉన్న ఆలయానికి చుట్టూ ప్రహరి గోడ, నలుదిక్కులా నాలుగు ప్రవేశ ద్వారాలుంటాయి.
ప్రాంగణం లోనికి అడుగు పెట్టగానే సందర్శకులను అబ్భుర పరచే ఎత్తైన ఏకశిలా గరుడ స్థంభం కనపడుతుంది.
పక్కనే ఉన్న బలి పీఠం, ధ్వజ స్థంభం దాటిన తరువాత ప్రధాన ఆలయంలోనికి దారి తీసే ప్రవేశ ద్వారం కనపడతాయి.
పూర్తిగా కేరళ నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయంలో ముఖమండపం, అగ్రమండపం మరియు నమస్కార మండపం ఉంటాయి. వర్తులాకార శ్రీ కోవెల లో స్థానక భంగిమలో సుందర రూపుడైన శ్రీ వల్లభ స్వామి సుదర్శన, శంఖ మరియు పద్మాలను ధరించి ఎడమ ముందు చేతిని నడుము మీద ఉంచుకొని చక్కని అలంకరణతో రమణీయంగా దర్శనమిస్తారు.
గమనించవలసిన విషయం ఏమిటంటే ఒకేసారి స్వామి వారి ముఖము పాదాలను దర్శించలేరు.
ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత అది.
స్వామి వారి వెనుక శ్రీ సుదర్శన చక్రము ( చక్రత్తి ఆళ్వార్ ) పడమర ముఖంగా కొలువు తీరి ఉంటారు.
దూర్వాస మహా ముని శ్రీ సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించారని, ప్రతి రాత్రి ఆయన వచ్చి స్వామిని సేవించుకొంటారని అంటారు.
సుదర్శన చక్ర ప్రతిష్ట వెనక ఒక గాధ ప్రచారంలో ఉన్నది.
పురాణ కాలంలోశంకర మంగలతమ్మ అనే బ్రాహ్మణ వితంతువు ఇక్కడ నివసించేదట.
విష్ణు భక్తురాలైన ఆమె నియమంగా ఏకాదశి వ్రతం ఆచరిస్తూ ద్వాదశి నాడు బ్రాహ్మణునికి ఆతిధ్యం ఇచ్చేదట.





కొంత కాలానికి "తోలకాసురుడు" అనే రాక్షసుడు ఆ ప్రాంతాలకు వచ్చి ప్రజలను భయభ్రాంతులను చేసి వెళ్ళగొట్టేసాడట. దానితో ఆ సంవత్సరం శంకర మంగలతమ్మకు బ్రాహ్మణుడు దొరకలేదట. 
చింతాక్రాంతురాలైన ఆమె శ్రీ హరిని ప్రార్ధించినదట. 
అప్పుడు శ్రీ వల్లభుడు బ్రాహ్మణ వటువు రూపంలో వచ్చి ఆమెను పుష్కరణి వద్దకు బిక్ష తెమ్మనమని తెలిపారట. 
ఆమె అటు వెళ్ళగానే అక్కడికి భీకరంగా అరుస్తూ తోలకాసురుడు రాగా ఇరువురి నడుమ భీకర యుద్ధం జరిగినదట. 
చివరకు స్వామి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా అది అసురుని సంహరించి తీర్థంలో అంటిన రక్తాన్ని కడుగుకొని భూమిలో స్థిరపడినదట. 
భిక్ష తీసుకొని వస్తున్న శంకర మంగలతమ్మకు రాక్షసుని మరణ వార్త తెలిసినదట. 
పుష్కరణికి చేరుకొని ఆమె ప్రార్ధించగా వటువు రూపంలో ఉన్న వల్లభుడు తన నిజ రూప దర్శనమిచ్చి, మోక్షం ప్రసాదించారట. 
ఈ సంఘటనకు నిదర్శనంగా నేటికి మహా నైవేద్యాన్ని మూల విరాట్టు కన్నా ముందు ఒక బ్రాహ్మణునికి పెడతారు.  


శ్రీ వల్లభ స్వామి సన్నిధిలో చందనాన్ని వెనుక ఉన్న శ్రీ సుదర్శన మూర్తి వద్ద శివాలయంలో మాదిరి విభూది ప్రసాదంగా ఇవ్వడం చెప్పుకోవలసిన విషయం. 
సుమారు యాభై సంవత్సరాల క్రిందటి వరకు స్త్రీలకు ఈ ఆలయ ప్రవేశం నిషిద్దం. 
అతి సుందరుడైన వల్లభుని చూసి మైమరచి మహిళలు గర్భాలయం లోనికి వెళ్ళడమే ఇందుకు కారణం అని చెబుతారు. 
పూర్వం సంవత్సరానికి రెండు సార్లు తిరువతిర (డిసెంబర్ ), ధనుర్మాసం ( జనవరి) సందర్భంగా స్వామి వారికి కిరాతక వేషం వెసేవారట. దాని వలన మూల విరాట్టు అందవికారంగా కనపడేదట. 
ఆ సమయాల్లోనే మహిళలను  ఆలయం లోనికి అనుమతించేవారట . 
1967లో న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుతో నేడు ఆడవారు ఆలయం లోనికి రాగలుగుతున్నారు. 
ఇదే కాకుండా మరికొన్ని విశేషాలు ఉన్నాయి. 
ఆలయంలో స్వామికి ఒక రకమైన అరటి పండు మాత్రమే నివేదనగా పెడతారు. 
కధా కళీ నృత్య ప్రదర్శన మొక్కుబడిగా భక్తులు సమర్పించుకొంటారు. 
భక్తులు తాము కోరుకొన్న కోరిక నెరవేరితే స్వామివారికి కృతజ్ఞతగా ఒక రాత్రి కధాకళీ నృత్యాన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపుగా ప్రతినిత్యం ఒక ప్రదర్శన ఉంటుంది అంటే ఊహించుకోవచ్చును భక్తులకు వల్లభ స్వామి మీద ఉన్న అచంచల భక్తి విశ్వాసాలను. 
కేరళలో పేరొందిన కధాకళీ కళాకారులు చాలా మంది తిరువళ్ళకు చెందినవారే కావడం ఈ మొక్కుబడే కారణమేమో !
ధనుర్మాసం, కార్తీక మాసం, శబరి మండల మరియు మకర విళక్కు సమయాలలో విశేష పూజలు జరుగుతాయి. 
ఏకాదశి, శ్రీ రామ నవమి, కృష్ణాష్టమి, శివరాత్రి రోజులలో, స్థానిక పర్వ దినాలైన విషు మరియు ఓనం సందర్భంగా వేలాదిగా భక్తులు వళ్లభ దర్శనానికి తరలి వస్తారు. 
మే నెలలో జరిగే ఒక రోజు ఉత్సవం తిరువళ్ళ ఆలయ శోభను పెంచుతుంది. 
ఆ రోజున సమీప గ్రామాలైన కావిళ్, పదప్పాడ్ మరియు అలంతురత్ లలో కొలువైన భగవతి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు గజారూఢులై ఊరేగింపుగా తిరువళ్ళ వస్తారు. 
వైకుంఠ ఏకాదశి తరువాత ఆ రోజే ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. 
రాత్రి అంతా నాట్య గానాలు నిర్వహిస్తారు. అలా వైభవంగా గడిపిన తరువాత మరుసటి ఉదయాన తమ సోదరుని నుండి నూతన వస్త్రాలను తీసుకొని  భగవతి అమ్మవార్లు తమ స్వస్థానాలకు వెళతారు. 
ఉదయం అయిదు గంటల నుండి పన్నెండు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి వుంటుంది ఈ ఆలయం. 
పన్నిద్దరు శ్రీ వైష్ణవ గాయక భక్తులైన ఆళ్వార్ లలో ప్రముఖుడైన శ్రీ నమ్మాళ్వార్ శ్రీ వల్లభ స్వామిని కీర్తిస్తూ పది పాశురాలు గానం చేసారు. 
ఎర్నాకుళం నుండి కొట్టాయం మీదగా తిరువనంతపురం వెళ్ళే మార్గంలో ఉన్నది తిరువళ్ళ. 
అన్ని రైళ్ళు ఆగుతాయి. 
యాత్రీకులకు కావలసిన వసతులు లభిస్తాయి. 
స్టేషన్ నుండి అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం.   
జై శ్రీమన్నారాయణ !!!!






Sri Kala Hanuman Temple, Hyderabad

   శ్రీ కాలా హనుమాన్ మందిరం - (అత్తాపూర్) హైదరాబాద్ 

పవన సుతుడు పేరుకు తగినటులే భారత దేశంలో గాలి వీచే అన్నిప్రదేశాలలో కొలువుతీరి భక్తుల పూజలందుకొంటున్నారు. రామ భక్తుని ఆలయం లేని ఊరు కనపడదు. 
కొన్ని చోట్ల ఉప దేవతగా వెలసినా ఆనతి కాలం లోనే ప్రధాన అర్చనా మూర్తిగా మారిన క్షేత్రాలు ఎన్నో కనపడతాయి. అలాంటి వాటిల్లో హైదరాబాద్ లోని శ్రీ కాలా హనుమాన్ మందిర్ ఒకటి.  












ఎన్నో ఏళ్ళ క్రిందట స్థాపించబడిన ఈ మందిరం ఎంతో పౌరాణిక నేపద్యం కలిగి ఉన్నది.
మన అందరికీ జనమేజయుడు చేసిన సర్పయాగం చేసిన విషయం తెలిసిందే !
తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుని వంశ నాశనార్ధమై జనమేజయుడు సర్పయాగాన్నితలపెట్టాడు. ఆ యాగానికి తగిన స్థలంగా భావించి చేసినదిక్కడే అని అంటారు.
నిదర్శనంగా ప్రాంగణంలో ఉన్న పురాతన పుష్కరణి చూపుతారు. అదే నాటి యాగ గుండమని కాలక్రమంలో ఇలా కోనేరుగా రూపుదిద్దుకొన్నది అంటారు.






గోల్కొండను పాలించిన తానీషా వద్ద మంత్రులుగా ఉండిన అక్కన్న మాదన్న సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది.  

తదనంతర కాలంలో గుట్ట మీద ఉన్న గుహలో నాగేంద్రుడు కనిపించేవాడట. అదే విధంగా అర్హులైన భక్తులకే శ్రీ మన్నారాయణుడు అనంత శయనునిగాను, శ్రీ తిరుమల వెంకటేశునిగాను దర్శన మిచ్చేవారట. అలా గుట్ట మీద శ్రీ అనంత పద్మనాభ స్వామి కోవెల రూపుదిద్దుకొన్నది.
అందుకే ఈ క్షేత్రానికి అనంతగిరి అన్న పేరొచ్చినది.
అప్పట్లో జనమేజయుడు ప్రతిష్టించిన అంజనా సుతుని విగ్రహం మరుగున పడిపోగా, పదహారవ శతాబ్దంలో విజయ నగరాధీశుడైన శ్రీ కృష్ణ దేవరాయల వారి గురువైన శ్రీ వ్యాస రాయలు వెలికి తీసి పునః ప్రతిష్టించారు.శ్రీ వ్యాస రాయలు శ్రీ ఆంజనేయ ఉపాసకులు.ఎన్నో హనుమంతుని ఆలయాలను నిర్మించారు. మరుగున పడిన వాటిని వెలుగు లోనికి తెచ్చారు.





 

తొలుత ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. స్వామి స్వయంభూగా గుహలో వెలిశారని చెబుతారు.

అచిర కాలం లోనే భక్తులకు లభించిన దివ్యానుభూతులతో యిది హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ది కెక్కినది.
వాయు నందనుడు స్వయంగా ఆదేశించినందున ఇతర దేవాలయాలలో మాదిరి ఇక్కడ స్వామికి సింధూర వర్ణ లేపనం చేయరు.
ఈ కారణం చేతనే ఇక్కడి రామ దూత " కాలా ( నల్లని ) హనుమంతు"నిగా పేరొందారు.


 








ఉత్తర దిశలో ఉన్న స్వాగత ద్వారం దాటి లోపలికి వెళితే సువిశాల ప్రాంగణంలో ముందుగా కనపడేది గోశాల.
ఎన్నో గోవులతో కళ కళలాడుతూ కనపడుతుంది.
ముందుకి వెళితే తూర్పు ముఖంగా ఉన్న చిన్న ద్వారం ప్రధాన ఆలయానికి దారి చూపుతుంది.
ఇక్కడ మరో హనుమంతుని మందిరం మరియు రదోత్సవానికి ఉపయోగించే రధం కనపడతాయి. కొంతవరకు ఆధునీకరించిన ఆలయంలో కపీంద్రుడు ముకుళిత హస్తాలతో దాసునుగా దర్శనమిస్తారు.














నవ గ్రహ మండపం, శ్రీ లక్ష్మి దేవి సన్నిధి ఉంటాయి.
పుష్కరణికి పూడిక తీస్తున్నప్పుడు ఈ లక్ష్మి దేవి విగ్రహం లభించినట్లుగా తెలుస్తోంది.








అనంత గిరి వంశం వారే తరతరాలుగా ఆలయ నిర్వహణా భాద్యతలను చూస్తున్నారు. 








కోనేరుకు పడమర భాగంలో పురాతన శివ మందిరం కలదు.













దాసాంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న మెట్ల మార్గం గుట్ట మీదకి దారితీస్తుంది.
పురాతన మండపాలను దాటి వెళితే గుహ లోపల అనంత పద్మనాభ స్వామి విలాసంగా శయనించిన భంగిమలో సుందరంగా దర్శనమిస్తారు.
పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిది, మరియు అద్వైత సిద్దాంత రూపకర్త శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యుల వారి సన్నిధి ఉంటాయి.





















హనుమద్జయంతి, శ్రీ రామ నవమి, కృష్ణాష్టమి ఆదిగాగల హిందూ పర్వ దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. 
నియమంగా శ్రీ సత్యనారాయణ వ్రతాలు, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంటాయి. 






















శ్రీ కాలా హనుమాన్ మందిరానికి వెళ్ళే మార్గంలో చిన్న అనంతగిరి శ్రీ మహేశ్వర మందిరం, శ్రీ రామాలయం ఉంటాయి.
ఈ మందిరాలు సుమారు నాలుగు శతాబ్దాల నాటివిగా నిర్ధారించబదినవి.
శ్రీ కాలా హనుమాన్ మందిరం చాలా వరకు పురాతన నిర్మాణాలతో ఉండగా, శివాలయ పూర్తిగా ఆధునీకరించబడినది. శ్రీ రామాలయం పూర్తిగా నాటి నిర్మాణాన్నే ప్రదర్శిస్తుంది.
చెప్పుకోవలసిన అంశం ఏమిటంటే మూడు చోట్లా గోవుకి ఇచ్చిన ప్రాధాన్యత.

































హడావుడి, రణగొణ ధ్వనులకు పేరుగాంచిన నగరంలో పూర్తిగా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సందర్శకులలో అద్త్యాత్మిక భావాలను నెలకొల్పే ఈ ఆలయాలను భాగ్య నగరాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ దర్శించవలసినవి.
సికింద్రాబాదు నుండి, మహాత్మా గాంధీ బస్సు స్టాండ్ నుండి అత్తాపూర్ కి సిటీ బస్సులు ఉన్నాయి.


శ్రీ ఆంజనేయం !!!!

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...