అందరూ పూజ్యనీయులే
= ఇలపావులూరి వెంకటేశ్వర్లు
భారత దేశం పుణ్య భూమి. వేద భూమి, దైవ భూమి, కర్మ భూమిగా పేరొందినది.
భారత దేశం పుణ్య భూమి. వేద భూమి, దైవ భూమి, కర్మ భూమిగా పేరొందినది.
వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు పుట్టినదిక్కడే!
అవి భారతీయుల నిత్య జీవితాల మీద తమవైన ముద్ర వేసాయి.
అందుకే వాటిల్లోని పాత్రలను ఆదర్శంగా ఎంచుకొన్నారు. తమ జీవితాలను వాటికనుగుణంగా మలచుకొని తమదైన విశ్వాసాలతో, నమ్మకాలతో జీవనం కొనసాగిస్తున్నారు.
మహా విష్ణువు, సదాశివుడు, బ్రమ్హ దేవుడు, వారి అవతారాలు, మిగిలిన దేవతలు, దిక్పాలకులు, మహర్షులు అందరూ హిందూ మత గ్రంధాలలో ఉన్నవారే!
హిందువుల దైనందిన జీవితాలలో వీరి ప్రాధాన్యత ఎంత ఉన్నదో అందరికి తెలిసిన విషయమే!
పురాణాలలో రామాయణ భారతాల ప్రభావం హిందూ సమాజంమీద చాల శక్తివంతమైనది అని చెప్పవచ్చు.
ముఖ్యంగా పంచమ వేదంగా పేరొందిన మహా భారత ప్రభావం భారతీయుల మీద బలంగా కనిపిస్తుంది.
పద్దెనిమిది పర్వాలతో, లక్షకు పైగా శ్లోకాలతో, కొన్ని వేల పాత్రలతో, వారి మధ్య నెలకొన్న అనేకానేక సంఘటనలతో నిడిన ఈ మహా కావ్యం ఎంతో సందేశాత్మకమైనది.
హిందువులు అమితంగా గౌరవించే భగవద్గీత మరియు విష్ణు సహస్రనామం ఇందులోనివే !
మహా భారత గొప్పదనాన్ని విజ్ఞులు ఏక వాక్యంతో తెలిపారు.
" ఇందులో ఉన్నది అన్నింటా ఉన్నది - ఇందులో లేనిది ఎక్కడా లేదు "
ఇంతటి ప్రశంస పొందటానికి కారణం దీనిలోని ప్రతి పాత్రా తనదైన లక్ష్యంతో ( అది చెడ్డదా, మంచిదా అన్నది పట్టించుకోకుండా ) దానిని సాధించే దిశగా విశేష కృషి చేసారని గ్రంధాన్ని చదివితే అవగతమౌతుంది.
అందువలననే ఈ ఉద్గ్రంధం లోని ప్రతి పాత్ర దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో పూజలందుకొంటోంది.
దీనికి కారణాలు అనేకం.
ఆయా పాత్రల వలన ఆ ప్రాంతానికో, వర్గానికో లాభం జరగడం లేదా ఆ పాత్రలోని గుణగణాలు వారిని ప్రభావితం చెయ్యడం లేదా ఆ పాత్రతో భంధుత్వం ఉన్నది అన్న భావనో మరొకటో గానీ అందరూ మంచివి అని ఏక కంఠంతో పొగిడిన వారితో పాటు దుష్ట పాత్రలుగా తీర్మానించబడిన వారికి సంభందించిన ఆలయాలో, చిహ్నాలో, నిర్మాణాలో
ప్రముఖంగా గుర్తింపు పొందడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
మహా భారత గ్రంధాన్ని వేద వ్యాస మహర్షి చెబుతుండగా వినాయకుడు రచించాడని అంటారు.
ప్రధమ పూజితునిగా పేరొందిన గణపతి ఆలయాలు ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క ఆలయంలో ఉంటాయి.
ఆయనే ప్రధాన అర్చా మూర్తిగా కొలువైన ఆలయాలెన్నో దేశవ్యాప్తంగా నెలకొల్పబడి ఉన్నాయి. కాణిపాకం, అయినవిల్లి, పంపా గణపతి, పలవంగాడు మహా గణపతి, కేరళ పుర యిలా ఎన్నో క్షేత్రాలలో కొలువు తీరి కొలిచిన వారిని కాపాడుతున్నాడు పార్వతీ నందనుడు.
సకల విఘ్నాలను తొలగించి, సర్వ విద్యలను ప్రసాదించే విఘ్న నాయకుడు ఇతడు.
ఘంటం ఆపకుండా మహా భారాతాన్ని రచించిన ఆది రచయిత.
ఆయనే ప్రధాన అర్చా మూర్తిగా కొలువైన ఆలయాలెన్నో దేశవ్యాప్తంగా నెలకొల్పబడి ఉన్నాయి. కాణిపాకం, అయినవిల్లి, పంపా గణపతి, పలవంగాడు మహా గణపతి, కేరళ పుర యిలా ఎన్నో క్షేత్రాలలో కొలువు తీరి కొలిచిన వారిని కాపాడుతున్నాడు పార్వతీ నందనుడు.
సకల విఘ్నాలను తొలగించి, సర్వ విద్యలను ప్రసాదించే విఘ్న నాయకుడు ఇతడు.
ఘంటం ఆపకుండా మహా భారాతాన్ని రచించిన ఆది రచయిత.
ఆశువుగా మహా కావ్యాన్ని చెప్పిన వ్యాస భగవానుని సాక్షాత్ మహా విష్ణు అవతారమని పేర్కొంటారు.
ఈయన మహా భారతం రచించారని తెలిపే క్షేత్రాలు రెండు ఉన్నాయి.
మొదటిది ఉత్తరా ఖండ్ రాష్ట్రంలోని బదరీ నాథ్ కి దగ్గరలో సరస్వతీ నదీ తీరంలోని మన గ్రామంలో ఉన్న వ్యాస గుహలోనే పురాణ రచన జరిగిందని స్థానిక నమ్మకం. దీనికి ఉదాహరణగా గుహలో పుస్తకాలలోని పుటల మాదిరి కనిపించే శిలలను చూపుతారు. వీటిని వ్యాస పుస్తకం అని పిలుస్తారు.
ఇక్కడికి సమీపంలోనే గణేష గుహ కూడా ఉన్నది.
రెండవది మన రాష్ట్రంలో ముగురమ్మల రూపం అయిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి కొలువైన బాసర.
బ్రహ్మాండ పురాణం ప్రకారం వ్యాసుడు ఇక్కడ గోదావరీ తీరంలో ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించి సమీపంలోని గుహలో భారత రచన చేసాడని తెలుస్తోంది.
ఇక్కడీయనకొక ఆలయం ఉన్నది.
నిత్య పూజలు జరుగుతాయి.
వ్యాస మహర్షి మహా భారత సృష్టి కర్త కాగా కురు పాండవుల మూల పురుషుడు శంతను మహారాజు.
శంతనునికి ప్రత్యేకంగా గుడి లేక పోయినా మథుర పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గోవర్ధనగిరికి వెళ్ళే మార్గంలో ఉన్నది శంతన కుండ్. ఇక్కడే శంతనుడు సత్యవతిని చూసాడని, ఆమెను వివాహం చేసుకోన్నాక వంశాన్ని నిలిపే సుపుత్రుడు జన్మించాలని తపస్సు చేసాడని చెబుతారు .
ఈ గుండం మధ్యలో ఉన్న చిన్న మందిరంలో "శ్రీ శంతను బీహర్జి" కొలువై ఉంటారు. సంతానాన్ని కోరుకొనే ఆడవారు ఈ గుండంలో స్నానమాచరించి శంతను బిహర్జి ని నియమంగా సేవిస్తే కోరిక నెరవేరుతుంది అన్నది తరతరాల విశ్వాసం.
మథురకు ప్రక్కనే ఉన్న బృందావనం దగ్గరలో "పసోలి" అనే చోట మానస కుండ్ ఉన్నది. అక్కడ శంతను మహారాజు కుమారుడైన విచిత్ర వీర్యుడు తన తల్లి సత్యవతి మరియు అన్న భీష్ముని సంభందాన్ని శంకించినందుకు పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంగా తపస్సు చేసాడని తెలుస్తోంది.
ఒకప్పుడు చాలా పెద్దదైన గుండం ఇప్పుడు పూర్తిగా కనుమరుగై పోయినట్లు, తిరిగి పునరుద్దరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
శంతనుడు కురు వంశానికి మూల పురుషుడు కాగా గంగా దేవి ఆ వంశానికి ఒక ఆదర్శ వీరుని ఇచ్చినది.
అలాంటి గంగా దేవికి హరిద్వార్ చుట్టు ప్రక్కల చిన్నా పెద్ద మందిరాలు చాల ఉన్నాయి.
కానీ రాజస్తాన్ లోని భరతపూర్ లో గంగ దేవికి అద్భుతమైన మందిరం ఉన్నది. మహా రాజా బల్వంత్ సింగ్ సంతానం కొరకు గంగా మాతను ప్రార్ధించారు. వారసుడు జన్మించడంతో 1845 వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. వివిధ కారణాల వలన నిర్మాణ పనులు తొంభై ఒక్క సంవత్సరాలు కొనసాగింది. బల్వంత్ సింగ్ వంశంలో అయిదో తరం వాడైన బ్రిజేంద్ర సింగ్ అధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. చూడ చక్కని శిల్పాలతో సుందర గంగా మాత విగ్రహం, ఆమె వాహనం అయిన అతి పెద్ద మొసలి విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
గంగా దేవికి, శంతను మహారాజుకి జన్మించినవాడే కురుకుల పితామహుడు భీష్ముడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. కన్న తండ్రి కోరిక నెరవేర్చడానికి అనితర సాధ్యమైన ప్రతిజ్ణ చేసి భీష్మ అన్న బిరుదు పొందారు.
వార ణాసి ( కాశి ) లో గంగ వడ్డున ఒక భీష్మ మందిరం ఉన్నది. భక్తులు దీర్గాయుషు కోరుతూ ఇక్కడ పూజలు చేస్తారు.
హర్యానాలోని కురుక్షేత్రంలో నాగవాసుకి మందిర ప్రధాన ద్వారం వద్ద 1961వ సంవత్సరంలో శయన భీష్ముని మందిరాన్ని నిర్మించారు.
మహాభారత యుద్ధం జరిగిన ఇదే కురుక్షేత్రం కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తనేసర్ లో అంప శయ్య మీద ఉన్న తాత దాహం తీర్చడానికి అర్జనుడు తన బాణంతో తెప్పించిన పాతాళ గంగతో ఏర్పడిన భీష్మ కుండ్ ఉన్నది.
ఈ స్థలంలోనే ధర్మరాజు అడిగిన సందేహాలకు సమాధానంగా భీష్ముడు శ్రీ విష్ణు సహస్ర నామ విశిష్టత తెలిపినదిక్కడే!
ఈ తటాకం చుట్టు ప్రక్కల ఎన్నో మందిరాలుంటాయి.
భీష్మ పితామహుని తరువాత మహా భారతంలో చెప్పుకోదగ్గ పాత్ర శ్రీ దూర్వాస మహామునిది. ఈ స్వామి ఉపదేశించిన మంత్రం మూలానే కుంతి దేవి వివాహానికి ముందే సూర్య వర ప్రసాదిగా కర్ణుని, వివాహానంతరం భర్త అనుమతితో పంచ పాండవులను పుత్రులుగా పొందినది.
ఒక్క మహా భారతమే కాదు అన్ని పురాణాలలో తనదైన పాత్ర పోషించారు ఈ మహర్షి.
ముక్కోపానికి మారుపేరైన ఈయన ఈశ్వరుని అంశతో అత్రి మహా ముని అనసూయ దంపతులకు జన్మించారు.
ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ ఘర్ జిల్లా ఫుల్పూర్ లో టాన్స్ మరియు మజ్హుహూ నదుల సంగమ క్షేత్రంలో పురాణ కాలంలో దూర్వాసుని ఆశ్రమం ఉండేదట. ఎందరో విద్యార్ధులు ఇక్కడ విద్య నేర్చుకోవడానికి వచ్చేవారట.
ప్రసిద్ద శైవ క్షేత్రం అయిన తిరువన్నమలై లో గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో వచ్చే సోన తీర్థం దగ్గరలో దూర్వాస మునికొక ఆలయం ఉన్నది. పౌర్ణమినాడు ఎందరో భక్తులు ముఖ్యంగా సంతానం కోరుకొనేవారు, సొంత ఇంటి కల నిజం చేసుకోవాలనుకొనేవారు ఎక్కువగా వస్తారు. సంతానం కోరుకొనేవారు విగ్రహం వెనుక ఉన్న వేప చెట్టుకు పచ్చని తోరణం కట్టి మూడు నేతి దీపాలను వెలిగిస్తే సత్సంతానం కలుగుతుంది అన్నది స్థానిక నమ్మకం. అలానే సొంత ఇల్లు కట్టుకోవాలనుకునేవారు నాలుగు రాళ్ళను నలు పక్కలా పేర్చి మద్యలో దీపం వెలిగిస్తే వారి కల నెరవేరుతుందని చెబుతారు.
కురు కుమారుల తల్లి తండ్రులైన ద్రుత రాష్ట్ర , గాంధారి దేవి దంపతులలో గాంధారి దేవికి ప్రత్యేక ఆలయాల రాష్ట్రం అయిన కేరళ రాజధాని తిరువనంతపురం రైల్వే స్టేషన్ కి రెండు కిలోమీటర్ల దూరంలో స్టాట్యూ సర్కిల్ దగ్గరలో ఉన్నది. మే నెలలో వచ్చే చైత్ర పౌర్ణమి నాడు పెద్ద ఉత్సవం జరుగుతుంది.
ద్రుత రాష్ట్ర మహా రాజుకు మన దేశంలో ఎక్కడా ఆలయం లేదు. కానీ ఒక చిత్రమైన విషయం తెలిసింది.
బౌద్ద మతం ప్రకారం ద్రుత రాష్ట్రుడు ఒక దిక్పాలకుడు.ఈయన తూర్పు దిక్కును, వాయువును శాసించే వాడని తెలుస్తోంది.చైనా లోని అతి పెద్ద బౌద్ద ఆరామాలలో ఒకటి అయిన లింగ్ యిన్ ఆరామంలోని దర్బార్ హాల్లో ( దీనినే వారు హాల్ ఆఫ్ హెవెన్లీ కింగ్స్ అంటారు ) "పిప" అనే ప్రత్యేక వాయిద్యం పట్టుకొన్నచిత్రమైన ధృతరాష్ట్ర చిత్రపటం ఉన్నది. ఈయనకు మహా భారత ద్రుతరాస్ట్రునికి సంభంధం లేక పోయినా పేర్లు ఒకటి అయినందున యిది ఉదహరించడం జరిగింది.
పాండు నందనులుగా పేరొందిన పాండవుల తండ్రి పాండు రాజుకు ఎక్కడా ఆలయం లేదు.కాని సిక్కులకు పవిత్ర దర్శనీయ క్షేత్రం అయిన హేమకుండ్ సాహిబ్, (ఉత్తరా ఖండ్ )లో కొంత కాలం పాండు రాజు తపస్సు చేసాడని, యోగ విద్య అభ్యసించారని తెలుస్తోంది.అలానే కేరళ లోని చెంగనూర్ సమీపంలోని తిరు క్కోడి త్తానం అన్న ఊరిలో పాండు రాజు మరణించారని, అక్కడే ఆయనతో పాటు ఆయన చిన్న భార్య అయిన మాద్రి సహగమనం చేసారని అంటారు. ఈ సంఘటనకు నిదర్శనంగా ప్రతి సంవత్సరం నవంబర్ లో జరిగే ఆలయ ప్రధాన ఉత్సవాలలో ఒక రోజున దీప ఉత్సవం జరుపుతారు.ఆ సందర్భంగా మాద్రి చేసిన సహగమనాన్నితమదైన శైలిలో ప్రదర్శిస్తారు.ఈ ఆలయాన్ని సహదేవుడు నిర్మించాడన్నది పురాణ గాధ. తప్పక దర్శనీయ ఆలయం.ఎన్నో అరుదైన శిల్పాలు, చిత్రాలు, వివిధ రాజ వంశాల శాసనాలు ఉన్నాయిక్కడ.
పాండు రాజు సతీమణి కుంతీ దేవికి గుజరాత్ రాష్ట్రంలో చాలా ఆలయాలున్నాయి. వీటిల్లో అత్యంత పురాతనమైనది అహ్మదా బాద్ కి రెండు వందల కిలో మీటర్ల దూరంలోని "దేదియా పర" లో ఉన్నది. స్థానికులు "దేవి మొగ్రా మందిరం"గా పిలిచే ఈ ఆలయం ఆరువేల సంవత్సరాల చరిత్ర కలిగిఉన్నదని , వాయుసుతుడైన భీముడికి రాక్షస యువతి హిడింబ తో వివాహం జరిగినదిక్కడే అని తెలిపే ఎన్నో గాధలు ప్రచారంలో ఉన్నాయి.
దుర్వాస మహా ముని ఉపదేశించిన మంత్రం ప్రభావంతో కుంతీ దేవికి తమ అంశలతో సంతానాన్ని ప్రసాదించిన వారు సూర్య భగవానుడు , యముడు, ఇంద్రుడు, వాయువు, అశ్వనీ దేవతలు. వీరిలో ఇద్దరికీ మన దేశంలో ఆలయాలు ఉన్నాయి. మిగిలిన వారికి వారికంటూ విడిగా ఆలయాలు లేకున్నా వారితో ముడిపడి ఉన్న దేవాలయాలు కొన్నిఉన్నాయి.
ప్రత్యక్ష నారాయణుడు, లోకానికి వెలుగును ప్రసాదించే శ్రీ సూర్యనారాయణ స్వామికి దేశంలో చాలా ప్రదేశాలలో ఆలయాలున్నాయి. మన రాష్ట్రంలో అయిదు సూర్య దేవాలయాలున్నాయి.
అరసవిల్లి, గొల్లల మామిడాడ, నంది కొట్కూరు, బూదగవి మరియు హైదరాబాద్.
శ్రీ సూర్యనారాయణ స్వామి వర ప్రసాదిగా కర్ణుడు, కుంతీ దేవికి వివాహానికి ముందే జన్మించాడు.
అరసవిల్లి
నందికోట్కూరు
వివాహానంతరం భర్త ఆజ్ఞ మేరకు యమ ధర్మ రాజును ఆరాధించి యుధిష్టరునికి జన్మనిచ్చినది. యమునికి తమిళ నాడు లోని తంజావూరు కి సమీపంలోని తిరు చిత్రాంబలంలో ఒక విశేష ఆలయం ఉన్నది.
ఇక్కడ శివుని కోపాగ్నికి భస్మమైన మన్మధుడు పునర్జీవితుడైనాడట.
ఆషాడ మాసంలో, మాఘ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి దీర్గాయువు కొరకు యమ ధర్మ రాజుని ప్రార్ధిస్తారు.
కుంతీ దేవికి భీమ సేనుకని అనుగ్రహించిన వాయు దేవునికి,అర్జనుని ప్రసాదించిన దేవేంద్రునికి ప్రత్యేకంగా ఆలయాలు లేకున్నా శ్రీ కాళహస్తి లోని శ్రీ కాళ హస్తీశ్వర స్వామి ఆలయం , గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయం వాయు దేవునితో, తమిళ నాడులోని అనేక ప్రముఖ ఆలయాలు ఇంద్రునితోనూ ముడిపడి ఉన్నాయి.
అలాగే నకుల, సహదేవుల జన్మకు కారకులైన అశ్వనీ దేవతలకు ఎక్కడా ఆలయాలు లేవు.
కురు పాండవులకు చిన్నాన్న వరసయ్యే విదురునికి ఆలయాలు లేక పోయినా "విదురాశ్వద్ద" అనే పేరుతొ కర్నాటక రాష్ట్రం చిక్ బల్లారపూర్ జిల్లా గౌరిబిదనూర్ తాలూకాలో ఉన్నది. ఈ ఊరిలో విదురుడు నాటాడని చెప్పే అశ్వద్ద వృక్షం ఉంటుంది. భక్తులు సంతానం కొరకు ఇక్కడకు వచ్చి అశ్వద్ద వృక్షానికి, నాగ దేవతకి ప్రదక్షిణాలు చేస్తారు. ఈ పురాణ క్షేత్రం మన రాష్ట్రం లోని హిందూపూర్ ( అనంతపురం జిల్లా ) కి పదిహేను కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
ద్రోణాచార్య కురు,పాండవులకు విద్య నేర్పిన గురువు.
మన దేశ రాజధాని ఢిల్లీకి చేరువలో ఉన్న గురుగావ్ ద్రోణా చార్యుని జన్మస్థలమని, ఆయన పేరు మీదగానే ఈ పేరోచ్చినది అంటారు. అలానే ఢిల్లీ కి యాబై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ బుద్ధా జిల్లాలోని "దాన్కుర్" గ్రామంలో కురు పాండవులకు విద్య నేర్పారట. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ద్రోణాచార్య నగరం అని పిలిచేవారట. ఇక్కడి ఆలయంలో ఏకలవ్యుడు తయారు చేసుకొన్నద్రోణుని విగ్రహాన్ని నేటికీ చూడవచ్చును.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్ కి దగ్గరలోని "శాస్త్ర ధర్" ఊరిలోని శివ లింగాన్ని గురు దేవుడే ప్రతిష్టిం చాడని, ఇదే రాష్ట్రంలోని కాశీ పూర్ ని పాండవులు గురు దక్షిణగా నిర్మించి ద్రోణునికి సమర్పించుకోన్నారని తెలుస్తోంది. అదే విధంగా ద్రోణునికి శిష్యుడు కాని శిష్యుడైన ఏకలవ్యునికి గురుగావ్ ముప్పై ఏడవ సెక్టార్ లోని ఫారుఖ్ నగరులో ఒక ఆలయమున్నది.
ద్రోణుని భార్య అయిన కృపి కి ఒక విశిష్ట ఆలయం గురుగావ్ లోనే ఉన్నది. భక్తులు "శీతలా దేవి"గా పిలుస్తూ ఆరోగ్య ప్రదాయనిగా కొలుస్తారు. ప్రతి నిత్యం వేలాది భక్తులతో కళ కళ లాడే ఈ దేవాలయం చైత్ర, శ్రావణ మాసాలలో లక్షలాది భక్తులతో కిట కిట లాడుతుంది. ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల చరిత్రకలిగినదిగా పేర్కొంటారు.
ఈమె సోదరుడు, కురు పాండవులకు మరో గురువు అయిన కృపా చార్యునకు ఆలయం లేకున్నా కడప నగరంలోని తిరుపతికి గడప అని పేర్కొనే దేవుని కడప లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కృపుడే ప్రతిష్టించారని ఒక గాధ ప్రచారంలో ఉన్నది.
ద్రోణుని కుమారుడు, సప్త చిరంజీవులలో ఒకరైన అశ్వద్దామ కు ఒక ఆలయం కర్ణాటకలోని బెల్గావ్ నగరంలో ఉన్నది. సంవత్సరంలో ఒక్క సారికూడా సామాన్యులు ఆలయంలోనికి వెళ్ళే ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే పసి వారైన ఉప పాండవులను రాత్రి పూట అధర్మంగా సంహరించినవానిని దర్శించుకుంటే అశుభం అని భావించడమే దీనికి కారణం. కానీ హోలీ పండుగ మరునాడు వేలాదిగా భక్తులు ఆలయం చుట్టూ పొర్లు దండాలు పెట్టి, లోపలికి వెళ్లి దర్శనం చేసుకొంటారు.ఈ చిత్రమైన ఆచారానికి తగిన ఆధారం ఏమిటి అన్నది తెలియడంలేదు.
మన రాష్ట్రంలోని నెల్లూరుకు సమీపలోని నారసింహ క్షేత్రం అయిన నరసింహ కొండ మీద ఉన్న గుహలలోఅశ్వద్దామ తపస్సు చేసాడని అంటారు.
ఇక మహా భారత విజేతలైన పంచ పాండవుల విషయానికి వస్తే అగ్రజుడైన యుదిష్టునికి ద్రౌపది దేవితో కలిసి కొలువై ఉన్న ఆలయాలు మన రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలో చాలా ఉన్నాయి. నెల్లూరు పట్టణం మూలపేటలో పురాతనమైన శ్రీ కృష్ణ ధర్మ రాజ స్వామి ఆలయం ఉన్నది. అదే విధంగా గూడూరు, శ్రీ కాళ హస్తి, చిత్తూరు పట్టణాలలో శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజ ఆలయాలున్నాయి. తమిళ నాడులో ద్రౌపది అమ్మన్ ఆలయాలు చాలా ఉన్నాయి.
బెంగళూరు నగరంలో "నాగరత్"లో ఉన్న ధర్మరాజ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. ప్రతి ఏడాది మార్చి నెలలో "కరగ" ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వేలాది భక్తులు పాల్గొంటారు.
పాండవులలో రెండవ వాడైన భీమ సేనునికి కర్నాటక రాష్ట్రం, కోలార్ జిల్లా మోతకపల్లి గ్రామంలో మోదక వృక్షం క్రింద ఒక ఆలయం ఉన్నది. కోరిన కోర్కెలు తీర్చేవానిగా, ప్రయాణాలలో ఆటంకాలు, ప్రమాదాలు రాకుండా కాపాడే వానిగా శ్రీ బాల భీమ స్వామి ప్రసిద్ది.
భీమ సేనునికి అత్యంత పురాతనమైన ఆలయం ఒకటి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఛండీ ఘర్ , సిమ్లా జాతీయ రహదారిలోవచ్చే "పింజోర్" గ్రామంలోని ఆలయాన్ని 606 వ సంవత్సరంలో "సిర్కా రామదేవ మహారాజు" నిర్మించారు. చాలాకాలం అజ్ఞాతంలో ఉండి 1974 వ సంవత్సరంలో వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం అద్భుత శిల్పాలకు నిలయం. భీమసేనునికి మన పొరుగు దేశం అయిన నేపాల్లో కూడా ఆలయాలు ఉన్నాయి. ఆయనను వ్యాపార అభివృద్ధికి సహాయపడేవానిగా ఆరాధిస్తారు.
పాండవ మధ్యముడైన అర్జనునకు భారత దేశంలో ఆలయాలు లేవు. ఇండోనేషియా దేశంలోని జావా లో ఉన్న దేయింగ్ ప్లాటో అనే శివాలయాన్ని అర్జున ఆలయం అని పిలుస్తారు. 809 వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయం ఇండోనేషియాలో అతి పురాతన హిందూ ఆలయంగా పేరొందినది. అదే విధంగా కేరళలోని చాలా విష్ణు ఆలాయాల నిర్మాణం వెనుక అర్జనుడున్నాడని అక్కడి పురాణ గాధలు తెలియజేస్తున్నాయి.
పంచ పాండవులలో ఆఖరి వారైన నకుల సహదేవులకు కూడా ఎక్కడా ఆలయాలు లేవు. కానీ కేరళలోని తిరువిత్తకోడ్, తిరుక్కోడిత్తనం, తిరువంవండూరు క్షేత్రాలలోని శ్రీ మహా విష్ణు ఆలయాలను వీరు నిర్మించినట్లుగా స్థల పురాణాలు తెలుపుతున్నాయి. ఇక పంచపాండవులతో ముడిపడి ఉన్న చారిత్రాత్మక నిర్మాణాలను మహా బలిపురంలో వీక్షించవచ్చును.
కౌరవుల విషయానికి వస్తే అగ్రజుడు రారాజు దుర్యోధనునికి ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో "మోరి, దివోర, ఓస్ల, గంగార్, దత్మీర్" లాంటి గ్రామాలలో ఆలయాలున్నాయి.
ఇక్కడొక విశేషం ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ లోని "ఘర్వాల్,కిన్నారు,కులు" ప్రాంతంలో పాండవులు పూజనీయులు. ఉత్తరా ఖండ్ లోని తమస్ నది పరివాహక ప్రాంతంలో కౌరవులు పూజ్యనీయులు. అసలు దుర్యోధనుని మరణ వార్త తెలిసి రొదించినవారి కన్నీటితో ఏర్పడినదే తమస్ నది అని ఒక నమ్మకం. అందుకే ఈ నది నీటిని తాగారు.
మోరి గ్రామంలోని దుర్యోధన ఆలయం .
కురు సార్వభౌమునికి కేరళలోని కొల్లం జిల్లా పొరువలి గ్రామంలో ఒక ప్రత్యేక ఆలయం ఉన్నది.
పోరువాలి పెరువురితి మలనాడ దుర్యోధన క్షేత్రం
ఇక్కడ నివసించే కురువ వంశం వారి కుల దైవం దుర్యోధనుడు.ఉత్తరాదిలోగాని,దక్షినాదిలోగాని దుర్యోధనుని ఆలయాలలోఎలాంటి విగ్రహము ఉండదు.గద్దె లాంటి పీఠాన్ని పూజిస్తారు.పొరువలి పెరువురతి మలనాడ క్షేత్రంలో కూడా గద్దెకే ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.పొగాకు, కొబ్బరి కల్లు లాంటి నివేదనలు సమర్పించుకొంటారు. కోడి పుంజులను కానుకగా యిస్తారు. ఇక్కడికి సమీపంలోనే మాయా జూద నిపుణుడు, కురు వంశ నాశనానికి కారకుడైన శకుని ఆలయం కూడా కలదు. ప్రపంచం మొత్తంలో శకునికి ఉన్న ఒకే ఒక్క ఆలయమిది. పీఠం మీద కొలువుతీరి సేవకుల నీరాజనాలందుకొంటున్న గాంధార రాజ పుత్రుని వైభవం చూడాల్సినదే !
సూర్య పుత్రుడు, అడిగిన వారికి లేదని చెప్పని దానశీలి అయిన కర్ణునికి ఉత్తరాఖండ్ లో పెక్కు ఆలయాలున్నాయి.
కర్ణ ప్రయాగ, దియోరా , నెట్వర్ అనే చోట్ల కర్ణుడు పూజ్యనీయుడు.
ధుశ్యాసనునికి, మిగిలిన కౌరవులకు ఆలయాలు లేవు.
బీమసేనుని వివాహమాడిన రాక్షస కన్య హిడింబికి హిమాచల్ ప్రదేశ్ లోని మనాలికి సమీపంలో ఒక ఆలయం ఉన్నది.
హిడింబ దేవి ఆలయం
ఇక్కడికి దగ్గరలోనే ఆమె కుమారుడైన ఘటోత్కచునికి ఒక ఆలయం ఉన్నది. ఘటోత్కచునికి యాదవ రాజ కుమార్తె అయిన "ఆహిలావతి"కి జన్మించినవాడు "బర్బరీకుడు" (బారబరిక). మహా యోధుడు. శ్రీ కృష్ణుని మాయ చేత కురుక్షేత్ర యుద్దానికి ముందే ప్రాణ త్యాగం చేసిన త్యాగశీలి. ఈయనను "ఖటు శ్యాం జీ" అని కృష్ణుని పేరుతోనే పిలుస్తూ ఆరాధిస్తారు. రాజస్తాన్ లోని శిఖర్ జిల్లా ఖటు గ్రామంలో వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించబడిన సుందర ఖటు శ్యాంజీ ఆలయం ఉన్నది. మరో ఆలయం గుజరాత్ లోని సూరత్ లో ఉన్నది.
బర్బరీకుని లాంటి కధే అర్జునునికి నాగ కన్య ఉలూచికి జన్మించిన "ఇరవన్" ది కూడా !
ఇతను కూడా మహా యోధుడు. వీరిద్దరి ప్రాణ త్యాగం వెనుక వున్నకధలలోఎన్నో సారూప్యాలున్నాయి. బారబరిక శ్రీ కృష్ణ నామాన్ని కోరుకోగా, ఇరవన్ నీల మేఘ శ్యామునినే భర్తగా వాంచింఛాదు. ఇరవన్ కూడా బారబరిక మాదిరి
శ్రీ కృష్ణుని మాయ చేత యుద్దానికి ముందే బలిదానం చేసాడు. కాకపొతే ఇతని కోర్కె మేరకు శ్రీ కృష్ణుడు,మోహిని అవతారం ధరించి అతనిని వివాహం చేసుకొని ఆ రాత్రి గడిపారట. తొమ్మిదో శతాబ్దములో రచించిన తమిళ మహా భారతం ప్రకారం జరిగిన కధ ఇది. ఈయనకు తమిళ నాడులో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అన్నింటి లోనికి విల్లుపురం జిల్లాలో ఉన్న "కూవగం" ఆలయం ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం ( ఏప్రిల్- మే ) లో పదిహేను రోజుల పాటు జరిగే ఉత్సవంలో వేలాది మంది కొజ్జాలు పాల్గొంటారు. వారు తమని తాము మోహిని అవతారంగా భావించుకొంటూ, ఇరవన్ ( స్థానికంగా కూతండవర్ అంటారు )ని వివాహమాడి, మరునాడు అతని మరణానికి దుఖాన్ని అనుభవించి, వైధవ్యాన్ని స్వీకరిస్తారు.దేశంలోనే హింజ్రాలు పాల్గొనే అతి పెద్ద ఉత్సవం యిది.
బారబరిక విషయంలో లాగానే ఇరవన్ తల భాగాన్నే పూజిస్తారు.
తమిళ నాడు లోని ప్రతి ద్రౌపది దేవి ఆలయంలో తప్పనిసరిగా కూతండవర్ ఉప ఆలయంలో కొలువుతీరి ఉంటాడు.
ఇవే కాకుండా మహా భారత పాత్రధారులతో ముడిపడివున్న పర్యాటక స్థలాలు కొన్ని ఉన్నాయి.
తమిళ నాడు లోని ధర్మపురి నుండి పళని వెళ్ళే మార్గంలో వెయ్యి సంవత్సరాల పురాతన శ్రీ వాగీశ్వర స్వామి ఆలయం ఉన్న కీరనూర్ అప్పట్లో విరాట్ నగరమని, భీముడు కీచకుని సంహరించినదిక్కడే అని ఒక గాధ ప్రచారంలో ఉన్నది. మరికొన్ని ఆధారాల ప్రకారం మన రాష్ట్రం ఖమ్మం జిల్లా లోని నేలకొండ పల్లినే నాటి విరాట్ నగరంగా పేర్కొంటారు. తవ్వకాలలో విరాట రాజు దిబ్బ, కీచక గుండం బయట పడినాయి.
భీమ జరాసంధుల యుద్ధం జరిగిందని తెలిపే "జరాసంధ అఖర" నలందా జిల్లా ( బీహార్ ) లోని రాజగిరి లో ఉన్నది అని తెలుస్తోంది.
ఇలా ఎన్నో మహా భారత పాత్రలు అనేక ప్రాంతాలలో పూజ్యనీయులుగా నీరాజనాలందుకొంటున్నారు.యత్ భావమ్ తత్ భవతి!
అసలు సూత్రధారి అయిన శ్రీ కృష్ణునికి దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఉడిపి, గురవాయూర్, ద్వారక, పూరి లాంటి ఎన్నో క్షేత్రాలలో నటన సూత్రధారి స్థిర నివాసమేర్పరచుకొని ఉన్నారన్నది నమ్మిన భక్తుల స్వానుభవం.
కురుక్షేత్ర యుద్దారంభంలో అర్జనునికి ఉపదేశించిన భగవద్గీత హిందువులందరికీ నిత్య పారాయణ గ్రంధం.
శ్రీ విష్ణు సహస్ర నామం మోక్షప్రదాయకం అన్నది శ్రీ షిర్డీ సాయి బాబా లాంటి అవతార పురుషుల వాక్యం.
శ్రీ విష్ణు అన్న నామానికి అర్ధం సర్వాంతర్యామి.