11, జనవరి 2025, శనివారం

Only One Brahma Temple, Chebrolu

 

శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం   

  
లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోకంలో ఆలయాలలో కొలువుతీరి భక్తుల సేవలు అందుకుంటూ కొలిచిన వారిని కాపాడుతున్నారు. 
కానీ సృష్టికర్త బ్రహ్మదేవునికి ఎక్కడా ఆలయం లేకపోవడం చెప్పుకోవలసిన విషయం. విధాతకు పూజార్హత లేకపోవడానికి సంబంధించి కొన్ని గాధలు వినిపిస్తాయి. అసత్యమాడినందుకు కైలాసనాధుడు ఇచ్చిన శాపం కారణంగా చెబుతారు.  మరో గాథ ప్రకారం త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అన్న విషయాన్నీ కనుగొనడానికి మహర్షుల కోరిక మీద సత్య లోకానికి వెళ్లిన భృగు మహర్షి తనను పట్టించుకోని కమలాసనునికి భూలోకంలో పూజలు ఉండవని శపించారని తెలుస్తోంది. 








ఈ రెండు గాధల సారాంశం ఏమిటంటే బ్రహ్మ దేవువునికి భూలోకంలో పూజలు చేయరు అన్నదే!
చిత్రంగా కొన్ని క్షేత్రాలలో హంసవాహనుడు కొలువై పూజలు అందుకోవడం కనపడుతుంది. వాటిల్లో విశేషమైనది రాజస్థాన్ రాష్ట్రంలోని "పుష్కర" క్షేత్రం. 
అదే విధంగా తమిళనాడు మరియు కేరళలో కొన్ని క్షేత్రాలలో సృష్టికర్త కొలువై ఉండటం కనిపిస్తుంది. 
మన రాష్ట్రంలో కూడా ఒక బ్రహ్మ ఆలయం ఉండటం చెప్పుకోవలసిన విషయం. 
ఈ బ్రహ్మ ఆలయం పద్దెనిమిదో శతాబ్దకాలంలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. 
ఎవరు ? ఎందుకు ? ఎప్పుడు ? ఈ ఆలయాన్ని నిర్మించారు అన్న విషయాలను తెలుసుకొందాము. 

చేబ్రోలు 

క్రీస్తు పూర్వం నుండి మానవ నాగరికత నెలకొన్న చేబ్రోలు ఒకప్పుడు రాజకీయంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా అనేక గ్రంధాలూ, పరిశోధనలు, శాసనాలు తెలియచేస్తున్నాయి. క్రీస్తుశకం రెండవ శతాబ్ద కాలంలో శాతవాహన రాజులు వేసిన శాసనాన్ని నేటికీ మనం చూడవచ్చును. 
ఒకప్పుడు లోహపరిశ్రమకు ప్రసిద్దికెక్కి "తామ్ర పురి"గా పిలవబడిన నేటి చేబ్రోలు లో జైన, బౌద్ధ మరియు హిందూ మతాలు ఒకదాని తరువాత ఒకటి వెళ్లి విరిశాయని చెబుతారు. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో లభించిన శతాబ్దాల పూర్వపు జైన, బౌద్ధ మరియు హిందూ నిర్మాణాల అవశేషాలు, నాటి పత్రాలు, శాసనాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 
క్రీస్తుశకం తొలి శతాబ్దం నుండి ఇక్కడ హిందూ ఆలయాల నిర్మాణాలు వివిధ రాజ వంశాల కాలంలో జరిగినట్లు ఆధారాలు ఎన్నో లభించాయి. ఒకప్పుడు ఇక్కడ నూటికి పైగా ఆలయాలు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి. 
శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామి మరియు శ్రీ ఆది కేశవ స్వామి ఆలయాలు తొమ్మిది నుండి పదకొండవ శతాబ్ద మధ్య కాలాలలో నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. 
ముఖ్యంగా ఒకే క్షేత్రంలో త్రిమూర్తులు కొలువై ఉండటం అత్యంత అరుదైన విశేషం. అలాంటి అద్భుతాన్ని మన రాష్ట్రంలో ఒక్క చేబ్రోలులోనే చూస్తాము.







 శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు 

వాసిరెడ్డి వంశానికి చెందిన ఈయన నిజాం మరియు ఆంగ్లేయులకు సామంతునిగా ఉండేవారట. తొలుత నేటి పల్నాడు జిల్లాలోని చింతపల్లి రాజధానిగా ఉండేదట. అనంతరం పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరావతికి మార్చరట. వీరి పరిపాలనా కాలం 1783-1816. 
నిజాం నవాబు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా వీరి సామర్ధ్యాన్ని ప్రశంసించి అనేక బిరుదులు ఇచ్చారు. 
సుమారు మూడు దశాబ్దాలకు పైగా పాలించిన ఈయన గొప్ప పరిపాలనాదక్షునిగా, కవి పండిత పోషకునిగా పేరుగాంచారు. అనేక ఆలయాలను పునః నిర్మించడం, కొత్త ఆలయాలను నిర్మింపచేయడం. భూ, ధన విరాళాలు ఇవ్వడం చేసారు. 
ఈయన కాలంలో "పిండారీలు" గ్రామాల మీద దాడులు చేయడం,రహదారులలో ప్రయాణీకులను దోచుకోవడం అధికంగా ఉండేదట. అనేక పర్యాయాలు హెచ్చరించినా పిండారీలు పట్టించుకోలేదట. మంత్రులతో సంప్రదించి పిండారీలను ఆహ్వానించారట. అధికశాతం పిండారీలు వచ్చారట. వారితో మాట్లాడిన రాజావారు తమ షరతులకు అంగీకరించని వారికి ఆహారంలో విషం కలిపి అందరినీ సంహరించారట. ఇది తెలిసి భయపడి లొంగిపోయిన వారిని కూడా కఠినంగా శిక్షించారట. 
దీనితో రాజ్యానికి, ప్రజలకు దొంగల బాధ తప్పిపోయింది కానీ రాజావారికి అంతులేని మానసికవ్యధ కలిగించిందట. యెంత దొంగలైనా వారిని నమ్మించి చంపించాను అన్న ఒక క్షోభ ఆయనను నిరంతరం వేధించేదట. 
జోతిష్యులు, పండితులు చెప్పిన ప్రకారం ఆలయాలను నిర్మించడం, ఆలయాలను నిర్వహించడం, దానధర్మాలు చేయడం, ధర్మసత్రాలను ఏర్పాటు చేయడం ఇలా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారట. అయినా మానసిక శాంతి లభించలేదట. చివరికి భోజనం చేయలేని పరిస్థితికి వచ్చారట. 









అప్పుడు జ్యోతిష్యులు "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అందువలన ఒక బ్రహ్మ దేవుని ఆలయం నిర్మిస్తే అన్నీ సర్దుకొంటాయి అని సలహా ఇచ్చారట. 
కానీ విధాతకు పూజ మరియు ఆలయం యోగం లేదు కదా ? అన్న ప్రశ్న ఉత్పన్నమైనది. దానికి పండితులు శివలింగ ప్రతిష్ట హత్యాదోషాన్ని తొలగిస్తుంది. అందువలన ఉభయతారకంగా శివ లింగం మీద సృష్టికర్త రూపాన్ని చెక్కించి ప్రతిష్టించడం తగిన పరిష్కారం అని తెలిపారట. 
కానీ బ్రహ్మ దృష్టి సోకితే ఆ ప్రాంతంలో దుర్భిక్షం తాండవిస్తుంది అన్న మరో సందేహం తలెత్తినది. 
దానికి పరిష్కారంగా ఆలయాన్ని ఒక సరస్సులో ఏర్పాటు చేసి అష్టదిక్కులను దిగ్బంధం చేయడం ఉత్తమమని నిర్ణయం చేసారట. దీనికి తగిన ప్రదేశం శతాబ్దాలుగా ప్రసిద్ధికెక్కిన చేబ్రోలును ఎంచుకొన్నారట. 
అలా చేబ్రోలులో శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయానికి రూపకల్పన జరిగింది. 

శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం 

చేబ్రోలులో ప్రధాన ఆలయం శ్రీ నాగేశ్వర స్వామి వారు కొలువైనది. కానీ ప్రధాన ఆకర్షణ శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం. రెండూ పక్కపక్కనే ఉంటాయి. 
చతురస్రాకార కోనేరు మధ్యలో ఉన్న ఆలయానికి చేరుకోడానికి వారధి ఏర్పాటు చేశారు. 
మండపంలాగా కనిపించే ఈ ఆలయానికి నలుపక్కలా స్తంభాలు ఉంటాయి. మధ్యలో ఉన్న సన్నిధికి నాలుగు ద్వారాలు, సున్నితంగా సుందరంగా రాతి మీద చెక్కిన కిటికీలు ఉంటాయి.
ఎత్తైన పానవట్టం మీద పద్మ పీఠం ఉంటుంది. బ్రహ్మ దేవుడు కమలసంభవుడు కదా !
పద్మాసనానికి కేంద్రంలో కనిపించే చతురస్రాకారపు లింగం పైన అభయ వరద ముద్రలలో ఉపస్థిత భంగిమలో  ఉన్న చతుర్ముఖ బ్రహ రూపాన్ని చెక్కారు. 
బ్రహ్మదేవునికి నాలుగు ముఖాలు ఉంటాయి కదా !
సన్నిధికి ఉన్న ద్వారాల నుంచి ప్రదక్షిణ చేస్తూ నాలుగు ముఖాలను దర్శించుకోవచ్చును. 
ఉపాలయాలు ఏమీ ఉండవు. సరస్సులో నీరు నిరంతరం నిండుగా ఉంటుంది. 
బ్రహ్మ దృష్టి పడకూడదని ఎనిమిది దిక్కులలో ఎనిమిది ఆలయాలను స్థాపించారు. వీటిలో నాలుగు అమ్మవారివి, రెండు పరమేశ్వరునివి కాగా మిగిలిన రెండు శ్రీ మహావిష్ణువు కొలువైనవి. 
ఎనిమిది అష్ట దిగ్బంధన ఆలయాలలో రెండు పూర్తిగా శిధిలమయ్యాయి. 
మిగిలినవి ఆగ్నేయంలో శ్రీ పార్వతీ దేవి, తూర్పున శ్రీ చంద్రశేఖర స్వామి, ఈశాన్యంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు, ఉత్తరంలో శ్రీ వేణుగోపాల స్వామి, వాయువ్యం లోశిధిల ఆలయం, పడమర శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి,  నైఋతిలో శిధిల ఆలయం, దక్షిణంలో శ్రీ రంగనాధ స్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు ఉంటాయి. పక్కనే నూతనంగా షిర్డీ సాయిబాబా మందిరం నిర్మించారు. 
ఈ ఆలయాలు అన్నీ కూడా పురవాస్తుశాఖవారి ఆధ్వర్యంలో ఉంటాయి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరంలో ఉన్న ఆలయాలను పునః నిర్మించడం జరిగింది. అష్ట దిగ్బంధ ఆలయాలలో ఉన్న ఆలయాలు అన్నీ కూడా ప్రత్యేకమైనవి కావడం చెప్పుకోవలసిన విషయం. అన్నింటినీ దర్శించడం విధాయకం. 
ముఖ్యంగా రెండు విషయాలు ఏమిటంటే దరిదాపుగా అధికశాతం శివలింగాలు బ్రహ్మ సూత్రం 
కలిగి ఉండటం, నంది విగ్రహాలు కుడి కాలికి బదులు ఎడమ కాలిని ఎత్తి ఉండటం ప్రత్యేకం చేబ్రోలులో. 








నిత్య పూజలు జరిగే ఈ ఆలయాలు శలవు రోజులలో  యాత్రీకులతో, పర్వదినాలలో స్థానిక భక్తులతో సందడిగా ఉంటాయి. 
చేబ్రోలులో ఉన్న అన్ని ఆలయాలు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఈ పురాతన ఆలయాల సందర్శన నాటి ఆలయ నిర్మాణం పట్ల, ప్రజలు  పాలకులకు నిరాకారుడైన సర్వాంతర్యామి పట్ల గల భక్తివిశ్వాసాల గురించి కొంత అవగాహనను కలిగిస్తాయి. 
మన రాష్ట్రంలో త్రిమూర్తులను  ఒకే క్షేత్రంలో దర్శించుకునే అరుదైన అపూర్వ అవకాశం కలిగించే చేబ్రోలు గుంటూరు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వసతి సౌకర్యాలు లభించవు. 
శతాబ్దాలుగా రమణీయ ఆలయాల క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన చేబ్రోలు సందర్శన గొప్ప అనుభూతిని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
ఇలా మనరాష్ట్రంలో చిన్న చిన్న గ్రామాలలో కూడా పురాతన ప్రత్యేక ఆలయాలు నెలకొని ఉన్నాయి. వాటిని సందర్శించడం మన బాధ్యత. 

నమః శివాయ !!!!  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...