శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి ఆలయం
లోకసంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించారు. విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి మొత్తంగా ఇరవై నాలుగు అవతారాలు వివిధ సందర్భాలలో తీసుకొన్నారని తెలుస్తోంది.
కానీ మనందరికీ తెలిసినవి దశావతారాలు మాత్రమే. మిగిలిన వాటిలో కొన్ని పేర్లు తెలిసినా వారు శ్రీమన్నారాయణుని అంశ అని తెలియదు.
దశావతారాలలో అత్యంత భీకరమైనది ఉగ్రమైనది శ్రీ నృసింహ అవతారం.
అహోబిలం లో ఉగ్రస్థంభం నుండి అవతరించిన స్వామి అసురుడైన హిరణ్యకశ్యపుని సంహరించారని పురాణాలు తెలుపుతున్నాయి.
రాక్షససంహారం అనంతరం ఆవేశం తగ్గని నృసింహుడు మన తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో తిరుగుతూ వివిధ కారణాల వలన ముప్పై రెండు క్షేత్రాలలో కొలువైనారని చెబుతారు.
భక్త ప్రహ్లాద స్తోత్ర పాఠాలతో చివరికి శాంతించిన నరసింహుడు విశాఖపట్నం కు సమీపంలోని భీమునిపట్నం (భీమిలి) లో ఉన్న సౌమ్య గిరి పైన\శ్రీ సౌమ్య నారాయణ నరసింహుడుగా వెలిశారని చెబుతారు. స్వామివారు ఇక్కడ చతుర్భుజాలతో మానవ రూపంలో దర్శనమిస్తారు. సౌమ్య గిరిని స్థానికంగా పావురాల కొండ అని పిలుస్తారు.
శ్రీ నరసింహ స్వామి వివిధ నామాలతో వివిధ రూపాలతో ముప్పై రెండు క్షేత్రాలలో కొలువై ఉన్నారు అని చెప్పుకొన్నాము కదా అవి అహోబిలం, వేదాద్రి, మట్టపల్లి, మంగళగిరి, సింహాచలం, యాదాద్రి, కేతవరం, పెంచెలకోన,కదిరి ఇలా ఉన్నాయి. ఒక్క అహోబిలంలోనే స్వామి పది రూపాలలో దర్శనమిస్తారు. అవి శ్రీ లక్ష్మీనరసింహ, ప్రహ్లాదవరద, జ్వాలా, క్రోడా, మాళోల, పావన, భార్గవ, ఛాత్రవట, యోగ, కారంజ.
ఈ క్షేత్రాలలో స్వామి సింహ వదనంతో కనపడతారు. వీటికి భిన్నంగా వ్యాఘ్ర వదనంతో కనిపించే ఒక విశేష విశిష్ట క్షేత్రం మన రాష్ట్రంలో విజయవాడకి సమీపంలో ఉన్నది.
కృత యుగం నాటి పౌరాణిక గాథ మరియు శతాబ్దాల చరిత్రల సమాహారం అయిన ఈ పుణ్యక్షేత్రం
విజయవాడకు ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగిరిపల్లి అనే గ్రామంలో నెలకొని ఉన్నది.
ఆలయ క్షేత్ర గాథ
బ్రహ్మాండ పురాణం లోని శోభనాచల మహత్యం ప్రకారం ఆలయ క్షేత్ర గాథ ఇలా ఉన్నది.
తొలియుగంలో శ్రీ మహావిష్ణువు భక్తుడైన శుభవ్రత మహా రాజు వైకుంఠ వాసుని దర్శనం ఆపేక్షిస్తూ తపస్సు చేశారట. భక్తుని భక్తివిశ్వాసాలకు సంతసించిన శ్రీహరి దర్శనమిచ్చారు.
ఆత్మబంధువు దర్శనంతో తన్మయతుడైన శుభవ్రతుడు స్తోత్రపాఠాలతో స్తుతించి తన మీద స్థిరనివాసం అదీ శ్రీ నరసింహుని రూపంలో అని కోరారట.
అతని కోర్కెను అంగీకరించారట భక్తవత్సలుడు.
కాలం గడిచిపోయింది. మహారాజు మహా పర్వతంగా మారిపోయారట. అయినా పన్నగశయనుని నామస్మరణం చేస్తుండేవారట. ఒకనాడు శివకేశవులు ఆకాశమార్గాన వెళుతూ ఈ పర్వత ప్రాంతానికి వచ్చారట.ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైన హరిహరులు కొంత సేపు విశ్రాంతి తీసుకొందామని ఆగారట.
ఆపకుండా వినిపిస్తున్న హరినామం గదాధరునికి గతం గుర్తుకు వచ్చి భక్తుని కోర్కెను మన్నించి చిత్రమైన విశేషమైన శ్రీ వ్యాఘ్ర నరసింహునిగా కొలువు తీరారట. ఆయనతో పాటు కైలాసనాధుడు కూడా లింగరూపంలో స్థిరపడిపడినారట.
శుభవ్రతుడు శిలగా మారిన ఈ పర్వతాన్ని శోభనాచలం అని పిలుస్తారు. స్థిరపడిన స్వామిని శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి అని లింగరాజును కొండ మల్లేశ్వర స్వామి అని పిలుస్తున్నారు.
అనంతర కాలంలో పాలకులు కొండ క్రింద ఒక ఆలయాన్ని నిర్మించి పర్వతం ఎక్కలేని వారికీ కూడా స్వామి వారి దర్శనం కలిగే అదృష్టాన్ని అందించారు.
అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం పదహారవ శతాబ్దంలో స్వామి దేవులపల్లి వంశ పెద్దకు స్వప్న దర్శనం ఇచ్చి తనను సేవించుకోమని తెలిపారట. వారు చాలా ఆనందంతో ఆలయ పునరుద్ధరణ చేయించి గుడిపూడి వారిని అర్చకులుగా నియమించారట. వీరికి తొలుత నైజాం నవాబు, తరువాత బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ ప్రాంతం మరియు ఆలయం మీద సర్వహక్కులు ప్రసాదిస్తూ దన పట్టా ఇచ్చారట.
పద్దెనిమిదో శతాబ్దంలో నూజివీడును పాలిస్తున్న జమీందార్లు అయిన కీర్హిశేషులు మేకా రామచంద్ర అప్పారావు గారి కుమారులైన శ్రీ రాజా శోభనాద్రి అప్పారావు గారు ఆలయ ధర్మకర్తలుగా నియమించబడినారు. ఆయన శ్రీ జియ్యం గారి ఆదేశాల మేరకు క్షేత్రంలో శ్రీ వైష్ణవ దివ్యదేశ సంప్రదాయాన్ని అమలు చేయడంతో పాటు శ్రీ శ్రీ శ్రీ రామానుజ కూటాన్ని నిర్మించారట.
వీరి కుమారులు కీర్తిశేషులు శ్రీ రాజా సారయ్య అప్పారాయణం గారు పందొమ్మిదవ శతాబ్దపు చివరలో ఆలయ ప్రస్తుత నిర్మాణాన్ని చేయించారు. స్వామివార్లకు అనేక ఆభరణాలు చేయించడమే కాకుండా వివిధ ఉత్సవాలకు కొత్త హంగులు ఏర్పాటుచేయసారు అని తెలుస్తోంది.
వీరి విగ్రహం రాజగోపురం లోపల మండపంలో నేటికీ చూడవచ్చును.
ఆలయ విశేషాలు
కొద్దిగా ఎత్తులో పర్వత పాదాల వద్ద సువిశాల ప్రాంతంలో నిర్మించబడిన ఆలయానికి తూర్పున నాలుగు అంతస్థుల రాజగోపురం , దానికి ముందు స్వాగత తోరణం కనిపిస్తాయి.
స్వాగత తోరణం పైన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఇరువైపులా శ్రీ మురళీ కృష్ణ మరియు శ్రీ కోదండ రాముడు, స్తంభాల పైన గరుత్మంతుడు మరియు హనుమంతుడు నమస్కార భంగిమలో కనిపిస్తారు. వెనుక పక్కన శ్రీ లక్ష్మీనరసింహ, శ్రీ ఉగ్రనరసింహ, శ్రీ వినాయక మరియు శ్రీ మహాలక్ష్మి కూడా సుందర రూపాలలో కనపడతారు.
రాజగోపురం ద్వారంగుండా ప్రాంగణం లోనికి వెళితే ఎదురుగా ఎత్తైన ధ్వజస్థంభం, బలిపీఠాలు, వినతాసుతుని సన్నిధి, అయిదు విమాన గోపురాలు వెనక పర్వతం పైన పైకి వెళ్లే సోపానమార్గం, గోపురం, స్వయంవ్యక్త స్వామి వారి సన్నిధి, శ్రీ కొండ మల్లేశ్వర స్వామి వారి ఆలయం పచ్చని పరిసరాలలో శోభాయమానంగా ఉంటాయి.
వంటశాల వద్ద ఆలయ పురాణగాథ తెలిపే శిలాఫలకం, పక్కన పురాతన వాహన మండపం ఉంటాయి.
ఎత్తు తక్కువ ఆస్థాన మండపంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రాముడు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల సన్నిధులు, ముఖమండపంలో శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ వరదరాజ స్వామి కొలువైన ఉపాలయాలు, శ్రీ గోదాదేవి, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవార్ల సన్నిధులూ కనిపిస్తాయి.
విశేషంగా అన్ని సన్నిధులకు ప్రత్యేకంగా ధ్వజస్తంభాలు ఉండటం.
గర్భాలయానికి వెలుపల క్షేత్ర పాలకుడు శ్రీ యోగాంజనేయుడు కొలువై ఉంటారు.
ముఖమండపంలోనే రమణీయంగా అలంకరించిన ఉత్సవిగ్రహా మండపం ఉంటుంది.
గర్భాలయంలో వామాంకం మీద శ్రీ మహాలక్ష్మి దేవి ఉపస్థితులుగా శ్రీ వ్యాఘ్ర నృసింహ స్వామి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు ధరించి చక్కని పుష్ప మాలాలంకృతులై నేత్రపర్వంగా దర్శనమిస్తారు.
అభిషేక సమయంలో స్వామి వారి వ్యాఘ్ర వదనాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం భక్తులకు లభిస్తుంది.
నిత్య పూజలు జరిగే ఆలయంలో ప్రతి నెలా ఒక ఉత్సవం నిర్వహిస్తారు.
ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం, శ్రీసీతారాముల కళ్యాణం, చైత్ర పౌర్ణమి, నృసింహ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ వినాయక చతుర్థి, శ్రీ దుర్గా నవరాత్రులు, కార్తీక పౌర్ణమికి వార్షిక బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస పూజలు, గోదాదేవి కళ్యాణం, రధ సప్తమి, వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి తో పాటుగా ఇతర హిందూ పర్వదినాలను విశేషంగా వైభవంగా జరుపుతారు.
పర్వతం పైకి వెళ్ళడానికి సుమారు ఏడువందల మెట్ల మార్గం ఉన్నది. మార్గంలో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వేణుగోపాల స్వామివార్ల ఆలయాలు వస్తాయి.
పైన శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి, శ్రీ కొండ మల్లేశ్వరస్వామి వార్ల సన్నిధులు , అనంతర కాలంలో ప్రతిష్టించబడిన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంటాయి.
పై ఆలయానికి విడిగా గోపురము, ధ్వజస్థంబము ఏర్పాటు చేశారు.
తామ్ర శాసనాలు
సహజంగా పురాతన ఆలయాలలో శిలా శాసనాలు కనిపిస్తాయి. వాటిలో వివిధ నిర్మాణాల చేయించినవారి, కైంకర్యాలు సమర్పించిన వారి వివరాలతో బాటు ఎప్పుడు ఇచ్చింది అన్న కాల సమాచారం కూడా లభిస్తుంది.
తమిళనాడులోని కొన్ని ఆలయాలలో విశేష వివరాలను అందించే తామ్ర శాసనాలు ఉంటాయి . అలాంటి రాగి రేకుల శాసనాలు శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి వారి ఆలయ ముఖమండపంలో కనిపిస్తాయి.
వీటిలో శ్రీ దేవులపల్లి వారి మరియు నూజివీడు జమీందార్ల వివరాలు సంవత్సరాలతో సహా కనిపిస్తాయి.
అనేక ప్రత్యకతల నిలయం అయిన శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి కొలువు తీరిన ఆగిరిపల్లి విజయవాడకు పాతిక కిలోమీటర్ల దూరంలో నూజివీడు వెళ్లే దారిలో వస్తుంది.
ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి వుంటుంది.
ఎలాంటి వసతి సౌకర్యాలు లభించవు. విజయవాడ లేదా నూజివీడు లలో వసతి సౌకర్యాలు లభిస్తాయి.
కృతయుగం నాటి పౌరాణిక విశేషాల నిలయం అయిన శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి వారు కొలువైన ఈ క్షేత్రం ఆలయ సందర్శన పట్ల అభిలాష, ఆసక్తి కలిగినవారు తప్పక దర్శించుకోవలసిన క్షేత్రం. చుట్టుపక్కల గ్రామాలలో, నూజివీడులో కూడా అనేక పురాతన ఆలయాలు కనిపిస్తాయి.