నారదుడు ప్రతిష్టించిన నారాయణుడు
కలియుగ వరదుడైన శ్రీ వేంకటేశ్వరుడు ఎన్నో క్షేత్రాలలో కొలువు తీరి భక్తులకు వరప్రదాయనునిగా దర్శమిస్తున్నారు.
మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా స్వామి స్థానం ఏర్పరచుకున్నారు. అయినా సమస్త భూమండలానికి అధిపతి అయిన ఏమిటి పర ఏమిటి ?
దేశవిదేశాల విషయం వదిలేస్తే మన రాష్ట్రంలోనే ఉన్న అనేక శ్రీనివాసుని కోవెలల విషయం మనలో చాలా తెలియదు.
అలాంటి ఒక పుణ్య తీర్ధ క్షేత్రం ప్రకాశం జిల్లాలోని మల్లవరం.
నాలుగు యుగాలలో ప్రసిద్ధికెక్కిన క్షేత్రం మల్లవరం.
చరిత్రలో స్థానం పొందిన ప్రదేశం మల్లవరం.
భక్తులకు దర్శనీయ ఆలయం మల్లవరం.
పురాణగాథ
ఒకనాడు గరుడవాహనుడు ఆకాశ మార్గాన వెళుతూ నదీతీరంలో పచ్చని ఫలవృక్షాలతో నిండిన పర్వత శోభను చూసి దిగి కొంతసేపు విహరించారట.
ఈ ఉదంతాన్ని లోకసంచారి నిరంతర నారాయణ మంత్ర జపధారి అయిన నారద మహర్షి ఇక్కడ తపస్సు చేసుకొంటున్న మునులకు తెలియచేశారట.
మునివాటికగా ప్రసిద్ధికెక్కిన నదీతీరం లోని మహర్షులకు ఎవరిని అర్చామూర్తిగా స్థాపించుకోవాలి అన్న సందేహం తలెత్తిన సందర్భంలో నారద మహర్షి నారాయణుడు సంచరించిన ప్రదేశంలో శ్రీ మన్నారాయణుని శ్రీ వెంకటేశ్వర రూపంలో ప్రతిష్టించుకోవడం ఉచితం అని మార్గదర్శకత్వం చేశారట.
ఆయనే మునుల కోరిక మేరకు శ్రీవారి మూలవిరాట్టును ప్రతిష్టించారట.
ఆ విధంగా వైకుంఠవాసుడు గుండ్లకమ్మ తీరవాసి అయ్యారు.
చరిత్ర
పదునాల్గవ శతాబ్దంలో అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన ప్రోలయ వేమా రెడ్డి తన తమ్ముడు మల్లారెడ్డి నేతృత్వంలో కందుకూరు దుర్గం మీదకు సేనను పంపారు. యుద్ధంలో గెలిచారు. కానీ చోటు చేసుకున్న అనవసర ప్రాణనష్టం మల్లారెడ్డిని బాధ పెట్టినది.
వేమా రెడ్డి తమ్ముడిలో ఏర్పడిన ఉదాసీనతను తొలగించడానికి గుండ్లకమ్మ తీరంలో అతని పేరు మీద ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసారు. అక్కడ కొండ మీద నెలకొనివున్న పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునః నిర్మించే బాధ్యతలను అప్పగించారు.
శ్రీవారి సేవలో మల్లా రెడ్డిలో అపరాధభావం తొలగిపోయింది.
ఆ విధంగా మల్లవరం గ్రామం ఏర్పడింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన శోభను సంతరించుకొన్నది అని తెలుస్తోంది.
కాలక్రమంలో భక్తుల తోడ్పాటుతో ఆలయం అనేక మార్పులు చెంది ప్రస్తుత రూపు పొందింది.
ఆలయ విశేషాలు
గుండ్లకమ్మ నది నల్లమల అడవులలో గుండ్ల బ్రహ్మశ్వరం వద్ద జన్మించి సుమారు రెండువందల కిలోమీటర్ల దూరం ప్రవహించి ప్రకాశం జిల్లా లోని ఉలిచి వద్ద సాగరంతోసంగమిస్తుంది.
కృష్ణ మరియు పెన్నా నదుల మధ్య నంద్యాల, పల్నాడు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల అనేక వేల ఎకరాలను సస్సశ్యామలం చేయడమే కాదు ప్రసిద్ధ కంభం చెరువును నింపుతుంది. నదీ తీరంలో అనేక దేవాలయాలు నెలకొని ఉన్నాయి.
గతంలో ఈ నదీతీర ప్రాంతంలో బౌద్దులు మరియు జైనులు నివసించారు అనడానికి కొన్ని దాఖలాలు కూడా కనపడతాయి.
మల్లవరం దగ్గర గుండ్లకమ్మ మీద కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని నిర్మించారు. ఆలయానికి సమీపంలో ఉంటుంది.
చిన్న పర్వతం మీద ఉన్న ఆలయం వద్దకు చేరుకోడానికి రహదారి మార్గం ఉన్నది.
పర్వత పాదాల వద్ద శ్రీ గణపతి సన్నిధి మరియు క్షేత్రపాలకుడైన శ్రీ దాసాంజనేయ స్వామి సన్నిధి ఉంటాయి. ఆలయం చేరుకోడానికి సోపాన మార్గం ఏర్పాటు చేశారు. మెట్లకు ఇరుపక్కలా శ్రీ అంజనా తనయుడు మరియు శ్రీ వినుతా సుతుడు ముకుళిత హస్తాలతో భక్తులకు దర్శనమిస్తారు.
అయిదు అంతస్థుల రాజగోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎత్తైన ధ్వజస్థంభం , బలిపీఠాలు మరియు శ్రీ గరుత్మంతుని సన్నిధి కనిపిస్తాయి.
ధ్వజస్థంభానికి మొక్కి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ముఖమండపం లోనికి వెళితే ఎదురుగా గర్భాలయంలో రమణీయ పుష్ప స్వర్ణాభరణ అలంకరణలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్థానక భంగిమలో నయానందకరమైన దర్శనాన్ని ప్రసాదిస్తారు.
ఆలయ ప్రాంగణం నుండి దూరంగా ప్రవహిస్తున్న నదీజలాలను వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ భగవంతుని సన్నిధిలో గడపడం ఒక జీవితకాల అనుభూతి.
నిత్యం నాలుగు పూజలు జరిగే ఆలయంలో శ్రీ ,వినాయక చవితి, శ్రీ హనుమజ్జయంతి, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, శ్రీ రామనవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఉగాది ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
చైత్రమాసంలో ఆలయ ఉత్సవాలు కూడా రంగరంగ వైభవంగా జరుపుతారు.
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది ఆలయం.
మల్లవరం కు ఒంగోలు పట్టణం నుండి సులభంగా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చును. ఇరవై కిలోమీటర్లు. వసతి సౌకర్యాలు ఒంగోలు లో లభిస్తాయి.
విశేష ఆలయాలుగా పేరొందిన శ్రీ రఘునాయక స్వామి మరియు శ్రీ లింగోద్భవ స్వామి కొలువైన చదలవాడ ఇక్కడకు దగ్గరే !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి