15, ఫిబ్రవరి 2024, గురువారం

Jagannadha Gattu, Kurnool

                   జటాధరుని నెలవు - జగన్నాధ గట్టు 



మనందరం చూడక పోయినా విని లేదా చదివి ఉంటాము ఈ విషయం గురించి. అదేమిటి అంటే శ్రీ శైలం దగ్గరలో సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది నెలలు కృషాణాదిలో మునిగి ఉంది మూడు నెలలు మాత్రమే దర్శన భాగ్యం కలిగించే శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, మచ్చుమర్రి (కర్నూలు జిల్లా ఆత్మకూరు కి ముప్పై కిలోమీటర్ల దూరం). 
ఒకప్పుడు ఈ ప్రాంతం పవిత్ర నదుల సంగమ క్షేత్రంగా ప్రసిద్దికెక్కి అనేక ఆలయాలు ఇక్కడ ఉండేవట. కానీ కృష్ణానది మీద శ్రీ శైలం ఆనకట్ట 1981వ సంవత్సరంలోనిర్మించడం వలన వీటిలో చాలా  ఆలయాలు నీట మునిగిపోయాయి. వాటిలో ఒకటి శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. నదిలో నీటి ప్రవాహం తగ్గిన సమయంలో అనగా జనవరి లేదా ఫిబ్రవరి నుండి జూన్ వరకు శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వెలుపలికి వస్తుంది. తిరిగి వర్షాలు పడగానే నీటి ప్రవాహం పెరిగి జలాధివాసం లోనికి స్వామి వెళ్ళిపోతారు. 
కొన్ని ఆలయాలను ఆ సమయంలో కర్నూలు, ఆలంపూర్ లాంటి ప్రదేశాలకు తరలించారు. 
అసలు మచ్చుమర్రి ప్రాంతం ఎందుకు పవిత్ర క్షేత్రంగా పేరొందినది ? ఆ విషయం తెలుసుకొందాము. 







పవిత్ర సంగం క్షేత్రం 

ఈ క్షేత్రం యెంత గొప్పది అంటే ఇక్కడ మొత్తం ఆరు నదులు కృష్ణానదితో సంగమిస్తాయి. అవి వేణి, భవనాశి, తుంగ, భధ్ర, మలాపహారిణి, భీమరధి. వీటిలో భావనాశిని మగ నది అంటారు. తూర్పు నుండి పడమర ప్రవహించేవాటిని మగ నదులుగా గుర్తించారు. 
ఇదే కాకుండా ఒకప్పుడు ఇక్కడ 
ఏడు నదుల పవిత్ర సంగమం అయిన ఈ ప్రాంతానికి పాండవులు తమ అరణ్యవాస సమయంలో శ్రీ శైల మల్లిఖార్జున స్వామిని సేవించుకొని వచ్చారట. ఎందరో మునులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఉండేవారట. వారి సేవిస్తూ కొంతకాలం ఇక్కడ గడిపారట పాండవులు ద్రౌపదీ దేవితో కలిసి. ఒకరోజు మునులు ధర్మరాజుతో జ్యోతిర్లింగ మరియు అష్టాదశ పీఠాల క్షేత్రం అయిన  శ్రీశైలాన్ని తాకుతూ ప్రవహించే పావన నదుల సంగమమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించడం వలన వారికి ఏదైనా దుష్టగ్రహ పీడ ఉంటె తొలగిపోయి సమస్త జయాలు కలుగుతాయని చెప్పారట. గ్రహ స్థితి , జయాల విషయం ఎలా ఉన్నా శివలింగ ప్రతిష్ట అనే పవిత్ర కార్యక్రమం చేయడం మనోల్లాసాన్ని కలిగించి మషిని శక్తిమంతుని చేస్తుంది అని తలంచిన ధర్మరాజు భువిలో కైలాసం, మోక్షపురి మరియు శ్రీ అన్నపూర్ణా క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన వారణాశి నుండి ఒక శివలింగాన్ని తీసుకొని రమ్మని భీమసేనుని పంపారట. 
కానీ మునులు నిర్ణయించిన ముహూర్త సమయానికి భీమసేనుడు చేరుకోలేకపోయారట. అందువలన ధర్మరాజు మునుల సలహా మేరకు ఒక వేప చెట్టు మొద్దును ప్రతిష్టించారట. 
భీమసేనుడు తిరిగి వచ్చిన తరువాత తెచ్చిన లింగాన్ని పక్కన మరో చోట ప్రతిష్టించారట. ఈ ఆలయాన్ని శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం గా పిలిచేవారు.  

































అనంతర కాలంలో స్థానిక పాలకులు మరికొన్నిఆలయాలను ఇక్కడ నిర్మించారు. 
1981 వ సంవత్సరంలో ఆనకట్ట నిర్మాణ సమయంలో ముఖ్యమైన వాటిని పూర్తిగా లెక్క ప్రకారం విడదీసి వేరే ప్రాంతాలలో తిరిగి పునః నిర్మించారు. 
అలా కర్నూల్ పట్టణ  శివార్లలో ఉన్న జగన్నాథ గట్టు మీద శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పునః స్థాపించారు. 

ఆలయ విశేషాలు 

ప్రశాంత వాతావరణానికి, చక్కని ఆధ్యాత్మిక వాతావరణానికి మరియు  సుందర దేవాలయానికి స్థానమైన జగన్నాథ గట్టు ఒక రోజు కుటుంబ సన్నిహితులతో ఆహ్లాదంగా గడపటానికి అనువైన ప్రదేశంగా చెప్పుకోవాలి. 
గుట్ట మీదకు చేరుకోడానికి చక్కని రోడ్డు నిర్మించారు. 



















మధ్యలో పెద్ద సుందర నందీశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శివపరివారం తరుఫున శిలాద తనయుడు స్వామి దర్శనానికి తరలి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది.
గుట్ట పైకి చేరుకొంటే ఎదురుగా నూతనంగా నిర్మించిన మూడు అంతస్థుల రాజ గోపురం కనిపిస్తుంది. వెలుపల సుందరంగా తీర్చిద్ది, అనేక పురాణ ఘట్టాలను, దేవీదేవతలు మూర్తులను రమణీయంగా చెక్కిన రధం ఉంటుంది. 
రాజగోపురం గుండా విశాలమైన ప్రాంగణం ఓనికి ప్రవేశిస్తే ఒక పక్కన అశ్వద్ధ వృక్షం క్రింద నాగ ప్రతిష్ట మరో పక్కన నవగ్రహ మండపం కనిపిస్తాయి. ఎదురుగా ధ్వజస్థంభం మరియు  ప్రధాన ఆలయానికి చేరుకోడానికి మెట్ల మార్గం. 
పచ్చని ఇసుక రాతితో నిర్మించిన ఈ ఆలయ గోడల పైన, పై కప్పుకి, స్తంభాలకు అనేక సుందర శివ, విష్ణు మరియు ఇతర దేవతల మరియు అనేక పురాణ ఘట్టాలను అత్యంత రమణీయంగా మలిచారు. 
నేరుగా పైకి వెళ్లకుండా ఒక ప్రదక్షిణ చేస్తే ఆలయ శిల్పాల వీక్షణ అబ్భురపరుస్తుంది. అతితక్కున సాధనాలతో నాటి శిల్పులు ఇంత అద్భుత శిల్పాలను ఎలా మలిచారు ? ఎలా వాటిని సరైన ప్రదేశంలో నేర్పుగా అమర్చగలిగారు అన్న ఆలోచన మనలను విస్మయపరుస్తుంది. వారు ఎలా కొలతలు తీసుకొన్నారు, ఎలా కావలసిన రాతిని ఎంచుకొన్నారు, వాటి ఎలాంటి శిల్పాలను చెక్కాలి అన్న అవగాహన ఎలా ఏర్పడినది ? ఇవన్నీ ఆలోచిస్తే మన ముందు తరాల వారు మనకన్నా ఎంతో పురాణ, సాహిత్య, కళా రంగాల పట్ల పూర్తి స్థాయి ప్రావీణ్యం కలిగి ఉండేవారన్న సత్య తెలుస్తుంది. 
మెట్ల మార్గంలో మొదటి అంతస్థులో ఉన్న ప్రధాన ఆలయానికి చేరుకొంటే ముఖమండపంలో అమర్చిన రాతి స్తంభాల కూర్పు మనలను నాటి శిల్పులను పదే పదే తలుచుకొనేలా చేస్తుంది. ఇంతటి గౌరవాన్ని పొందుతున్న వారెంత ధన్యులో కదా !
 మెట్ల మార్గంలో పైన సుందరమైన యక్షుల, గంధర్వుల శిల్పాలు కనిపిస్తాయి. 
గర్భాలయంలో పెద్ద లింగరూపంలో శ్రీ సంగమేశ్వర స్వామి దర్శనమిస్తారు. స్వామివారి లింగం పైన బ్రహ్మ సూత్రం ఉండటం మరొక ఆకర్షణ. 
రాయల సీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నేను అనేక   అనేక ఆలయాలను భగవంతుని అనుగ్రహంతో సందర్శించుకోగలిగాను. వాటిల్లో చాలా వరుకు శివాలయాలలో బ్రహ్మ సూత్రం ఉన్న లింగాలు ఉండటం విశేషం. పాఠకుల సమాచార నిమిత్తం మరో రెండు ఆలయాల గురించి తెలుపుతాను. 

















కర్నూలు నగరంలో బళ్లారి చౌరస్తా దగ్గర ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఒక బ్రహ్మ సూత్రం ఉన్న శివ లింగం ఉన్నది. మరొకటి కర్నూలు పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న "వామ సముద్రం" అనే చిన్నపల్లెలో విజయనగర పాలకుల కాలంలో నిర్మించిన శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి జంట ఆలయాలు ఉన్నాయి. శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి వారి లింగం మీద బ్రహ్మ సూత్రం ఉండటం విశేషంగా పేర్కొనాలి. ఎందుకంటే బ్రహ్మ సూత్రం ఉన్న శివ లింగాలను అధికంగా కాకతీయుల కాలంలో ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. 
ప్రతి రోజు  నియమంగా నాలుగు పూజలు జరిగే శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో గణేష చతుర్థి, దేవీ నవరాత్రులు మరియు శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా  శివరాత్రికి విశేష పూజలు జరుగుతాయి. వేలాదిగా స్థానిక, దూర ప్రాంత భక్తులు తరలి వస్తారు. పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆఖరి రోజున రధోత్సవం కూడా ఘనంగా జరుపుతారు. 
కాలినడకన కర్ణాటక నుండి శ్రీశైలం వెళ్లే వీర శైవ భక్తులు తప్పని సరిగా జగన్నాథ గట్టు లో ఒక రాత్రి మజిలీ చేస్తారు. 
ఒక శలవు రోజున సాయంత్రం జగన్నాథ గట్టు కు వెళితే వాతావరణ, శబ్ద కాలుష్య బారి నుండి బయటపడవచ్చును. ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో ఒక సాయం సంధ్యా సమయం గడిపి జీవితకాల అనుభూతిని పొందవచ్చును. 







నమః శివాయ !!!! 



        



 

     
 













































































 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...