Thadalan Koil, Sirkazhi

                                    తాదళన్  కోవెల 

గతంలో మనం శిర్కాలి చుట్టుపక్కల ఉన్న పదకొండు తిరునాన్గూర్ శ్రీ వైష్ణవ దివ్యదేశాల గురించి తెలుసుకున్నాము. 
శిర్కాలి లోనే మరికొన్ని దివ్యదేశాలు ఉన్నాయి. కానీ అవి తిరునాన్గూర్ శ్రీ వైష్ణవ దివ్యదేశాల క్రిందికి రావు. కానీ వాటిల్లో కూడా పాశుర గానం చేసింది తిరుమంగై ఆళ్వార్ మాత్రమే ! 
దివ్యదేశాలలో అధికశాతం శ్రీ మహా విష్ణువు ఉపస్థిత, స్థానక మరియు శయన భంగిమలలో కొలువై దర్శనమిస్తారు. శ్రీ రామునిగా, శ్రీ కృష్ణునిగా, శ్రీ నారసింహునిగా దర్శనమిచ్చే క్షేత్రాలు కొద్ది. ఇక మిగిలిన దశావతారాల రూపాలలో కనపడేది ఇంకా స్వల్పం. చిత్రంగా మూడు దివ్యదేశాలలో స్వామి త్రివిక్రమునిగా కొలువై ఉంటారు. అవి శ్రీ ఉలగండ పెరుమాళ్ కోవెల, కాంచీపురం, శ్రీ ఉలగనాథ పెరుమాళ్ కోవెల, తిరుక్కోవిలూర్. మూడవది శిర్కాలి లోని శ్రీ కలి శీరం విన్నగరం. 
ఈ క్షేత్ర గాధ కూడా మిగిలిన రెండు దివ్య దేశాల పౌరాణిక గాధ కూడా !

పౌరాణిక గాధ 

ప్రహ్లాదుని మనుమడైన బలి  చక్రవర్తి మహావీరుడు. భూలోకంతో పాటు మిగిలిన లోకాలను జయించాడు. ఆయన పరాక్రమం ముందు ఇంద్రాది దేవతలు పలాయనం చిత్తగించి, శ్రీ హరి శరణు కోరారు. ఆయన వారికి అభయమిచ్చి తొందరలోనే బలి చక్రవర్తి పతనం తప్పదు అన్నారు. 
బలి ఎంతటి వీరుడో అంతకన్నా గొప్ప హరి భక్తుడు, దానశీలి. దేవేంద్ర పదవికి అర్హతను ఇచ్చే నూరవ అశ్వమేధ యాగానికి సిద్ధమయ్యారు బలి. మరింత ఆందోళనకు లోనైనా ఇంద్రుడు శ్రీమన్నారాయణుని పరిష్కారం చూపమని ప్రార్ధించారు. 
బలి చేసిన దానధర్మాలు వలన, చేస్తున్న అశ్వమేధ యాగాల కారణంగా ఇంద్ర పదవికి ఒకరకంగా అర్హుడే !కానీ రాక్షస వంశానికి చెందడం వలన అనర్హత చెందుతాడు. ఈ ఒక్క కారణంతో అతనిని శిక్షించదలచారు పరమాత్మ. 
బాల బ్రాహ్మణునిగా బలి యజ్ఞశాల వద్దకు చేరుకొన్నారు. అప్పటికి ఆ నాటి దాన ధర్మాలను ముగించి యాగానికి సిద్ధమవుతున్నారు చక్రవర్తి. ఆయన వద్దకు వెళ్లి దానం కోరారు వామనుడు. ముద్దుగా ఉన్న బాలుని కాదనలేక ఏమి కావాలి అని ప్రశ్నించారు. తలా దాచుకోడానికి మూడడుగుల నేల చాలన్న బాలుని చూసి అహంకారం తో నవ్విన బలి "సరే తీసుకో!"అన్నారు. 
ఆ తరువాత కధ మనకు తెలిసినదే ! వామనుడు "వటుడింతింతై..... " అన్నట్లుగా విరాట్రూపంతో ఒక అడుగుతో భూలోకాన్ని, మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో అడుగు బలి శిరస్సున ఉంచి పాతాళానికి పంపారు. 
పై రెండు క్షేత్రాలతో పాటు ఈ క్షేత్ర గాధ కూడా ఇదే !
కానీ ఈ క్షేత్రం ముఖ్యంగా శ్రీ రామచంద్రుడు కొలువైనదిగా చెబుతారు. పేరు కూడా ఉచ్చారణ దోషం కారణంగా కలి శీరం గా మారింది అంటారు. 
ఆ విషయాలను పక్కన బెట్టి ఆలయ విశేషాలు తెలుసుకొందాము. 

ఆలయ విశేషాలు 

విశాలమైన ప్రాంగణానికి తూర్పున మూడు అంతస్థుల రాజా గోపురం ఉంటుంది. ఎదురుగా బలిపీఠం, ధ్వజస్థంభం కనపడతాయి. ప్రధాన ఆలయం కొద్దిగా ఎత్తులో నిర్మించబడినది. ముఖ మండపం, అర్ధ మండపం, గర్భాలయంగా నిర్మించారు. 
గర్భాలయంలో ఎడమ కాలిని పైకెత్తి ఆకాశాన్ని కొలుస్తున్న భంగిమలో "శ్రీ లోకనాథన్ పెరుమాళ్" నేత్రపర్వమైన అలంకరణలో దర్శనమిస్తారు. 
స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ త్రివిక్రమ నారాయణ పెరుమాళ్ శ్రీ దేవి భూదేవి సమేతులై మూలవిరాట్టుకు ముందుగా కొలువై ఉంటారు. 
గమనించవలసిన విషయం ఏమిటంటే కాంచీపురం, తిరుక్కోవిలూర్ ఆలయాలలో శ్రీవారు విరాట్ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం సాధారణ రూపంలో కనపడతారు. కాకపోతే ఉలగండ అన్నా లోకనాథన్ అన్నా అర్ధం మాత్రం సమస్త లోకాలకు అధిపతి అని. 
క్షేత్రం నామమైన తాదళన్  అంటే మూడు అడుగుల మహావిష్ణువు అని అంటారు. ఈ ఆలయంలో కనిపించే మరో విశేషం ఏమిటంటే పైకి ఉన్న ఎడమ పాద దర్శనం నిత్యం భక్తులకు లభిస్తుంది. కానీ క్రింద ఉన్న కుడి పాద దర్శనం ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే !
ఉపాలయాలలో శ్రీ లోకనాయకీ తాయారు, శ్రీ గోదా దేవి, శ్రీరామచంద్ర మూర్తి, గరుడాళ్వార్, శ్రీ మనవాళ్ మహర్షి  మరియు శ్రీ తిరుమంగై ఆళ్వార్ కొలువై ఉంటారు. అర్ధ మంటపంలో పన్నిద్దరు ఆళ్వారులు ఉపస్థితులై ఉంటారు. 

తిరుమంగై ఆళ్వార్ 

శ్రీ వైష్ణవుడైన శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధమైన "వేల్"  ధరించి కనపడటం. 
గతంలో ఒకే సమయంలో శైవ గాయక భక్తులలో అగ్రగణ్యులైన శ్రీ తిరుజ్ఞాన సంబందార్ మరియు తిరుమంగై ఆళ్వార్ శిర్కాలి విచ్చేసారట. వారిరువురిలో గొప్పవారు ఎవరు ? అన్న సందేశం కలిగిన భక్తులు వారి నడుమ ఒక పోటీలాంటిది నిర్వహించారట. తిరుమంగై ఆళ్వార్ తన ఇష్టదైవం, స్థానికంగా కొలువైన శ్రీ త్రివిక్రమ పెరుమాళ్ ని కొనియాడుతూ ఎవరికైన అర్ధమయ్యే లలితలలితమైన తమిళ పదాలతో పాశుర గానం చేశారట. పరవశించిపోయిన జ్ఞాన సంబందార్ ఆయనను ప్రశంసించి తన చేతిలో సదా ఉండే వేల్ ని మేడలో ధరించిన మాలను కానుకగా సమర్పించారట. 
నాటి నుండి తిరుమంగై ఆళ్వార్ వాటిని ధరించి కనపడేవారట. 

ఆలయ చరిత్ర 

తిరుమంగై ఆళ్వార్ మరియు తిరు జ్ఞాన సంబందార్ ఇరువురూ ఏడో శతాబ్దానికి చెందివారని చెబుతారు. వారివురు కలయిక జరిగిన ఆలయం కనుక ఏడో శతాబ్దానికి పూర్వమే నిర్మాణం జరిగి ఉండాలన్నది ఆధ్యాత్మిక వాదుల అంచనా !
ఆలయానికి చోళులు, విజయనగర రాజుల, స్థానిక పాలకులు తమ వంతు కైకర్యాలు సమర్పించారని, పునరుద్ధరణ , నిర్మాణ పనులు చేశారని తెలుస్తోంది. వివరాలను తెలిపే శిలాశాసనాలు పదో శతాబ్దం నాటి నుండి ఆలయంలో కనిపిస్తాయి. 

ఆలయ ఉత్సవాలు 

ప్రతి నిత్యం నియమంగా నాలుగు పూజలు నిర్వహించే ఆలయం ఉదయం ఏడున్నర గంటల నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది. 
వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహిస్తారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. 
శ్రీ రామనవమి, శ్రీ కృష్ణాష్టమి, మత్స్య, కూర్మ, నరసింహ, వామన, పరశురామ, బలరామ జయంతులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్థానిక పర్వదినాలలో వేడుకలు జరుగుతాయి. తిరునాన్గూర్ ఉత్సవాల సందర్బంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. 
శిర్కాలి రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న ఈ దివ్య దేశాన్ని మిగిలిన వాటితో పాటు దర్శించుకోవచ్చును. స్థానిక ఆటో వారికి ఈ ఆలయాల సమయాల పాతాళ తగినంత అవగాహన ఉండటం వలన వారి సహాయం తీసుకొంటే అన్ని దేవాలయాలను ఒక రోజులు సందర్శించుకునే అవకాశం లభిస్తుంది. 

జై శ్రీమన్నారాయణ ! 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore