22, ఏప్రిల్ 2023, శనివారం

Sri Tyagaraja Swamy Temple. Tiruvarur

                 శ్రీ త్యాగరాజ స్వామి ఆలయం, తిరువారూర్ 

                         


దైవభూమి, కర్మభూమి, యోగ భూమి మరియు మోక్ష భూమిగా యుగయుగాలుగా ప్రసిద్ధి చెందినది భరత భూమి. 
అందువలననే అనేక పవిత్ర తీర్థ క్షేత్రాలు దేశం నలుమూలలా కనిపిస్తాయి. వీటిల్లో కొన్ని మహామహితాత్మకమైనవి. తిరువారూర్ అలాంటి వాటిల్లో ఒకటిగా చెప్పుకోవచ్చును. 
తిరువారూర్ ఎందుకని మహాక్షేత్రంగా ప్రసిద్దికెక్కినది అనేదానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. 
తిరువారూర్ లో జన్మించిన వారికి ముక్తి లభిస్తుంది అన్నది పురాణ వాక్యం.

శ్రీ త్యాగరాజ స్వామి 

తిరువారూర్ మూలవిరాట్టు "శ్రీ వాల్మీకినాథర్". అయినా ప్రాధాన్యత శ్రీ త్యాగరాజ స్వామి కి ఇవ్వబడుతుంది. కారణం ఏమిటంటే ఈ సోమస్కంద మూర్తి శ్రీ మహావిష్ణు సృష్టి. ఆయన వక్షస్థలం మీద కొలువుతీరి ఉండేది. సోమస్కంద మూర్తి అనగా శివపార్వతుల మధ్య శ్రీ సుబ్రమహ్మణ్యేశ్వరుడు ఉపస్థితులై ఉంటారు. 
అంతటి మహిమాన్విత మూర్తి భూలోకానికి రావడం తొలితరం చోళ రాజు ముచికుంద మహారాజు జీవితంతో ముడిపడి ఉన్నది. 









ముచికుంద మహారాజు 

ముచికుందుడు గొప్ప పరిపాలకుడే కాదు మహా వీరుడు కూడా ! దేవదానవ యుద్ధంలో దేవతలు పరాజయం పాలయ్యే పరిస్థితులలో దేవేంద్రుడు ఇతని సహాయం అర్ధించాడట. దేవతలు తరుఫున కొన్ని వందల సంవత్సరాలు యుద్ధం చేసి దానవులను తరిమికొట్టాడట. సంతోషంతో ఇంద్రుడు ఏమి వరం కావాలో కోరుకోమన్నారట. 
తన భార్యాబిడ్డలను కలుసుకోవాలని కోరుకోగా వారంతా కాలగర్భంలో కలిసిపోయారన్న సత్యం తెలుసుకున్నాక తనకు శ్రీ మన్నారాయణుని వక్షస్థలం మీద ఉన్న శ్రీ త్యాగరాజ స్వామి మూర్తి కావాలని, తరువాత అంతులేని విశ్రాంతి కావాలని కోరుకొన్నారట. 
అప్పటికే శ్రీ త్యాగరాజస్వామి విగ్రహాన్ని శ్రీహరి నుండి పొందిన దేవరాజు ముచుకుందుని పరీక్షించడానికి ఒకే మాదిరిగా ఉన్న మరో ఆరు విగ్రహాలను సృష్టించి వాటిలో అసలైన దానిని గుర్తించి తీసుకోమన్నారట. 
పరీక్షలో నెగ్గిన రాజును  అభినందించిన దేవేంద్రుడు మొత్తం ఏడు మూర్తులను అతనికి ఇచ్చాడట. 
భూలోకానికి వచ్చి ముచుకుందుడు వాటిని ఏడు పవిత్ర స్థలాలలో ఉంచాడట. తరువాత వెళ్లి ఒక కొండ గుహలో నిద్రలో మునిగిపోయాడట. 
భాగవత, విష్ణు  పురాణాలలో ముచుకుందుని ప్రస్థాపన ఉన్నది. శ్రీ కృషుడు కాలయవనుని సంహరించడానికి ముచుకుందుని సహాయం తీసుకోవడం అదంతా వేరే కథ. 
 అలా ముచుకుందుడు ఇలలో ఉంచిన ఏడు స్థలాలను "సప్త విదంగ క్షేత్రాలు" అంటారు. 
 త్యాగరాజ మూర్తులతో పాటు ముచికుందుడు ఏడు క్షేత్రాలలో మరకత లింగాలను కూడా ప్రతిష్టించారు. 










సప్త విదంగ స్థలాలు 

 అసలు "విదంగం" అనగా శిల్పి ఉలి తాకకుండా ఏర్పడిన మూర్తి అని అర్ధం. అనగా స్వయంభూ లేక స్వయంవ్యక్త రూపం అన్నమాట. శివాలయాలలో ఉత్సవమూర్తి నటరాజ స్వామి. కానీ ఈ ఏడు క్షేత్రాలలో శ్రీ త్యాగరాజ స్వామి (సోమస్కంద మూర్తి)ఉత్సవమూర్తి. స్వామిని ఈ ఏడు ప్రదేశాలలో ఒకో క్షేత్రంలో ఒక్కో పేరుతో పిలవడంతో పాటు ఒక్కో విధమైన నృత్యం చేస్తారు ఉత్సవాల సమయంలో. తిరువారూర్ లో "విధి విదంగర్" అని ఆయన కోసం చేసే నాట్యాన్ని "అజప తాండవం" అనగా గానం లేకుండా చేసే నృత్యం. తిరునళ్ళార్ శ్రీ శనీశ్వర స్వామి దేవాలయం గా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ కొలువైన స్వామిని "నాగ విదంగర్" అని ఇక్కడ జరిపేది "ఉన్మత్త తాండవం". మూడవది అయిన నాగపట్టిణం లోని శ్రీ కాయరోహణ స్వామి దేవాలయం. స్వామిని  "శ్రీ సుందర విదంగర్"అని పిలుస్తారు. ఈయన పేరిట సలిపే నృత్యాన్ని "పరవర తరంగ లేదా విలతి నృత్యం" (సముద్ర అలల మాదిరి ఉండేది). తిరుక్కరయిల్ లో కొలువైన నాలుగవ త్యాగరాజ స్వామిని "ఆది విదంగర్" అని ఆయన సంతృప్తి కొరకు చేసేది "కుక్కుడ నాట్యం". నాగపట్టిణం దగ్గరలోని "తిరుక్కువలై" లోని శ్రీ బ్రహ్మపురీశ్వర స్వామి ఆలయంలోని స్వామిని "అవని విదంగర్" అని, చేసే నాట్యం బృంగ నృత్యం(పుష్పాల పైన ఎగిరే భ్రమరం లాగా). ఆరవ క్షేత్రం తిరువారూర్ కి సమీపంలోని "తిరువైమూర్" లోని శ్రీ వైమూర్ నాథర్ ఆలయంలో "నల్ల విదంగర్"గా కొలువైన స్వామి కొరకు చేసేది "కమల నాట్యం" (గాలికి లయబద్దంగా కదిలే కమలాల మాదిరి). ఆఖరి క్షేత్రం నాగపట్టిణం చేరువలో "వేదారణ్యం". శ్రీ వేదారణ్యేశ్వర స్వామి కోవెలలో "భువని విదంగర్" గా వెలసిన స్వామికి చేసేది "హంసపాద నృత్యం"(హంస నడక మాదిరి). 
  ఇలా శ్రీ త్యాగరాజ స్వామి కొలువైన సప్త విదంగ క్షేత్రాలలో ఉత్సవాల సందర్బంగా రకరకాల నాట్యం ప్రదర్శిస్తారు. 
సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శ్రీ త్యాగరాజ స్వామి (సోమస్కంద మూర్తి)అది కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా నగర సంచారం చేస్తారు. అలానే అమ్మవారి అయ్యవారి కుడి పాదాల దర్శనం సంవత్సరంలో ఒక్క ఆరుద్ర దర్శనం నాడే లభిస్తుంది. ఎడమ పాదాల దర్శనం "ఫాల్గుణి ఉత్తరాయం" నాడు లభిస్తుంది. 
మిగిలిన రోజులలో మూర్తిగా పుష్పాలతో కప్పబడి ఆది దంపతుల వదనాలు మాత్రమే కనపడతాయి. మరకత విదంగ లింగాల దర్శనం రోజులో  రెండు సార్లు   అది కూడా అభిషేక సమయంలో మాత్రమే !(ఉదయం 8.30 / సాయంత్రం 5.30 అభిషేక సమయాలు)












తిరువారూర్ ప్రత్యేకతలు 

 సుమారు పదిహేడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన శ్రీ త్యాగరాజ స్వామి  ఆలయం తమిళనాడు లోని పెద్ద ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. మొట్టమొదటి ఆలయాన్ని చోళులు నిర్మించారని తెలియవస్తోంది. పాండ్యులు, విజయనగర పాలకులు, మరాఠా రాజులు, నాయక రాజులు ఆలయాభివృద్దికి తమ వంతు కైకార్యాలను సమర్పించుకొన్నట్లుగా ఆలయంలో కనిపించే లెక్కలేనన్ని శాసనాలు తెలుపుతున్నాయి.  
 మూడు ఎత్తైన ప్రాకారాలు, తొమ్మిది గోపురాలు, ఎనభై విమానాలు, పదమూడు మండపాలు, పదిహేను బావులు, కోనేరులు, మూడు పుష్ప వనాలు, వందకు పైగా ఉపాలయాలు కలిగి ఉన్న ఒకే ఒక ఆలయం. ఇన్ని ఉపాలయాలు మరే ఇతర ఆలయంలో కనపడవు అంటే అతిశయోక్తి లేదు. 
వీటిల్లో శ్రీ అనంతిశ్వర, అసలేశ్వర, అణ్ణామలేశ్వర, అడగేశ్వర, వరుణేశ్వర ముఖ్యమైనవి. 
రణ విమోచన మరియు రుణ విమోచన లింగాలుంటాయి. రణ మోచన స్వామి అనారోగ్యాన్ని తొలిగించేవాడని, రుణ మోచన స్వామి అప్పుల బాధ తగ్గించేవాడని పేర్కొంటారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు.  
అమ్మవారు శ్రీ కమలాంబిక సన్నిధి వద్ద ఒక రాతి పీఠం కనపడుతుంది. నిరాకార శ్రీ అక్షరా దేవి గా రూపంగా ఆ పీఠాన్నిఆరాధిస్తారు. 
మరే ఇతర ఆలయంలో కనపడని  రెండు ప్రత్యేకతలు కనపడతాయి తిరువారూర్ ఆలయంలో కనపడతాయి. అవి నంది నిలుచొని ఉండటం, నవగ్రహాలు అన్నీ ఒకే వరుసలో ఉండటం.  
సహజంగా అభిషేక జలాలు బయటికి ప్రవహించే గోముఖి పక్కన శ్రీ చండికేశ్వర సన్నిధి తమిళనాడులోని అన్ని శివాలయాలలో కనపడుతుంది. తిరువారూరులో శ్రీ చండికేశ్వర సన్నిధిలో పాటు మరో సన్నిధి కనపడుతుంది.అందులో శ్రీ యమ చండికేశ్వరుడు దర్శనం        ఇస్తారు. ఇలాంటిది మరెక్కడా కనిపించదు.నరకానికి వచ్చేవారు లేనందున ఇక్కడ నరకాధిపతి యమ ధర్మరాజు శివసేవలో మునిగి ఉంటారు అని చెబుతారు.  అందువలననే తిరువారూర్ ముక్తి క్షేత్రంగా ప్రసిద్దికెక్కినది.  
తిరువారూరులో శివ గణాలు సామాన్య ప్రజలుగా జన్మనెత్తుతారని, వారు నిరంతరం శివ సేవలో మునిగి ఉండి అంతిమంగా కైలాసానికి తిరిగి వెళతారని విశ్వాసం. 
మండపాలలో ముఖ్యమైనవి చిత్ర సభా మండపం, మహా మండపం మరియు వెయ్యి స్తంభాల మండపం. తమిళనాడులో వెయ్యి స్తంభాల మండపాలు కలిగిన అతి కొద్ది ఆలయాలలో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయం ఒకటి. 
గోపురాల మీద, మండప స్థంభాలపైనా చక్కని శిల్పాలను చెక్కారు. 
చీమల పుట్టలో లభించినందున గర్భాలయంలో కైలాసనాధుడు  శ్రీ వాల్మీకినాథర్ గా పిలవబడుతూ లింగ  రూపంలో దర్శనం  ఇస్తారు. కాంచీపురంలో కనిపించే శ్రీ ఏకాంబరేశ్వర స్వామి లింగం మాదిరి శ్రీ వాల్మీకీనాథర్ కూడా సైకత లింగం కావడంతో అభిషేకాలు జరగవు. అవన్నీ కూడా శ్రీ త్యాగరాజస్వామికే !









అమ్మవారు శ్రీ కమలాంబిక విడిగా సన్నిధిలో కొలువై దర్శనమిస్తారు. అమ్మవారు కాలి మీద కాలు వేసుకొని విశ్రాంతిగా విలాసంగా కూర్చున్న భంగిమలో ఉంటారు. 
తిరువారూర్  దక్షిణ భారత సంగీత ప్రముఖులుగా పిలవబడే సంగీత త్రయం శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, శ్రీ శ్యామ శాస్త్రిల జన్మస్థలం. 
శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ ప్రతి రోజు అమ్మవారి సన్నిధిలో నవవర్ణ కృతులను గానం చేసేవారట. అమితానందంతో అమ్మవారు వాటిని వినేవారని, అందువలననే అలా కాలి  మీద కాలు వేసుకొని కనపడతారు అంటారు.  
ఆలయానికి వెనుక పక్క కమలాలయ పుష్కరణి ఉంటుంది.

ఆలయ ఉత్సవాలు 

ఉదయం అయిదు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సౌకర్యార్ధం ఆలయం తెరిచి ఉంటుంది. ఉత్సవాల సమయంలో దర్శన సమయాలు మారుతుంటాయి. 
నియమంగా ప్రతి నిత్యం ఆరు పూజలు జరుపుతారు. సోమవారం, శుక్రవారం, అమవాస్య, పౌర్ణమి రోజులలో ప్రత్యేక పూజలు చేస్తారు.పక్షానికి ఒకసారి త్రయోదశినాడు ప్రదోషపూజలను శాస్త్రోక్తంగా చేస్తారు. 
కార్తీక మాస పూజలు విశేషంగా చోటు చేసుకొంటాయి. 
సంవత్సరంలో సుమారు యాభైఆరు పైచిలుకు ఉత్సవాలు నిర్వహించబడే ఏకైక ఆలయం ఇదే !
వీటిని పరమ శైవుడైన రెండవ కుళోత్తుంగ చోళ చక్రవర్తి ఏర్పాటు చేసినట్లుగా ఆలయ శాసనాలు తెలుపుతున్నాయి. 
ప్రతినిత్యం వందలాది మంది భక్తులతో కళకళ లాడే ఆలయం చైత్ర మాసంలో నిర్వహించే పది రోజుల బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులతో కిటకిట లాడుతుంది.  బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసే రధోత్సవం నాడు మరింత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద రధం గల ఒకే ఒక్కటి  తిరువారూర్ శ్రీ త్యాగరాజ స్వామి వారి దేవాలయం.       








అరవైమూడు మంది నయనారులలో పలువురు శ్రీ వాల్మీకినాథర్ (శ్రీ త్యాగరాజ స్వామి)ని కీర్తిస్తూ పాతికాలను గానం చేసారు. వీరిలో ఇద్దరి జన్మస్థలం తిరువారూర్ కావడం చెప్పుకోవలసిన విషయం. వారు కళర్సింగ నయనారు మరియు తండియదిగల్ నయనారు. 
ఇంతటి విశేషాల సమాహారమైన తిరువారూర్ కు తమిళనాడులోని అన్ని పట్టణాల నుండి సులభంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చును. వసతి మరియు భోజన సౌకర్యాలు లభిస్తాయి. 
సమీపంలో ఉన్న నాగపట్టినం, తంజావూరు, కుంభకోణం పరిసర ప్రాంతాలు ఎన్నో పౌరాణిక, చారిత్రక ఆలయాలకు నిలయాలు. 

నమః శివాయ !!!!  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...