తిరునాంగూర్ దివ్యదేశాలు - 3
తిరునాంగూర్ దివ్య దేశాలు ఆకారంలో చిన్నవి కావచ్చును కానీ ప్రాధాన్యతలో ఆధ్యాత్మికతలో పెద్దవిగానే పేర్కొనాలి.
ప్రతి ఆలయం ఒక తనదైన ప్రత్యేకతలతో, పరమాత్మను ఆకర్షించడమే కాక ఆళ్వార్లను కూడా ప్రభావితం చేయగలిగాయి.
తిరునాంగూర్ దివ్య దేశాల విశేషాల మూడవ భాగంలో మిగిలిన ఆలయాల గురించి తెలుసుకొందాము.
7. తిరు వైకుంఠ విన్నగరం
తిరునాంగూర్ దివ్య దేశాల వరుసలో ఏడవది అయిన ఈ దివ్య దేశం గురించి పద్మ పురాణంలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అగస్థ్య మహర్షి ఈ క్షేత్ర మహత్యం గురించి ఉపరిచర వాసు మహారాజుకు చెప్పినట్లుగా అవగతం అవుతోంది.
గతంలో శ్వేతకేతు అనే ఇక్ష్వాకు వంశ రాజుకు వైకుంఠవాసం చేయాలన్న తలంపు కలిగిందిట. సతీ సమేతంగా తీవ్ర తపస్సు చేసి వైకుంఠం చేరుకోగలిగారట. కానీ వారికి అక్కడ శ్రీ మన్నారాయణుని దర్శనం లభించలేదట. పైగా అక్కడ వారిని ఆకలిదప్పులు బాధించ సాగాయట.
ఈ పరిణామాలతో వ్యాకుల పడిన రాజ దంపతులు తిరిగి భూలోక మార్గం పట్టారట. మార్గమధ్యలో వారికి త్రిలోక సంచారి బ్రహ్మఋషి అయిన నారద మహర్షి ఎదురయ్యారట. వారు ఆయనకు తమ బాధ తెలుపుకొని, తరుణోపాయం తెలుపమని అర్ధించారట.
ఆయన గత జన్మలో వారు ఎలాంటి దానధర్మాలు, దైవకార్యాలు చేయనందున ఈ పరిస్థితి ఎదురయ్యింది అని చెప్పారట. ఆయన వారిని భూలోకం లోని పావన కావేరీ నదీ తీరంలోని పలాస వనంలో తపస్సు చేస్తూ తగిన విధంగా అన్నదానం చేయమని సలహా ఇచ్చారట.
మహర్షి ఆదేశం మేరకు రాజదంపతులు పలాస వనం చేరుకొని అక్కడ కొలువైన "ఐరావతేశ్వర స్వామి"ని భక్తి శ్రద్దలతో సేవించుకోసాగారట.
కొంతకాలానికి మహేశ్వరుడు దర్శనమిచ్చి వారి కోరిక విని తాను కూడా మహావిష్ణువు దర్శనం కొరకు కలిసి అక్కడ తపస్సు చేశారట. వారి నిర్మలమైన భక్తికి సంతసించిన వైకుంఠవాసుడు శ్రీ దేవి, భూదేవి మరియు శ్రీ నీలాదేవి సమేతులై సాక్షాత్కరించారట.
రాజదంపతులు శాశ్వత వైకుంఠనివాస యోగం ప్రసాదించారట. సర్వేశ్వరుని కోరిక మేరకు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారట.
ఈ క్షేత్ర మహత్యాన్ని విన్న ఉపరిచర వాసు మరియు ఉదంగ మహర్షి తరలి వెళ్లి శ్రీ వైకుంఠనాధుని సందర్శించుకొన్నారట.
ఆలయ విశేషాలు
శిర్కాలి కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఎలాంటి ఆకర్షణీయ నిర్మాణాలు కనిపించవు. కానీ పరిపూర్ణ విశ్వాసంతో కోరుకొంటే మోక్షాన్ని ప్రసాదించే వాడు శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ అన్న నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.
గర్భాలయంలో శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ తో పాటుగా క్షేత్ర తాయారు శ్రీ వైకుంఠ వల్లి, శ్రీదేవి. భూదేవి ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు.
నియమంగా రోజుకు నాలుగు పూజలు నిర్వహించే ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుండి పది వరకు, సాయంత్రం అయిదు నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది.
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ ని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు.
8. తిరు సెంపోం అరంగ కోవెల
పురుషోత్తమన్ కోవెలకు తూర్పుగా అర కిలోమీటర్ దూరంలో ఉంటుందీ దివ్య దేశం.
క్షేత్రంతో ముడిపడి ఉన్న గాథ కారణంగా స్వామిని హేమ(బంగారు)రంగనాధుడు అని పిలుస్తారు.
గతంలో హేమ రంగపురి అని పిలిచేవారట.
శ్రీ రామచంద్ర మూర్తి రావణ సంహారం తరువాత ఇక్కడ ఒక యజ్ఞం చేసారని తెలుస్తోంది.
పద్మ పురాణంలో ఈ క్షేత్రం గురించి అనేక గాధలు పేర్కొనబడ్డాయని తెలుస్తోంది.
వాటి ప్రకారం పెరుమాళ్ ను భక్తిశ్రద్ధలతో స్మరించిన వారి ఇహపర లోకాల దరిద్రం తీరిపోతుంది అని విశ్వసిస్తారు.
కోరిన వారి కోర్కెలను తీర్చడంలో స్వామి ప్రసిద్ధి.
తూర్పు ముఖంగా ఉన్న కోవెలలోని గర్భాలయంలో శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతులై నేత్రపర్వంగా అలంకరణలో స్థానక భంగిమలో దర్శనమిస్తారు.
తిరుమంగై ఆళ్వార్ స్వామిని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు.
9.తిరుమణి కూడం
పద్మ పురాణం ప్రకారం చంద్రుడు తన మామగారైన దక్ష ప్రజాపతి ఇచ్చిన శాప కారణంగా క్షీణించి పోసాగాడట. పుణ్య క్షేత్రాల సందర్శనంతో శాపం తొలిగిపోతుంది అన్న విశ్వాసంతో చంద్రుడు అనేక తీర్థ క్షేత్రాలను దర్శించుకుంటూ చివరికి నాగపురి గా పిలవబడిన నాంగుర్ చేరుకొన్నాడట.
అక్కడి మునిపుంగవుల సలహా మేరకు సోమ పుష్కరణిలో స్నానమాచరిస్తూ పెరుమాళ్ ధ్యానంలో గడపసాగాడట. అతని భక్తికి మెచ్చిన శ్రీహరి దర్శనమిచ్చి స్వస్థత ప్రసాదించారట.
చంద్రునితో పాటు అక్కడి మహర్షుల కోరిక మేరకు స్వామి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు.
ఒక ప్రాకారంలో ఉన్న ఈ ఆలయంలో మూల విరాట్టు శ్రీ వరదరాజ పెరుమాళ్. గర్భాలయంలో స్దాన భంగిమలో చక్కని అలంకరణలో స్వామి కన్నుల పండుగగా దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీ తిరుమామగళ్ నాంచారి విడిగా ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు.
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే శ్రీ వరదరాజ పెరుమాళ్ ని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు.
10. తిరు పార్థన్ పల్లి
పడమర ముఖంగా ఉన్న ఈ ఆలయంలో మూలవిరాట్టు శ్రీ తామరయల్ కెల్వన్ (శ్రీ పార్ధసారథి). అమ్మవారు శ్రీ తామరై నాయకి.
కురుక్షేత్ర యుద్ధంలో అర్జున రథసారథిగా నిలిచిన శ్రీ కృష్ణుని పార్ధసారధిగా పిలుస్తారు. స్వామికి ఈ పేరు మీద ఉన్న మరో దివ్య దేశం చెన్నై పట్టణంలోని ట్రిప్లికేన్ లోని శ్రీ పార్ధసారధి ఆలయం.
కురుక్షేత్ర సమరానికి చాలా కాలం ముందు యుద్ధం అనివార్యమైతే తనవారిని చంపుకోవలసి వస్తుంది అన్న భయానికి లోనయ్యాడట.
ఇక్కడ ఈ ప్రదేశంలో శ్రీ కృష్ణుడు మొదటిసారిగా పార్థునికి జ్ఞానోపదేశం చేసి యుద్దానికి సంసిద్దుని చేశారట. ఆలయంలో ఉత్తరాభిముఖంగా ఉన్న పాండవ మధ్యముని సన్నిధిని చూడవచ్చును.
గతంలో గౌతమ, భరద్వాజ, అగస్థ్య మహర్షులు ఈ పుణ్య స్థలిలో తపమాచరించారట.
గర్భాలయంలో మూలవిరాట్టు చతుర్భుజాలతో స్థానక భంగిమలో దర్శనమిస్తారు. అమ్మవారు సన్నిధి విడిగా ఉంటుంది.
ఆలయం సాధారణంగా ఉంటుంది. ఎలాంటి విశేష శిల్పకళ కనపడదు.
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే పది పాశురాలను శ్రీ పార్ధసారధి పెరుమాళ్ మీద గానం చేసారు.
11. తిరు దేవనార్ తొగై
తిరు నాంగుర్ దివ్యదేశాలలో ఆఖరిది తిరు దేవనార్ తొగై.
శ్రీ దైవ నాయకన్ (శ్రీ మాధవ పెరుమాళ్) అమ్మవారు శ్రీ కడల్ మగళ్ నాంచారి విడివిడిగా రెండు సన్నిధులలో కొలువై దర్శనమిస్తారు.
ఇక్కడ స్వామిని సేవించినవారి జీవితంలో అన్ని పనులలో విజయం సిద్ధిస్తుందని చెబుతారు.
తిరుమంగై ఆళ్వార్ శ్రీ మాధవ పెరుమాళ్ ని కీర్తిస్తూ పది పాశురాలను గానంచేసారు.
తిరు నాంగుర్ దివ్యదేశాలను, ఈశ్వర కోవెలలను శిర్కాలి లేక చిదంబరం నుండి ఒక్క రోజులో సందర్శించుకోవచ్చును. రెండు చోట్లా తగిన వసతి, భోజన సౌకర్యాలు లభిస్తాయి.
చెన్నై నుండి రైలు లేక బస్సు ద్వారా చిదంబరం చేరుకోవచ్చును.