శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం, జంబుకేశ్వరం (శ్రీ రంగం)
మానవునికి జీవాధారమైనవి పంచ భూతాలైన నీరు, నిప్పు, నేల, నింగి మరియు గాలి. లోకాలను పాలించే సర్వేశ్వరుడు వీటికి ప్రతి రూపం. అందుకే మన పూర్వీకులు చరాచర సృష్టికర్త పట్ల కృతజ్ఞతా భావంతో ఆలయాలలో స్థాపించి ఆరాధిస్తున్నారు యుగయుగాల నుండి. అవే పంచ భూత స్థలాలైన సి చిదంబరం (ఆకాశం), కాంచీపురం (పృథ్వి), తిరువణ్ణామలై (అగ్ని), శ్రీకాళహస్తి (వాయువు) మరియు జంబుకేశ్వరం (జలం).
ఈ క్షేత్రాలలో నాలుగు తమిళనాడులో ఉండగా వాయు లింగం మన రాష్ట్రం లోని శ్రీకాళహస్తి లో ఉన్నది.
తొలి యుగంలో ఏర్పడిన ఆ స్థలాల విశేషాలు లెక్కలేనన్ని. ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం విశేష చారిత్రక విషయాలతో, పురాణ గాధలతో, భక్తుల అనుభవాలతో అలరారుతున్నాయి. కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలవబడుతున్నాయి.
వీటిల్లో సర్వ జీవులకు ప్రధాన జీవాధారమైన జలంతో ముడిపడి ఉన్న క్షేత్రం తమిళనాడులోని తిరుచునాపల్లి నగరానికి సమీపంలో కావేరి మరియు కొల్లిడాం నదుల మధ్య ఏర్పడిన శ్రీరంగ ద్వీపంలో ఉన్నది.
నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ప్రధమ స్థానంలో ఉన్న శ్రీ రంగనాధ స్వామి ఆలయానికి చేరువలో నెలకొని ఉంటుంది శ్రీ అఖిలాండేశ్వరి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి కొలువైన జంబుకేశ్వరం.
ఈ క్షేత్రం గురించి సంగమ సాహిత్యంలో, నయనారుల పాటికాలలో, ఆళ్వారుల పాశురాలతో పాటు పెరియ పురాణం. నళయర దివ్య ప్రబంధం, శిలప్పాధికారం మరియు మణిమేఖల లాంటి పురాతన గ్రంధాలలో పేర్కొనబడినది. తొలితరం చోళ రాజులు వేయించిన రాగి శాసనాలలో కూడా జంబుకేశ్వరం ప్రస్తాపన ఉన్నట్లుగా తెలుస్తోంది.
తిరువనైకావాల్
శాసనాలలో ఈ క్షేత్రం పేరు "తిరువనైకావాల్" అని పేర్కొనబడినది. తిరు అన్నది గౌరవ వాచకమైన శ్రీ తో సమానం. యానై అనగా ఏనుగు, కా అంటే అడవి లేదా వనము. దరిదాపుగా శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క పురాణ గాధను పోలి వుండే ఈ పేరు వెనుక ఉన్న కధ క్రీస్తు పూర్వం నాటిదిగా తెలుస్తోంది.
నిరంతరం శివసాన్నిధ్యంలో ఉండే శివగణాలలో మాల్యవంతుడు మరియు పుష్పదంతుడు అనే వారివురికి ఏ విషయంలోనూ పొసగదు. నిరంతరం ఒకరినొకరు నిందించుకొంటూ, దూషించుకొంటూ ఉండేవారట. శృతి మించి రాగాన పడినట్లుగా వివాదం ముదిరి శాపాలు వరకు వెళ్లిందట. శాప కారణంగా మాల్యవంతుడు సాలీడుగా, పుష్పదంతుడు ఏనుగుగా భూలోకంలో జంబూ ద్వీపంలోని వనంలో జన్మించారట.
గత జన్మలో శివ సేవలో ఉండటం వలన ఈ జన్మలో కూడా వారివురూ లింగారాధనలో ఉండేవారట. అడవిలో జంబూ వృక్షం క్రింద కొలువైన కైలాసనాధునికి ప్రతి నిత్యం గజరాజు పవిత్ర కావేరి నదీజలాలతో అభిషేకించేవాడట. లింగరాజు మీద దుమ్మూ, ధూళి, ఎండిన ఆకులు పడకుండా సాలీడు పైన గూడు లాగ అల్లేవాడట. అభిషేక సమయంలో దానిని తొలగించేవాడట కరిరాజు. అది సాలీడుకి కోపకారణమైనది. ఆవేశంతో ఒకనాడు ఏనుగు తొండం లో ప్రవేశించి తన విషం వెదజల్లినదట. భరించలేని బాధతో ఏనుగు రాతికి తల మోదుకోవడంతో ఇద్దరూ మరణించారు. చూడండి శత్రుత్వం ఎంతటి క్రూరమైనదో. జన్మజన్మలకు వదలదు.
చేయని తప్పుకు దండన పొందిన పుష్పదంతుడు శాపవిముక్తుడై కైలాసానికి వెళ్ళిపోయాడు. కానీ రెండో జన్మలో కూడా వైషమ్యాన్ని వీడని మాల్యవంతుడు చేసిన శివపూజకు ఫలితంగా ఆ ప్రాంతాన్ని పాలించే చోళ రాజ దంపతులకు జన్మించాడట.
క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన శుభ దేవ చోళుడు చక్కని పాలకుడు. అన్నీ ఉన్నా ఆయనకు రాణి కమలావతికి ఉన్న ఒకేఒక్క దిగులు సంతానం లేదని. దైవజ్ఞుల సలహా మేరకు చిదంబరం వెళ్లి శ్రీ నటరాజ స్వామిని సేవించుకొన్నారట. స్వామి వారి అనుగ్రహంతో రాణి చిదంబరం వెళ్లిన కొద్ది రోజుల లోనే గర్భం దాల్చినది. నెలలు నిండాయి. జోతిష్యం పట్ల అపార నమ్మకం ఉన్న చోళరాజు జ్యోతిష్యులను ఏ బిడ్డ పుడతాడు ? ఏ సమయంలో పుడితే గొప్ప జాతకుడు అవుతాడు ? అని అడిగారట. వారు ఖచ్చితంగా మగబిడ్డ జన్మిస్తాడు అని చెప్పి ఏ సమయంలో శిశువు తల్లి గర్భం నుండి భూమి మీదకు వస్తాడో అంచనా వేసి చెప్పారట. కానీ వారు చెప్పిన సమయానికి కొన్ని ఘడియల ముందు గానే మహారాణికి పురిటి నొప్పులు ఆరంభం అయ్యాయట. జ్యోతిష్యులు చెప్పిన సమయానికి ముందు పుడితే నష్ట జాతకుడు అవుతాడన్న నమ్మకంతో రాణి తనను తాను తల్లక్రిందులుగా కట్టేసుకుని బలవంతంగా నొప్పులను ఆపుకొన్నదట. అలా రావలసిన సమయానికి రాకుండా నిర్బంధంగా గర్భంలో ఎక్కువ సమయం ఉన్నందున పుట్టిన శిశువు ఎఱ్ఱటి కళ్ళతో జన్మించాడట. పుట్టిన బిడ్డను చూసి తల్లి " కొచ్చెంగనన్" (ఎఱ్ఱని కళ్ళ వాడు) అని పిలచి మరణించిందట.
అనంతర కాలంలో అతను అదే పేరుతొ ప్రసిద్ధుడు అయ్యాడు. అతను మరెవరో కాదు గత జన్మలో సాలీడుగా పుట్టిన మాల్యవంతుడు. గత జన్మలలో చేసిన శివ పూజల ఫలితంగా ఈ రాజ జన్మ పొందిన అతను తన గతంలో చేసిన పాపకర్మలు తొలిగి పోవడానికి మార్గనిర్దేశికత్వం చేయమని దైవజ్ఞులను అర్ధించాడట. వారు అతనికి వీలైనన్ని శివాలయాలను నిర్మించమని చెప్పారట. వారి మాట ప్రకారాం కొచ్చెంగనన్ డెబ్బై అయిదు ఆలయాలను నిర్మించాడట. వాటిల్లో శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం ఒకటి.
కొచ్చెంగనన్ శివభక్తి గురించి ప్రశంసిస్తూ నయనారులలో ప్రముఖులైన సుందరార్, అప్పార్, తిరుజ్ఞాన సంబంధార్ తమ పాటికాలలో ప్రస్తావించారు. అనంతర కాలంలో కొచ్చెంగనన్ కూడా అరవై మూడు మంది శివగాయక భక్తులైన నయనారులలో ఒకరుగా గుర్తింపు పొందారు.
అసలు కైలాస నాధుడు ఇక్కడ కొలువు తీరడానికి ఆయనను శ్రీ జంబుకేశ్వర స్వామిగా పిలవబడటానికి సంబంధించిన పూర్వగాథ కృత యుగం నాటిదిగా తెలియవస్తోంది.
శ్రీ జంబు మహర్షి
మహా శివ భక్తుడైన జంబూ మహర్షి పావన కావేరి నదీ తీరంలో పరమేశ్వర సాక్షాత్కారం కొరకు తీవ్రమైన తపస్సు చేశారట. ఆయన భక్తికి సంతసించిన సదాశివుడు దర్శనం ఇచ్చారట. సంతోషంతో ముని ముక్కంటికి జంబూఫలాన్ని అందించారట. స్వీకరించి సేవించిన సర్వేశ్వరుడు ఫలం తాలూకు గింజలను ఉమ్మి వేశారట. గురు ఉచ్ఛిష్టకం గా వాటిని ఆరగించారట జంబూ మహర్షి. వెంటనే ఆ విత్తనాలు ముని శిరస్సు నుండి మొలకెత్తి పెను వృక్షాలుగా పెరిగిపోయాయట. తన పేరుకు, ఈ ప్రాంతానికి శాశ్విత కీర్తి ప్రసాదించామన్న మహర్షి కోర్కెను మన్నించి మహేశ్వరుడు ఆయనకు కైలాస ప్రాప్తిని అనుగ్రహించారు.
శ్రీ జంబుకేశ్వర స్వామి వృత్తాంతం
కైలాసంలో కపర్ది అంతర ధ్యాన నిమగ్నులై ఉన్న సమయంలో దేవతలు,దిక్పాలకులు, మునులు, తరలి వచ్చి అసుర బాధ నుండి కాపాడమని ప్రార్ధించారట. వారి విజ్ఞప్తులు వృషభ వాహనుని చెవికి చేరలేదు. ధ్యానం నుండి వెలుపలికి రాలేదట. కానీ వారి దీనాలాపనలు లోకమాతను కదలించాయట. ఎంతైనా అమ్మ కదా !
ఆగ్రహానికి లోనుకావలసి వస్తుందని తెలిసీ ఆమె ఆయన ధ్యానం భగ్నం చేసిందట. దాని వలన లోకాలకు రాక్షస బాధ తొలగి పోయింది కానీ లోకపావని భూలోకానికి రావలసి వచ్చినదట. పార్వతీ దేవి జంబూ ద్వీపం చేరుకొని కావేరి నది ఇసుకతో ఒక సైకత లింగాన్ని సృష్టించి జంబు వృక్షం క్రింద ప్రతిష్టించి తదేక దీక్షతో ధ్యానించసాగిందట.
ఆమె తపస్సుకు సంతుష్టుడైన సోమసుందరుడు ప్రత్యక్షమై "శివ జ్ఞానం"బోధించారట.
పై ఉదంతం జరపడంలో గల ముఖ్య ఉద్దేశ్యం అమ్మవారికి శివ జ్ఞానం తెలపడమే !
అయ్యవారు అమ్మవారికి ఇక్కడ గురువుగా మారి శివ జ్ఞానం ఉపదేశించడం వలన ఉత్సవాల సమయంలో ఆదిదంపతుల కళ్యాణం నిర్వహించరు ఈ క్షేత్రంలో ! వారిరువురి మధ్య ఉన్నది గురుశిష్య సంబంధం కదా!
దానికి తగినట్లుగానే రెండు ఆలయాలు ఎదురెదురుగా ఉంటాయి. ఇలా మరెక్కడా చూడము. అందుకే జంబుకేశ్వరం ఉపదేశ క్షేత్రం గా పిలవబడుతోంది.
జంబూ మహర్షి శరీరం నుండి మొలకెత్తిన జంబూ వృక్షం స్వామివారి గర్భాలయం పక్కనే ఉంటుంది.
జంబు వృక్షాల వనం మరియు మహర్షి తపమాచరించిన ప్రదేశంగా జంబుకేశ్వరం అని పిలవబడుతోంది. అక్కడ కొలువు తీరిన లింగరాజు శ్రీ జంబుకేశ్వరునిగా పిలవబడుతున్నారు.
ఆలయ విశేషాలు
శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ప్రధమ స్థానంలో ఉన్న శ్రీ రంగనాధ స్వామి ఆలయానికి చేరువలో ఉన్న శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం ఒక సుందర,రమణీయ, అద్భుత నిర్మాణం గా పేర్కొనబడుతున్నది.
ఈ రెండు ఆలయాలు దరిదాపుగా ఒకే కాలంలో నిర్మించినా జంబుకేశ్వర ఆలయంలోని శిల్ప కళ
రంగనాథుని ఆలయంలో కనపడదు.
సుమారు పద్దెనిమిది ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో అయిదు ప్రాకారాలతో ఏడు గోపురాలతో ఎన్నో మండపాలతో అలరారుతుంటుందీ ఆలయం. తమిళనాడులో మొత్తం ఎనిమిది ఆలయాలలో వెయ్యి కాళ్ళ మండపాలుఉన్నాయి . వాటిల్లో జంబుకేశ్వర ఆలయం ఒకటి. ప్రాంగణాలు అన్నింటిలో కలిపి మొత్తం తొమ్మిది కోనేరులు ఉంటాయి.అవి బ్రహ్మ, శ్రీమాత, ఇంద్ర, చంద్ర, రామ, అగ్ని, అగస్థ్య, జంబు మరియు సూర్య తీర్థాలు.
సహజంగా ప్రాకారాల గణన అన్నింటికన్నా లోపల గర్భాలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ పధంతో
ప్రారంభం అవుతుంలేకపోవడం ది. కానీ మన సౌలభ్యం కొరకు వెలుపలి నుండి ప్రాకారాలను లెక్క పెట్టుకొందాము. అప్పుడు ఆలయం గురించి పూర్తిగా సులభంగా గ్రహించగలము.
విభూది ప్రాకారం
సుమారు ఒక మైలున్నారు పొడుగు, ముప్పై అయిదు అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వెడల్పుతో అన్నింటికన్నా వెలుపల ఉండే ప్రాకారాన్ని "విభూధి ప్రాకారం" అని పిలుస్తారు. దీనిని స్వయంగా శ్రీ జంబుకేశ్వరుడే దగ్గర ఉండి నిర్మించుకొన్నారట. రాజు వద్ద నిధులు లేకపోవడంతో పని వారికి ఇవ్వడానికి ధనం లేకపోవడంతో పరమేశ్వరుని ఆదేశం మేరకు అందరికి విభూధి ఇచ్చారట రాజు. వారు ఇండ్లకు పోయి చూసుకొంటే విభూధి స్థానంలో బంగారు నాణేలు ఉన్నాయట. ఈ కారణంగా దీనిని విభూధి ప్రాకారం అని పిలుస్తారు.
దీనికి పడమర పక్కన ఏడు అంతస్థుల రాజగోపురం ఉంటుంది. తూర్పున పదమూడు అంతస్థుల రాజ గోపురం కనపడుతుంది.
రెండో ప్రాకారం
వెలుపలి నుండి ప్రాంగణం లోనికి వెళ్లే క్రమంలో వచ్చే రెండవ ప్రాకారాన్ని నిర్మించినది మదురై ని పాలించిన జటవర్మన్ సుందర పాండ్య పదమూడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసన ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా ఈ ప్రాకారానికి తూర్పున ఉన్న ఏడు అంతస్థుల గోపురాన్ని సుందర పాండ్య గోపురం అని పిలుస్తారు. ఈ ప్రాకారంలో ఏడు వందల తొంభై ఆరు స్తంభాల మండపం, నిరంతర నీటి ప్రవాహ ధార ఏర్పాటు చేయబడ్డ పుష్కరణి కనపడతాయి. ద్వారం పక్కనే ప్రధమ పూజితుడు శ్రీ వినాయకుడు కొలువైన సన్నిధి ఉంటుంది. లోనికి వెళ్లే మార్గంలో కనపడే తొలి సన్నిధి ఇదే !
మూడో ప్రాకారం
సుందర పాండ్య ప్రాకారం తరువాత వచ్చేది విక్రమ చోళుడు పన్నెండో శతాబ్దంలో నిర్మించాడు. దీనికి తూర్పు పడమరలలో రెండు గోపురాలుంటాయి. తూర్పున ఉన్న గోపురాన్ని మల్లప్పన్ గోపురం అంటారు.
ద్వారానికి ఇరుపక్కలా ఆది దంపతుల ముద్దు బిడ్డలైన శ్రీ గణపతి శ్రీ కుమార స్వామి కొలువై ఉంటారు. చిన్న చిన్న మండపాలతో పాటు పెద్ద కొబ్బరి చెట్ల తోపు ఈ ప్రాకారంలో కనపడుతుంది.
నాలుగో ప్రాకారం
లోపలి నుండి రెండో ప్రాకారం అయిన ఇక్కడి నుండి ఆలయ శిల్ప శోభ , నిర్మాణ విలువలు కనపడతాయి. ఇక్కడి అరియ విట్టన్ గోపురాన్ని ఆనుకొని నిర్మించిన మండపానికి ఏక శిల స్తంభాలను అమర్చారు. వీటి మీద చెక్కిన శిల్పాలు, పన్నెండు రాశుల మూర్తులు, రాతి గొలుసులు ఆకర్షిస్తాయి. పడమరన ఉండే కార్తీక గోపురాన్ని మూడవ కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు.
ఈ ప్రాకార వాయువ్య మూలాన ఉండే వెయ్యి కాళ్ళ మండపం రధం ఆకారంలో స్తంభాల పైన సుందర శిల్పాలతో ఎంతో సుందరంగా ఉంటుంది. నైరుతిలో వంద కాళ్ళ మండపాన్ని, త్రిమూర్తి ,వసంత,సోమస్కంద మరియు ఊంజల్ మండపాలు కూడా ఇక్కడే ఉంటాయి.
ఇంద్ర తీర్థంతో పాటు ఎన్నో ఉపాలయాలు ఈ ప్రాకారంలో కనపడతాయి.
జంబు తీర్థం ఒడ్డున శ్రీ వల్లభ గణపతి సన్నిధి, పెద్ద కుబేర లింగం, చిన్నదైన శ్రీజంబుకేశ్వర లింగం, శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంటాయి.
శ్రీ అఖిలాండేశ్వరి దేవి సన్నిధి
శ్రీ జంబులింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా ప్రత్యేక ధ్వజస్థంభం, నంది మండపం కలిగి ఉన్న అమ్మవారి సన్నిధి ఈ ప్రాకారంలో కనపడుతుంది. అమ్మవారికి ఎదురుగా శ్రీ గణపతి కొలువై ఉంటారు. ఈ రెండు ఆలయాలు కలిపి ఓంకార ఆకారంలో ఉండటం విశేషం.
తొలుత అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉండేదట. జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారికి ఎదురుగా కుమార గణపతిని, చెవులకు శ్రీ చక్ర చిహ్నాలున్న తాటంకాలను అమర్చడం వలన అమ్మవారు ప్రస్తుతం శాంతా రూపిణిగా దర్శనమిస్తున్నారని చెబుతారు. దీనికి తగినట్లే అమ్మవారు స్దానక భంగిమలో చతుర్భుజాలతో సుందర్ స్వర్ణాభరణ అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు.
రెండు ప్రాకారాల్లో ఉండే శ్రీ అఖిలాండేశ్వరి దేవి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ సరస్వతి, శ్రీమతులైన రోహిణి, కృత్తికా నక్షత్రాలతో శ్రీ చంద్ర భగవానుడు ఉపాలయాలలో దర్శనమిస్తారు. గోష్ఠ దేవతలుగా ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, దుర్గ మరియు చండికేశ్వరి కనిపిస్తారు.
శ్రీ జంబుకేశ్వర స్వామి సన్నిధి
గర్భాలయానికి వెళ్లే క్రమంలో శ్రీ కళ్యాణ సుందర స్వామి, శ్రీ శివగామి సమేత శ్రీనటరాజు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ భైరవ, సప్త మాతృకలు, సూర్య, చంద్ర, శ్రీ దక్షిణ మూర్తి, శ్రీ చండికేశ్వర మరియు అరవై మూడు మంది నయనారుల విగ్రహాలను దర్శించుకోవచ్చును.
ఇక్కడ కనిపించే సహస్ర లింగాన్ని శ్రీ రామచంద్ర మూర్తి రామ రావణ యుద్ధానంతరం వెంటాడుతున్న బ్రహ్మ హత్య పాతకాన్ని తొలగించుకోడానికి సేవించారట. పక్కనే ఆయన ప్రతిష్టించిన మరకత లింగం కూడా కనపడుతుంది.
నంది మండపం పక్కనే నవగ్రహ మండపం కూడా ఉంటుంది. ఆలయ వృక్షం అయిన జంబు ఫల చెట్టు ఆలయ ఈశాన్య భాగంలో గోడ పక్కనే కనపడుతుంది.
ప్రధాన లింగం కొలువు తీరిన గర్భాలయానికి ఒక చిన్న అర్ధమండపం మరో చిన్న ముఖ మండపం ఉంటాయి. ముఖ మండపానికి ఉన్న తొమ్మిది రంధ్రాల రాతి కిటికీ గుండా స్వరి జంబులింగేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ప్రత్యేక దర్శనం సంధర్బంగానే తప్ప అర్ధ మండపం నుండి స్వామిని దర్శించుకొని అవకాశం భక్తులకు లభించదు.
రాతి కిటికీకి ఎదురుగా అమ్మవారు శ్రీ పార్వతీ దేవి కొలువై ఉంటారు.
గర్భాలయంలో రాగి వర్ణపు లింగ రూపంలో కొద్దిగా ఎత్తైన పానువట్టం మీద శ్రీ జంబులింగేశ్వర స్వామి దర్శనమిస్తారు. పానువట్టానికి నిరంతరం తెల్లని వస్త్రం కట్టి ఉంచుతారు. క్రింద నుండి ఉద్భవించే నీటి ధార వలన ఆ వస్త్రం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తులకు ఇస్తారు.
కావేరి నదీ పాయ ఒకటి లింగం క్రింద నుండి ప్రవహిస్తూ నిరంతరం లింగరాజును అభిషేకిస్తుంది అన్నది భక్తుల విశ్వాసం.
చారిత్రక ఆధారాలు
చరిత్రను మనకు తెలిపేవి ప్రధానంగా శాసనాలే ! వాటి తరువాత వివిధ కాలాలలో నిర్మించబడిన నిర్మాణాలు. గర్భాలయాన్ని తొలుత నిర్మించినది కొచ్చెంగనన్ చోళుడు అన్న విషయాన్ని నిరూపించడానికి వేరే ఆధారాలు లేవు. కానీ ఆయన తరవాతి తరం చోళ రాజులు గర్భాలయ సమీపంలో ఆయన సన్నిధిని ఏర్పాటు చేశారు. అలానే మండప స్తంభాల పైన వాటిని నిర్మించిన రాజుల శిల్పాలు కూడా కనపడతాయి.
ఇక శాసనాల విషయానికి వస్తే చోళులు, పాండ్యులు, హొయసల, విజయనగర మరియు మదురై నాయక రాజుల కాలాల నాటి శిలా శాసనాలు ఎన్నో ఈ ఆలయంలో కనపడతాయి. వీటిల్లో వారు ఈ ఆలయాభివృద్దికి వారు చేసిన కృషి సమర్పించుకొన్న కైంకర్యాలు వివరాలుంటాయి.
ఆలయ ఉత్సవాలు
నిత్యం శైవాగమ సిద్ధాంతం ప్రకారం ఆరు పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఒక విశేష పూజ జరుగుతుంది ఆలయంలో. ప్రతి నెల ఒక ఉత్సవం చోటు చేసుకొంటుంది. త్రయోదశి నాడు ప్రదోష పూజ, మాస శివరాత్రి నాడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అన్నింటి లోనికి మధ్యాహన్నం నిర్వర్తించే పూజ ప్రత్యేకమైనది. అమ్మవారు సదాశివునికి మధ్యహాన్న పూజ చేసేవారన్న విశ్వాసంతో దీనిని నిర్వహిస్తారు. స్వామితో పాటు అరుదైన జాతికి చెందిన నల్ల ఆవుకు కూడా పూజ చేస్తారు. ఈ సందర్బంగా పూజారి ఒకరు చీర ధరించి అమ్మవారి ప్రతి రూపంగా స్వామికి మధ్యాహన్నం పూజలు చేస్తారు.
ఆది పూరం, శివరాత్రి, గణేష చతుర్థి, దీపావళి, దసరా నవరాత్రులు, కార్తీక మాస పూజలు, శుక్రవారం పూజలు ఇలా ఎన్నో శ్రీ అఖిలాండేశ్వరి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి వారి ఆలయంలో. వీటిల్లో అప్పాసి నెల(అక్టోబర్ - నవంబర్) నెలలో జరిగే అన్నాభిషేకం విశేషమైనది. ఏ అన్నాభిషేకాన్ని వైశాఖ మాసంలో కూడా చేస్తారు కానీ వర్షాలు ఎక్కువగా కురిసే ఆ రోజులలో లింగం క్రింద నుండి వచ్చే నీటి ధార ఎక్కువగా ఉంటుంది. అందువలన దానికి బదులుగా భస్మాభిషేకం జరుపుతారు.
నయనారులలో ముఖ్యులైన తిరుజ్ఞాన సంబంధార్, అప్పార్ , సుందరార్ గానం చేసిన పాటికాల కారణంగా జంబుకేశ్వరం రెండువందల డెబ్భై అయిదు పడల్ పెట్ర స్థలాలలో ఒకటిగా శాశ్విత కీర్తిని పొందినది.
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు ఆలయ ప్రవేశానికి భక్తులకు అవకాశం ఉంటుంది.
శ్రీ రంగంలో ఉన్న శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయానికి చేరుకోడానికి దేశం నలుమూలల నుండి రైలు సౌకర్యం తిరుచునాపల్లి కి కలదు. అన్ని రైళ్లు శ్రీ రంగం స్టేషన్ లో కూడా ఆగుతాయి.
తిరుచునాపల్లికి విమాన మార్గం కూడా ఉన్నది. తిరుచ్చి పట్టణంలోనూ, చుట్టుపక్కల ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి.
వసతికి అందుబాటు ధరలలో లాడ్జీలు లభిస్తాయి.
నమః శివాయ !!!!