1, ఏప్రిల్ 2020, బుధవారం

Tiruvetakalam

                పార్దుడు పాశుపతం పొందినది ఇక్కడే 




వనవాస కాలంలో సమయం వృథా చేయకుండా రాబోయే యుద్ధంలో ఉపయోగపడే పాశుపతాస్ర్తము పొందమని పాండవ మధ్యమునికి సలహ ఇచ్చారు శ్రీ కృష్ణ భగవాన్.  ఆ ప్రకారం అరణ్యంలో పరమేశ్వర అనుగ్రహం కొరకు తపస్సు చేయసాగాడు అర్జునుడు.  
ఒకనాడు అడవి పంది ఒకటి దాడి చేయడానికి రాగా ఫల్గుణుడు దాని మీదకు శరం వేశాడు.  ఇంతలో మరోవైపు నుంచి మరో బాణం పందిని తాకింది.  సూకరం మృతి చెందింది.  
" నేను వేసిన బాణం వలన నే చచ్చింది కనుక వేట నాది" అంటూ ప్రవేశించాడొక వేటగాడు. అతని పాటు భార్య ఇతర అనుచరులు ఉన్నారు. 
" పందిని కావాలంటే తీసుకో!  కాని దాని చావుకు కారణం నేను సంధించిన శరం " అన్నాడు విజయుడు. 
వాదం పెరిగి చివరకు ఇరువురి మధ్య యుద్దానికి దారి తీసింది. భీకరమైన పోరు జరిగింది. అర్జనుని శరాఘాతానికి అంతర్యామి గాయపడ్డారు. అప్పుడు ఆయన తన నిజస్వరూపం ధరించారు. తెలియకుండా చేసిన తప్పు క్షమించమని ప్రార్దించాడట పార్దుడు.  
ఆశీర్వదించి పాశుపతం అనుగ్రహించారట. గాయపరచిన వానిని దగ్గరకు తీయడంతో అమ్మవారు ఆగ్రహించగా అర్దనారీశ్వరుడు ఆమెను బుజ్జగించారట. ఈ ఉదంతం " కిరాతకార్జునీయం" పేరిట ప్రసిద్ధి చెందింది.  ఈ సంఘటనలను ఆలయ మండపంలో చక్కని శిల్పాలు గా మలచారు. రమణీయంగా ఉంటాయి.  
ఈ పోరు జరిగింది చిదంబరం సమీపంలో అని చెబుతారు. వేట యుద్దానికి దారి తీసిన స్ధలంగా "తిరువేటక్కాళం " అని పిలుస్తారు.
అమ్మల గన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి పాదాల వద్ద ఉన్న "శ్రీ విజయాలేశ్వర స్వామి"  వారి ఆలయ గాధ కూడా దీనిని పోలి ఉండటం విశేషం. ఈ ఆలయంలో అర్జునుడు పొందిన అస్ర్తానికి ప్రత్యేక సన్నిధి కలదు. శ్రీ విజయాలేశ్వర లింగాన్ని విజయుడే ప్రతిష్టించాడని అంటారు. 
తిరిగి తిరువేటక్కాళం విషయానికి వస్తే అర్జనుని కోరిక మేరకు కొలువైన స్వామి ని " శ్రీ పాశుపతేశ్వరుడు లేదా శ్రీ పశుపతేశ్వరుడు" అని పిలుస్తారు. 
ఆలయ పౌరాణిక గాధ తెలిపే స్ధంభాలు కలిగిన మండపంలో అమ్మవారు శ్రీ సద్గుణాంబాల్ లేదా నల్ల నాయకి" ఉపస్థిత భంగిమలో వెనుక హస్తాలతో పుష్పాలను ధరించి వరద అభయ హస్తాలతో భక్తులను అనుగ్రహిస్తుంటారు. 
చందన కుంకుమ విభూతి లేపనాలతో పుష్ప మాలాలంకృతులై శ్రీ పశుపతేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉంటారు. లింగం మీద బాణం తాకడం వలన ఏర్పడిన గాయం తాలూకు మచ్చ స్పష్టంగా కనిపిస్తుంది. 
తొలి ఆలయాన్ని పదో శతాబ్దంలో చోళులు నిర్మించారని శాసనాధారాలు తెలుపుతున్నాయి. . కానీ ఇరవయ్యో శతాబ్దానికి శిధిలావస్థకు చేరుకొన్న ఆలయాన్ని పునః నిర్మించారట.
రెండు ఎకరాల స్థలంలో తూర్పున మూడు అంతస్తుల రాజగోపురం ఉంటుంది.  దానికి అనుబంధంగా ప్రాంగణం నికి నలువైపులా ఎత్తయిన గోడ నిర్మించారు. ఎన్నో పరివార దేవతల సన్నిధులుంటాయి. నర్తన, సిద్ధి, ఉచ్ఛ గణపతులు,  దక్షిణామూర్తి, వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి, శ్రీ చండికేశ్వరుడు, శివగామి సమేత నటరాజు, మహలక్ష్మీ, భైరవుడు, సూర్య చంద్రులు వాటిల్లో దర్శనమిస్తారు. విడిగా నవగ్రహ మండపం కలదు.
గ్రహణ సమయాల్లో సూర్య చంద్రులకు చేసే పూజల వలన అన్ని గ్రహ దోషాలు తొలగి పోతాయి అని విశ్వసిస్తారు. 
శ్రీ పాశుపతేశ్వరుడు వైద్యులు కూడా!  ముఖ్యంగా నత్తి ఉన్నవారు నిర్ణయించిన పూజ చేయించుకొని ప్రసాదంగా ఇచ్చే చిన్న చిన్న ఇసుక గుళ్ళను తీసుకొంటే గుణం ఉంటుంది అని అంటారు. 
అవివాహితులు అమవాస్య నాడు ఇక్కడ ఆది దంపతులను దర్శించుకొంటే వివాహ అడ్డంకులు తొలిగి పోతాయి. 
పడాల్ పేట్రస్ధలాల వరుసలో చిదంబరం తరువాత స్ధానం తిరువేటక్కాళం దే!  నయనారులలో అగ్రగణ్యులు అయిన సంబంధార్. అప్పారు శ్రీ పాశుపతేశ్వరుని కీర్తిస్తూ తేవరగానం చేసారు. అరుణగిరి నాధర్ కూడా ఈ క్షేత్రంలో గానం చేశారు. 
నియమంగా రోజుకి మూడు పూజలు జరుపుతారు. సోమవారాలు పౌర్ణమి, అమవాస్య ఆరుద్ర నక్షత్ర, త్రయోదశి పూజలు ఘనంగా చేస్తారు.  అన్ని హిందూ పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజలు జరుపుతారు. 
అర్జునుడు పాశుపతాస్ర్తము పొందిన ఫాల్గుణ మాసంలో విశేష ఉత్సవం నిర్వహిస్తారు. 
ఇన్ని విశేషాలు కలిగిన తిరువేటక్కాళం ఆలయం చిదంబరం నికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అన్నామలై విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నది. ఆటో లో సులభంగా చేరుకోవచ్చును. 

నమః శివాయ !!!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...